Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    ఆమె సిగ్గుపడుతూ వచ్చి కుర్చీలో కూర్చుంది. జరీ అంచు లేత నీలం చీర ధరించింది. జుట్టును వదులు వదులుగా జడవేసి చివరలు వదిలివేసింది. నొసట సన్నని ఎర్రని తిలకం ఆమె వదనానికి ఆకర్షణతోపాటు ఉదాత్తత నాపాదిస్తోంది. ఆమె కళ్ళు పెద్దవిగా, జాలిగా, మంచులో తడిసిన పద్మాల్లా వున్నాయి.

    "మీరు నా మాట మన్నించి ఆగినందుకు నాకు చాలా ఆనందంగా వుంది" అందామె తలవంచుకుని.
 
    "సరేసరే. ఆనందించవలసింది నేనుకాని మీరు కాదు. శ్రమంతా మీది. చివరికి మీరు పడుకునే మంచంకూడా నాకిచ్చివేసినట్టే కనపడుతోంది. నిజానికి ఓ చాపా దిండు యిస్తే నడవలో పడుకుని నిద్రపోతాను. అనవసరంగా నన్ను చాలా గౌరవించేస్తున్నారు" అని అతను నిర్మలంగా నవ్వాడు.

    "కాదు కాదు. నేనూ అవ్వా యింకో గదిలో పడుకుంటాం. మీరు చాలా దూరంనుంచి వచ్చినట్టున్నారు" అందామె.

    "అవును అయిదారు మైళ్ళపైన నడిచాను. ఉదయం అంతా నడిచి "-" పల్లెటూరికి వెళ్ళాను. రోడ్డయినా ఏమీ బాగూలేదు. ఈ పెట్టెనీ, గొడుగునీ మోసుకుంటూ యింత వర్షంలో -నిజంగా చాలా అలసిపోయాను. మీకు నిజం చెప్పమన్నారా?" అని ఆగాడు జగన్నాఝం.

    "చెప్పండి" అందామె ఓరగా చూస్తూ.

    "ఈరోజంతా నాకు భోజనం లేదు. పల్లెకి వెళ్ళిన పనీ జరగలేదు " అన్నాడతను విచారంగా.

    "ఏం జరిగింది?"

    "నా మిత్రుడొకడు కష్టాలలో వున్నాడు 'నా' అన్నవాళ్ళెవరూ లేరతనికి. జబ్బుతో తీసుకుంటున్నాననీ, ఒక వెయ్యి రూపాయలు సహాయం చెయ్యమనీ ప్రాధేయపడుతూ ఉత్తరం రాశాడు. ఆ జాబు నాకు చాలా ఆలస్యంగా అందింది. నేను ఒక్కొక్క ఊరే తిరుగుతూంటే ఆ ఉత్తరం నా వెనకాలే వచ్చింది. చివరికి మొన్ననే ఉత్తరం చేరింది. నేను సొమ్ము తీసుకొని యకాయకీన బయలుదేరి ఈరోజునే పల్లెకి వెళ్ళాను. కాని........"

    "నా మిత్రుడు నాలుగైదు రోజులక్రితమే పోయాడు. ఈ పూటకి నన్నాగమన్నారు వూళ్ళోవాళ్ళు. కాని నాకు మనస్కరించలేదు. బయలుదేరి వచ్చేశాను"

    ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉన్నారు. ఈ విషాద కథనానికి దీపకాంతి కూడా కొంచెం తగ్గినట్టనిపించింది వారికి. ఆమె కంగారుగా పైట సర్దుకుని లేవబోయి కూర్చుంది.

    "ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. చూడండి. ఆ పెట్టెలో వెయ్యి రూపాయలూ వున్నాయి. కాని అతను మాత్రం యిక్కడెక్కడా లేడు" అన్నాడతను నిట్టూరుస్తూ.

    గది అవతల చప్పుడయింది. "ఎవరూ?" అంటూ యువతి గుమ్మం వద్దకు వెళ్ళింది. పక్కగా ముసలిది ఉంది. "ఏం?" అంది కోపంగా యువతి.

    "పాలు కాచమన్నావా పిల్లా?" అడిగింది ముసలిది.

    "ఇందాకనే చెప్పాను కదూ కాచమనీ" అంటూ యువతి వచ్చి కుర్చీలో కూర్చుంది.

    అతను దిండుకు చేరగిలబడి కూర్చున్నాడు. ఒకసారి యింటికప్పునీ, గోడల్ని చూసి "ఊరికింత దూరంగా ఈ యిల్లు వుండడం తమాషాగా ఉంది" అన్నాడు. అతను వచ్చే ఆవులింత నాపుచేసుకుని "మీకు వివాహమైందా?" అని అడిగాడు.

    హఠాత్తుగా వేసిన ఈ ప్రశ్నకు ఆమె ఉలిక్కిపడి "ఏఁవిటీ?" అంది.

    "మీకు వివాహమయిందా?"

    ఆమె జవాబు చెప్పలేదు. తలవంచుకుంది.

    "తెలిసింది. తెలిసింది లెండి. వివాహమైతే యింటి యజమాని ఉండేవారుగా! మీకు పెళ్ళికాలేదు. అంతేకదూ?"

    ఆమె కాలి బొటనవేలుతో నేలని గీస్తోంది.

    "మీరు చాలా సిగ్గుపడిపోతున్నారే" అంటూ అతను ఆవలింత నాపుచేసుకోబోయాడు. కాని ఆవులింత అతని ప్రయత్నాన్ని జయించి శబ్దం చేసుకుంటూ వచ్చింది. అతను చిటికెవేస్తూ "ఇంకా మీరు పెళ్ళిచేసుకోలేదేం?" అని అడిగాడు.
    యువతి కుర్చీలోంచి సంభ్రమంగాలేచి "మీకు నిద్రవస్తున్నట్టుంది. చప్పున పాలు కాచి తీసుకువస్తాను" అంటూ తొందరగా గదిలోంచి వెళ్ళిపోయింది. సుష్టయిన భోజనమూ, మెత్తని పరుపూ అలసిన అతని నరాలనీ దేహాన్నీ లాలిస్తూంటే, నిద్ర ముంచుకు వచ్చింది. హోరున వర్షమూ, ఒంటరిగా ఉన్న యీ యిల్లూ, యీ రాత్రి, యీ ఆతిధ్యమూ గురించి వింతగా తలచుకుంటూనే నిద్రలోకి జారిపోయాడు. చలిగాలి చూరుని జయ్యిమని శబ్దంచేస్తూ కొట్టుకుంటోంది. ఇంటిముందు మడుగులో కప్పలు బెకబెకమని చప్పుడు చేస్తున్నాయి. వర్షం చూరుమీద ఉన్న రేకు మీదపడి డబడబ ధ్వనించేస్తోంది. అయినా వీటన్నింటిని మించిన నిశ్శబ్దం ఆ ప్రదేశాన్ని ఆవరించుకుంటుంది.

    సుమారు ఓ గంటకి అతనికి మెలకువ వచ్చింది. గది తలుపులు తెరచిన చప్పుడయి ఒక కన్ను కొంచెం తెరచి చూశాడు. యువతి అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా వచ్చింది. ఆమె చేతిలో పాలగ్లాసు ఉంది. మెల్లగా "ఏఁవండీ?" అంది. జగన్నాథం నిద్ర నటించాడు. ఆమె మళ్ళీ "ఏఁవండీ పాలు తీసుకుంటారా?" అంది. అతనికి మెలకువ రాకపోవడం చూసి పాలగ్లాసు ముక్కాలపీటమీద పెట్టి అలమారులో ఉన్న ప్లేటు ఒకటి తీసి మూతపెట్టింది. అడుగులో అడుగువేస్తూ గుమ్మంవరకూ వెళ్ళింది. ఆమెకేదో ఊహ తోచి ఆగిపోయింది. సంకోచంతో మంచంవైపు చూసింది. అతనంతా కనిపెడుతూనే వున్నాడు. ఆమె మూలనున్న దీపం తీసుకుని వత్తి పెద్దదిచేసి మంచం దగ్గరకు వచ్చి దీపాన్ని అతని ముఖానికి దాపుగా ఎత్తిపట్టుకుని పరీక్షగా చూస్తూ నిలుచుంది. అతని కుతూహలం ఎక్కువయింది. కాని అనుకోకుండా చటుక్కున కదిలాడు. ఆమె కంగారుగా దీపం కింద పెట్టి వెళ్ళిపోబోయింది. అతను కళ్ళు తెరుచుకొని ఏమీ ఎరగనట్టు 'ఎవరదీ?' అన్నాడు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.