Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"ఏం నవ్వుతావ్" అన్నాడు లాటరీవాడు.
" ఈ గుర్రం నిజం గుర్రం కాదు" అన్నాడు లక్ష్మీమోహనరావు.
"ఊరుకోవయ్యా ఇది ఫస్టు క్లాసు గుర్రం. చూడు ఈ ఏనుగుని మైసూరు మారాజా దీన్నే ఎక్కి ఊరేగేవాడు. కాయ్ రాజా కాయ్" అన్నాడు లాటరీవాడు.
" నే కాయను" అన్నాడు లక్ష్మీమోహనరావు.
"ఏం ఎందుకు కాయవ్" నాది నిజాయితీ అయిన లాటరీ" అన్నాడు లాటరీవాడు.
" ఎందుకో చెప్పనా" అని అడిగాడు లక్ష్మీ మోహనరావు.
"చెప్పవయ్యా చెప్పు. ఏదేనా మోసం ఉందని రుజుచేస్తే పది రూపాయలు నీకు ఈనాం" అన్నాడు కోపంతో లాటరీవాడు.
"అయితే చెప్తావిను. నా దగ్గర డబ్బులేదు. నే నాడను" అని లేచిపోయాడు. లక్ష్మిమోహనరావు. అందరూ గొల్లుమని నవ్వారు లాటరీవాడు పెద్ద అవమానంగా తలచి "కలేజా వుంటే కాయండి. రూపయికి రెండు రూపాయలు. ఊరికే చూస్తే అదురుష్టంరాదు మొగాలకి" అన్నాడు.
లక్ష్మిమోహనరావు సత్రంలోకి వెళ్ళాడు. సత్రం గుమాస్తా ఇతన్ని ఎరుగును. బీడీపొగ పైకి ఊది "ఏవయ్యోయ్ కులాసాగా కనపడ్డంమానేశావ్" అన్నాడు.
"ఏదీ బీడి వుంటే ఒకటివ్" అన్నాడు రావు.
" అరే నీ కలవాటు లేదుగా?"
"చేసుకున్నానులే" అంటూ బీడి తీసుకుని అంటించాడు లక్ష్మీమోహనరావు. అతనికి బీడి అలవాటులేదు. కాని ఈ వేళ అతనికి ప్రతిపనీ చేసేందుకు స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది.
" కులాసాయేనా? ఏంటి ఇలా వచ్చావ్?" అన్నాడు గుమాస్తా.
"ఆ ఇలాగ పనిమీద వెళుతున్నాను. ఏదైనా మంచం వుంటే పడెయ్యి. కాసేపు నడుం వాల్చిపోతాను" అన్నాడు.
గుమాస్తా కాళీ గది ఒకటి చూపించాడు. బీడీ కాలుస్తూ ఉక్కిరి బిక్కిరి అవుతూ దగ్గుతూ మంచం మీద పడుకుని లక్ష్మీమోహనరావు రకరకాల ఆలోచనల్ని తరుముతున్నాడు. అలసిపోయిన అతనికి తెలీకుండా నిద్రపట్టింది.
సాయంత్రం ఆరు దాటాక గుమాస్తా లేపేవరకూ అతనికి మెలకువ రాలేదు. మేలకువ వచ్చాక అతను చాలాసేపు తికమక పడ్డాడు. తనక్కడ ఎందుకున్నదీ తెలియక. కొంతసేపటికి అతన్ని అతను గుర్తించడానికి వీలయింది. గుమాస్తాకి థాంక్స్ చెప్పి ఇన్నీసుపేట గోదావరి ఒడ్డుకి వెళ్ళి మొహం కడుక్కుని మెట్లమీద కూర్చున్నాడు. విశాలంగా చల్లగా పారుతూన్న గోదావరి ముందు అతను చటుక్కున ఏకాకిలా ఫీలయ్యాడు. కమ్ముకుంటున్న లేతచీకటిలో బద్దకంగా చూస్తూ కూర్చున్నాడు. అతనికి చిన్ననాటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. చుట్ట నముల్తూ మాట్లాడే తండ్రి, తులసి కోటకు రోజూ పూజ చేసే తల్లి పకోడిల కొట్టూ, సర్కసూ, తెలుగు మాస్టారూ, శ్రీరామ నవమి ఉత్సవాలూ,... అతనికి లోపల్లోపల దాగివున్న కోరిక ఒక్కసారి బయటపడింది. ఒక్కరాత్రి అయినా భోగం దానితో అనుభవించాలని ఉబలాటపడిపోయింది. అతని మనస్సు, పుష్పలత, అందంగా వుంటుందనీ , బాగా అభినయిస్తుందనీ అంటారు. ఓసారి మెరక వీధిలో వెళుతుంటే పుష్పలత మేడని చూపించారు. మిత్రులు. ఈవాళ ఎలాగయినా తాకట్టు పెట్టడానికి టైమయిపోయింది. రేపటి సంగతి రేపు చూచుకోవచ్చుననిపించింది. మెరక వీధిలో మేడ వుంది. ఇంకేం అనుకున్నాడు. లేచి బయల్దేరాడు.
విద్యుద్ధీపాల కాంతిలో రాజమండ్రి సందులు చవకరకం అడదానిలా మెరుస్తున్నాయి. తికమకగా ఉన్న జుట్టుతో మాసిన చొక్కాతో తిన్నగా పుష్పలత మేడగుమ్మం ముందు నిలబడ్డాడు. ఏం చేయ్యాలో ఎలా పిలవాలో అతనికి సరీగ్గా తెలియదు. దగ్గాడు కొంత సేపయ్యాక మళ్ళీ దగ్గాడు. చివరికి "ఏమండీ" అని పిలిచాడు. అతనికి సిగ్గుగా భయంగా వుంది. ఇంతలో గళ్ళచీర కట్టుకున్న యాభై ఏళ్ళ స్త్రీ వచ్చి "ఏం కావాలి" అంది. జుట్టు పల్చబడి అమె తల పెంకు అక్కడక్కడ కనిపిస్తూ అసహ్యంగా ఉంది.
"ఈ మేడలో పుష్పలత వుందా?"అన్నాడు బెరుగ్గా.
"ఆ వుంది. ఎవరేనా పంపించారా నిన్ను?"
" కాదు, నాకే కావాలి"
" నీకా!" అమె విరగబడి నవ్వింది. నవ్వినప్పుడు గొగ్గిపళ్ళు కన్పిస్తున్నాయి.
" నా దగ్గిర అరకాసు బంగారం వుంది"అన్నాడు ధీమాగా.
అమె ఎగాదిగా చూసి, " ఆగు కనుక్కుని చెపుతాను" అని లోపలికి వెళ్ళి కొంతసేపటికి తిరిగివచ్చి "రాత్రి తొమ్మిది దాటక రండి" అంది.
లక్ష్మీమోహనరావు ఉత్సాహంగా బజారువైపు నడిచి ఒక క్షౌరశాలలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరూ లేరు. యజమాని తప్ప.
"ఏం సార్ క్రాఫ్ వెయ్యమంటారా?" అన్నాడువాడు.
"కాదు కొంచెం తలకి నూనెరాసి పెట్టాలి. పౌడరు కూడా కావాలి. డబ్బులు తీసుకురాలేదు. ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఇస్తాను" అన్నాడు లక్ష్మీమోహనరావు ప్రాధేయ స్వరంతో. శాలధిపతి యితన్ని నిదానించి చూచి " ఏం గిరాకి పంతులూ?" అన్నాడు.



