Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    సీతాపతి మొహంలో చటుక్కున ఏదో శాంతి కాంతివంతంగా అలముకుంది. "వచ్చావా పద్మా" అన్నాడు మెల్లగా.

    రుద్ధమైన పద్మ కంఠం నుండి మాట రాలేదు. జవాబుగా తల వూపింది.

    గోవిందయ్య బుట్టలు తెరచి పల్ళూ, గ్లూకోజూ, హార్లిక్సూ, మందులూ మొదలైన సరంజామాని గది అలమారాలో సర్దుతున్నాడు.

    "మహా ఇల్లాలు సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆమె యెంత బెంగపడిపోయిందో. ఎంతమదిని ఎన్ని దిక్కులకు పంపించిందో. ఓహోహో యెంత అందమైన భవంతీ - నౌకర్లూ చాకర్లూ ఏం సిరీ -ఏం సంపదా - నిష్కారణంగా ఇల్లు వదలి ఈ వూరు రావడమేఁవిటీ విడ్డూరం కాకపోతే. ఇంకోరోజు ఆలశ్యమైతే ఆవిడ ప్రాణాలే వదిలేసును - రామ రామ, ట్యూషన్లు చెప్పుకుంటానంటూ ఈయన దేవిరించడమేఁవిటీ" ముసలాయన మాటలోంచి మరో మాటలోకీ, భావంలోంచి మరో భావంలోకి గంతులేస్తూ ఉత్సాహంగా చెపుతున్నాడు. వీరి సిరిసంపదలకీ, పద్మ పతిభక్తికీ ఆయన హృదయం గౌరవ పూజ్య భావాలతో నిండిపోయింది.

    సుబ్బలక్ష్మి ఎంతో నిరాశ చెందినా పద్మ అందాన్ని చూసి లోపల్లోపల మెచ్చుకోకుండా వుండలేకపోయింది. ఇదంతా సినిమాలా, కలలా వింతగా వుంది ఆమెకు.

    డాక్టరుగారు పరీక్ష పూర్తిచేసి, ఇది మామూలు ఫ్లూజ్వరమనీ, జ్వరం కన్న మానసికాందోళనవల్ల ఎక్కువగా సీతాపతి బాధపడుతున్నాడనీ, భయపడవల్సిన అవసరం ఏమీ లేదనీ చెప్పాడు. పద్మ నిట్టూర్చింది.

    "డాక్టరుగారూ ఈయన్ని కదిపి మనవూరు తీసుకు వెళ్ళొచ్చునా యింత జ్వరంలో."

    డాక్టరు నవ్వాడు "నువ్వు వచ్చాక ఇంకా జ్వరం ఎందుకుంటుందమ్మా. చల్లపడగానే సాయంత్రం బయలుదేరుదాం" అన్నాడు.

    "ఎంతమాట ఎంతమాట! ఈ పేదవాడి ఇంటికి రానే వచ్చారు. ఒకపూట ఆతిధ్యం స్వీకరించి నన్ను ధన్యుణ్నిచేసి -" ఆర్ధోక్తిలో ఆపాడు పూజారి.

    గోవింజయ్య కలిపి ఇఛ్చిన హార్లిక్సు తాగి పద్మ వొడిలో తలపెట్టుకుని నిద్రపోయాడు సీతాపతి. గదిలో ఎవరూ లేరు. పద్మ మెల్లగా విసురుతూ కూర్చుంది. కాసేపటికి సీతాపతికి మెలకువ వచ్చింది. దీర్ఘంగా ప్రేమగా చూశాడు పద్మవైపు.

    "ఎందుకిలా చేశారు మీరు?" గద్గదికంగా అడిగింది పద్మ.

    సీతాపతి ఏం జవాబివ్వలేదు.

    "ఇంకెప్పుడూ యిలా చేయరుకదూ?"

    సీతాపతి చెయ్యనని తలవూపాడు.

    డాక్టరూ, సుబ్బలక్ష్మి గదిలోకి వచ్చారు. సుబ్బలక్ష్మి చేతిలో పళ్ళెంలో పళ్లూ ఫలహారాలూ వున్నాయి.

    "అమ్మాయ్, నువ్వీ నాలుగురోజులూ నిరాహారదీక్షతో వున్నావు. నీ భర్తకన్న నువ్వు నీరసంగా వున్నావు. కాస్త ఫలహారం తీసుకుని పాలుపుచ్చుకో" అన్నాడు డాక్టరు.

    పద్మ డాక్టరు ఆదేశాన్ని పాటించింది. ఈలోగా సీతాపతి తలగడకింద వున్న డైరీ తీశాడు. మెల్లగా యిలా రాశాడు.

    "పద్మ దేవత"

    ఏం రాస్తున్నాడా అని కొంచెం వొంగి చూసిన పద్మ తృప్తిగా నవ్వింది. ఎందుకో తెలియని సుబ్బలక్ష్మి నవ్వింది. డాక్టరు నవ్వాడు.

    సాయంత్రం భర్తతో వెళ్ళిపోయేముందు పద్మావతి పూజారి కుటుంబానికి తన కృతజ్ఞతను తెలియపరిచింది. పూజారివల్ల కథ అంతా ఆమెనుందే వినివుంది. సమయానికి ఈ అర్చక మహాశయుడు తోడుగా లేనట్లయితే సీతాపతి ఏమైవుండేవాడో ఊహించటానికి కూడా ఆమె భయపడింది. పూజారికీ, పూజారిభార్యకీ నమస్కరించి సుబ్బలక్ష్మి బుగ్గలు పట్టుకుని "నీకు మంచి మొగుడు రావాలని ఆశీర్వదిస్తున్నాను. నా భర్తలాంటివాడిని కట్టుకున్నా సుఖపడేది ఏమీవుండదు . రాత్రీ పగలూ ఆయనకి ఎంతో సేవ చేశావు. లక్ష్మీ! నీ మంచితనం నీకు సౌభాగ్యాన్ని చేకూరుస్తుంది. నీ పెళ్ళికి రాగలనో లేదో, ఇప్పుడే నీకు నా కానుక ఇచ్చేస్తాను. నీ అక్కనీ, ఆమె ప్రేమనీ మరచిపోకమ్మా" అంటూ మెడలోంచి రెండుపేటల గొలుసు తీసి సుబ్బలక్ష్మి మెడలో వేసింది.

    పూజారి ఏదో అనబోయాడు. ముసలమ్మ ఏదో అనబోయింది. సుబ్బలక్ష్మి సిగ్గుగా తికమకగా చూసింది. కాని ఏమీ వినకుండా పద్మ చరాలున కారులో కూర్చోవడమూ, బుర్రున కారు కదలడమూ జరిగింది.

                                                           (జ్యోతి, 1963)

                            *******************




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.