Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "ఖర్చులకి భయపడకండి. నావేలి ఉంగరాలు రెండూ మీరు తీసుకోండి. ఒక ఇంగ్లీషు వైద్యుడిని పిలిపించండి . తెలుగు మందులు నాకు పడవు తాతగారూ!"

    "ఎంతమాట, ఎంతమాటన్నావు నాయనా. ఈ మాత్రం దానికి మేం చెయ్యలేమూ. మేమేమైనా పరాయివాళ్ళమా, రేపు ఉదయమే ఫస్టుక్లాసు డాక్టర్ని తీసుకొస్తాను. ఆంజనేయులు సామాన్యుడుకాదు. గొప్ప హస్తవాసి ఉన్నవాడు. ఒక ఇంజక్షన్ యిచ్చాడా. జ్వరం పిలక పుచ్చుకొని లాగినట్టు చర్రున దిగిపోతుంది."

    సీతాపతి తలవూపి కళ్ళు మూసుకున్నాడు.

    "చూడు నాయనా, నీతో మనసులోమాట చెప్పకపోవడమెందుకు. మా సుబ్బలక్ష్మి వుంది చూడు మహ ఉత్తమురాలు. దానికి పెళ్ళిచేసే బాధ్యత నాదేకదా. పిల్లకి పెళ్ళిచేసి, పిల్లనీ అల్లుణ్ణీ యింట్లో పెట్టుకొని, వాళ్ళను చూసుకుంటూ రామా కృష్ణా అంటూ కాలక్షేపం చేయడమే మా అభిమతం. నీకూ ఎవరూ లేరు సుఖంగా యిక్కడే వుండిపోవచ్చును. మా పిల్ల వొళ్ళుదాచుకునే మనిషికాదు. శ్రద్దగా నిన్ను కనిపెట్టుకుని ఇంటిపనులన్నీ దివ్యంగా చూసుకుంటుంది. నెలకి వంద తక్కువ కాకుండా నీకు ట్యూషన్ల మీద జీతం వచ్చేటట్లు చూసే పూచీ నాది. ముప్ఫైయేళ్ళు పైగా యీ పూజాపునస్కారాలు చేస్తూ నలుగురిలో ఓహో అనిపించుకున్నానే కాని వేరుకాదు. మా అల్లుడు చదువుకున్నవాడు, పాఠాలు చెప్తాడు అంటే ఎగిరి వస్తారు. ఏమంటావ్ పిల్లదానిని వొంటిమీద రెండుతులాల బంగారం వుంది. కడుపున కన్నపిల్లలా చూసుకుంటున్నాం నాయనా. అంగీకారమేనా నీకు?" ముసలాయన వుండబట్టలేక తన అభిలాషని తెలియజేశాడు. సీతాపతి ఊ అంటే ఆయన జీవితాన్ని వేధించే ఒకే ఒక సమస్యకు పరిష్కారం దొరికిశాంతి సుఖాన్ని పొందగలడు. సీతాపతి చెప్పినదంతా విన్నాడో లేదో తెలియదు. జ్వర తీవ్రత, తలనొప్పి, మనసులో తెలియని కసి, దాని పక్కనే కొండంత దిగులూ -యిన్నింటితో మనస్సు మనస్సులో లేని ఒక దయనీయ పరిస్థితిలో వున్నాడు. ముసలాయన "ఏమంటావ్ నాయనా" అని మళ్ళీ రెట్టించి అడగ్గానే తలవూపాడు. ఎందుకు వూపాడో సీతాపతికి తెలియనే తెలియదు. కానీ పూజారి మొహంలో సంతోషపు వెల్తురు అలుముకుంది.

    సుబ్బలక్ష్మి వింటూండగా భార్యతో సీతాపతి అంగీకారాన్ని తెలిపాడు పూజారి. ఆవిడ సుబ్బలక్ష్మిని కౌగిలించుకుని బుగ్గలు పుణికి దీవనలు కురిపించింది.
    
    మూడవరోజు ఉదయం సీతాపతి ఇల్లువదలి రెండు రోజులు పూర్తి అయాయి -ఉత్సాహంలాంటి లేత ఎండ ఇళ్ళమీద, చెట్లమీదా, పొలాలమీదా, సీతాపతి పడుకున్న కిటికీ అంచులమీదా సమబుద్దితో ప్రసరించినా, గ్రామం అంతా చైతన్య కోలాహలంలో మునిగివున్నా సుబ్బలక్ష్మి తలదువ్వుకుంటూ పాటలు పాడుకుంటున్నా ఒక్క సీతాపతి మాత్రం ఆ ఆనందాన్ని పంచుకోలేకపోయాడు. పైగా బరువుగా మూలిగాడు. జ్వరం ఏమాత్రం తగ్గలేదు. అతనికి వొంటిమీద ఎవరో కాల్చిన ఇనుప కడ్డీలతో వాతలు పెడుతూన్నట్టు వుంది. సుబ్బలక్ష్మి తీసుకొచ్చి యిచ్చిన కాఫీ చేదుగా హాలాహలంగా వుంది. మరి కాసేపటిలోనే పూజారి ఇంగ్లీషు వైద్యుడు ఆంజనేయులుని తీసుకొచ్చాడు.

    "చూడు నాయనా. డాక్టరుగారు వచ్చారు" అన్నాడు పూజారి.

    సీతాపతి కళ్ళు తెరిచాడు . ఎదురుగా పంచెకట్టుమీద రంగుచొక్కా దానిమీద  ఇంకో రంగుకోటూ, చేతిలో స్టెతస్కోపూ, మరో చేతిలో మందులు సంచితో ఆంజనేయులు కనిపించాడు. గుబురుగా పెరిగిన కనుబొమ్మలూ, లావాటి పెదవులూ, సగం బట్టతలా, సన్నంగా మనిషీ, చాలా అసందర్భంగా వదులుగావున్న అవయవాలూ.

    సీతాపతి నీరుకారిపోయాడు.

    ఆంజనేయులు నవ్వుతూ "మీకు ఏవైద్యం కావాలి" అని అడిగాడు.

    ప్రశ్నార్ధకంగా చూశాడు సీతాపతి.

    "ఆంజనేయులుగారు ఇంగ్లీషు వైద్యమొక్కటే కాదు. నాయనా, హోమ్యోపతీ, ఆయుర్వేదం, యునానీలో కూడా సిద్దహస్తులు. ఏమైనా ఇంగ్లీష్ వైద్యానికే గిరాకీ యిక్కడ. నాలుగేళ్ళు పట్నంలో కాంపౌండరుగా వుండి వైద్యంలోని మెలకువలన్నీ గ్రహించేశారు. మహ సూక్ష్మ బుద్ధి. గ్రామం అంతా వైద్యానికి వీరిమీద ఆధారపడి వుంది. పది పదిహేనేళ్ళు అనుభవం వుంది."

    సీతాపతి నిస్పృహతో తలవూపాడు. కాకినాడలో పెద్ద డాక్టర్లందరూ ఈపాటికి తన పాదాల దగ్గరుండేవారు కదా అని లోపలే వాపోయాడు.

    ఆంజనేయులు భయంలేదని చెప్పి మాత్రలిచ్చి, తగ్గకపోతే యింజీషన్ (ఆంజనేయులు అలానే ఉచ్చరిస్తాడు) యిస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

    మధ్యాహ్నం వేళకీ సీతాపతికి నీరసంగా ఆకలిగా అనిపించింది. గుమ్మం అవతల సుబ్బలక్ష్మి కుంపటి అంటించి సీతాపతి తాగడానికి వేడినీళ్ళు కాస్తోంది. "అమ్మాయ్" అని పిలిచాడు. సుబ్బలక్ష్మి పవిట సవరించుకొని కాస్త దూరంగా నిలబడింది.

    "నాకు ఆకలేస్తోంది" అన్నాడు మెల్లగా.

    "కాఫీ కాచి తీసుకురానా?"

    "వద్దు నాకు తినేందుకేమైనా కావాలి."
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.