Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
అమె ఏదో పసిగట్టినట్టు భోం చేశారా?" అంది.
" లేదు"
"ఏం?"
" అతను జవాబివ్వలేదు. ఎందుకో అతని మనసంతా కలతపడిపోయింది. అతనికి కొడుకుని స్మశానికి మోసుకుపోవడం జ్ఞాపకం వచ్చింది.
" మరి బంగారం ఏది?" అడిగిందామె.
" బంగారం ఏమిటి?" అన్నాడతను.
" మా పిన్ని చెప్పింది అరకాసు బంగారం ఉందని"
" ఓహ్ అదా---- ఓహ్ మర్చిపోయాను" జేబులోంచి మంగళసూత్రాలు పొట్లంతీసి అమె కిచ్చాడు.
"భలేవారే మీరు ఇంతవరకూ ఇవ్వకుండా నన్నాడిస్తున్నారా?" అంటూ అమె పొట్లం విప్పి చూచింది. పసుపుతాడుకి మంగళసూత్రాలు కట్టబడి ఉన్నాయి. అప్రయత్నంగా అమె "సరే!" అంది. అమె చెక్కిళ్ళలోంచి రక్తం దిగిపోయింది. సందేహంగా అతనికేసి చూసింది.
"అరకాసు ఉండదనా నీ సందేహం? అని అడిగాడతను.
"ఉంటయ్యేమోలే---- అమె పొట్లాం చేత్తో పట్టుకుని " కొంచెం మిఠాయి తినండి. ఇప్పుడే వస్తాను" అని గదిలోంచి వెళ్ళిపోయింది.
అతనికి ఉత్సాహం తగ్గిపోతూన్నట్టనిపించింది. మధ్యాహ్నం భోజనంలేని కారణాన ఏమో అనుకున్నాడు. మంచి చలాకిదే ఈ పాప. తనని లేనివాడని కనిపెట్టేసిందా?" అయితేనేం , బంగారం ఇచ్చాడుగా. ఇంకేం అనుకున్నాడు. టేబిల్ మీద పళ్ళెంలో మిఠాయిలు తీసుకుని తాపీగా తిన్నాడు. కిందనుంచి ఏవో కేకలు వినిపిస్తున్నాయి. పాప ఎవరిమీదో---- బహుశా ఆ గొగ్గిపళ్ళ పిన్నిని తిడుతుందేమో అనుకున్నాడు. రెండు చెక్కరకేళీ అరటిపండ్లు వొల్చుకొని తిన్నాడు. క్రమంగా అతనికి బలం వచ్చింది. దాంతో అతనిమీద అతనికి నమ్మకం కలిగింది. ఇందాకట్నుంచి నీరసంవల్ల కాబోలు అలా బెదురుగా ఉన్నాననుకున్నాడు. ఇప్పుడు చూడమను తన ప్రజ్ఞ. తనూ చమత్కారంగా మాట్లాడగలడు. పాపచేత జావళీ అభినయింప జెయ్యాలి. "తూరుపు తెలవారే" అంటే అతనికి ఇష్టం.మరచెంబు నీళ్ళు తాగి త్రేన్చాడు. రాబోయే సుఖాన్ని తల్చుకుంటుంటే అతనికి వొళ్ళు మళ్ళీ పులకరించింది. లేచివెళ్ళి మంచం మీద పడుకున్నాడు. చిరునవ్వు నవ్వుకున్నాడు తృప్తిగా.
గదిలోకి గొగ్గిపళ్ళావిడ వచ్చింది. ఇదొచ్చిందేమిటీ అని కంగారుపడ్డాడు. లక్ష్మీమోహనరావు. "లేలే పంతులూ మంచంమీద దొర్లాగా పడుకున్నావు కాని. " అంది మోటుగా అవిడ.
. "ఇన్ స్పెట్టరొత్తన్నాడు . కబురొచ్చింది. ఏల్లుబాబు నువ్వెళ్ళిపో. "
. " ఎక్కడికి వెళ్ళను?" కోపం వచ్చింది లక్ష్మిమోహనరావుకి.
. "నేనెందుకు వెళ్ళాలి. " అన్నాడు.
. "సాల్లే... ఇన్ స్పెట్టరొస్తే నిన్నూ నన్నూ జెయిల్లోకి తోస్తాడు. దయచెయ్యి పంతులూ ఇదిగో నీ బంగారు-------. " అమె పొట్లం మీదికి విసిరింది.
. " పాప ఏదీ. ఇలా రమ్మను. " మెల్లగా అడిగాడు రావు.
. "పాపే చెప్పింది నిన్ను పంపించెయ్యమని నడు నడు ఊ. " అంది.
కోపంలో పొట్లం తీసుకొని లక్ష్మీమోహనరావు గబగబా కిందికి దిగాడు. ఇటూ అటూ చూశాడు. గుమ్మం పక్కగా పాప నుంచుని వుంది.
. " నన్ను పొమ్మాన్నావేం--- వాడెవడు ఆ ఇన్ స్పెక్టరు , నాకేం భయం?" అన్నాడు గట్టిగా.
పాప నవ్వి, . " కోప్పడకు పంతులూ, మళ్ళీ ఎప్పుడయినా వొద్దువుగానిలే. నా మాట విని వెళ్ళు. "
. "ఏం. "
. " ఇదిగో ఈ పది రూపాయలూ దగ్గరుంచుకో. నాకూ తెలుసు కష్టం ఏమిటో!"
. " ఎందుకో ఏ అవ్యక్త స్మృతివల్లనో చటుక్కున అతనికి కోపంపోయి సిగ్గుతో అవమానంతో తనమీద తనకి జాలితో బలహీనుడయిపోయాడు. లక్ష్మి మోహనరావు. అమె జేబులో పదిరూపాయలు పెడుతూంటే తోసివేయాలనుకున్నాడు. కాని, అతని నరాలూ, ఇంద్రియాలూ స్తంభించిపోయాయి. అలాగే నుంచునిపోయాడు. కోపంగా కేకలేద్దామనుకున్నాడు.కాని మాట రావడంలేదు.
. " వెళ్ళు పంతులూ. "---- పాప జాలిగా చూసి అంది.
లక్ష్మీమోహనరావు జేబులోంచి నోటుతీసి అమెమీదకు విసిరివేశాడు. ఒళ్ళంతా అవమానంతో దహించుకుపోతోంది. నిర్జనంగా ఉన్న రాజమండ్రి రోడ్లమీద నడచిపోతున్నాడు. లక్ష్మీవారం పేట, తుమ్మలావ గడిచిపోయాడు. పాప జాలిగా చూడడం అతనికి మరీ మరీ గుర్తుకు వస్తోంది.
తను దరిద్రుడని తెలిసిపోయింది. తన శక్తి అంతా ఈ ప్రమాదం రాకుండా ధారపోసినా లాభం లేకపోయింది. తనకి వ్యభిచారించే అర్హత కూడా లేదు. ఎంతదూరం ఆ చీకట్లో అలా నడిచాడో తెలియదు. కాని అతను తనకి తెలియకుండానే తన యింటికి వెళ్ళాడు. అతని ఒంట్లోంచి సత్తువంతా ఎవరో తోడేసినట్లయింది. కాళ్ళు వణికాయి.. తన ఇంటి మెట్లమీద చతికిలపడ్డాడు. మొహం చేతులతో కప్పుకున్నాడు. అతని గొంతు నుంచి మూలుగు హీనస్వరంతో బయటకు వచ్చింది.
ఇంటి తలుపు తెరచి భాగ్యలక్ష్మి తొంగి చూసింది. . "ఇంతదాకా ఎక్కడెక్కడున్నారు? రండి లోపలికి. అలా బెంగపడిపోతే ఎలాగ. " అంటూ అతని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది.
. " మీరు కూడా ఏమయ్యారో అని భయంతో ఛస్తున్నాను. చచ్చిన కొడుకెల్లానూ రాడు. మీరుకూడా?"అమె కంఠం రుద్దమయింది.
. "పడుకోండి ఇలాగ. " అంటూ అతన్ని మంచం మీద పడుకొబెట్టింది.
లక్ష్మీమోహనరావు కళ్లు మూసుకొని పడుకున్నాడు. కనుకొలనుల నుంచి కన్నీటి బిందువులు రాలుతున్నాయి. లక్ష్మీ అతని కళ్ళు తుడిచి . " కాస్త విశ్రాంతి తీసుకోండి. " అని తన కళ్ళు తుడుచుకుంది. లక్ష్మీమోహనరావుకి కాస్సేపటికి నిద్రపట్టింది.
(జ్యోతి 1963)



