Home » VASUNDHARA » Trick Trick Trick
గోపీ నెమ్మదిగా-"నన్ను మీరంతా హీరో అంటారెందుకు?" అన్నాడు.
అక్కడ మొత్తం అయిదుగురు యువకులున్నాడు. అయిదుగురూ అతడి వీధిలోనివారే! వారెప్పుడూ బిజీగా, చలాకీగా ఉంటారు. అయిదుగురూ సాధారణంగా కలిసే తిరుగుతూంటారు. గోపీ వారితో కలవలేడు. అలాగని వాళ్ళతడిని వదిలిపెట్టరు. అప్పుడప్పుడు ఆటపట్టిస్తూంటారు.
"హీరో కావడానికి అన్ని లక్షణాలు ఉన్నాయినీలో!" అంటూ బదులిచ్చాడాయువకుడు.
"ఏమిటవి?"
"నీ తండ్రి హత్యచేయబడ్డాడు. నీతల్లి హత్యచేయబడింది. అప్పుడు హంతకుడిరూపం నీ కనులముందు మెదుల్తూనే ఉండాలి. పగ, ప్రతీకారం నీలో రగులుకుపోవాలి. అమితాబ్ బచ్చన్లా, ఆనాటి ఎన్టీరామారావులా, ఈనాటి చిరంజీవిలా .....నువ్వు.....నువ్వు.....హంతకుడినివేటాడాలి. ప్రస్తుతానికి నీవు ఒంటరివి. ఉద్యోగం కూడాలేదు. ఇంతకంటే ఏంకావాలి-హీరో కావడానికి...."
"నేను హీరోనుకాను కాలేను.....అన్నాడు గోపీ.
"మరేం చేస్తావ్?"
"ఉద్యోగం....."
"నీకోసం ఉద్యోగం చూడాలంటే అదేదో ప్రత్యేకమైనదే అయుండాలి. నా మాట విను-నువ్వుద్యోగం కోసం చూడకు. హీరోవైపో.....అప్పుడు నీకు మేడలుంటాయి. కార్లుంటాయి. విలస్లందరూ నీకు భయపడుతూంటారు. ప్రజలు, ప్రభుత్వం నిన్ను గౌరవించేస్తూంటారు...."
అందరూ నవ్వారు.
"నాకు ఉద్యోగమే కావాలి...." అన్నాడు గోపీ నెమ్మదిగా.
"ఉద్యోగం కావాలని ఎదురు చూస్తూండు. అలా ఏళ్ళు గడిచిపోతాయి..."
3
గోపీ బియ్యేప్యాసైనాక అయిదేళ్ళు గడిచాయి. ఇంతవరకూఅతడికుద్యోగం దొరకలేదు. తనంటున్న ఇంటిలో గది తన మటుక్కు ఉంచుకుని మిగతాభాగాన్ని అద్దెకిచ్చాడు. అదే అతడికి ప్రస్తుతంజీవనాధారం.
ఒకరోజు గోపీ పేపర్లో విచిత్రమైన ప్రకటన చూశాడు. ఒక భాగ్యవంతుడి మనుమడి సంరక్షణ ఉద్యోగం. అభ్యర్ధి గ్రాడ్యుయేటై ఉండాలి. వంటరావాలి. ఓర్పుగా పాఠాలు చెప్పగలగాలి. మనుమడుపెంకివాడు. అతడు పెట్టే బాధలకు తట్టుకుంటూ అతడిని శిక్షించగలగాలి. జీతం నెలకు అయిదువందలు.
గోపీ దీనికి అప్లికేషన్ పెట్టాడు. సరిగ్గా వారం రోజుల్లో ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది.
ఇంటర్వ్యూ ఒక కుగ్రామంలో. అక్కడికి ప్రయాణమై వెళ్ళడానికి తిన్నగా బస్సుకూడా ఏమీలేదు.
రైలు, బస్సు, జట్కా, నావ-మొత్తం నాలుగురకాల ప్రయాణసాధనాల సాయంతో గోపీ ఆ ఊరు చేరుకున్నాడు.
ఇంటర్వ్యూ ఒక పురాతన భవనంలో జరిగింది. ఇంటర్వ్యూకు మొత్తం ముగ్గురే అభ్యర్ధులు వచ్చారు. బహుశా కొందరు ప్రయాణం మధ్యలో వెనక్కుపోయుండాలి.
గోపీ ఇంటర్వ్యూగదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్దుడు, ఒక నడివయస్కుడు, ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారు.
"నీ పేరు?" నడివయస్కుడు అడిగాడు.
"గోపీ-"
"బియ్యేప్యాసయ్యావుకదూ?"
"అవును-"
"వంటెలా నేర్చుకున్నావు?"
"అమ్మా, నాన్నాలేరు, హోటల్లో తినడానికి డబ్బు చాలదు. అందుకని ఇంట్లో వండుకుంటున్నాను...."
"నిన్ను చూస్తూంటే నీ తల్లిదండ్రులకెంతో వయసుంటుందని పించదు. వారి అకాల మరణానికి కారణమేమిటి?"
"హత్య!"
నడివయస్కుడులిక్కిపడి-"హత్యా?" అన్నాడు.
"అవును-"
"ఇద్దరూ ఒకేసారి హత్యచేయబడ్డారా?"
"లేదు-" అంటూ గోపీక్లుప్తంగా వివరించాడు.
నడివయస్కుడి ముఖంలో కుతూహలం కనబడింది- "నీకు స్మగ్లింగ్ అంటే ఆసక్తి ఉన్నదా?"
"స్మగ్లింగ్ అంటే అసహ్యంనాకు-" అన్నాడు గోపీ.
"ఎందుకని?"
"ఎట్టి పరిస్థితుల్లోనూ దేశభక్తిని విడనాడవద్దని మానాన్న చెప్పాడు. స్మగ్లింగ్ దేశద్రోహులే చేస్తారు-"
"అయితే నువ్వు దేశాన్ని ప్రేమిస్తున్నావా?"
"ఊఁ"
"దేశంకోసం ఏమైనా చేయగలవా?"
గోపీ అదొకలానవ్వి- "చేద్దామన్నా ఏమీ చేతకాదు నాకు- అన్నాడు.
"నీకింకా వివాహం కాలేదు కదూ-"
"వివాహం చేసుకునే ఉద్దేశ్యంకూడా నాకులేదు-"
"ఎందుకని?"
"నాకిప్పుడు ఎవ్వరూలేరు. అందుకే ఇంకెవ్వర్నీ జీవితంలోకి ఆహ్వానించదల్చుకోలేదు-" అన్నాడు గోపీ.
"వెరీగుడ్! బయట ఎదురు చూస్తూండు. నిన్ను మళ్ళీ పిలుస్తాము" అన్నాడు నడివయస్కుడు.
గోపీ బయటకు వెళ్ళిపోయాక- "నాజీవితంలో ఇంత చచ్చుఘటాన్ని చూడలేదు-" అన్నాడు వృద్ధుడు నడివయస్కుడితో.
"మీరలాగంటే ఎలా? హి ఈజ్ సెలక్టెడ్!" అన్నాడు నడివయస్కుడు నవ్వుతూ.
"కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు-ఇతడా మీకు నచ్చింది! ఇట్స్ వెరీ బాడ్ డీ ఐజీ సాబ్-" అన్నాడు వృద్ధుడు.
"పోపుగరిటె కానీండి. మరతుపాకీ కానిండి, స్టెయిన్ లెస్ స్టీలు కానీండి- అన్నింటికీ ఇనుమే మూలకం. మహాభవంతులను, భారీ వంతెన లను నిలబెట్టే ఇనుము, రవంత ఉప్పుగాలికి చితికిపోనూగలదు. ఇనుము గొప్పది. దాన్ని మనం ఉపయోగించుకొనడంలో ఉంటుందంతా-" అన్నాడు డీ ఐజీ.





