Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"మీతో మాట్లాడుతూ కూర్చుంటే నాకేదో హాయిగా ఉంది" అందామె.
అతను దూరంగా చూస్తూ అంతకన్న దూరంగా ఆలోచిస్తూ "నిజానికి నేను లౌక్యుణ్ణి కాను. ఎప్పుడెలా ప్రవర్తించాలో నాకు తెలియదు. అందుకే జీవితంలో ఏమీ కూడబెట్టుకోలేకపోయాననుకుంటాను" అన్నాడు.
"అంటే" ఆసక్తిగా అడిగిందామె.
"జీవితంలో నేను పరాజయం మీద పరాజయం పొందాను. డబ్బుగాని, వసతిగాని, భార్యాపిల్లల్నిగాని ఏమీ సంపాయించుకోలేదు. అందుకే విసుగెత్తి సైన్యంలో చేరాను"
"సైన్యమా? విజయుడు కూడా సైన్యంలో చేరాడు!" అందామె సంభ్రమంగా కుర్చీనుండి లేచి.
అతను వినలేదు. తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. "బర్మా సింగపూర్, ఇంఫాల్ రంగాలలో పనిచేశాను. కాని అక్కడ నాకు సుఖం లేదు. తుపాకిమందు వాసనా, చావులూ, యూనిఫారమూ అంతే. అసహ్యం కలిగింది. ఎలాగో అలాగ బయటపడి ఇదివరకు ఆపుచేసిన చదువుని మళ్ళీ మొదలుపెట్టాను. యం.యస్.సి చివరికంటా చదివి చదివి పరీక్షలకు కూర్చోలేదు."
"అరె! అలా చేశారెందుకు?"
"ఆ రోజున "
"ఆ రోజున పరీక్షలనగా నేనద్దెకున్న గది తాలూకా యింటావిడ అటకమీద నుంచి పడింది. తలమీద బలమైన గాయం తగిలి స్పృహతప్పి పడిపోయింది. ఆమెకు అయిదేళ్ళ పిల్ల ఒకర్తి వుంది. అస్తమానూ నా గదిలోకి వచ్చి కూర్చుని ఆడుకునేది. పాపం ఆ పిల్ల ఒకటే ఏడుపు. ఇంటావిడని ఆస్పత్రిలో చేర్చాను. డాక్టరు బతుకుతుందో బతకదో చెప్పలేమన్నారు. ఆ పిల్ల సంరక్షణ నామీద పడింది. రెండుపూటలా ఆస్పత్రికి వెళ్ళి ఆమె బాగోగులు విచారించడమూ, అమ్మ., అమ్మ అంటూ ఏడ్చే ఈ పిల్లని సముదాయించడంతో నాచదువూ, పరీక్షలూ కొండెక్కాయి."
"ఆవిడ బతికిందా?"
"బతికింది. నేనంటే ఆమెకి చాలా గురి కలిగింది. ఆమె విధవరాలు తమ్ముడిలా చూసుకుంటాననీ ఎన్నో విధాలా చెప్పింది. కాని నేను వినలేదు."
"ఇప్పుడు మీరేం చేస్తున్నారు?"
"నన్ను గురించి మీరడిగిన మొదటి ప్రశ్న యిది" అంటూ అతను నవ్వాడు. ఆమె కూడా నవ్వి "సరే చెప్పండి" అంది.
"ఒక మందులు తయారుచేసే కంపెనీలో ఉంటున్నాను. కాని ఆ ఉద్యోగమూ చెయ్యాలనిలేదు. ఒకచోటుకి వృత్తికి అంటిపెట్టుకుని ఉండడం నా స్వభావంలో లేదనుకుంటాను. జిప్సీలని ఉన్నారు చూడండి వాళ్ళుప ఊరూరా తిరుగుతుంటారు. అటువంటి ప్రవృత్తి ఏదో నాలో ఉందనుకుంటాను. ఏవిఁటో చెప్పలేను. ఈ దేశాన్నే విడిచి వెళ్ళిపోవాలని ఉంది -బర్మాకో , సింగపూర్ కో"
"వద్దు వెళ్ళకండి" అని ఆవేశంతో అందామె. చటుక్కున సిగ్గుపడిపోయింది. అతను తెల్లబోయి చూశాడు. ఆమె అర్ధంలేకుండా గబగబా వెళ్ళి కిటికీ తలుపులు తెరిచింది. చలిగాలి. కొరడా ఝళిపించినట్టుగా లోపలికివచ్చి తగిలింది.
"అబ్బ! చలి! తలుపులు వేసెయ్యండి" అన్నాడు జగన్నాథం.
"వాన చాలామటుకు తగ్గింది" అంటూ తలుపులువేసి ఆమె వచ్చి కుర్చీలో కూర్చుంది.
అతను నవ్వుతూ యిలా అన్నాడు. "ఇందాకట్నుంచీ మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా దాటుకుపోతున్నారు. చెప్పండీ మీరు పెళ్ళిచేసుకోరా?"
"నన్నెవరు చేసుకుంటారు?" ఆమె నీరసంగా అంది.
"ఏం? మీకేం తక్కువ?" అన్నాడతను.
ఆమె పెదవులు వణుకుతున్నాయి. అతను గమనించలేదు. అతను మళ్ళీ రెట్టిస్తూ "ఇఁతకాలం మీరు అవివాహితులుగా ఉండడానికి ఏదేనా ప్రత్యేక కారణం ఉందంటారా! లేక మీరు అవివాహితులుగానే వుండదలచారా?" అన్నాడు.
ఆమె తన ముఖాన్ని రెండుచేతులతో కప్పుకుని "మీకు తెలియదు. మీకు .తెలియదు. మీకు తెలియకూడదు" అంటూ గబగబా గదిలోంచి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళినవైపే నిశ్చేష్టుడై చూస్తూ వుండిపోయాడు జగన్నాథం. వెనకాలే వెళ్ళి క్షణించమని అడిగితే బావుంటుందనుకున్నాడు. కాని ఆమె వెంటపడడం కూడా పొరపాటేమో అని సందేహించాడు. ఏమీ తోచక కిటికీ తలుపులు తెరిచాడు. సన్నగా వాన పడుతోంది. దట్టంగా భయంకరంగా వుంది అవతల చీకటి. ఆకాశాన ఒక నక్షత్రం కూడా లేదు. కప్పల అరుపుల మాత్రం ఘోరంగా అసహ్యంగా వినిపిస్తున్నాయి.
తలుపులు వేసి మంచంమీద మేనువాల్చాడు. ఊరికి దూరంగా వున్న ఈకొంప దెయ్యాలకొంప కాదుకదా!అన్న ఆలోచన అతన్ని ఒక నిమేషమాత్రం భయావహుణ్ణి చేసింది. అతనికి చనిపోయిన మిత్రుడు జ్ఞాపకం వచ్చాడు. ఎందుకింత తొందరపడి, ఈ స్నేహాల్నీ అనుభవాన్ని వదులుకొని చచ్చిపోయాడు! అతని ఆత్మలాంటిది యింకా ఏదైనా భూమిమీద వుండి అతృప్తంగా తిరుగుతూంటుందా? ఇంత మిధ్యగా మోసంగా వున్న బ్రతుకులో నిజానికి ఎవరికెవరు? ఈ బాంధవ్యాల అనుబంధాల అర్ధం ఏమిటి? ఎందుకు తాను కష్టపడి ఆర్జించిన వెయ్యి రూపాయలూ చనిపోయే ఒక మిత్రునికి దాసం చేయాలని వర్షంలో, గాలిలో బయలుదేరి వచ్చాడు! విజయుడెవరు? అతని పోలికలు తనలో ఎందుకుండాలి? ప్రతి బ్రతుకునీ ఏదో రహస్యంలో చుట్టబెట్టి అగోచరమూ బలీయమూ అయిన విధి నిరంకుశంగా ఎక్కడికో తెలియని చోటికి నడిపిస్తోన్నట్టు అనిపించింది అతనికి.



