Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    ఆమె గొంతు క్రమక్రమంగా క్షీణమూ, గాద్గదికమూ అయిపోయింది. ఆమె కాసేపాగి మళ్ళీ యిలా చెప్పింది. "ఓసారి చెట్టుమీద నుంచి పడినప్పుడు విజయుడికి నెమరుకణత పక్కగా గాయం తగిలింది. క్రమేణా అది మచ్చగా మారింది" ఆమె జగన్నాథం కేసి తీవ్రంగా చూసింది. "అదిగో అక్కడ మీకు ఏదో మచ్చ వుంది. మీరు విజయుడు కాదా? చెప్పండి. నిజం చెప్పండి. నన్ను మోసగించకండి. నన్ను బాధపెట్టకండి" ఆమె ఉద్రేకంతో దీనంగా ప్రాధేయపడుతూ అడిగింది.

    జగన్నాథం ఆమెని, పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. శాంతంగా "నేను నీ విజయుణ్ణి కాదు రమా! అలా చిన్నపిల్లలాగ ఉద్రేకపడిపోవడం మంచిది కాదు" అన్నాడు.

    గది గుమ్మందగ్గరో ఎవరో నడిచినట్టు చప్పుడయింది. ఇద్దరూ అటువైపు చూశారు. ఎవరూలేరు. అతను తిరిగీ ఆమెను ప్రశ్నించాడు. "అనాథాశ్రమంలో మిమ్మల్ని ఎవరు చేర్పించారు?"

    "నాన్న" అందామె.

    "మీ తండ్రి నెరుగుదురా?"

    "ఎరుగుదును"

    "ఆయన వుండగా, ఆయనే స్వయంగా మిమ్మల్ని శరణాలయంలో చేర్పించవలసిన అవసరం ఏముంది?"

    "అదంతా ఒకగాథ" ఆమె బరువుగా నిట్టూర్చింది.

    "అంటే....."

    "నాన్న చాలా దుఃఖజీవి . సంస్కారవాదీ. విప్లవవాది కూడా. తక్కువ కులస్థురాలిని పెళ్లాడడం వలన బంధువర్గమూ, సమాజం, పెద్దలూ అతన్ని వెలివేశారు. నాన్న ఆ రోజుల్లో ఒక రహస్య విప్లవ సంఘంలో సభ్యుడుగా ఉండేవాడు. ఎన్నోసార్లు జైలుకివెళ్ళి తప్పించుకువచ్చేవాడు. ఒకసారి పోలీసులకి, ఈ సంఘానికి పెద్ద కొట్లాట జరిగింది. అందులో నాన్న తుపాకి దెబ్బవల్ల గాయపడ్డాడు. దాని ఫలితంగా ఒక కాలు శస్త్రచికిత్స చేసి తీసివేశారు. కుంటివాడూ అనారోగ్యవంతుడూ అయిన తండ్రి అమ్మనూ, నన్నూ పోషించలేకపోయేవాడు. అమ్మ బెంగతో వ్యాధితో మరణించింది. నాన్న చేసిన త్యాగాన్నీ, దేశ సేవని ఎవరూ గుర్తించుకొని కాస్త సహాయమైనా చెయ్యలేదు. కర్రనాధారంగా చేసుకొని పొరుగూళ్ళు వెళ్ళి యాచన చేసి నన్ను పోషించేవాడు. క్రమేణా నాన్నకి జీవితంమీద విరక్తి కలిగింది. బతకడమే పెద్ద బరువైపోయింది.

    "ఒకరోజున అర్ధరాత్రి నిద్రపోతూన్న నన్ను లేపి తనతో రమ్మన్నాడు. నాకు అప్పుడు ఏడెనిమిదేళ్ళ వయస్సు. తనతో కూడా చీకట్లో నడిపించుకు వెళ్ళాడు. ఎత్తయిన ప్రహరీ గోడలూ చుట్టూ వున్న ఒక పెద్ద యింటికి తీసుకువెళ్లాడు. అదే అనాథ శరణాలయం . శరణాలయ నిర్వాహకురాల్ని మానాన్న బాగా ఎరుగునట. ఆవిడకి నన్నప్పగించాడు. ఆమె చేతికొక ఉత్తరం ఇచ్చి పెద్దదాన్నయాక నాకిమ్మన్నాడు. ఒకచేత్తో కర్రనానుకుని ఒకచేత్తో నా చుబుకం పట్టుకుని కన్నీళ్ళతో "అమ్మడూ ఇక నుంచీ ఈవిడే నీకు అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా" అని శిరస్సుమీద ముద్దుపెట్టుకుని కర్రని టకటకమని చప్పుడు చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. నేను భయంతో "నాన్న! నాన్న!" అని గట్టిగా అరిచాను. ఆ ఆక్రోసం చీకట్లో మార్మోగింది. ఉదయానికి నాన్న ఆత్మహత్య చేసుకున్నట్టు ఊరంతా చెప్పుకున్నారు" ఆమె బాధతో కంపించిపోతూంది. మంచంపట్టెని గట్టిగా నొక్కి పట్టుకుంది. ఇంకా ఇలా చెప్పుకుపోయింది.

    "ఇప్పటికీ ఆ పిలుపు చీకటివేళల హృదయవిదారకంగా ప్రతి ధ్వనిస్తూన్నట్లే ఉంటుంది నాకు. ఆశ్రమ నిర్వాహకురాలు చాలా దయాహృదయం కల మహిళ. ఆవిడే వుంటే నా బ్రతుకిలాగ అయిపోయి వుండేది కాదు. కాని రెండు సంవత్సరాల అనంతరం ఆమె కూడా చనిపోయింది."

    "ఆ ఉత్తరంలో ఏమని రాశాడు మీ నాన్న?" అని అడిగాడు జగన్నాథం.

    "నేను జీవిత సమరంలో చిత్తుగా ఓడిపోయినానమ్మా. అందుకే నిన్ను దిక్కులేనిదానిగా ఒంటరిదానిగా చేసిపోతున్నాను. కాని ఒక్కటి మాత్రం మరచిపోకు. నీ తండ్రి ఏంచేసినా ఒక ఆదర్శంకోసమూ, ఒక విశ్వాసం కోసమూ చేశాడు. అంతేకానీ నీచమైన మోసమైన ఏపనీచెయ్యలేదు. ఏ లోకంలోవున్నా! నీ సుఖాన్నీ, అభివృద్ధిని కాంక్షిస్తుంటాను! అని రాసి వుంది" అందామె.

    దుఃఖపూరితమైన యీ గాథలో గాలి అంతా బరువెక్కినట్లనిపించింది అతనికి. ఇద్దరూ కొన్ని నిముషాలు మౌనంగా వున్నారు. అతనే మళ్ళీ ప్రశ్నించాడు.  "మరి ఈ వూరు ఎలా వొచ్చావు రమా! ఈ అవ్వ ఎవరూ!"

    ఆమె సంకోచంతో సాశ్రునయనాలనెత్తి చూసింది. "చెప్పు రమా. నా దగ్గర ఏం చెప్పడానికీ నీకు సంకోచం అనవసరం. ఈ విషాదయాత్రలో నేనూ ఒక సహచరుడినే" అన్నాడు జగన్నాథం.

    "విజయరాముడు -అది విజయుడి అసలు పేరు - వెళ్ళిపోయాక నాకు బతుకంతా శూన్యమైపోయింది. చాలాకాలం అతనికోసం వేచివున్నాను. కొందరు అతను యుద్దంలో చనిపోయాడన్నారు. అతన్ని తలచుకుని రోజూ ఏడుస్తూ బెంగగా వుండేదాన్ని. ఆశ్రమం అప్పుడు స్వార్ధపరుల చేతుల్లో వుండేది. నానా కష్టాలూ పడేవాళ్ళం. బ్రతుకు దుర్బరమైపోయింది. అప్పుడు......." ఆగిందామె.


    "అప్పుడు?"

    "ఒక పెద్దమనిషి తీయనిమాటలు చెప్పి నమ్మించి నన్నీ వూరుకుతీసుకువచ్చేశాడు. ఇక్కడ హోటల్లో మకాం పెట్టారు. ఒక రోజున ఉదయం లేచి చూచేటప్పటికి అతగాడు పెట్టెతో బెడ్డింగుతో మాయమయ్యాడు. కట్టుబట్టలోత ఉన్న నన్ను వీధిలోకి గెంటేశారు. అవమానంతో ఆకలితో చచ్చిపోదామనుకుంటూన్న నన్ను అవ్వచూసింది. అప్పట్నుంచీ, ఇక్కడ అవ్వతో ఉంటున్నాను."




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.