Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    "నీ బుద్ది మారదు ముసలిపీనుగా" అంటూ విసురుగా ఇంకో గదిలోకి వెళ్లిపోయింది రమ.

    జగన్నాధం ఒక్కడూ గదిలో మంచంమీద దిండ్లు నానుకుని కూర్చుని ఆమెకోసం నిరీక్షిస్తున్నాడు. అతని మనస్సెంతో తేలికైంది. వర్షం ఎక్కువయింది. రేకుమీద చినుకులుపడిన శబ్దం కూడా ఎక్కువయింది. కొంతసేపటికి రమ గదిలోకివచ్చింది. రమకన్న ముందుగా సుతారపు అత్తరపు వాసన గదిలోకి వ్యాపించింది. ఆమె ముఖానికి స్నో, పౌడరూ ఉపయోగించింది. ఇందాకటి కన్నీటి చారలూ, బాధయొక్క నీడలూ లేవు. తెల్లని పల్చనిచీర కట్టుకుంది. జుట్టు దువ్వుకుని సిగగా చుట్టుకుంది. నవ్వుతూ, సిగ్గుతో, హాయిగా రాజహంసలా వచ్చే ఆమెని చూడగానే అతని హృదయం ఆనందంతో  నిండింది.

    అతను లేచి ఆమెను మంచంమీద పరుండబెట్టి పక్కనే కూర్చున్నాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ "నువ్వు అమాయకురాలివి రమా. ఇంక నిన్నెప్పుడూ ఏడవనివ్వను. ఏడుపు నీ బ్రతుకులోనికి రానివ్వను" అన్నాడు.

    ఆమె తన చేతివేళ్ళనతని చేతివేళ్ళలోంచి పోనిచ్చి "మీరు నన్ను తప్పక పెళ్ళిచేసుకుంటారు కదూ. ఇక్కడనుంచి వెళ్ళిపోతాం కదూ" అంది.

    "తప్పకుండా, ఈ వర్షం తగ్గగానే బయలుదేరివెళ్ళి అన్ని ఏర్పాట్లూ చేసి ఒక వారం రోజుల్లో నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తాను."

    "మీరు రాకపోతే" భయంగా అడిగింది రమ. ఆమె కళ్ళల్లో భయం సుళ్ళు తిరగడం చూశాడు జగన్నాథం.

    "ఎందుకు రాను రమా. నీకిటువంటి అనుమానం ఎందుకు కలగాలి?" అన్నాడు.

    "అయితే వొట్టెయ్యండి" అంది రమ.

    అతడు నవ్వుతూ ఒట్టువేశాడు. ఆమె నిట్టూర్చి కన్నులు మూసుకుంది. మనస్సు యొక్క అగాధపు చీకటి లోయలో కాంతిమార్గం తెరచుకుంటూన్నట్టనిపించింది. ఎర్రని ఆమె పెదవులు దేనికోసమో వెతుకుతూన్నట్లు కదిలాయి. ఆమె ముఖంలో తృప్తి వెయ్యిరేకుల పద్మంలా విరిసింది.

    "నువ్వు చాలా అలసిపోయావు, కాసేపు నిద్రపో రమా" అన్నాడు జగన్నాథం

    "మీరు-?" అడిగింది రమ.

    "నేనిలాగే కూర్చుని ఆలోచిస్తుంటాను."

    "నాకు కాపలా కాస్తుంటారా?" అని నవ్వింది రమ కన్నులు మూసుకునే.

    "అవును. ఎవరి సొమ్ముని వాళ్ళు భద్రంగా చూసుకోవాలి కదా?" అన్నాడు జగన్నాథం

    పెంకితనంలో వికసించడానికి ఒప్పుకోని ఎర్రని మొగ్గలాగ ఉన్నాయి ఆమె పెదవులు. జగన్నాథం వంగి ఆమె పెదవుల్ని మెల్లగా మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. రమ అతని చేతిని తీసుకుని తన గుండెలమీద పెట్టుకుంది. అతని చేతిమీద తన చేయి వేసింది.

    "ఈ చేయి యిలాగే ఉంచండి. ఇంక నాకు భయంలేదు. హాయిగా నిద్రపోతాను" అంది రమ. అతనేవో కబుర్లు చెబుతూంటే వింటూ నిద్రలో లీనమయిపోయింది.    

    ఈ విచిత్ర సంఘటన గూర్చీ తన హఠాన్నిర్ణయాన్ని గూర్చీ యింకా విస్మయంగా ఆలోచిస్తున్నాడు జగన్నాథం. అతని చెయ్యి ఆమె గుండెలమీదనే వుంది. ఆ చేతిమీద ఆమెచెయ్యి వుంది. అలాగ ఎంతసేపు కూర్చుని ఆలోచించాడో అతనికే తెలియదు. గది గుమ్మం దగ్గర ఎవరో తచ్చాడుతూన్నట్టుగా అనిపించి నిదానించి చూశాడు. ముసలిది సైగ చేస్తూంది. రమ్మని చేయి వూపుతోంది. రమకి నిద్రాభంగం కాకుండా మెల్లగా తనచేయి విడిపించుకుని చప్పుడుకాకుండా గది దాటి వెళ్ళాడు.

    "ఎందుకవ్వా పిలిచావు!" అన్నాడు. ముసలిది అతన్ని మండువాలో మూలకు తీసుకువెళ్ళింది.

    "అమ్మాయి బాగా నచ్చిందా బాబూ!" అంది.

    "నచ్చింది" అన్నాడు జగన్నాథం నవ్వుతూ.

    ముసలిదానికళ్ళు కుత్సితపు వూహతో సన్నగా ముడుచుకున్నాయి. వెకిలిగా నవ్వి  "మారాజులు మీరు. గొప్ప గొప్ప ప్రభువులు" అంది.

    జగన్నాథం రమ లేస్తుందేమోనని "త్వరగా చెప్పు అవ్వా!" అన్నాడు ఆమె నమ్ముకున్న హస్తాన్ని ఆమె గుండెలనుండి తీయటం కూడా ఏదో దోషంలాగా అనిపిస్తూంది అతనికి.

    "నువ్వేకాదు బాబూ, ఏ అయ్య చూసినా నచ్చిందన్న వాడేకాని వేరు మాటపలికినవాడు లేడు. ఒక రాత్రికి రెండొందలు, మూడొందలు యిచ్చిన మారాజులే అందరూ. అందరిలాంటిది కాదు బాబూ నా పిల్ల. వజ్రం, వైడూర్యం, దాని వొళ్ళూ దాని రుచీ మీలాంటి ప్రభువులకి తెలుస్తుంది. అందుకే అయినవాణ్ణీ, కానివాణ్ణీ గుమ్మం ఎక్కనివ్వను. ఎంచుకోవడంలో దానికున్న తెలివి గొప్పది బాబూ. మనసు కాకపోతే ఎంత గొప్పవాడినైనా పొమ్మంటుంది" అంది ముసలిది.

    "ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి?" అన్నాడు జగన్నాథం విసుగ్గా.

    "మరేం లేదు బాబూ, నీకెన్నాళ్ళు మనసైతే అన్నాళ్ళూ అనుభవించు. నువ్వు లోటు చేస్తావా బాబూ మహారాజు బిడ్డవి. ఒక రాత్రికి రెండొందలు తక్కువకాకుండా యిస్తావు. నాకు తెలుసు. నీ ఠీవి నీమాటేచాలు బాబూ, నీ లోతు తెలుసుకోవడానికి ఏదో లేనివాళ్ళం. మీలాంటివాళ్ళు దయదలిస్తే నాలుగురోజులు మీ పేరు చెప్పుకుతింటాం"

    జగన్నాథానికీ మాట యీ తీరు అసహ్యం అనిపించింది. "ఇదిగో అవ్వా రమని నేను పెళ్ళిచేసుకోబోతున్నాను" అన్నాడు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.