Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు



    "ఏముంది"

    " పిల్లేదేనా దొరికిందా?"   

    ఆశ్చర్యంతో లక్ష్మీమోహనరావు " నీకెలా తెలిసింది?" అన్నాడు.

    "ఓస్, అందరి వయినం ఇట్టే పసిగట్టగలను. అనుభవం! అంతే అనుభవం. నిన్ను చూడగానే అనుకున్నాను. ఈ డెవడో నాసిరకంరా బాబూ అని" అన్నాడు కొట్టువాడు.

    ఇలా లోకువచేసి మాట్లాడడం కష్టమనిపించింది లక్ష్మీమోహనరావుకి. అయినా చేసేది లేదు. తల దువ్వుకుని పౌడరు రాసుకుని తొమ్మిదయ్యేవరకు అక్కడే ఒక బల్లమీద కూర్చున్నాడు. ఒళ్ళంతా బరువుగా వుంది. ఒకపక్క చెయ్యకూడని పని ఏదో చేస్తూన్నట్టు వుంది. అంతలోనే విపరీత శక్తులమీద తిరుగుబాటు  చేస్తోన్న నాయకుడిలాగా గర్వంగా అనిపించింది. తన ఒక్క కోరిక ఎందుకు తీర్చుకోకూడదు? ఎవరు అడ్డుపెడతారు?  అతనిలో తెలియని సంతోషం వ్యాపించింది.

    ఇదివరకు వెళ్ళిన మెరకవీధి మేడదగ్గరకు వెళ్ళాడు. ఇందాకటావిడ గుమ్మం దగ్గర కూర్చుని కాళ్ళకి తైలం రాసుకుంటోంది. ఇతన్ని చూసి " ఆ మెట్లెక్కి పైకి వెళ్ళు. అక్కడుంటుంది" అంది. ఏకవచన ప్రయోగానికి ఒళ్ళు మండింది. కోపంగా చూచి మెట్లెక్కాడు. డాబామీద పిట్టగోడనానుకొని విలాసంగా ముంచుందొక యువతి. పొడుగాటి వాల్జడ మద్య బంగారపు చామంతిపువ్వు వుంది. మెళ్ళో నెక్లెసూ ఒక ఒంటిపేట గొలుసూ వున్నాయి. రొమ్ములు ఎత్తుగా ఉన్నాయి. పౌడరు పూసిన మొహం తెలుపూ, చేతుల చామనచాయ రంగూ విడివిడిగా అసందర్భంగా వున్నాయి.

    ఇతన్ని చూచి నవ్వూతూ రాండి" అంది అమె. అమె వెన కాలే గదిలోకి వెళ్ళాడు. గది చిన్నదైనా పందిరి పట్టెమంచం ఒక సోఫా. ఒక డ్రాయరూ ఇరుకుగా సర్ది ఉన్నాయి. పరుపుమీద మొ    ఖమల్ పరచివుంది. డ్రాయరుమీద మిఠాయిలు అరటిపళ్ళూ, టోబిలు ఫానూ ఉన్నాయి. గోడమీద వెంకటేశ్వరుడి పటానికి ఇటూ అటూ సినీతారల బొమ్మలూ , క్యాలెండర్లూ ఉన్నాయి. ఓ పక్కగా ఉన్న ఒక కిటికి మూసేసి ఉంది. గదిలోకి వెళ్ళగానే లక్ష్మిమోహనరావుకి నిలవవున్న గాలి వాసనా, ఒకరకం ముదురు సెంటు వాసనా కలిపి గమ్మత్తుగా ఉంది.

    ట్యూబ్ లైటు కాంతిలో అమెను తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. అమె నవ్వి అలా చూస్తున్నారేం బావులేనా?" అంటూ దగ్గరకు వచ్చి చెంపల్ని తాకి సోఫాలో కూర్చోపెట్టింది. అతనికి వొళ్ళు పులకరించింది. అమె అంత అందంగా కనపడలేదు. అయినా అమె చొరవలో, చనువులో ఉద్రేకపరిచే గుణం వుంది.

    తనని పరీక్షగా చూస్తోందని తెలుసుకొని " మీ పేరు పుష్పలతేనా?" అని అడిగాడు.

    కిలకిల నవ్వి అమె అతని పక్కగా కూర్చొని "ఇలాంటి చోటుకి రావడం మీకు కొత్తా?" అంది.

    "ఏం?"

    " నన్ను మీరు" అని గౌరవిస్తున్నారేం?"

    " మిమ్మల్ని గౌరవించకూడదా?"

    " ఊహూ" అని కళ్ళు కుంచించి అతనిమీదికి కొంచెం వంగి "మీది ఈ ఊరు కాదా?" అనడిగింది.

    "కాదు" అబద్దమాడాడు లక్ష్మీమోహనరావు.

    "మరి ఏ వూరు?"

    " అమలాపురం"

    " ఏం చేస్తోంటారు?"

    " వ్యవసాయం--- అక్కడ నాకు భూములున్నాయి" ధైర్యంగా అనేశాడు.

    అమె తీవ్రంగా చూచి మళ్ళీ నవ్వుతూ " ఈనాందార్లన్నమాట, ఏమాత్రం కమతం వుందీ?" అంది.

    "యాభై ఎకరాలు------" తన లోకువ పట్టేస్తుందేమోనని నిచ్చెన మెట్లెక్కి పోతున్నాడు లక్ష్మీమోహనరావు.

    " మరి ఈ మాసిన బట్టలూ వేషమూ------- ఇలాగే వస్తారా మా దగ్గరికి" అయ్యోరామ" అని చెంగు నోటికి అడ్డం పెట్టుకొని నవ్వుతోంది.

    " పెట్టె, బెడ్డింగు పోయాయి వస్తోంటే. ఈ వూర్లో పనుంది మరి! ఏం చెయ్యను" కంగారుపడ్డాడు. లక్ష్మిమోహనరావు.

    "ఊహూ." అమె ఏదో ఆలోచిస్తున్నట్టు వుంది.

    "పుష్పలతంటే మావైపు మంచిపేరు"

    "నేను పుష్పలతని కాను"

    " మరి నువ్వు....."

    "నన్ను పాప అంటారు. పుష్పలత మా అక్కయ్య. ఓ లక్షాధికారి మా అక్కయ్యను సొంతంగా ఉంచేసుకున్నాడు."

    "ఓహో! అన్నాడు లక్ష్మీమోహనరావు . పోని ఇదైతేనేం దాని చెల్లెలే కదా అని సమాధానపర్చుకున్నాడు.

    " నన్ను కూడా మీరు తీసుకుపోయి ఉంచుకోరాదూ?" చిలిపిగా నవ్వుతూ అడిగింది.

    "నేనా------ ఎక్కడ ఉంచుకోవడం?" ఎలాగ?" తడబడుతూ అన్నాడు లక్ష్మీమోహనరావు.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.