Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "నీ వయస్సులో పిల్లలు పుడితే నీకేసి ఎవరు చూస్తారే ఈ రోజుల్లో . వొంటికి బిగువు పోయాక నేనెంతో నువ్వూ అంతే" అసహ్యంగా నవ్వింది ముసలిది.

    "నోర్ముయ్యి" అంది యువతి కోపంగా.

    "మూస్తాను మూస్తానులే. నోరు మూసుకుంటే నువ్వూ నేనూ అడుక్కుతినాలిసిందేగా! ముసలిముండనైనా దేవుడు నాకు బుర్రలో తెలివిచ్చాడే పిల్లా!"

    ఓ నిముషం ఆగి ముసలిది "ఇదిగో పిల్లా! నీక్కొడుకు పుట్టగానే సోదికెళ్ళి అడిగాను. అటువంటి వెధవ పిల్లలు బతకరని తెగేసి చెప్పింది సోదె. ఒక తండ్రి ఒక వంశమూలేని మదనష్టపు పిల్లలకి దేవుడు శాపం వుంది శాపం. నీ కొడుకే కాదు, ఈ ఇంట్లో ఎప్పుడూ ఏ పిల్లాడు పుట్టిబతికిన పాపాన పోలేదు" అంది.

    యువతి భయంతో విహ్వలంగా చూసింది. "నిజంగానా? నిజంగానా అవ్వా?" అని అడిగింది.

    "ఆ భయమే వద్దన్నాను. నీ వయస్సూ, నీ అందమూ వుండి భయపడిన ఆడదాన్ని నేనెరుగను. ఇప్పుడు నాలుగురాళ్ళు చేసుకోకపోతే ఇంకెప్పుడే పిల్లా! వచ్చిన ప్రతివాణ్ణి వెళ్ళగొడతావు. ఎవళ్ళో రాజకుమారులు కాని నీకు నచ్చనే నచ్చరు. ఆసరాగా వుంటావని నిన్ను నమ్ముకొని నే బతుకుతున్నాను. నా మాటా, నేనుకూడా నీకు చేదయింది" ముసలిదానికి తీవ్రత హెచ్చిపోతోంది. చేతులు వూపుతూ యింకా యిలాగ అంది. "చచ్చినవాళ్ళకోసం చావలేం పిల్లా! నన్ను ముట్టుకోకు నా మాలకాకీ అని కూర్చుంటే ఆకలితో మాడి చస్తాం. నీకేం దొరసానిలాగ కబుర్లు చెపుతావ్. అప్పుడు నే నాదుకోకపోతే నీ గతి ఏమయ్యేదే! చాల్చాలు! వాణ్ణి తలచుకుంటే మాట దక్కదు. మూడు నెలల ముంగి వెధవ చచ్చాడు పీడావదిలింది"

    యువతి కోపంతో, బాధతో, జేవురించిన మొహంతో కిటికీలోవున్న కప్పుతీసి ముసలిదానిమీద విసిరింది. "పో ముసలిముండా, పో దెయ్యపుముండా! నా ఎదట నిలబడకు......" అంటూ వెర్రిగా అరిచింది. ముసలిది ఒడుపుగా దెబ్బతగలకుండా తప్పుకుని, "పోతాను పోతాన్లే. నే బ్రతికినన్నాళ్ళే నీ కష్టం సుఖం చూసేది. తర్వాత నీ వూసు ఎవరు పట్టించుకుంటారో చూస్తాను!" అంటూ కీచుగా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది..

    యువతి మొహం బాధతో మలినమైంది. కంటి చివరల రెండు నీటి చుక్కలు నిలిచాయి. గుండె బరువెక్కింది. ఇనుపతెర మధ్య ఎవరో తన్నిపెట్టి నొక్కుతూన్నట్లు బాధతో "అమ్మా" అంది.

    చీకటి పడుతోంది. పొలాలన్నీ అస్పష్టంగా నల్లరంగులో కలిసిపోతున్నాయి. చుట్టుప్రక్కల ప్రదేశమంతా నిర్మానుష్యంగా భయంకరంగా ఉంది. యువతి అక్కడే అలాగే కూర్చుని కిటికీలోంచి చూస్తోంది.

    ముసలిది మండువాలోకి వచ్చింది. "అన్నంలోకి ఏం వండమన్నావ్ పిల్లా?" అంది.

    "ఏదో ఒకటి."

    "ఇప్పుడేనా చెప్పినమాట విను. చలిగాలి ఎక్కువయింది. వొంటికి మంచిదిగాదు. వెళ్ళు, లోపలికి వెళ్ళు"

    "సర్లే"

    "చిటికెలో వంటచేసి పిలుస్తాను. వేడివేడిగా కూడు తిన్నావంటే బలం వస్తుంది. లోపలికి పోయి శాలువా కప్పుకో" అంటూ ముసలిది వెళ్ళిపోయింది.

    యువతి బరువుగా నిట్టూర్చింది. కాని అక్కడనుంచి కదలలేదు. అలాగ కిటికీలోంచి చూస్తూనేవుంది. కొండచిలువలాగ మెలికలు తిరిగి తిరిగి చీకట్లో కలిసిపోయిన రోడ్డువైపు. కొంత సేపటికి దూరంగా రోడ్డుమీద ఏదో ఆకారం అస్పష్టంగా కనిపించింది. దగ్గరౌతున్న కొద్దీ చేతిలో సూట్ కేసూ, మరో చేతిలో గొడుగుతో రోడ్డు బురదలో కాళ్ళీడ్చుకుంటూ వస్తూన్న వ్యక్తి కనిపించాడు. గాలికి గొడుగు తిరగబడి పోతూంది. అతి ప్రయత్నం మీద గొడుగుని ఆ వ్యక్తి సమానంగా ఉంచగలుగుతున్నాడు. ఇంత వర్షంలో ఈ ప్రయాణం సాగించే బుద్దిహీనుడెవరా అనుకుంది యువతి. అదేకాదు రోడ్డంతా గోతులు పడివుంది. చీకటి పడ్డాక ఈ దారిని వెళ్ళడం ప్రమాదకరం. ఆ వ్యక్తి తన యిల్లుకూడా  దాటిపోయాడు. యువతి చప్పున లేచి మండువాలోనుంచి వీధి అరుగుమీదికి వచ్చింది. చప్పట్లు కొట్టింది. "ఏవఁయ్యోయ్! మిమ్మల్నే ఇలా రండి!" అని పిలిచింది గట్టిగా.

    ప్రయాణీకుడు కొంచెంసేపు తటపటాయించాడు. మెల్లగా ఇంటివైపు తిరుగివస్తున్నాడు. ఇంటిముందు పల్లంలో మోకాలిబంటి నీరు ఉంది. ప్రయామీకుడు గొడుగు ముడిచి చంకన పెట్టుకొని మోకాళ్ళపైకి పంచెలాక్కుని భయం భయంగా అడుగుమీద అడుగులేసుకుంటూ కాలవని దాటాడు. అరుగుమీదకి వచ్చి పెట్టెని, గొడుగుని కిందికి దింపి "హమ్మయ్యా!" అన్నాడు. ఆ వ్యక్తి ఆజానుబాహుడు. తెల్లని అతని బట్టలమీద బురద చింది అసహ్యంగా హాస్యాస్పదంగా వుంది. మొహం సరిగా కనిపించలేదు యువతికి.

    "నన్ను పిలిచారా" అన్నాడతను అలసిన గొంతుతో.

    "అవును ఎక్కడికి వెడుతున్నారు మీరు?" అంది యువతి.

    "రైలు స్టేషన్ కి"

    "అబ్బో! స్టేషన్ యింకా చాలాదూరం వుంది" అంది యువతి.

    "అయినా వెళ్ళక తప్పదుగా!" తడిసిన బట్టల్ని పిండుకుంటున్నాడతను.

    "ఈ చీకట్లో ఈ రోడ్డుమీద వెళ్ళడం ప్రమాదకరం. రోడ్డంతా గోతులు, పైగా పైన ఎక్కడో గండికూడా పడిందట. ఈ మాట చెబుదామనే పిలిచాను"




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.