Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
అతని కోరిక
లక్ష్మీమోహనరావు నిద్రనుండి లేచాడు. లేచి భార్యకేసి చూచాడు. అమె యింకా నిద్రపోతుంది. అమెను లేపటం ఇష్టంలేదతనికి. అమెతోపాటు ఎన్నో బాధలూ, గాథలూ, మేల్కొంటాయని అతనికి తెలుసు. అసలు నిద్రకన్న సుఖకరమైన స్థితి మరొహటి ఏమీ అతనికి ప్రపంచంలో కనపడలేదు. అర్థాంగి అయిన అమెను సుఖాన్నుంచి దూరం ఎందుకు చెయ్యాలనుకున్నాడు. అతనికి నిద్ర అన్నా, నోవకేన్ ఇంజక్షన్ అన్నా చాలా యిష్టం. ఇదివరెకెప్పుడో తేలుకుట్టి అతనికి కాలంతా మంటలూ, పొట్లూ ఎత్తినప్పుడూ డాక్టరు ఈ యింజక్షన్ యిచ్చాడు. దాంతో పాదం తిమ్మిరెక్కిపోయింది. బాద తెలియలేదు. నిద్ర కూడా అతనికి అలాగే వుంటుంది.బాధల్ని, అరుచికరమైన సంగతుల్నీ నొక్కివేసి ఉంచుతుంది. అందిరకి లాగా అతనికి నిద్ర గాఢనిద్రకాదు. సుఖనిద్రకాదు. ఒహరకం తిమ్మిరిలాంటిది. నిద్రలేవగానే అతనికి మనస్సు సలుపుతూన్నట్లు ఉంటుంది.
దొడ్లోకి వచ్చి వేపపుల్ల విరిచి పళ్ళు తోముకున్నాడు. ఆ సమయంలోనే అతనికి జరిగిపోయిన రోజున జరిగిన ముఖ్య సంఘటన జ్ఞాపకం వచ్చింది. నాలుగేళ్ళు కొడుకు చనిపోవడమూ, తాను మోసుకుని శ్మశానానికి తీసుకుపోవడమూ తన భార్య గుండెలు బాదుకుని ఏడ్వడమూ------ ఇదంతా నిన్ననే జరిగిందా, ఇదివరలో ఎప్పుడైనా జరిగిందా? అన్న అనుమానమూ వచ్చిందతనికి. అతనికి జ్ఞాపకం లేకకాదు. అతనికేదేనా కష్టం వచ్చినప్పుడు అతనికి మనస్సంతా చిత్రంగా మొద్దుబారిపోతుంది. కాలం అనే డైమన్షన్ ఎక్కడికో తప్పుకుంటుంది. ఏమైనా అతనికి అంతగా ఏడుపు రాలేదు. అంతగా బాధ అనిపించలేదు. అంతే, ఇదీ తిమ్మిరే అనుకున్నాడు.
పళ్ళు తోముకుంటుంటే ఇలాగ ఆలోచనలు మంచు పొగలాగ ఎందుకు ముసురుతాయో అతనికి తెలీదు. వాళ్ళమ్మ చిన్నతనంలో దరిద్రుడా అని తిట్టేది. మరి తనకి లక్ష్మీమోహనరావు అని పేరు ఎందుకు పెట్టింది ? అతనికి అమ్మమీద కోపం వచ్చింది. తనకి ఆ పేరు పెట్టినందుకు కాదు. తనకి లక్ష్మీ అనే పేరుగల భార్యను వెతికి తెచ్చి మెడకు కట్టినందుకు . అతను నవ్వుకున్నాడు. అతనికి ఎవరేమన్నా కోపం రాదు. కాని దరిద్రుడా" అని అంటే కోపం వచ్చేది. తల్లిని అలా పిలవొద్దని కసురుకునేవాడు. దరిద్రం యాచనలో ఉంది. సోమరితనంలో ఉంది. కష్టపడేవాడికీ, అభిమానం ఉన్నవారికీ దరిద్రం ఉండదు. ఎవరూ కూడా ఉందని వేలెత్తి చూపించలేరు. అందుకే అతను దొరికిన ఉద్యోగమల్లా చేసేవాడు.అతనికెప్పుడూ టెంపరరీ ఉద్యోగాలే దొరికేవి. బియ్యంకొట్టే గుమాస్తాగా పనిచేశాడు. ఎలక్ట్రిసిటి అపీసులో పనిచేశాడు. టాటరీ టిక్కెట్లు అమ్మేవారిలో కూర్చొని మైక్ ముందు గొంతుపెట్టి రూపాయికి లక్షరూపాయలు అని కేక వేశాడు. సినిమాలో గేటుదగ్గర నిలబడ్డాడు. కిరాణాకొట్లవాళ్ళకి పద్దులు రాసి పెట్టేవాడు. ఎప్పుడూ అతని జీతం ముఖ్యావసరాలకీ సగం సరిపోయేది. పై సగం అవసరాలూ ఎండిపోయి అతని భార్యకి జబ్బురూపంలో, తనకిట భయం రూపంలో, కొడుక్కి ఆకలి రూపంలో దాగిఉండేవి.
చచ్చిపోయిన కొడుక్కి ఆక లెక్కువ. వాడస్తమానం తిండికావాలని మారాం చేసేవాడు. వాడికి కడుపునిండా అన్నం పెట్టినా ఇంకా యివీ అవీ కావాలనేవాడు. తోచకపోతే మట్టితినేవాడు. ఒక వైద్యుడికి చూపిస్తే లివర్ పెరిగిందన్నాడు. అందుకే పొట్ట అలా ఎత్తుగా వచ్చిందన్నాడు. పొట్టమీద నీలిరంగు నరాలు పైకి వుబ్బి భూగోళం మ్యాపు మీద నదుల గీతల్లా వుండేవి. వాడికి సరీగా మందివ్వక----- మందిప్పించలేక--- చంపేశాడన్నారు లక్ష్మీనారయణరావుని కొందరు. కాని అది అబద్ధం. ఎలాగో అలాగ డబ్బు తెచ్చి మందులిప్పించాడు. కొట్టువాడిని బతిమాలి కొన్ని మందులు అరువు తెచ్చాడు. ఆ జబ్బుకి ఇవి అరువు మందులని తెలిసిపోయి లోకువచేసి కాస్తయినా తగ్గలేదని అతని అనుమానం.
వాడు బతికి వుంటే వాళ్ళ మేనమామ అల్లుడు పింతండ్రిలాగ తాసీల్దారయివుండేవాడు అని భార్య లక్ష్మీ ఉద్దేశం. అతనికీ అతని భార్యకీ కూడా గౌరవంగా, గర్వంగా చెప్పుకోదగిన బంధువు ఈతాసీల్దారు ఒక్కడే. ఆ తాసీల్దారుని వీళ్ళెప్పుడూ చూడలేదు. ఆయన వీళ్ళనెప్పుడూ ఏ కార్యానికి పిలవనూలేదు. కానీ ఆ తాసీల్దారు మాత్రం ఈ భూమిమీద ఎక్కడో ఉండడం ఖాయం. లక్ష్మి కుళాయి దగ్గర ఏవో మాటల్లో " మా బంధువొకాయన తాసీల్తారు అయన కివూరు బదిలిట అయితే బాగుండును. ఈకుళాయి నీళ్లు ప్రత్యేకం ముందుగా నేను పట్టుకునేందుకు ఏర్పాటుచేసి ఉండును. వేగలేక ఛస్తున్నాం. ఈ అలగా జనంతో---- అంటుండేది.
అలగా జనంలో తానూ ఒకర్తెనని లక్ష్మికి తెలియలేదు. అయితే లక్ష్మి నమ్మకాలూ, ఆశలూ పెట్టుకున్న మనిషి. తన భర్తకి యేనాలుగువందల ఉద్యోగమో, ఏ లాటరీ ఫస్టు ఫ్రైజో ఏదో ఒకటి అనతి దూరంలో రెడీగా వుందని అనుకుంటుంది. ఒక మేడ, ఒక మంచి కారు, రాళ్ళ నక్లైసూ అవిడ కనీసపు కోర్కెలు. కాని లక్ష్మీమోహనరావుకు ఏనాడూ పెద్ద ఆశలు లేవు. అతనికి కనీసపు సరదాలు వుండేవి. చిన్నతనంలో అతను పెద్దవాణ్ణయి పోవాలనుకునేవాడు. చిత్రం ఏమంటే నిజంగా కొన్నేళ్ళకి పెద్దవాడయిపోయాడు. నిజానికి అతనికి తీరని కోరిక ఇది ఒక్కటే. చిన్నప్పుడు కసరత్తుచేసి గామా" లా తయారవాలనుకున్నాడు. దానికి బాదంపప్పు, కోడిగుడ్డూ, మొదలైన పుష్టికరమైన ఆహారం తినాలనేవారు. బాదంపప్పు సమృద్దిగా సంపాదించుకోగలిగిననాడు కసరత్ ప్రారంభం చేయాలనుకోవడం వలన ఈనాటికి ఆ కోరిక నెరవేరలేదు. సర్కస్ అంటే అతనికి యిష్టం.నల్లకోటు వేసుకొని పొడగాటి కమ్చీని చప్పుడు చేస్తూ గుర్రాల్ని గుండ్రంగా పరిగెత్తించే వాడండే అతనికి భయం,గౌరవం అభిమానమూ కూడా.అఁతవాడవాడని ఉండేది. తన ఇంటి పెరట్లోకి వచ్చే పోయే రెండు మూడు చచ్చుకుక్కలికి మెడకి నవారుపట్టీ కట్టి వెదురు పుల్లలు ఎత్తుగా అడ్డం పెట్టి వాటిని దుమకమనేవాడు. అవి మొరిగేవి. మూల్గేవి. కరవబోయేవి. వాటిని తన చాంతాడు కమ్చితో చావకొట్టేవాడు---- అవి వెల్లకితలా పడుకుని బోరుమని ఏడ్చేవి. ఇలాగ అతనికి చిన్న చిన్న సరదాలే ఉండేవి. ఆరోజుల్లో అతను లేనివాడని ఎవరూ అనుకునేవారు కాదు. అతనికి కూడా అనిపించేది కాదు. అతని తండ్రి చేసేది గుమాస్తా ఉద్యోగమైనా తెలివిగా, సులువుగా లంచాలు పట్టగలిగిన వాడవడంవల్ల ఇంట్లో ఏ ఇబ్బందీ ఉండేదికాదు. లక్ష్మీ మోహనరావుకి చిరుతిండికి, సినిమాలకీ లోటు ఉండేదికాదు.



