Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "కృతజ్ఞుణ్ణి! కాని నేను వెళ్ళక చేయగలిగిందేముంది చెప్పండి! ఈ రోజున బయలుదేరడమే బుద్దిపొరపాటు. మధ్యాహ్నం కొంచెం తెరిపియిస్తే ఫరవాలేదుకదా అని బయల్దేరాను. ఎవరినడిగినా నాలుగడుగులువేస్తే స్టేషన్ వచ్చేస్తుందని చెప్పారే! ఏం మనుషులండీ వీళ్ళు! అబ్బ! చేతులు నొప్పి పెడుతున్నాయి" అంటూ వేళ్లు సాచి ముడుచుకున్నాడు కీళ్ళు సడిలేందుకు.

    "మీకు దూరమని తెలియదా?"

    "తెలియదు. నేను ఈ దారిని రాలేదుగా వచ్చేటప్పుడు? అసలు నేనీ ప్రాంతానికి కొత్తవాణ్ణి. అందులో ఈ వర్షాకాలంలో పల్లెటూళ్ళకి వెళ్ళడం తెలివితక్కువ."

    యువతి చిన్నగా నవ్వింది. "అయితే యిప్పుడేం చేస్తారు మీరు?" అంది.

    "ఏం చెయ్యను! ఎలాగో అలాగ తంటాలుపడి స్టేషన్ కి చేరుకుంటాను."

    "మీ గొంతు విన్నట్టుగా ఉందే ఎప్పుడో ఎక్కడో!" అంది విస్మయాన్ని సూచిస్తూ.

    "కంఠధ్వనిలో పోలికలుంటాయిలెండి. కాని మీరు నన్ను కానీ, నేను మిమ్మల్ని కానీ కలుసుకోలేదని నిక్కచ్చిగా చెప్పగలను" అన్నాడా వ్యక్తి.

    "ఎలా చెప్పగలరు?" అంది యువతి కుతూహలంతో.

    "ఈ ప్రాంతానికి నేనెప్పుడూ రాలేదని చెప్పాను కదా, అదీగాక చాలాకాలం ఈ దేశంలోకూడా లేను" అంటూ ఆ వ్యక్తి తిరిగి పెట్టెనీ, గొడుగునీ చేతపట్టుకున్నాడు. "నమస్కారం! నేను వెళ్ళొస్తాను. రోడ్డు విషయమై మీరు చేసిన హెచ్చరికను మరిచిపోను" అన్నాడు.

    "మీరు నామాటనర్ధంచేసుకోలేదు. మీరింక ప్రయాణం సాగించడం శ్రేయస్కరంకాదు. ఈ రాత్రికి ఇక్కడ పరుండి పొద్దుటే వెడితే మంచిది, మీకభ్యంతరం ఏమీ లేకపోతే" అంది యువతి.

    నూతన వ్యక్తి ఆలోచించాడు. "అంతేనంటారా?" అన్నాడు.

    "అవును ఉదయం ఆరుగంటలకి రైలువుంది. అప్పటికి వర్షం కూడా చాలామట్టుకు తగ్గొచ్చును."
    వర్షం మళ్ళీ హెచ్చింది. వానజల్లు వరండాలోకి వచ్చి పడుతోంది. నూతన వ్యక్తి హతాశుడై "సరే. సరే మీరు సూచించిన మార్గమే ఉత్తమంగా కనపడుతోంది. తెల్లవారాక మున్సిపాలిటీవాళ్ళు ఏ గోతిలోంచో బురదలోంచో కూరుకుపోయిన నా శవాన్ని పైకి తీయడం అంతగా ఆశించదగినదిగా లేదు. మీ దయకు కృతజ్ఞుణ్ణి" అంటూ సంకోచంగా నవ్వుతూ అన్నాడు.

    ఇంతలో ముసలిది దీపం పట్టుకుని వచ్చింది. దీపపు వెలుగులో అతని ఆకారం మరింత స్పష్టంగా కనబడింది. మనిషి ఒడ్డూ పొడుగూ ఉన్నాడు. బుగ్గలు కొంచెం చిక్కినట్టున్నా మహం అందంగానే వుంది. చామనచాయ. మొత్తంమీద విగ్రహంలో గాంభీర్యం స్పురిస్తోంది. పంచె అంతా బురదతో నిండివుంది. ముసలిది దీపం పైకెత్తి దగ్గరగా పట్టుకుని పరీక్షగా చూస్తూ "ఏ వూరు బాబూ మీది?" అంది. దీపకాంతిలో మెరిసిన అతని వదనాన్ని చూసి యువతి ఉలిక్కిపడింది. తెల్లబోయి రెండు కళ్ళూ అప్పగించి అలాగ చూస్తూ నిలబడింది. ముసలిది మోచెయ్యితో యువతిని పొడిచి "దెయ్యం పట్టినట్టు ఏమిటే ఆ చూపు పిల్లా?" అంది.

    యువతి యింకా తేరిచూస్తూ "మీ పేరు?" అంది.

    "జగన్నాథం" అన్నాడా వ్యక్తి.

    యువతి కళ్ళలో ఆశాభంగం అద్దంలా కనపడింది. అది గమనించిన అతనికి సంకోచం ఎక్కువయింది. "మీరు నన్నాహ్వానించడంలో ఏదో పొరపాటు జరిగిందనుకుంటాను. మీ ధోరణి చూస్తే. ఈ వర్షపు తీవ్రత తగ్గగానే వెళ్ళిపోతాను. నేనేమీ అనుకునేవాణ్ణి కాను" అన్నాడు.

    యువతి తనలో కలిగిన ఉద్రేకాన్ని అణుచుకొని సహజస్వరంతో "కాదుకాదు. మీరు నేనెరిగిన ఒక వ్యక్తిలాగ వున్నారు. అంతే. మీరు అపార్ధం చేసుకుని వెళ్ళిపోతే నేను చాలా బాధపడతాను" అంది. వ్యక్తి నిట్టూర్చి పెట్టె కింద పెట్టాడు. ముసలిది తేలికగా పెట్టెని ఎత్తి లోపలికి తీసుకువెళ్ళింది.

    యువతి జగన్నాధాన్ని ఒక గది దగ్గరకు తీసుకువెళ్ళి "అవ్వ ఈ గదిలోనే మీ పెట్టెని పెట్టింది. మీరు బట్టలు మార్చుకుని విశ్రాంతి తీసుకోండి. మీకు భోజనం ఏర్పాటు చేసివస్తాను" అని వెళ్ళిపోయింది. జగన్నాథం గదిని నలువైపులా పరీక్షగా చూశాడు.

    పాతకాలపు పందిరిమంచం ఒకటుంది. దానిమీద తెల్లని పక్కవేసివుంది. మంచానికి పక్కగా ఒక ఎత్తైన ముక్కాలిపీట వుంది. పేముతో అల్లిన కర్ర కుర్చీ కూడా వుంది. ఒక మూలగా హరికేన్ లాంతరు వెలిగించి వుంది. అతను తొందర తొందరగా దుస్తులు మార్చుకున్నాడు. అతనికాకలి ఎక్కువగా ఉంది. వొళ్ళంతా చలితో, తేమతో ముద్దకట్టుకుపోయినట్టుంది.

    ముసల్ది వచ్చి భోజనానికి రమ్మని పిలిచింది. అరిటాకులో అన్నమూ, పదార్ధాలూ వడ్డించి వున్నాయి. ముసలిది నిశ్శబ్దంగా వడ్డిస్తూవుంది. ఏదో చెప్పాలని నోరు తెరుస్తుంది. కాని తలుపుచాటుకి చూసి మానివేస్తుంది. ఆకలితో వున్న అతనికి భోజనం రుచిగా వుంది. ముసలిది మాట్లాడబోయి మానివేయడం గమనించి తలుపుచాటుకు చూశాడు. తలుపుచాటుగా యువతి కూర్చుని వుంది. అతనికేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. తనలో తాను నవ్వుకున్నాడు.

    భోంచేసి గదిలోకి వెళ్ళగానే ముక్కాలిపీటమీద తమలపాకులూ, వక్కా అమర్చబడిన వెండిపళ్ళెం కనపడింది. అగరువత్తులు వెలిగించబడి గోడకున్న చిన్న చిల్లులో గుచ్చబడివున్నాయి. తలవని తలంపుగా లభించిన యీ ఆతిధ్యానికి ఆదరానికీ అతనికి విస్మయానందాలు రెండూ కలిగాయి. కాసేపట్లో గుమ్మంవద్ద గాజుల చప్పుడు విన్నాడూ. తల పైకెత్తి "రండి, జన్మలో మీరు చూసిన ఆదరాన్ని మరిచిపోలేను. రైల్లోనో, రైలుస్టేషన్ లోనో తిండి తిప్పలులేక పడి ఉండవలసిన విధినుండి తప్పించారు మీరు" అన్నాడు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.