Home » VASUNDHARA » Trick Trick Trick
"ఇతడిలో మీకు నచ్చిన లక్షణాలేమిటి?"
"మనిషి ఒంటరివాడు. తల్లిదండ్రులు లేరు. పైగా హత్య చేయబడ్డారు. దేశభక్తి ఉన్నది. దేశద్రోహులంటే అసహ్యం ఉన్నది. ఈలక్షణాలు చాలు నాకు. మీరే చూద్దురుగాని-నాచేతిలో ఇతడెలా రూపురేఖలు దిద్దుకుంటాడో...." అన్నాడు డీ.ఐజీ.
4
"నిన్ను సెలక్టు చేసింది పోలీస్ డిపార్టుమెంట్! నేను డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. నాపేరు చంద్రశేఖర్. కంగ్రాట్యులేషన్స్" అన్నాడు గోపీతో- అతణ్ణి ఇంటర్వ్యూచేసిన నడివయస్కుడు.
గోపీ ఆశ్చర్యంగా- "పోలీస్ డిపార్టు మెంటా? కానీ ప్రకటన అలా లేదే?" అన్నాడు.
"నేరాలు చేయడంలో మనదేశంలో ఇంతవరకూ ఎవ్వరూ కనీ వినీ ఎరుగని తెలివితేటలు. సామర్ధ్యం చూపుతున్న ముఠాలకారణంగా-ఆ ప్రకటన ఆ విధంగా చేయాల్సొచ్చింది. ఎక్కడా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండడంకోసం ఈ మారుమూల కుగ్రామంలో ఇంటర్వ్యూ జరిపాము. మాకు కావలసింది నేరస్థుల దృష్టికి ఏ మాత్రమూ అందని సామాన్యుడు...."
"అయితేనేనిప్పుడేం చేయాలి?"
"ఫిరంగిపురం తెలుసా నీకు?"
"పేరు విన్నాను-"
"ఆ ఊళ్ళో ఇద్దరు నాయకులున్నారు. ఒకడు చౌదరి, మరొకడు నాయుడు. వాళ్ళిద్దర్నీ ఆ ఊరిపేరుతోనే ఎఫ్ పీ చౌదరి, ఎఫ్ పీ నాయుడుఅంటారు. అక్కడ ఇద్దరూ చేసే చట్ట విరుద్ధమైన పనులకు అంతులేదు. కానీ వారిని ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నది. పోలీసు డిపార్టుమెంటు వారి ఆగడాలను అరికట్టలేకపోతున్నది. మేమే పథకాలు వేసినా వారు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. వారి మనుషులు కొందరు ప్రభుత్వరంగంలో కూడా ఉండి ఉండాలి. మా రహస్యాలన్నీ వారికి తెలిసిపోతున్నాయి. దేశంలోని ఎక్కడెక్కడి మా డిపార్టుమెంటు మనుషులగురించీ వారికి తెలిసిపోతున్నది. వారి ఆగడాలనుఎలాగైనా అరికట్టాలని నేను నిశ్చయించుకున్నాను. అందుకు నిన్నెన్నుకున్నాను-" అని ఆగాడు చంద్రశేఖర్.
"నన్నా?" అన్నాడు గోపీ.
"ఆశ్చర్యమెందుకు?" అన్నాడు చంద్రశేఖర్.
"నేను సామాన్యున్ని. పిరికివాణ్ని. హంతకుడు నా కళ్ళెదుటే నా తల్లిని చంపుతూంటే ఆవేశానికి బదులు భయాన్ని గుండెల్లో నింపుకున్న వాణ్ణి. మీ డిపార్ట్ మెంటులో సమర్దులూ, శుశిక్షితులూ ఎవ్వరూ చేయలేని పని నావల్ల ఎలా అవుతుంది?" అన్నాడు గోపీ.
"అసామాన్యమైనవి సామాన్యమనీ, సామాన్యమైనవి అసామాన్యమనీ ఒకోసారి అనిపిస్తూంటుంది. లేనిపక్షంలో అటు పోలీసుబలగం, ఇటు ప్రభుత్వం-నాపక్షాన ఉండగా నేనా స్మగ్లింగ్ ముఠాలను పట్టుకుని బంధించలేకపోవటం ఎలా జరుగుతుంది?" అన్నాడు డీ ఐజీ.
"స్మగ్లింగ్ ఎలా జరుగుతోంది?"
డీ ఐజీ నవ్వి అతడిని ఒక గదిలోకి తీసుకునివెళ్ళి- "ఇప్పుడు నీకు కొన్ని వీడియోలు చూపిస్తాను-"అన్నాడు.
గోపీ మాట్లాడలేదు. అతడికి మతిపోయినట్లయింది. తానేమిటి?ఫిరంగిపురం ముఠాల ఆగడాలను అరికట్టడమేమిటి?
గోపీ కనులముందు ఒక టెలివిజన్ ఆ టెలివిజన్లోని తెర ఉన్నట్లుండి ప్రకాశవంతమయింది.
వాచీల్లో, పెన్నుల్లో, ఉంగరాల్లో, కళ్ళజోళ్ళలో, కాలిబూట్లలో-మత్తుపదార్ధాలు! విదేశాలకు రహస్యంగా బస్తాల్లో యురేనియం సరఫరా! బంగారు ఇటికెలు ఒకదేశం నుంచి మరోదేశానికి!
చిత్రవిచిత్రమైన స్మగ్లింగ్ ఆపరేషన్సు చూశాక- "అన్నీ మీకు తెలుసు. అయితే మీరెందుకుపేక్షిస్తారు...." అన్నాడు గోపీ.
"స్మగ్లింగ్ కేంద్రస్థానం ఫిరంగిపురం. అక్కడి నుంచే ఆజ్ఞలు జారీ అవుతాయి. అయితే ఎక్కడ ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు. అందుకు ప్రజల సహకారం కావాలి. ఫిరంగిపురం వాస్తవ్యులెవరూ పోలీసులకు సహకరించరు-"
గోపీ చిరాగ్గా-"పోలీసులకు ప్రజల సహకారమెందుకు? వారికి అధికారముంది. తలచుకుంటే ఏమైనా చేయగలరు?" అన్నాడు.
"డిపార్టుమెంట్లోని వ్యక్తులు ఫిరంగిపురంలో అడుగుపెట్టిన ఇరవై నాలుగ్గంటల్లో ఫినిష్! అసలు ఫలానావ్యక్తిని పంపిద్దామనుకునేసరికి వాళ్ళకు తెలిసిపోతోంది. ఆ వివరాలు నీకు మరోవీడియోలో చూపిస్తాను...." అన్నాడు చంద్రశేఖర్.
మళ్ళీ గోపీ ముందున్న టెలివిజన్ స్క్రీన్ ప్రకాశవంతమయింది. అతడు కుతూహలంగా ముందుకు వంగాడు.
* * * *
ఇన్ స్పెక్టర్ మోహన్ ఫోన్ ఎత్తి - "హలో - ఇన్ స్పెక్టర్ మోహన్ స్పీకింగ్-" అన్నాడు.
"మిస్టర్ ఇన్ స్పెక్టర్ - మీ మనిషి డిటెక్టివ్ వేణు రేపు ఫిరంగిపురం వస్తున్నాడు. ప్రాణాలమీద ఆశఉంటే అతనినక్కడకు రావద్దని చెప్పండి-"
"హలో-ఎవరు మీరు?"
"డిటెక్టివ్ వేణు శ్రేయోభిలాషిని. అతడు ఫిరంగిపురంలో అడుగుపెడితేమాత్రం-అతడిపాలిటి యమున్ని....."
ఆ దృశ్యం మాయమై మరో దృశ్యం.
ఇన్ స్పెక్టర్ మోహన్, డిటెక్టివ్ వేణు మాట్లాడుకుంటున్నారు.
"ఇలాంటి చచ్చుబెదిరింపులకు లొంగేవాడినికాదు నేను. ఫిరంగిపురంలో కాలు పెడతాను. వాళ్ళ అంతుచూస్తాను-" అన్నాడు డిటెక్టివ్ వేణు.
"ఎందుకైనా మంచిది- అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులకు చెందని ఒక మనిషినికూడా మీతో పంపుతాను. అక్కడేం జరిగిందీ చూసి చెప్పడానికే అతడు-" అన్నాడు మోహన్.





