Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"అయ్యబాబోయ్, అన్నం తినకూడదు. లంకణం వుండాలన్నాడు నాన్న"
"పోనీ అన్నం వద్దు- ఇంకేమైనా" బతిమాలుతూ చూశాడు సీతాపతి.
"జంతికలున్నాయి."
"కాసిని తెచ్చిపెట్టు"
తటపటాయించింది సుబ్బలక్ష్మి.
"ఎవరికీ చెప్పొద్దు. ఏమేనా తింటేగాని నాకు జ్వరం తగ్గదు"
సుబ్బలక్ష్మి చాటుగా రెండురోజుల క్రితం చేసిన డబ్బాలో దాచిన జంతికల్ని భక్తియుతంగా సీతాపతి చేతిలో పెట్టింది. కరకర నమిలి గ్లాసుడు మంచినీళ్ళు తాగి నిద్దరపోయాడు సీతాపతి. పద్మ వుంటే పండ్లో, రొట్టె (బ్రెడ్)గాని ఇచ్చివుండేది. కాని ఆసదుపాయాలు ఇక్కడ వీళ్ళకి తెలియవు. అర్ధంకావు అనుకున్నాడు సీతాపతి.
సీతాపతికి మెలకువ వచ్చేసరికి చీకటి పడుతోంది అతనికి తలపోటుగా దిమ్ముగా ఉంది. వొళ్ళు కాలిపోతోంది. అతనికి పరిసరాలూ, పరిస్థితులూ అన్నీ మసకగా వున్నాయి. ఆంజనేయులు వచ్చి జ్వరంచూసి నూటనాలుగు డిగ్రీలుందనడం, ముసలాయన ఆతృతగా ఏవేవో అనడం, సుబ్బలక్ష్మి తడిగుడ్డ తలమీదవేయడం - ఇవన్నీ ఎక్కడో ఎవరిని గురించో జరుగుతూన్నట్టు ఉంది సీతాపతికి.
రాత్రి సీతాపతి పక్కగానే తనపక్క వేయించుకున్నాడు ముసలాయన. సుబ్బలక్ష్మి తలాపి దిక్కున కూర్చుని తల రాస్తోంది. ముసలావిడ భయం భయంగా గుమ్మం అవతల కూర్చునివుంది. సీతాపతి అశాంతిగా నిద్రలోనే దొర్లుతున్నాడు. కలవరిస్తున్నాడు. పద్మ అంటున్నాడు. హత్య లంటున్నాడు. సందర్భంలేని ఆ మాటలకు అందరూ హడలిపోతున్నారు.
"సంధి లక్షణాలేమో" అంది ముసలావిడ.
"ఆంజనేయులుగార్ని పిలుచుకొస్తాను" అంటూ ముసలాయన కంగారుగా వెళ్ళాడు.
సుబ్బలక్ష్మి కనుకొలకులలో నీరు నిండింది. అయిదారేళ్ల నుండి తండ్రి తనకి వివాహ ప్రయత్నాలు చేసి విఫలుడయ్యాడు. ఇన్నాళ్ళక -ఇన్నేళ్ళకి తన మొగుడంటూ ఒకడు దొరికే అదృష్టం కలిగి, ఇంతలోనే వంచించబడడంలోని అవమానమూ, బాధా ఆమెని దహించి వేస్తున్నాయి. మనసులో వేయి దేవుళ్ళకి మొక్కుకుంది.
ఆంజనేయులు వచ్చి చూసి ఇంజక్షన్ ఇచ్చి ఫరవాలేదని చెప్పి వెళ్ళాడు. ముసలాయన మెలకువ వచ్చిన సీతాపతికి ధైర్యం చెప్పాడు. సీతాపతికి మళ్ళీ నిద్రపట్టింది. నిద్రలో కలవరింతలు.......
తల పట్టుతూన్న సుబ్బలక్ష్మికి తలగడ కింద డైరీ చేతికి తగిలింది. "ఏదో పుస్తకం నాన్నా" అంటూ తండ్రికిచ్చింది. ముసలాయన కళ్ళజోడు సవరించుకొని డైరీ పేజీలు పరిశీలించాడు. దీపకాంతిలో వేగంగా మారుతున్న ఆయన ముఖ కవళికల్ని సుబ్బలక్ష్మి తల్లి తదేకంగా పరికిస్తున్నారు. ముసలాయన ముఖంలో భయం, ఆశ్చర్యం పెనవేసుకున్నాయి.
"ఏమేవ్ ఏదీ నా అంగవస్త్రం యిలా పడెయ్యి" అన్నాడు తొందరగా.
"ఏం జరిగిందీ?" అంది ముసలావిడ కంగారుగా.
"ఒంటిగంటకి కాకినాడ వెళ్ళే బండి వుంది. నేను వెళుతున్నాను. ఇతగాణ్ణి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. అవసరమైతే ఆంజనేయుల్ని పిలవండి" చెప్పులు తొడుక్కుని గుమ్మంవరకూ వెళ్ళాడు పూజారి.
"ఇంత రాత్రివేళ ఈ ప్రయాణమేమిటీ, అసలేం జరిగిందీ అంట?"
"ఇతగాడికి ఇల్లూ వాకిలీ అన్నీ ఉన్నట్లే కనబడుతున్నాయి. కలవారి కుటుంబంలోంచి వచ్చాడు. నేను ముందే అనుమానించాను. ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా పీకలమీదకొస్తుంది. ఏ క్రిమినల్ కేసో వచ్చి జైల్లో కూర్చుంటాము."
పూజారి మళ్ళీ జాగ్రత్తగా సీతాపతిని సంరక్షిస్తూ ఉండమని హెచ్చరించి వెళ్ళిపోయాడు. నోరావలించి చూస్తూవుండిపోయారు భార్యా కూతురూ. ఇల్లూ వాకిలీ అన్నాడేకాని భార్య ఉందా లేదా అన్న సందేహంతో సతమతమౌతోంది సుబ్బలక్ష్మి.
మరునాడు మధ్యాహ్నం వేళకి సీతాపతి చుట్టూ కూర్చున్న ఆంజనేయులూ, సుబ్బలక్ష్మి ముసలావిడ తమ గుమ్మం ముందు కారు చప్పుడు విని ఆతృతగా వచ్చారు. ఒక పెద్దటాక్సీ ఆగివుంది గుమ్మంలో. పూజారి ముందుగా దిగాడు. వెనకాలే పద్మ, పద్మ తరువాత స్టెతస్కోపు చేత్తోపట్టుకొన్న ఫామిలీ డాక్టరూ. గుమాస్తా గోవిందయ్యా దిగారు. గోవిందయ్యా, డ్రైవరు కలిసి రెండు మూడు బుట్టల సామానూ , హోల్డాలూ వగైరాలు దింపారు.
"ఎలా ఉంది ఆయనకి?" ముసలావిడని అడిగింది పద్మ. ఆ గొంతులో ఆతృత, వేదనా యుగయుగాల్నీ దశదిశల్నీ చీల్చుకుపోగలదు.
"సీతాపతిగారి ధర్మపత్ని పద్మావతీదేవిగారు వీరు. అలా రాయిలా నిలబడ్డావేం లోపలికి వెళ్ళు" అన్నాడు పూజారి భార్యతో.
"రండమ్మా రండి -" అంది అప్పటికి అర్ధమై తేరుకున్న ముసలావిడ. "మీ ఆయనకేం భయంలేదు. ఇంక మీరేవచ్చారుగా."
ఆంజనేయులు పెద్ద డాక్టరు రావడం చూసి ఏ సందులోంచి ,ఏ నిముషంలో జారిపోయాడో ఎవరికీ తెలియదు.
సీతాపతి నీరసంగా కళ్ళెత్తి చూశాడు. ఫామిలీ డాక్టరు పరీక్ష చేస్తున్నాడు. తన తల ఏదో పరిచితమైన మెత్తని తొడమీద ఆనించి ఉండడం గ్రహించాడు. కళ్ళెత్తి పైకి చూశాడు పద్మ.- నీరసించి కృశించిన విదియ చంద్రుని రేకలాగా, వడలిన రాలిన పువ్వురేకులా - తన తలనే నిమురుతోంది. ఆమె కన్నుల వెంబడి సంతత బాష్పస్రవంతి చెక్కిళ్ళనీ, పవిటనీ తడిపివేస్తుంది.



