Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    అన్నింటికన్నా అతనికో సరదా ఉన్నట్టుగానే ఉండిపోయింది. అతను పదోక్లాసు చదువుతూన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలకి పందిట్లోకి వెళ్ళాడు. అక్కడ నుంచి మజాగా మేజువాణి జరుగుతోంది. పళ్ళెత్తుగా ఉన్న దెవత్తో మేళం కడుతోంది. ఛా" అనుకున్నాడు. లక్ష్మీమోహనరావు అమెనుచూసి కాని ఇంతలో రసజ్ఞుడైన ఒక కారాకిళ్ళీ ప్లస్ కండువా అసామి పిడేలు వాయించేవాడని పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. పళ్ళెత్తు అవిడ గజ్జెలు విప్పి ఇంకో సన్నగా నాజూకుగా ఉన్న ఎర్రనిపిల్ల కిచ్చింది. ఆ పిల్ల కళ్ళు బాగున్నాయి. బెంగగా వున్నాయి. చిన్నగా జాలిగా నవ్వి ముందుకు వచ్చి, "తూరుపు తెలవారె" అని అభినయం ప్రారంభించింది. లక్ష్మిమోహనరావుకు సరదా వేసింది. ఆ కళ్ళనీ, బుగ్గల్నీ ముద్దెట్టుకోవలనుకున్నాడు.

    తర్వాత పెద్దవాడయినకొలదీ భోగంవాళ్ళంటే ఏమిటో, ఎందుకో తెలిసిపోయింది. రాజమండ్రి మెరకవీధిలో వీళ్ళు ఉంటారనీ తెలిసింది. వాళ్ళొక మేలిరకం "హాయి" ని ఇస్తారనీ, బతికున్నవాడెవడైనా ఒకసారి ఆ హాయిని పొంది తీరాలని విజ్ఞులైన మిత్రులు కొందరతనికి చెప్పారు. కాని వాళ్ళు ఒక యిబ్బందైనమాట కూడా చెప్పారు. వాళ్ళకి డబ్బూ, నగలూ మొదలైనవి యిస్తేనే రానిస్తారని, లేందే గడప తొక్కనివ్వరనీ చెప్పారు.

     ఈ షరతు మాత్రం అతనికేమీ బాగాలేదు. ఈ సరదా క్రమక్రమంగా అతనిలో అడుగున పడిపోయింది. సంఘానికి వీళ్ళు చీడపురుగులనీ, తప్పనీ అవినీతి అనీ అందరూ అనడంవల్ల కొంత అతనూ నమ్మాడు. స్వంతవూళ్ళో మేజువాణీ చూడడానికి సిగ్గువేసినా పొరుగూళ్ళకు వెళ్ళినప్పుడు బెదురుగా మోతాదుగా చూసి సంతృప్తి పడేవారు.

    మొహం కడుక్కుని యింట్లోకి వచ్చాడు. అతనికేదో జైల్లో వున్నట్టనిపించింది. అసలీమధ్య అతనికి పట్టుమని పదినిముషాలు ఉండడమే కష్టంగా ఉంది. బతికున్నప్పుడు అతనికి కొడుకు బ్రతికున్నట్టే అనిపించేదికాదు. కాని ఇప్పుడు కొడకు లేడని ప్రతీ వస్తువూ సాక్ష్యం ఇస్తాన్నట్టు వుంది. తన భార్య నిద్రలేవకుండానే అతనికి వెళ్ళిపోవాలనిపించింది. పుత్రశోకంలో వున్న అమెని ఓదార్చడం చాలాకష్టమైన పని అనిపించింది. పక్కింటావిడ నిన్న వచ్చి కష్టంలో అదుకుంది. మళ్ళీ ఈ రోజు ఉదయమే తన భార్య నావిడకి వదిలెయ్యడం మంచిదనుకున్నాడు. వీధి తలుపు చప్పుడు కాకుండా తెరచి గుమ్మం దాటబోతుంటే అతనికి క్రితం రోజున లక్ష్మీ మెళ్ళో మంగళసూత్రాలు తీసి  పిల్లాడికి మందులూ, బియ్యమూ, తీసుకురమ్మని చెప్పడం జ్ఞాపకం వచ్చింది. వెనక్కు వచ్చి అల్మారులో మూలగా కాగితం పొట్లంలో కట్టిన మంగళసూత్రాలు తీసి జేబులో వేసుకున్నాడు. నిన్న వీటి అవసరం లేకుండానే కుర్రాడికి ప్రాణంమీదికి రావడంతో తాకట్టుపెట్టవల్సిన అవసరం లేకపోయింది. ఈరోజున డబ్బు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లక్ష్మి చాపమీద సగం, నేలమీద సగం పడుకుని నిద్రపోతుంది. అమె నిప్పు సెగకి యెండి ముడుతపడిన పాత కాగితంలా ఉంది. ఒక్కసారి అమెను చూచి గబగబా వీధిలోకి వెళ్ళిపోయాడు.

    లక్ష్మీ మోహనరావు వీధిలోకివచ్చి నడవటం మొదలుపెట్టాడు. అతనికొక గమ్యంలేదు. ఇంటికి తిరిగి వెళ్ళకుండా చీకటిపడేవరకూ పొద్దుపుచ్చడమే అతని ప్రస్తుతాశయం.  ఎప్పుడో ఒకప్పుడు మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టవచ్చును. ఒక వీధినుంచి  ఇంకొక వీధిలోకి, ఒక సందులోంచి ఇంకొక సందులోకి కులాసాగా నడుస్తున్నాడు. నడవడంలో ఇటూ అటూ కొట్లనీ, ఇళ్లనీ మనుష్యులనీ చూడడంలో అతని కొక విశ్రాంతి లభించినట్టుగా ఉంది. ఒళ్ళూ మనస్సూ ఏదో తేలికైపోయినట్టుగా బరువు దిగిపోయినట్టుగా వుంది. తాను విచ్చలవిడిగా తిరగడానికి ఇంత పెద్ద ఊరు ఏర్పడి ఉండడం ఏదో దైవ సంకల్పంలాగా అనిపించింది. రాజమండ్రి ప్రజలనందరిని పిలిచి ఒక్కసారి అభినందించాలనిపించింది. ఇంతమంది జనాభాలో ఎవడికి తన కొడుకు పోయినట్లు తెలియదు. తెలుసుకోలేదు. తెలుసుకోవాల్సిన అవసరమూ లేదు.  జనప్రవాహంలో తానొక బిందువు మాత్రమే. నడవగా నడవగా ఆకలి వేసింది.జేబులో ఒక రూపాయికూడా వుంది. హోటల్ కు వెళ్ళి ఇడ్డెన్లు తిని కాఫీ తాగి మిఠాయి కిళ్ళీ వేసుకుని నడక ప్రారంభించాడు. ఎదురుగా ఎవడో నున్నగా క్రాపింగ్ దువ్వుకున్న ఒక లుంగీదారు ఇతన్ని చూసి ఇకిలించినట్టు నవ్వాడు. గబుక్కున లక్ష్మీమోహనరావుకి జ్ఞాపకం వచ్చింది. తాను తల దువ్వుకోలేదనీ, బట్టలు మార్చుకోలేదని, పోనిలే అనుకున్నాడు. ఒక దేవాలయం దగ్గర ఎందరో తడిబట్టలతో దేవుడికి మొక్కుకుంటున్నారు. ( అతను కూడా చేతులెత్తి నమస్కరించాడు) ఒకావిడ చాలా ఖరీదైన పట్టుచీరా, మెడకీ చేతులకీ కొన్ని వందల తులాల బంగారమూ, విశాలమైన కళేబరంతో వెనకాల మొగుడూ పరిచారికా వెంటరాగా దేవాలయంలోకి వెళుతుంటే చూచి నవ్వుకున్నాడు. ఇంత డబ్బున్న అవిడనిచూసి దేవుడు నాలుగడుగులు ముందుకువేసి రండి మహలక్ష్మమ్మగారూ! దయచేయండి. మీబోటివాళ్ళు అస్తమానూ వస్తారా! అంటాడేమో అని కాసేపు నిలబడిపోయాడు. అక్కణ్నుంచి సినిమా పోస్టర్లు వరసగా చూస్తూ చదువుతూ యిన్నీసుపేట వరకూ వెళ్ళాడు. ఒకచోట రోడ్డుకి పక్కగా కాళీజాగాలో ఎవడో గారడీవాడు తన విద్యని ప్రదర్శిస్తున్నాడు. జనం గుడ్రంగా మూగి ఉన్నారు. లక్ష్మీమోహనరావు వాళ్ళలోకి చొచ్చుకుపోయాడు. సర్కస్ లాగా గారడీ అన్నా అతనికి ఇష్టం. గారడీవాడు తురకాన్నీ తెలుగునీ పసందైన పాళ్ళలో కలిపి వంచి పెడ్తున్నాడు. కోడిగుడ్డుని ఒక బుట్టలోమూసి కుక్కపిల్లని చేస్తానంటున్నాడు వాడు. తనకి గారడీ వస్తే దాన్ని మేకపిల్లనిచేసి గారడీవాణ్ణి ఏడిపించవచ్చు ననుకున్నాడు. గారడీవాడి కూతురు డబ్బులడుగుతోంది. దాని గడ్డంమీద మచ్చ ముద్దొస్తూందనుకున్నాడు. జేబులోంచి పావలాతీసి దానికిచ్చేశాడు. పక్కవాడు అణాయే యిచ్చాడు. వాడిని తిరస్కారంగా గర్వంగా చూశాడు.

    సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. ఎండ చుర్రుమంటోంది. మళ్ళీ అకలేసింది. లక్ష్మీ మోహనరావుకి. సత్రంవైపు బయల్దేరాడు. సత్రం ముందు ఎవడో బొమ్మలున్న గుడ్డ నేలమీద పరచి "కాయ్ రాజా కాయ్" అంటున్నాడు. సర్కస్ జ్ఞాపకం వచ్చింది. లక్ష్మీమోహనరావుకి. గుర్రాలంటే అతనికి ఇ,ష్టం. గుర్రంమీద బేడ కాసేడు. పావలా వచ్చింది. మళ్ళీ రెండోసారి పావలా , బేడ కలిపి కాశాడు పోయింది ఫక్కున నవ్వాడు.
   




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.