Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    "అవును"

    రమకి అనుమానం కలిగింది. తీవ్రంగా "నువ్విమ్మని చెప్పావా?" అంది.

    "ఢంకా బజాయించి చెప్పాను. నాకేం భయమా సిగ్గా? నాలుగురాళ్ళు రాలేచోట నోరుమూసుకుండడం నాచేతకాదు పిల్లా" అంది గర్వంగా ముసలిది.

    పెదవులు నొక్కి పట్టి "ఏం చెప్పావు ఆయనతో?" అంది రమ.

    "వెర్రిబాగులవాడు. నువ్వు ప్రేమించావనీ నిన్ను పెళ్ళిచేసుకుంటాననీ అన్నాడు. మరి నాగతేం కాను పిల్లా. నాకు మాత్రం ఎవరున్నారు పిల్లా నువ్వు తప్ప. వాణ్ణి తగులుకుని చల్లగా పోదామని చూస్తున్నావా? నీ ఆటలు నేను సాగనిస్తానటే పిల్లా. ముసలిదాన్ని దిక్కులేకచస్తే నీకేం? ఇన్నాళ్ళు చేసిందీ మరచిపోయి మాయచేస్తావా?" అంది ముసల్ది చేతులు వూపుతూ.

    "ఏం చెప్పావ్?" అంది రమ.

    "నీదంతా నటన అని చెప్పాను. వచ్చిన ప్రతివాడిదగ్గరా యిలాగే వేషం వేస్తుందన్నాను. ఆఁవదం తాగినట్టయింది అబ్బాయి మొహం" అంది ముసల్ది కళ్ళు చికిలిస్తూ నవ్వుతూ.

    రమకి కాళ్ళకింద భూమి బద్దలయిపోతూన్నట్టు అనిపించింది. ఆమెకి దేవుడిమీదా మనిషిమీదా విశ్వాసం ఒక్కపెట్టున తుడిచిపెట్టుకుపోయి నట్లయింది. కళ్ళుతిరిగి పడిపోతున్నట్టు ఆమె గోడనానుకుని నిలబడింది.

    ముసలిది అనునయంగా, "మగవాళ్ళమాటలు నమ్మి చెడిపోకుపిల్లా. అప్పుడు నేను నిన్నాదుకోకపోతే నీగతి కుక్కలకీ నక్కలకీ కూడా పట్టేదికాదు. ఈ వయసులో నాలుగురాళ్ళు కూడబెట్టకపోతే యింకెప్పుడే పిల్లా పోయి చూసుకో. నీ మంచంమీదికి పర్సుగిరవాటేసి పోయాడు, ఎంత సొమ్ముందో చూడు" అంది.

    "ముసలిపీనుగా, దొంగముండా, పిశాచముండా" అంటూ రమ వెర్రికోపంతో ముసలిదానిమీదపడి దబదబా తలమీదా వొంటిమీదా మొత్తేసింది. ముసలిది తప్పించుకుని పారిపోబోయింది. "నా కొడుకుని నువ్వే చంపేశావ్. నా బతుకుని నాశనం చేశావ్" అని వెర్రిగా అరుస్తూ అక్కడున్న ముక్కాలపీటని ముసలిదానిమీదకి విసిరింది. "అబ్బా" అని ముసల్ది నిలువునా కిందికి కూలపడిపోయింది. ఆమె తలమీదనుండి నెత్తురు ప్రవాహంలా కారుతోంది. బలమైన దెబ్బతో ముసలిది స్పృహతప్పి పడిపోయింది. రమ తిన్నగా గదిలోకి వెళ్ళింది. మంచంమీద పర్సుని తీసిచూసింది. ఒక అరనిండా నోట్లుకుక్కి ఉన్నాయి. ఒక అరలో జగన్నాథం ఫోటోవుంది. ఆ పర్సు పట్టుకుని వెర్రిదానిలాగా అలాగే నిల్చునిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. కనులమ్మట అశ్రువులు ఏకధారగా ప్రవహిస్తున్నాయి. మూర్తీభవించిన దైన్యంలాగ నిలబడిన ఆమెకు పరిజ్ఞానం నశించింది. ఒక్కసారిగా పరుగెత్తుకు వీధిలోకి వచ్చింది. చేత్తో పర్సుని గట్టిగా పట్టుకుంది. మడుగులోదిగి వేగంగా రోడ్డుమీదకి వచ్చింది. వర్షం సన్నగా పడుతూంది. ఆమె పరుగు సాగించింది. బురదనీళ్ళు వొళ్ళంతా చిందుతున్నాయి. ఆమె గోతుల్నీ గతుకుల్నీ చూడలేదు. గోతులలో కాలుపడి కింద పడుతోంది. మళ్ళీ లేచి పరుగెత్తుతోంది. బట్టలన్నీ బురదతో దట్టంగా అసహ్యంగా తయారయ్యాయి. ఆమె ముఖానకూడా బురద చిమ్మింది. జుట్టుముడి వీడిపోయింది. వానకి వొళ్ళంతా తడిసిపోయింది. బట్టల చివరల నుండి నీళ్ళు కారుతున్నాయి.

    తూర్పున వెలుతురు వచ్చేస్తూంది. తూర్పున మబ్బులు కొంచెం కొంచెం తెల్లబడుతున్నాయి. ఆమె పరుగు వేగం హెచ్చించింది. ఆమె రొప్పుతోంది. ఆయాసపడుతోంది. కనుచూపు మేరలో స్టేషన్ కనపడుతోంది. స్టేషన్ కి రైలు వచ్చేసింది. పళ్ళు బిగపట్టి శక్తినంతా ఉపయోగించి ఒక్క పరుగులో స్టేషన్ చేరింది. జనం గుంపులు గుంపులుగా దిగుతున్నారు. గేటు దగ్గర జనం క్రిక్కిరిసి వున్నారు. వాళ్ళని తోసుకుని లోపలికి పోయింది. చెయ్యి అడ్డంగా పెట్టి "ఆగు" అంటూన్న టికెట్ కలెక్టర్ని కూడా బురద చేతులతో తోసివేసింది. ప్లాట్ ఫారం మీదకు వచ్చింది. విడిపోయిన జుట్టుతో వొళ్ళంతా, మొహమంతా బురదతో దుర్భరంగా వుంది. వింతగా చూస్తున్నారు జనం. ఆమె ఒక్కొక్క రైలు పెట్టెనే ఆత్రంగా వెతుకుతోంది. "బాబుగారూ" అని అరుస్తోంది. పెట్టలలోని ప్రయాణీకులు అర్ధంకాక "ఏఁవిటి ఏఁవిటి" అంటున్నారు. ఆఖరు పెట్టెలో కిటికీకి కొంచెం దూరంలో వున్న జగన్నాధాన్ని చూసింది రమ. రైలుకూత వేసింది. గార్డు విజిల్ వేశాడు.

    "బాబుగారూ యిదుగో పర్సు" అంటూ పెట్టెలోకి పర్సుని విసిరింది రమ. జగన్నాథం రమని పోల్చుకోలేకపోయాడు మొదట. ఇంతలో రైలు కదిలింది. రైలుతోపాటు ఆమె కూడా పరుగెత్తుతూ "నేను రమని నేను రమని.... మళ్ళీ మీరు.... మీరు" ఆయాసంతో ఇంక మాట్లాడలేకపోయింది రమ. చీర మడతలో కాలు చిక్కుకుంది. ఒక్కసారిగా ముందుకు బోర్లాపడింది. జగన్నాథం తొందరగా వెళ్ళిపోయే రైలు కిటికీలోంచి ప్లాట్ ఫారం మీదికి చూశాడు. నేలను కరచుకుని, బురదతో నిండిన బట్టలతో, విడిపోయిన శిరోజాలతో, బోర్లా పడివున్న దీనమైన స్త్రీమూర్తివైపు ఫ్లాట్ ఫారం మీద మిగిలిన జనం కంగారుగా రావడం చూశాడు. అతని మొహం బాధతో నల్లబడింది. రైలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయింది. జగన్నాథం కిందకి వంగి పర్సును పైకితీసిచూశాడు. పర్సులో డబ్బంతా ఎలా పెట్టింది అలాగే వుంది. కాని ఫోటో మాత్రం లేదు.

                                                       (1961)

                                 ********




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.