Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ముసలిది ఫక్కున నవ్వింది. ఆ నవ్వు కొన్ని వందల కప్పల్ని బట్టలో చుట్టబెట్టి ఊపిరాడకుండా నొక్కుతూంటే వచ్చిన ధ్వనిలాగా వుంది
"మాకు పెళ్ళేవిటి బాబూ!" అంది.
"చూడవ్వా. రమ చాలా కష్టాలు పడింది. రమ బెంగతో కృశించిపోతోంది. రమని నేను ప్రేమించాను. పెళ్ళి చేసుకుంటానని వాగ్దానమిచ్చాను" అన్నాడు జగన్నాథం.
"వెర్రోడా!" అంటూ మళ్ళీ విరగబడి నవ్వింది ముసలిది.
"ఏం?" అర్ధంకాలే దామె నవ్వు జగన్నాథానికి.
"నువ్వుకూడా నమ్మేశావా బాబూ, అదంతా నటన బాబూ నటన. ఎప్పుడూ ప్రతివాళ్ళదగ్గరా యిలాగే కల్పించి చెప్పుతుంది. వాళ్ళు జాలేసి యింకో వంద ఎక్కువిచ్చేవారు. నీ కనుభవం తక్కువ .లేత మనిషిని ఇట్టే నమ్మేశావ్" అంది. ముసలిది అతన్ని కనిపెడుతూ.
జగన్నాథానికి కోపం వచ్చింది. సంశయమూ కలిగింది.
"రమ మోసం చెయ్యదు" అన్నాడు సందేహంగా.
"తాను దిక్కులేనిదానినని చెప్పింది కదూ. నువ్వు తను చిన్నప్పుడు ప్రేమించిన బుల్లోడివిలా ఉన్నావంది కదూ. తండ్రి ఉరిపోసుకు చచ్చిపోయాడంది కదూ, వెక్కి వెక్కి ఏడ్చింది కదూ" గబగబా అడిగింది ముసలిది. జగన్నాథం స్తంభించిపోయాడు.
"అంతా నటన బాబూ నటన. ఇలాంటి తప్పుడు వేషాలెయ్యొద్దని ఎన్నోసార్లు చెప్పాను. వినదు కదా బాబూ. నాకిలాంటి అబద్దాలూ వేషాలు నచ్చవు బాబూ, మన మామూలు మనకి చాలు. అటువంటి మోసాలు చెయ్యకు ఎప్పటికైనా ప్రమాదం అని చెప్పాను. ఇదిగో ధర్మప్రభువు కాబట్టి నీతో చెప్పాను. ఎక్కడా అనకు బాబూ. మా కూడు పడిపోతుంది" అంది ముసలిది ఉత్సాహంగా.
జగన్నాథానికి నోట్లో ఏదో అరుచి పుట్టినట్లయింది. వెగటుగా అసహ్యంగా అనిపించింది. కోపంతో అతని కళ్ళు జ్వలించాయి. "అయితే ఈ రోజు రాత్రి మీరు పిలిచి ఉండమన్నందుకు డబ్బివ్వాలి, అంతేనా" అన్నాడు.
"అంతే బాబూ, ఒళ్ళమ్ముకుని బతికేవాళ్ళం, మాకింకేం కావాలి బాబూ. ఇందాక నాదగ్గరకొచ్చి 'డబ్బుమాట నువ్వడుగు నాకు సిగ్గేస్తుంది' అని మరీ మరీ చెప్పింది. 'ఆఖరికి బజానా అయినా కొంత తీసుకో అవ్వా' అని పీక్కుతింది. 'మారాజు అన్యాయం చెయ్యడు పిల్లా ఉత్తికంగారు నువ్వూ' అని కేకలేశాను బాబూ" అంది ముసలిది వినయంగా.
"సరే అయితే" అన్నాడు జగన్నాథం. గబగబ గదిలోకి వెళ్ళాడు. బద్దలవబోతున్న అగ్నిపర్వతంలాగ ఉంది అతని మనస్సు. మంచం మీద నిశ్చింతగా పడుకున్న రమ విషపూరితమైన సర్పంలాగ కనపడింది. ఆమె పీక పిసికి చంపెయ్యాలన్నంత కోపంతో మంచం దగ్గరకు వెళ్ళాడు. అప్రయత్నంగా అతని చేతులలోని కండరాలు వురిపెట్టిన తాడు లాగ బిగుసుకుపోయాయి. పళ్ళు బిగించాడు. ఇంతలో మళ్ళీ ఏమనుకున్నాడో తన పెట్టెనుండి పర్సుతీసి మంచంమీదకు విసిరాడు! సూట్ కేసు చేత్తో పట్టుకుని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు. చీకటి వర్షం కురుస్తూనే వుంది. "వెళ్ళిపోతున్నావా బాబూ?" అంది ముసలిది సమాధానం చెప్పకుండా మెట్టుదిగి మడుగుదాటి వడివడిగా చీకట్లోకి వెళ్ళిపోయాడు. ముసలిది విజయసూచకంగా, వికడతంగా ధ్వనిచేసింది.
రమకి మెలకువ వచ్చేటప్పటికి అయిదుగంటలు దాటింది. చీకటి పలచబడుతోంది. నల్లని చీకటి బూడిదరంగుగా మారుతోంది. చావులోంచి భయంలోంచి ఏదో కొత్తలోకంలోకి కాంతిలోకంలోకి వచ్చినట్లనిపించింది రమకి, ఆమెకళ్ళు తెరుస్తూనే చిరునవ్వు నవ్వింది. బయట వానకురుస్తున్నా, ఆకాశం మేఘాచ్చాదితమై ఉన్నా, చలిగాలి సూదుల్లాగా గుచ్చుకుంటున్నా ఆమెలో ఒకానొక వసంత ప్రభాత సూర్యుడు వెచ్చని తెల్లని కిరణాల్ని ప్రసరించాడు.
బద్దకంగా ఆవులించి పక్కకు చూసింది రమ. అక్కడ జగన్నాథం లేడు. లేచి కూర్చుని గది అంతా చూసింది.
జగన్నాథం పెట్టెకూడా కనబడలేదు. కంగారుగా మంచందిగి మండువాలోకి వచ్చింది. అవ్వ చీపురుతో తుడుస్తోంది. ఆతృతతో "ఆయనేరీ అవ్వా?" అని అడిగింది.
"వెళ్ళిపోయాడు."
రమకి గుండె ఆగినంతపని అయింది. "ఊహుఁ వెళ్ళడు. నాతో చెప్పకుండా వెళ్ళడు" అని ఉద్రేకంతో అంది. ముసలిది మాట్లాడలేదు.
"ఎక్కడికి వెళ్ళాడు?" అంది రమ.
"ఏమో నాకేం తెలుసు, పెట్టె పట్టుకుపోయాడు" అంది ముసలిది.
"ఎందుకు వెళ్ళనిచ్చావ్ అవ్వా?నేను లేచేవరకైనా ఉంచలేకపోయావా?" అంది ఏడుపు నాపుకుంటూ రమ.
"ఏమిటే ఆ కంగారు పిల్లా! నేనంత తెలివితక్కువ దాన్ననుకున్నావా? అదిగో చూసుకో నీ మంచంమీద పర్సు వదిలేసి మరీ వెళ్ళాడు."
"డబ్బా!"



