Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
అతనికి గుండెలో ఏదో వెలితిగా తోచింది. తనలోని ఈ అస్థిరత్వానికి, అశాంతికి కారణం ఏఁవిటి? ఇలా వూళ్ళో దేశాలూ తిరుగుతూ జీవితాంతంవరకూ గడపవలసిందేనా? తన కొక ఇల్లు, తనకోసమై ఎదురుచూచే, జీవించే ప్రాణి అతడు తనలో తాను నవ్వుకున్నాడు. ఎప్పటికీ తానొకచోట స్థిరంగా ఉండలేడు. ఎప్పుడో ఎక్కడో గాలివాటానికి తాడు తెగిపోయింది. ఇలాగ శూన్యంలో ఏ బాధ్యతా లేకుండా గాలికి కొట్టుకుపోతూంటేనే బావుంటుందేమో?
ఆలోచిస్తూన్న అతనికి కునుకుపట్టింది. అప్పుడు కూడా అతని మనస్సు అవ్యక్తంగా ఆమెకోసమే నిరీక్షిస్తోంది. ఒక గంటలో అతనికి మెలకువ వచ్చింది, గుమ్మం తలుపులు బార్లా తీసివున్నాయి. నలువైపులా చూశాడు. ఆమె మళ్ళీ వచ్చిన జాడలేదు. గోడమీద గడియారంలో పండ్రెండు దాటింది. అతనికేమీ తోచలేదు. ఆ గదిలో ఒక్కడూ అలాగ వుండడం దుస్సహమనిపించింది. మంచందిగి మెల్లగా అడుగులు వేసుకుంటూ మండువాలోకి వచ్చాడు. ఒక మూలగా కోడిగుడ్డు దీపం మిణుకు మిణుకుమంటూ వుంది. ఆ తక్కువ కాంతిలో మండువాలోని వస్తుజాలం అస్పష్టంగా అసంబద్ధ రూపాలలో కనబడుతోంది. కిటికీకి ఎదురుగా నల్లగా ఒక ఆకారం కనబడింది. ఏమిటా అని దగ్గరకు వెళ్ళినకొలదీ స్త్రీ రూపం ప్రస్ఫుటమైంది. రమ కిటికీకి ఎదురుగా కూర్చుని వుంది విడిపోయిన పొడుగాటి ఆమె కేశపాశం బుజాల్నీ, వీపునీ ఒత్తుగా కప్పింది. అతను దగ్గరగా వెళ్ళి "రమా" అని పిలిచాడు. ఆమెపక్కకి తిరిగి అతనివైపు చూసింది.
దూపకాంతిలో ఆమె కన్నులు జలమయం అయివుండడం చూశాడు. ఆమె కపోలాలమీద అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి.
"ఇదేఁవిటి రమా ఏడుస్తున్నావా?" అన్నాడు జగన్నాథం, వ్యధతో సానుభూతితో, ఆమె చీరచెరగుతో కన్నీరు తుడుచుకుని లేచి నుంచుంది. అతని ప్రయత్నంమీద ఆమె ఏడుపు నాపుకుంటూన్నట్టు అతను గ్రహించాడు. ఆమె చెయ్యి పట్టుకుని "లోపలికి రండి. ఈ చలిగాలిలో కూర్చుంటే ఉదయానికి ఏ న్యూమోనియానో కూడా రావచ్చును" అంటూ గదిలోకి తీసుకువెళ్ళాడు. "ఇలాగ మంచంమీద కూర్చోండి. ఈ క్షణంలో మిమ్మల్ని చూస్తే ప్రపంచంలోని బాధ అంతా మీలోనే ముద్దకట్టుకుందా అనిపిస్తుంది" అంటూ ఆమె వద్దువద్దంటున్నా ఆమెను మంచంమీద కూర్చోపెట్టి ఆమెకి కొంచెం దూరంగా కూర్చున్నాడు.
"ఇప్పుడెవరైనా వచ్చి తమ యిరువుర్నీ చూస్తే నేను మిమ్మల్ని హింసిస్తున్నట్లుగా ఊహించుకొని నన్ను జైల్లో పడేయించాలని చూస్తారు. అవునా!" అన్నాడతను నవ్వుతూ.
ఆమె కన్నీళ్ళలోంచి నవ్వింది.
"అయితే యిప్పుడు చెప్పండి విజయుడెవరు?" అని అడిగాడతను. ఆమెను మాటలలోపెట్టి హృదయబాధని వెళ్ళబోయించినట్లయితే కొంత ఉపశమనం కలుగుతుందని అతను ఉద్దేశించాడు.
"నా బాల్య స్నేహితుడు" అందామె.
"ఊఁ!"
"నేను చదువుకునేరోజుల్లో అతని పరిచయం కలిగింది. ఎప్పుడుచూసినా ఎంతో ధైర్యంగా, ఉత్సాహంగా వుండేవాడు. తల్లీ తండ్రీ లేని నన్ను చూసి జాలిపడేవాడు. ఇంట్లోనుంచి డబ్బు దొంగిలించి తీసుకొచ్చి నాకెన్నో కొనిపెట్టేవాడు."
ఆమె కళ్ళు స్మృతిపూర్వకమైన గర్వంతో మెరిశాయి.
"తర్వాత!" అన్నాడతను.
"కాని ఆ దొంగతనాలకి అతను విపరీతంగా కఠినమైన శిక్షల్ని అనుభవించేవాడు. పాపం. అతనికి సవతితల్లి వుంది. ఆమె చాలా క్రూరురాలు. తండ్రి ఆమెకి దాసుడు. నా కోసమై అతను దెబ్బలు తినడమూ, తిండిలేక మాడడమూ సహించలేకపోయేదాన్ని. అతన్ని బతిమలాడుకునేదాన్ని ఇటువంటి పనులు చెయ్యొద్దని. అతను వినోవాడుకాదు. "నీకోసం ఏమైనా చేస్తాను. నాకొక్క నిముషం ఆనందం కిలగించడానికి వెయ్యేళ్ళ నరకాన్నైనా అవలీలగా అనుభవించగలను" అనేవాడు.
స్కూలు వదలగానే ఒక నిర్ణీత స్థలంలో కలుసుకొనేవాళ్ళం. ఇద్దరమూ అలా తోటలోకి పొలాలలోకి వెళ్ళేవాళ్ళం. ఆటలాడేవాళ్ళం. పాటలు పాడేవాళ్ళం. జామిపళ్ళూ, రేగిపళ్ళూ తింటూ గంటలు నిమిషాల్లాగా గడిపేవాళ్ళం. స్వచ్ఛమైన అనంతమైన నీలాకాశంకిందా వెచ్చని పచ్చని మెత్తని భూమ్మీదా ఎన్నో స్వప్నాలు కనేవాళ్ళం. నన్నే పెళ్ళి చేసుకుంటాననేవాడు. నన్నే ప్రేమించాననేవాడు.
చీకటిపడ్డాక అనాథ శరణాలయానికి బిక్కుబిక్కుమంటూ వెళ్ళేదాన్ని , అక్కడ వార్డెన్ పెద్దపులిలాగ నా కోసం కనిపెట్టుకుండేది. భోజనం లేకుండా చీకటి గదిలో నన్ని తోయించి తాళం వేసేది. రాత్రంతా ఏడుస్తూ బాధతో భయంతో గడిపేదాన్ని. కాని తెల్లవారిందా, ఎప్పుడు సాయంత్రమవుతుంది, ఎప్పుడు విజయుణ్ణి కలుసుకుంటాను? అని నిరీక్షిస్తూ ఉండేదాన్ని. అతనొకడే నా ఆశ. నేను బతకడానికి గల అర్ధం.
కాని మనం వూహించినట్టుగా. కోరుకున్నట్టుగా ఎక్కడైనా జరుగుతుందా చెప్పండి. రోడ్డంతా సవ్యంగా చదనుగా ఉన్నట్టే వుంటుంది. కాని మలుపు తిరిగేటప్పటికి బ్రహ్మాండమైన అగాధం నోరు తెరుచుకుని అప్రమత్తుడైన పాంధుణ్ణి అమాంతం మింగివేస్తుంది. అక్కడ ఎర్రని అక్షరాలతో 'అపాయం' అని బోర్డుకూడా వుండదు. ఇంటా బయటా కూడా విజయుడికి పరిస్థితులు దుస్సహమయ్యాయి. బి.ఏ. చదువుతూండగా అతనికి వివాహం చెయ్యడానికి సవతితల్లి దీక్ష వహించింది. అన్నీ స్థిరపరిచింది. విజయుడెదురు తిరిగాడు. బెదిరించాడు. ఒకరాత్రి సంభవించిన పెద్ద దెబ్బలాటలో యినపకమ్మీతో సవతితల్లి తలమీద బలంగా కొట్టాడు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా వుంది. రాత్రికి రాత్రి విజయుడు పరారీ అయిపోయాడు. తండ్రి పోలీసులకు రిపోర్టు యిచ్చాడు. అతని ఆచూకీ దొరకలేదు. మూడునెలల అనంతరం నాకో ఉత్తరం వచ్చింది. అందులో రెండే రెండు వాక్యాలున్నాయి. తాను సైన్యంలో చేరినట్టూ బతికి బాగుంటే ఎప్పుడో ఒకప్పుడు కలుసుకుంటాననీ మాత్రం రాశాడు. అంతే, యుద్ధం ముగిసింది ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి కాని ఈనాటివరకు అతని జాడలేదు."



