Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


               
                                        ఊరి చివర ఇల్లు

    హోరున వర్షం కురుస్తోంది. ఆకాశమంతా దట్టమైన నల్లని మబ్బులతో నిండి వుంది. ఊరికి శివారునవున్న ఆ పెద్ద పెంకుటిల్లు వర్షంలో మరీ ఒంటరిగా నిస్సహాయంగా వున్నట్లుంది. చూరు వంగిపోయింది. గోడల నుండి పెద్ద పెద్ద బెల్లులు విరిగి పడిపోయాయి. వేగంతో శ్రమించిపోయే కాలానికి, పదార్ధం మొండితనానికి జరుగుతున్న అనాది యుద్దానికి చిహ్నంగా నిలిచినట్టుంది ఆ ఇల్లు.

    ఊరికింత దూరంగా ఈ ఇల్లెందుకు వుందో ఎవరికీ తెలియదు. కొత్తగా చీసినవాళ్ళు ఈ యింట్లో ఎవరూ నివాసం ఉండడం లేదనుకుంటారు. కాని కాస్త నిదానించి చూస్తే గుమ్మాలకి, కిటికీలకి రంగులూ, తెరలూ వేసి ఉంటాయి. ఇంటి కిటూ అటూ మైళ్ళకొద్దీ పొలాలు పరుచుకుని వున్నాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద చింతచెట్లూ తుమ్మచెట్లు కూడా భారంగా భూమి మీదకు వంగి వున్నాయి. వారం పది రోజుల్నుంచి వర్షం అవిరామంగా ఏకధారగా కురుస్తోన్నందువలన ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది. పొలాలన్నీ నీటిలో మునిగిపోయి వున్నాయి. వరిమొక్కల చివళ్ళు మాత్రం కొన్ని చోట్ల నీటిపైకి కనబడుతున్నాయి.

    సాయంత్రం నాలుగు గంటలయినా నల్లని మబ్బులమూలాన్ని చీకటి పడిపోయినట్టువుంది. ఇంట్లో చీకటి మరీ చిక్కబడుతోంది. మండువాలో ముక్కాలిపీటమీద ఒక యువతి కూర్చుని కిటికీలోంచి ఎదురుగా ఉన్న రోడ్డుకేసి చూస్తూ వుంది. ఆమె అలాగ చాలాసేపటి నుండి చూస్తోంది. ఇరవైరెండు యిరవైమూడు సంవత్సరాల వయస్సుంటుంది. తెల్లనిచీర కట్టుకుని వుంది. ఆమె చూపులో ఒకరికోసం నిరీక్షణకాని, ఏ విధమైన కుతూహలంగాని లేదు. శూన్యంగా విరక్తంగా వున్నాయి. ఆ చూపులు. ఎదురుగా ఉన్న వర్ష దృశ్యం ఆమెలోని దిగులుని మరింత ఎక్కువ చేస్తోంది రోడ్డంతా నిండివున్నాయి. రోడ్డుకీ యింటికీ మధ్య ఉన్న పల్లపునేలలో వర్షపునీరు చేరుకుని చిన్నమడుగులా తయారయింది.

    ఆమె అలాగ చాలా సేపటినుండి చూస్తూ కూర్చుని వుంది - గంట నుండి రెండుగంటలనుండి బద్దకంగా, బరువుగా, దీనంగా, దిగులుగా. చూరుమీద వేసిన ధారలు వర్షంపడి టపటపమని మోటుగా చప్పుడవుతోంది. మధ్య మధ్య వర్షపు జోరు తగ్గుతోంది. కాని అంతలోనే హెచ్చిపోతోంది. వర్షం హెచ్చడంతో గాలికూడా పేట్రేగిపోతోంది. విసురుగా వీచే చలిగాలికి తెలీకుండా ఆమె వంటిమీదకి పైటలాక్కుంటోంది. మొహానపడే ముంగురుల్ని చేతివేళ్ళతో వెనక్కి నెట్టుతోంది.

    ఇంటిలోపల్నుండి మండువాలోకి ఓ ముసలి మనిషి వచ్చింది. ఆమె దేహంలో ఎక్కడా రక్తమూ, మాంసమూ వున్నట్టులేదు. చర్మం ఎండిబిగుసుకుపోయి ఎముకలకి కట్టి లాగినట్టుగా వుంది. మొహం వికృతంగా వుంది. నోరు పెద్దదిగా అసహ్యంగా వుంది. గుంటలాంటి కళ్ళు, ముడతలు పడిన రెప్పలసందుల్లోంచి ఆకళ్ళు ఏవో తెల్లని పురుగుల్లాగా కదులుతున్నాయి.
 
    ముసలి యువతిని కొంతసేపు పరీక్షగా చూసింది. నాలుగడుగులు వేసి ఆమె దగ్గరగా వచ్చింది. చిన్నగా దగ్గింది. యువతి ఆమె రాకని గమనించలేదు. ముసలిది ఆమె భుజంమీద చెయ్యి వేసి "పద పిల్లా పద, లోపలికిపోయి పడుకో. ఏమిటి చూస్తావిలాగ?" అంది. యువతి మాట్లాడలేదు.

    "నీకే చెప్తున్నాను. ఈ చలిగాలికి దగ్గో, జ్వరమో వచ్చిందంటే చచ్చినంతపనవుతుంది. లే లోపలికెళ్ళి పడుకో"         యువతి కిటికీలోంచి నిశ్చలంగా రోడ్డువైపు చూస్తూవుంది.

    "నా మాట వినవు ఎందుకు వింటావులే! ఎప్పుడైనా విన్నావు కనకనా! పోనీలే నాకెందుకు!" అంటూ ముసలిది లోపలికి వెళుతూ ఆగి "శాలువా తీసుకురానా పిల్లా?" అని అడిగింది.

    "వద్దు" అంది యువతి. ఆమె గొంతులో కూడా అదే శూన్యత అదే విరక్తి.

    ముసలిది గొణుక్కుంటూ లోపలికి వెళ్ళింది. మళ్ళీ కాసేపట్లో, తిరిగి వచ్చింది.

    "పోనీపిల్లా, కాస్త టీ చేసి తీసుకురానా?" అంది.

    "వద్దు" అంది యువతి ముక్తసరిగా.

    "సోద్యం, సోద్యం" అంటూ ముసలిది లోపలికి వెళ్ళిపోయింది. వాన ఎక్కువయింది. వానతోపాటు గాలి ఉధృతంగా వీచింది. గుమ్మాలవీ కిటికీలవీ తలుపులు టపటపమని కొట్టుకున్నాయి దూరంగా ఉరుములు మెరుపులు.

    పదినిమిషాల్లో ముసలిది చేత్తో టీకప్పు పట్టుకునివచ్చింది. యువతికి ఎదురుగావున్న కిటికీలో పెట్టి "తాగుపిల్లా, తాగు. పచ్చి -వొంటికి టీ నీళ్ళు చాలా మంచివి" అంది. యువతి విసుగ్గా ఆమె కేసి చూసి తల పక్కకి తిప్పుకుంది.

    "చచ్చినవానికోసం ఏడిస్తే ఏమొచ్చిందే పిల్లా! వేలెడులేడు ముదనష్టపు వెధవ. వాడికోసం బెంగ పెట్టుకుని ఏడ్చేదాన్ని ఎప్పుడూ చూడనేలేదు" అంది ముసల్ది.

    ముసలిది ఆగి ఆగి నిలిచి మాట్లాడుతూంది. మాటల్ని చేపల్లాగ కత్తిపీటమీద తరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. కీచుగా ఉన్న గొంతు వొంటిమీదపడి ప్రాకుతున్నట్లుగా వెలపరం పుట్టిస్తుంది.

    "వాన కురిసినప్పుడల్లా ఏవేవో జ్ఞాపకం వస్తాయి. కావల్సినవాళ్ళ కోసం దగ్గరవాళ్ళకోసం మనసు పోతుంది. వానలో ఒక్కళ్ళం ఉండలేం పిల్లా ఉండలేం - నాకు తెలుసు. అయితే అటువంటి ఆలోచనలవల్ల లాభం ఉండదు. పిల్లా! వానంటే భయం నాకు. వెధవ్వాన వెధవ్వాన" అంటూ ముసలిది ఆగింది. ఆమె కళ్ళల్లో కోపం మసిబొగ్గులాగ మండబోయి మాడిపోయింది "ఎందుకే ఈ విచారం చచ్చినవాడికోసం? అసలు నీకు పిల్లలెందుకే తెలివితక్కువదానివి కాని, అనుమానం కలగ్గానే ఏం చెప్పాను నీకు? ఎరుకలదానిదగ్గర బలే మందులున్నాయి. తీసుకొస్తానంటే విన్నావా? నువ్వెందుకు వింటావులే నా సలహా! అలాగ పుట్టాడు అర్ధాయుష్షు వెధవ -ఇలాగ మూడు నెలలకే చచ్చాడు"

     యువతి కళ్ళల్లో బాధ ఆకాశం మీద నల్లని మబ్బులాగా క్రమ్మింది. ముసల్ది వూరుకోలేదు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.