Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "అవ్వ నీకేమీ కాదన్నమాట!"

    "కాదు"

    "అయితే నువ్విక్కడ....." అని అతను ఏదో అనబోతూంటే ఆమెచేతులతో తన ముఖాన్ని కప్పుకుని "ఇంక నన్నేమీ అడగకండి. నన్నుచంపకండి" అని వెర్రిగా కేకలు వేసింది.

    జగన్నాథం తెల్లబోయాడు. ఆమె మంచంమీద బోర్లపడి వవెక్కివెక్కి యేడుస్తూంది. ఆమెకి ఉపశమనం బరువు తీవ్రమైన దుఃఖాన్ని కలిగించానే అని బాధపడ్డాడు జగన్నాథం. తెల్లని పక్కమీద ఆమె జుట్టు విప్పిన నెమలిపురిలా వుంది. వేటగాడి బాణంచేత దెబ్బతిన్న కపోతంలాగా విలవిలలాడుతోంది. ఆమె. అతనికేం చెయ్యాలో తోచలేదు. ఇబ్బందిగా దిక్కులు చూశాడు. అతని మనస్సు సానుభూతితో, జాలితో నిండిపోయింది. అనుకోకుండా అతని కళ్ళు రెండూ తడి అయినై.

    ఎన్నాళ్ళనుంచి దాచుకున్న ఈ అపరిమిత దుఃఖాన్ని విజయుడిలాగ కనబడే తనముందు ఒక ఆత్మీయతననుభవించి బహిర్గతం చేసిందనుకున్నాడు. సుకుమారంగా పువ్వులాగా ఉన్న ఈమెకి యింత బరువుని ఇన్నాళ్ళు మోయగల శక్తి ఎక్కడనుంచి వచ్చిందా అని ఆశ్చర్యపడ్డాడు. ఎన్ని సుఖాలూ, సదుపాయాలూ ఉన్నప్పటికీ మనస్సులోని ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో అతనికీ తెలియవచ్చింది. అది పెద్ద సహారాయెడారిలా వ్యాపించి ఉంటుంది. అక్కడ నీళ్ళు దొరకవు. అడుగుజాడలు  కనపడవు. బ్రతుకు వాసన ఉండదు. అక్కడ మండే కాలే యిసుకమాత్రం అనంతంగా పరుచుకొని వుంటుంది. ఎవరూ ఆ ఎడారిలో ఉండలేరు. బ్రతుకలేరు. తనలో, రమలో ఆఖరికి అవ్వలోకూడా ఎడారి. ఆ యిసుకలో కాళ్ళుమాడుతూ బ్రతుకునీడ్చుకుంటూ, నాలిక పిడచకట్టుకుపోతూంటే ఒయాసిస్సులకోసం కొన వూపిరితోకూడా వెతుక్కుంటూ ఉంటారు.

    ఈ ఆలోచనతో క్షణమాత్రం అతని సర్వాంగాలూ కంపించాయి. అతను నిలదొక్కుకుని, ఏడుస్తూన్న రమకేసి చూశాడు. ఆమె వీపుమీద చెయ్యివేసి "రమా" అని మృదువుగా పిలిచాడు. ఆమె మాట్లాడలేదు.

    "రమ ఒక్కమాట చెప్పనా" -అన్నాడు మళ్లీ.

    "ఏఁవిటి చెప్పండి" అంది అలాగే బోర్లా పడుకుని.

    "ఇక్కడకువచ్చి నిన్ను చూచినప్పటినుండీ నాలో ఒక అశాంతి రేగింది. ఇంతవరకూ ఏ సందేహాలూ లేకుండా కులాసాగా మొండిగా జీవితాన్ని గడిపేస్తున్నాను. బుద్ధిపూర్వకంగా మనస్సునీ, చర్మాన్నీ మొద్దుబారిపోయేటట్టు చేసుకుంటున్నాను. నిన్నుచూశాక ఎన్నాళ్ళనుంచో నీ కోసమే వెతుకుతూన్నట్టనిపించింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను రమా, నాకు నువ్వు కావాలి" అన్నాడు జగన్నాథం.

    రమ ఏడుపు నాపింది. లేచి కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అతనికేసి చూసింది.

    "చీకట్లో వెళ్ళే పాంధుడికి దీపం కన్న మరో పాంధుడు ఎక్కువ దైర్యాన్నీ, విశ్వాసాన్నీ యివ్వగలడు రమా. మన యిరువురి జీవితాల్ని ఏకం చేసుకుంటున్నాను. నిన్ను చూశాక ఎన్నాళ్ళనుంచో నీకోసమే వెతుకుతూన్నట్టనిపించింది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను రమా, నాకు నువ్వు కావాలి" అన్నాడు జగన్నాథం.

    రమ ఏడుపు నాపింది. లేచి కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా అతనికేసి చూసింది.

    "చీకట్లో వెళ్లే పాంధుడికి దీపంకన్న మరో పాంధుడు ఎక్కువ ధైర్యాన్నీ, విశ్వాసాన్ని యివ్వగలడు రమా. మన యిరువురి జీవితాల్ని ఏకం చేసుకున్నట్లయితే, మనకొక ప్రశాంతీ, ధ్యేయమూ కలుగుతాయని ఆశగా ఉంది. నేను నిన్ను - ప్రేమిస్తున్నాను రమా."

    "నిజంగానా?" నమ్మలేని కళ్ళతో అడిగింది రమ.

    "నిజం తెగిపోయిన దారాల్నీ, తంత్రుల్నీ చేర్చి ముడెట్టుకుంటేగాని జీవితాలు శ్రుతి తప్పి యిలాగే శిధిలమై నామమాత్రం లేకుండా నశించిపోతాయి. నన్నునమ్ము రమా. నిన్ను పెళ్ళిచేసుకుంటాను. నీకిష్టమేనా?"

    "మరి బర్మా, సింగపూరు ఎక్కడికి వెళ్ళరా?"

    "వెళ్ళను. నువ్వు నా భార్యవైతే"

    ఆమె అతని కళ్ళలోని నిజాయితీని, నిశ్చయాన్నీ చూసింది. ఆనందం ఎక్కడనుంచో సందుచేసుకుని వచ్చి ఆమె ముఖాన్నీ, దేహాన్నీ మెత్తని వెలుతురుతో నింపింది. ఆమె కళ్ళు పెద్దవై ప్రకాశించాయి. ఒక్కసారి పెదవి వారగా నవ్వింది. వెర్రి ఆవేశం ఆమెని ఆవరించింది. మైకం కమ్మినట్టయింది. అతన్ని తన వొడిలోనికి లాక్కుని, అతని శిరస్సుమీదా, బుగ్గలమీదా, రొమ్ముమీదా గబగబా ముద్దు పెట్టుకుంది.

    అతనికూపిరాడక "అబ్బ -వదులు వదులు రమా!" అన్నాడు. ఆమె కిలకిల నవ్వి మంచం మీదనుంచి దిగి యిప్పుడే వస్తానంటూ గదినుండి రివ్వున వెళ్ళిపోయింది.

    గది దాటగానే ముసలిది కంగారుగా అక్కడినుంచి వెళ్ళిపోవడం చూసింది. దగ్గరగా వెళ్ళి కోపంతో "అవ్వా నువ్వు చాటుగా నిల్చుని మా మాటలు వింటున్నావా?" అని అడిగింది.

    "లేదు పిల్లా లేదు, లేదు" తడబడుతూ అంది ముసలిది.

    "గుమ్మం దగ్గర ఏం చేస్తున్నావ్ ఇంత రాత్రివేళ?"

    "నీతోడు పిల్లా. నే నొక్కమాట వినలేదు. తాళంచెవులకోసం వెతుక్కుంటూ వచ్చానిలాగ" అంది ముసలిది.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.