Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    ఆమె ఆగింది. అతను లేచి కూర్చుని కళ్ళు నులుముకొని 'హో- మీరా?' అన్నాడు  తన చేష్టల్ని పరికించాడేమో అన్న శంకతో తడబడుతూ "మీకు పాలు తీసుకువచ్చాను" అంది ఆమె.

    పాలు తాగుతూ "మీరెందుకింత దయ చూపిస్తున్నారో అర్ధంకావడంలేదు" అన్నాడు.

    ఆమె నవ్వి "మీరు గోరంతలు కొండంతలు చేస్తున్నారు. మేం చేసిందేముంది చెప్పండి. ఇంత భోజనం పెట్టి పడుకోడానికింత జాగా చూపించడం కూడా ఘనకార్యమంటారా!" అంది.

    అతను నిట్టూర్చి "నిజంగా ఘనకార్యమే. నా జీవితంలో ఎన్నో రాత్రులు భోజనమూ వసతీ లేక గడిపినవి ఉన్నాయి" అన్నాడు.

    నిద్రవల్ల చిక్కిన స్వస్థతతో బలంతో అతనిలో ఉత్సాహం ప్రబలింది. ఈ అపరిచిత యువతివైపు తాను నిముషనిముషానికి ఆకర్షించబడుతున్నట్టు తెలుసుకున్నాడు. ఆమెను పరీక్షగా చూశాడు.

    నొసట ముంగురులు చెదరిపడుతున్నాయి. ఇందాకా వదులుగా వున్న జడని సిగగా చుట్టింది. ఆమె దేహంలో సౌకుమార్యము యౌవనోల్బణము రెండూ గోచరిస్తున్నాయి. లేత నీలంచీరలో ఆమె వొంటి సొంపులు పొందికగా అమరివున్నాయి. అన్నిటికన్నా ఆమె కళ్ళు ఎక్కువగా అతన్ని ఆకర్షించాయి. ఆ కళ్ళలో అపారమైన జాలీ కరుణా స్పురిస్తున్నాయి. ఏ స్వర్గలోకంలోనో స్వప్నలోకంలోనో విరిసుకొన్న ఆ కన్నులు, భూమిమీద ప్రవాస జీవితం అనుభవిస్తూ ఏదో పోగొట్టుకున్నట్లుగా బెదురుగా వెతుకుతూన్నట్టు అనిపిస్తోంది. జాలిగా మెత్తగా మన గుండెల్ని తాకుతూ పువ్వులాంటి గొంతుతో పిలుస్తోన్నట్టు ఉంటాయి. తనవైపు జగన్నాథం పరీక్షగా చూస్తోన్నట్టు గుర్తించిన ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. తాంబూల సేవనంలో ఎర్రబడిన పెదవులమ ధ్య చిన్న నవ్వు తెల్లని ముత్యంగా చిట్లింది.

    "అన్నట్టు మీ పేరు ఇంతవరకు తెలియనే తెలియదు" అన్నాడు జగన్నాథం.

    "రమ"

    "మీరు చదువుకున్నవారిలా కనిపిస్తున్నారు."

    "ఏం చదువులెండి! హైస్కూలులో ఆరవఫారం వరకూ చదివాను. అది కూడా పెద్ద చదువేనంటారా!" అని ఆమె అతన్ని చూసి "సరే కబుర్లుపెట్టి మీకు నిద్రాభంగం కలిగించాను. వెళ్ళిపోతాను" అని లేవబోయింది.

    "నిద్ర తేలిపోయిందిలెండి. అదీగాక కబుర్లు మొదలుపెట్టినవాణ్ణి నేను, నా దోషాన్ని మీరు నెత్తిమీద వేసుకుంటున్నారు" అన్నాడతను.

    ఆమె నవ్వి "బలేవారే!" అంది.

    "మీ గొంతు హాయిగా వుంది. మీరు పాడగలరా?"

    "అనాథాశ్రమంలో సభల్లో వార్షికోత్సవాలలో నన్నే పాడమనేవారు. చెట్టులేనిచోట ఆముదం చెట్టుని మరి."

    "అనాథాశ్రమమా?" ఆశ్చర్యంగా అడిగాడతను.

    "అవును"

    "తల్లీ తండ్రీ చిన్నతనంనుండీ మీకు లేరా?"

    "లేరు" ఆమె తల వంచుకుంది.

    అనుచిత ప్రసక్తి తీసుకువచ్చానేమో అన్న భయంతో మాట మార్చాలని ఏమీ తోచక "చాలా చలిగా వుంది" అన్నాడు.
 
    "అవును"  అందామె.

    అతను ఫక్కున నవ్వాడు.

    "ఎందుకలా నవ్వుతారు?" అందామె తెల్లబోయి.

    "మరేమీలేదు, ఏ ప్రశ్న అడిగినా నేనే అడుగుతున్నాను. మీరు అవును, కాదు అని ముక్తసరిగా సమాధానం ఇచ్చి ఊరుకుంటున్నారు. నేనెవరినో ఏఁవిటో తెలుసుకోవాలనే స్త్రీ సహజమైన కుతూహలం కూడా లేదా మీకు?"

    ఆమె అతనికేసి వింతగా చూసి వూరుకుంది.   

    "నిజం చెప్పండి. ఇందాక నా పేరడిగి తెలుసుకున్నప్పుడు మీలో కలిగిన ఆశాభంగం స్పష్టంగా కనిపించింది ఎంచేత?" జగన్నాథం అడిగాడు.

    "మీరు విజయుడిలాగా వున్నారు" అని పైటచెరగు వేలికి చుట్టుతోంది.

    "విజయుడెవరు?" ఆమె సమాధానం చెప్పేలోగానే మళ్ళీ ఇలా అన్నాడు. "మీలో నాకొక విచిత్రమైన అందం కనబడుతోంది. మీరంటే నాకు...... నాకు....." మాటకోసం జగన్నాథం తడబడ్డాడు.

    ఆమె జాలిగా అందంగా చిన్నగా నవ్వింది. అతను మళ్ళీ అడిగాడు. "మీకు పెళ్ళి కాలేదు కదూ!"

    లేదని ఆమె తల వూపింది.

    "మరి ఎందుకు చేసుకోలేదు మీరు రమా?"

    ఆమె మౌనంగానే ఉండిపోయింది.

    "ఇలాగ వ్యక్తిగమైన ప్రశ్నలు వేయడం సభ్యత కాదనుకుంటున్నారు కదూ! అవును చూడండి రమా, ఈ రాత్రీ, ఈ వర్షమూ, యీ విచిత్ర వాతావరణమూ -ఇవన్నీ మామూలు మర్యాదల్ని వెనక్కినెట్టి స్వచ్ఛంగా స్వేచ్ఛగా హృదయాలు విప్పి మాట్లాడుకోవాలనే వాంఛను ప్రేరేపించడంలేదూ?" అన్నాడతను.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.