Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
"డియర్ చెంగల్రావ్!
నీకూతురిప్పుడు నవయవ్వనంలో ఉంది. నువ్వు చేసిన ఒక తప్పుకు నీ యవ్వనం వృధా చేశాను. అయితే అంతటితో నా పగ తీరదు. నవయవ్వనంలో ఉన్న నీ కూతుర్ని నీ స్నేహితుడు డియస్పీ ఇందుభూషణ్ ఉంటున్న ఊళ్ళో వ్యభిచారం కొంపలకమ్మేశాను. ఒక్కసారి నా భార్యను పాడు చేసినందుకు ప్రతిఫలంగా యెన్నోసార్లు పదవుతోంది నీ కూతురు. చేతనైతే వెళ్ళి నీ కూతుర్ని తెచ్చుకో. అక్కడ ఆమె కోసం నువ్వు వెతకాల్సిన ప్రదేశాలు రెండే రెండు. మందిరం వీధి, ఎలక్ట్రానిక్ హవుస్.
ఎన్నో ఏళ్ళుగా దగ్గర లేకపోయినా నీ కూతుర్ని నువ్వు గుర్తు పట్టగలవనే అనుకుంటున్నాను.
-- విష్ యూ బెస్టా ఫ్ లక్...."
ఉత్తరం ఇందు భూషణ్ చేతుల్లో నలిగింది. అయన పళ్ళు పటపట కొరుకుతూ -- "రాస్కెల్ -- వీడికెంత ధైర్యం?" అన్నాడు.
"ఏది ఏమైనా నా కూతురు కోసమే నేనిక్కడకు వచ్చాను. నా ప్రయత్నం ఫలించలేదు. కానీ ఆ ప్రయత్నంలో మందిరం వీధిలోని యువతుల పాట్లు చూశాను, వాళ్ళందరిలో నా కూతురినే చూడగలిగాను. నా హృదయం ద్రవించి పోయింది. వాళ్ళందర్నీ అక్కణ్ణించి రక్షించాలనుకున్నాను. అందుకే మన పరిచయం రహస్యంగా ఉంచాను. మందిరం వీధి గుండాలకు చాలా పెద్ద పరిచయాలున్నాయి. వాళ్ళను జైల్లో కి తోయాలంటే హటాత్తుగా పోలీసు దాడి జరగాలి. నువ్వు సాయపడ్డావు...." అన్నాడు చెంగాల్రావు.
"ఇంతకూ నీ కూతుర్నెలా గుర్తు పట్టాలనుకున్నావు?"
"దానికి గుండె ల పైన బొటన వ్రేలంతా -- కుడి మోకాలుకు బాగా పైగా చిటికెన వేలంతా రెండు మచ్చలున్నాయి అవే దానికి గుర్తు ...."
"అయితే మీ అమ్మాయి గుర్తులు మాములుగా తెలుసుకోవడం కష్టం ..." అన్నాడు ఇందు భూషణ్ సాలోచనగా.
"అయినా నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నాను. అనుమానం తగిలిన ఏ యువతిని వదలలేదు . చాలామంది ఆడవాళ్ళకు నేనేంటే దురభిప్రాయం కూడా ఏర్పడింది. అయినా నేను వాళ్ళకు అసలు కధ చెప్పలేదు. అది వింటే యెవరూ నమ్మరు. కొబ్బరి చెట్టు దూడ గడ్డి కోసం ఎక్కానన్నాట్లుంటుంది-- కదూ?"
ఇందుభూషణ్ నిట్టూర్చి --"పోలీసు డిపార్ట్ మెంట్లో ఉండి కూడా నేనేమీ సాయం చేయయలేకపోయాను నీకు"అన్నాడు.
"విచారించకు . నా కూతురు నాకింక దొరకదు. మందిరం వీధిలోని యువతులకు విముక్తి కలిగించేక నా మనసు కెంతో తృప్తి కలిగింది. ఆ పుణ్యమే నా కూతురిని కాపాడుతుంది. నేనింక దాని కోసం అన్వేషించను. ఈ అన్వేషణ పేరు చెప్పి నేను కొందరు సంసార స్త్రీల కిబ్బందికి గురి చేస్తున్నాను...." అంటూ అరుణ విషయం చెప్పి --"ఎలక్ట్రానిక్ హహుస్ లో వాకబు చేశాను. అరుణ ఆ సంస్థకు సంబంధించిన యువతి కాదు, నాకు చెప్పబడిన యువతి యిచ్చిన అడ్రసు ను నేను తప్పుగా అర్ధం చేసుకున్నాను. ఆమె ఉంటున్నది శ్రీ శ్రీ దుర్గాలాడ్జి లోనట. శ్రీ దుర్గాలో కాదు.....ఈ విషయం తెలిసి నేను చాలా సిగ్గుపడ్డాను....." అన్నాడు చెంగల్రావు.
జరిగినదంతా విని --"నీ కధ చాలా తమాషాగా వుంది. నీ పద్దతిని బట్టి నీవు నీ కూతురి నన్వేషిస్తున్నావని యెవరూ అనుకోరు. ఇంకేదైనా పద్దతి ఎన్నుకోవలసిందేమో...." అన్నాడు ఇందుభూషణ్.
"ఇంక ఏ పద్దతి గురించీ ఆలోచించను. జరిగింది చాలు...." అన్నాడు చెంగల్రావు బాధగా.
ఇందుభూషణ్ ఏదో అనబోయి ఆగిపోయాడు. మూడు ప్లేట్లలో ఇడ్లీ తీసుకుని అప్పుడే అయన భార్య శాంత అక్కడికి వచ్చింది.
14
చెంగల్రావు నెమ్మదిగా నడుస్తూ తన గది ముందుకు వచ్చి ఆగిపోయాడు. ఆలోచిస్తూ కాలింగ్ బెల్ మ్రోగించాడు.
గది తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా కనపడ్డ వ్యక్తిని చూసి ఆశ్చర్య పోయాడు చెంగల్రావు -- "ఎవరు మీరు?" అన్నాడాయన.
"గుర్తు పట్టలేదా -- నేను --- మాధవ్ ని ...."
"మాధవ్ !" అన్నాడు చెంగల్రావు. అయన గొంతులో భయం, కంగారు ఆవేదన అన్నీ ఒక్కసారి ధ్వనించాయి.
"లోపలకు రండి ...." ఆన్నాడు మాధవ్.
చెంగల్రావు తలుపు వేసి చటుక్కున మాధవ్ కాళ్ళ మీద పడిపోయి ---" నా కూతుర్ని నాకప్పగించు. నా యావదాస్తీ నికిచ్చేస్తాను . నన్నిక వేధించకు ....అన్నాడు.
మాధవ్ ఆయన్ను లేవనెత్తి -- "బాబూ !మీ మంచితనాన్నర్ధం చేసుకోలేక చాలా హింస పెట్టాను మిమ్మల్ని . మీరేనన్ను మన్నించాలి ...." అన్నాడు.
చెంగాల్రావు తెల్లబోయాడు.
మాధవ్ చెప్పసాగాడు.
ఏ పురాణాలలో చూసినా అనాదిగా పురుషుడు స్త్రీ ఆకర్షణకు లోనై అవస్థలు పడుతున్నాడు. చెంగల్రావు భార్య పోయి బ్రహ్మచర్యం పాటిస్తూ ఏకాంతంలో మాధవ్ భార్యను చూసి ఉద్రేకం చెంది తప్పు చేశాడు. అప్పుడు తానజాగ్రత్తగా వుండడంలో కొంత మాధవ్ భార్య తప్పూ ఉంది. ఆమె తన పరిమితులు మించి ఆ యింట్లో పరాయి పురుషుడున్నాడని మరిచింది. చెంగల్రావు తన్ను తానదుపు చేసుకోలేకపోయాడు. అ తప్పును మాధవ్ క్షమించలేకపోయాడు. అంతవరకూ అంతా మానవ సహజం.
అయితే కన్న కూతురి కోసం తన కోరికలన్నీ చంపుకుని ఇంతకాలం జీవించిన చెంగల్రావులో అపూర్వమైన ప్రేమమూర్తి వున్నాడు. కూతురి కోసం అన్వేషిస్తూ తన యెదుట కనబడిన నగ్న యువతిలో తనక్కావలసిన గుర్తులు మాత్రమే వెతకగలిగిన - మహా యోగి ఉన్నాడు. ఆయనను అనుమానించి మానసికంగా హింసించిన మాధవ్ - ఇప్పుడెంతో పశ్చాత్తాపపడుతున్నాడు.
"హటాత్తుగా నీలో యింత మార్పెలా వచ్చింది?"
"ఈరోజు మీరీ ఎలక్ట్రానిక్ హవుస్ నుంచి ఓ యువతినీ రప్పించుకున్నారు. మీ పక్క గదిలోని దక్షిణా మూర్తి కి ప్రతీకారం అవకాశమివ్వాలని మీరా పని చేశారు. అతడికి యెంతో కొంత మానసిక తృప్తినివ్వాలన్నది మీ ఆశయం. అయితే దక్షిణామూర్తిలో మీకున్న ఉదాత్తత లేదు. భార్య కు అబద్దం కూడా చెప్పి తనామెను బలవంతంగా అనుభవించబోయాడు. సమయానికి నేనామెను రక్షించగలిగానంటే వేరే సంగతి. ఇది జరిగేక -- ,మీరెంత ఉదాత్తులో ఇంకా బాగా నాకర్ధ మయింది. అటుపైన మీరు మందిరం వీధి వేశ్యలకు విముక్తి కలిగించిన విధానం మీ గొప్పతనాన్ని చాటి చెప్పింది...." అన్నాడు మాధవ్.
"నా కూతురెక్కడ ?" అన్నాడు చెంగల్రావు.
"బాబూ! నేను తండ్రీ కూతుళ్ళను మరీ యింతకాలం విడదీసేటంత దుర్మార్గుడిని కాదు. మీ అమ్మాయికి ఆరేళ్ళ వయసప్పుడే మీ యింటికి పంపించేశాను. గుర్తు చేసుకోండి. సుమారు పది సంవత్సరాల క్రితం మీ యింటికి ఆరేళ్ళ పాపతో వంటమనిషి వచ్చింది నారాయణమ్మ. ఆ పాప నారాయణమ్మ కూతురు కాదు, మీ అమ్మాయి ."
"నిజం!" అన్నాడు చెంగల్రావు ఆశ్చర్యంగా.
"అవును . వంటమనిషి కూతురనుకుంటూనే ఆమెను మీరు కన్న కూతురిలా ఆదరించారు. అ మీ మంచితనమే మీ కూతురు సుఖంగా జీవించడానికి దారి తీసింది...."
"మాధవ్ ---- నీకు నేను కృతజ్ఞుడిని...." అన్నాడు చెంగల్రావ్.
"బాబూ -- నా ఆవేశాన్ని , అవివేకాన్ని మన్నించండి. మీరు ఆవేశంలో చేసిన తప్పు కంటే నా ఆవేశపు తప్పు క్షమించారానిదనిపిస్తోంది ...."
'అయితే వెంటనే మనం బయలుదేరాలి . అంతకు ముందు ఒక్కసారి పక్క గదికి వెళ్ళి అరుణకు నా తప్పుకు క్షమించమని చెప్పాలి --" అన్నాడు చెంగల్రావు .
"వాళ్ళకు మీరేమీ చెప్పక్కర్లేదు. వాళ్ళు నేను నియమించిన మనుషులే ....ప్రస్తుతం వాళ్ళు గది ఖాళీ చేసి వాళ్ళూరు వెళ్ళిపోయారు...."
చెంగల్రావు చటుక్కున ఫోన్ దగ్గరకు వెళ్ళి ఓ నంబర్ డయల్ చేసి - "ఒరేయ్ - ఫూల్ ప్లస్ రాస్కెల్ !" అన్నాడు.
"హమ్మయ్యా ! రోజంతా మా యింట్లో వుండి ఈ మాటనలేదు నువ్వు. నాకిప్పుడెంతో సంతోషంగా వుంది. ఏమిటో ఆ శుభవార్త చెప్పు " అన్నాడు ఇందు భూషణ్ అవతలి నుంచి.
"నా కూతురు దొరికింది -- మా ఊరు రా --- చూపిస్తాను ...." అని ఫోన్ పెట్టేశాడు చెంగల్రావు.
----: అయిపొయింది :-----





