Home » Dr Dasaradhi Rangacharya » Manavatha
చైర్మన్ కు మనఃకవాటాలు తెరుచుకున్నట్లనిపించింది. ఏదో వెలుగు-చల్లని గాలి అందులో ప్రవేశించి నట్లనిపించింది. అందరూ ఒకే నీరు తాగుతున్నారు, ఈ కులాలెందుకు? కుట్ర లెందుకు?
"అంతా ఒక్కటే"
"మానవులంతా ఒక్కటే" గునిశాడు చైర్మన్.
అది వినలేదు శకుంతల. ఆమె ధుమ ధుమ లాడుతూంది.
క్లాసులో___
"టీచర్! శారద నన్నంటుకోదు, దూరంగా వుంటుంది, కసిరికొడ్తుంది" మేరీ లేచి నుంచొని అడిగింది.
జానకి శారద దగ్గరికి వెళ్ళింది. తల నిమిరింది. "ఎందుకమ్మా శారదా! అలా చేస్తావు? తప్పుకదూ? అంతా ఒకచోట చదువుకుంటున్నారు, ఏముంది ఆ అమ్మాయి దగ్గర? ఎందుకంటుకోవు?"
శారద తల వంచుకుంది. "ఇగోనే టీచర్ మా అమ్మ చెప్పింది - వీళ్ళను అంటుకోవద్దని."
"మీ అమ్మ గాలి పీల్చదా?" నలుగురు పిల్లలడిగారు.
"మీ అమ్మ నీరు తాగదా?" మరికొందరు అడిగారు.
"శారద! తప్పమ్మా! అలా చేయగూడదు. ఇక్కడ మనమంతా ఒకటి. ఇక్కడ ఎవరూ ఎక్కువ లేదు. ఎవరూ తప్పువ కాదు."
"ఎవరూ చెప్పలేదు టీచర్ ఇంతవరకూ. ఇగోనే మేరీ అంటే నాకు చాలా ఇష్టం."
"రామ్మా , మేరీ, శారద దగ్గరకిరా."
మేరీ, శారద కౌగలించుకున్నారు.
జానకి అనమదం పట్టలేకపోయింది. కళ్ళు చెమ్మగిల్లాయి, చేతులు వాటంతట అవే చప్పట్లు కొట్టాయి.
పిల్లలంతా చప్పట్లు కొట్టారు.
చైర్మన్ కళ్ళల్లో ఆనందభాష్పాలు నిలిచాయి.
"ఏమిటా చప్పట్లు? స్కూలనుకున్నారా? గారడీ ఆటనుకున్నారా?" శకుంతల రుసరుస లాడింది. ముందుకు లంఘించ బోయింది.
"నీకు తెలిసేదంతేలే" చేయి పట్టుకుని వెనక్కు లాగాడు.
శకుంతలకు అర్ధమైంది మరొకటి -
"ఛీ, ఏమిటి స్కూల్లో! నలుగురు చూడరూ?"
చైర్మన్ శకుంతల గదివైపు అడుగు లేస్తున్నాడు - శకుంతల అనుసరిస్తూంది. అతనికి క్లాసులోంచి మాటలు వినిపిస్తున్నాయి.
"నీ దగ్గర మిఠాయి పెట్టవూ?" మేరీ అడుగుతుంది.
మిఠాయి డబ్బా తెరిచిన చప్పుడు.
"ఇదిగో మేరీ! మిఠాయి."
"మా శారద మంచిది" జానకి మాట.
"అంతా ఒక్కటే.....మనమంతా ఒక్కటే" పాటలా వినిపిస్తుంది.
గంట కొట్టారు-భోజనాల గంట.
క్లాసులో పిల్లలంతా కేకలేస్తూ పోవడానికి సిద్దపడ్డారు. జానకి వారిని ఆపింది, అన్నది__
"ఇహ మనం వేరు వేరు కాదు. మనం అంత ఒక్కటే, వేరువేరుగా టిఫిన్లు చేయం, అంతా కలిసి చేతాం, టిఫిన్ డబ్బాలన్నీ బల్లమీద పెట్టండి"
"టీచర్ నాకు టిఫిన్ డబ్బాలేదు, మా అమ్మ ఇవ్వలేదు"
"మరి?"
"ఇంతే టీచర్? రోజూ ఇంతే, నేనేం తినను"
"టీచర్! నా టిఫినుంది, మేరీ తింటుంది, నేను తినను" శారద.
"మా టిఫిన్లున్నాయి టీచర్. మేమంతా మేరీకి పెడ్తాం"
జానకి గుండె ఉప్పొంగింది. ఆమె గొంతు పూడుకుపోయింది.
"పాపలు! మీ రెంత మంచివారు! అందరం తిందాం. ఎవరూ ఆకలితో వుండోద్దు. ఉన్నదే అందరం పంచుకుందాం, తిందాం, పదండి చెట్లకిందకి."
"మా టీచర్ మంచిది, మా టీచర్ మంచిది" అని పిల్లలంతా ఆమెను అనుసరించారు, చెట్లకిందకి చేరారు. వేపచెట్ల నీడ చల్లగా వుంది, ఆకాశంలో మబ్బులు చేరాయి, పసిపాపల మనసుల్లా చల్లని గాలి వీస్తూంది.
పిల్లలంతా వలయాకారంగా కూర్చున్నారు, మధ్యన కూర్చుంది జానకి. టిఫిన్లన్నీ ఒక చోట చేర్చింది. అందరికీ పంచిపెట్టింది. తానూ తీసుకుంది, జానకి తినడం లేదు, చూస్తున్నది. ఆమెకు కడుపు నిండినట్లుంది.
కలిసి తింటున్నారు పిల్లలంతా.
కొందరు నవ్వుతున్నారు.
కొందరు ముచ్చట్లాడుకుంటున్నారు.
కొందరు ఇకిలిస్తున్నారు.
కొందరు సకిలిస్తున్నారు.
వారంతా జానకి కళ్ళలో మసలారు. ఎంత ఆనందం వట్టిపోయింది ఇంత కాలంగా! ఇందరు పాపలు కలిసి వుంటే ఎంత హాయి! వీరంతా మందారాలు. కలిసివుంటే దండలా వున్నారు. విడిగా వుంటే ఒక్కొక్క మందారం వేరు వేరు! ఇంత అందం వుండదు. ఇంత ఆనందం వుండదు అనుకుంది, జానకి మనసు నిండిపోయింది.
బెల్లు వినిపించింది.
"అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే" అంటూ పిల్లలంతా క్లాసులోకి పరిగెత్తారు.
జానకి క్లాసు గదిలో అడుగు పెడ్తోంది. ఇంతలో చప్రాసీ వచ్చి "అమ్మగారు పిలుస్తున్నారు" అని చెప్పింది. జానకి వెళ్ళింది.
శకుంతల చిరునవ్వు నవ్వింది.
జానకికి చురుక్కుమంది.
"చైర్మన్ గారు వచ్చారు. చూచావా?"
"చూళ్ళేదండీ!" గొంతులో భయం మాటల్లో కనిపిస్తూంది.
"నువ్వెందుకు చూస్తావు. చక్కగా ఉన్నావు కదూ! వారు గంట నుంచున్నారు నీ గదిముందు"
"నేను చూళ్ళేదండి"
"నీ చూపు కోసం ఆయన గంట నుంచున్నారు. నువ్వు చూడనే లేదు. మరొకరినయితే ఉద్యోగం ఊడపెరికేవారు. నువ్వంటే వారికి సరదా!"
జానకి మాట్లాళ్ళేదు.
ఆమె శకుంతలను చూస్తున్నది.
"నిన్ను చాలా మెచ్చుకున్నారు! సొగసుగా ఉన్నావన్నారు. ఆయన రసికుడు."
జానకికి ఏమీ అర్దం కావడం లేదు, గుండెలో భయం గూడు కట్టుకుంటూంది.
"నిన్ను ఇంటికి రమ్మన్నారు-వంటరిగా" కిసుక్కున నవ్వింది శకుంతల.
* * *
'భీముడు భీషణమైన ప్రతిజ్ఞ చేశాడమ్మా?'
జానకి తండ్రిని చూచింది. అతని లోకం వేరుగా కనిపించింది. తండ్రికి భారతంలోని భీముడు మాత్రమే కనిపిస్తున్నాడు. తాను కనిపించడంలేదు.
"దుశ్శాసనుదు ద్రౌపది కొప్పు పట్టుకున్నాడు. సభా మధ్యమునకు గుంజుకొని వచ్చినాడు. వలువలు వలుస్తున్నాడు. భార్య బట్టలు వలుస్తున్నాడు దుశ్శాసనుదు. మండిపోయినాడు భీముడు. పండ్లు పట పట కొరికినాడు. దుశ్శాసనుని రొమ్ము చీల్చుదునన్నాడు. వాని రక్తము త్రాగుదునన్నాడు."
జానకికి మరేవో దృశ్యాలు కనిపిస్తున్నాయి.
"నాన్నా! ద్రౌపదికి భర్త లేకుంటే ఎవరు పగ తీర్చుకునేవారు?"
ముకుందంగారు తికమకపడ్డారు. అది భారతదేశంలో లేని ప్రశ్న. ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
"అదేమిటమ్మా! అలా అడుగుతావు? ద్రౌపదికి భర్తలున్నారు కదా. లేకుంటే భారతమే ఉండేదికాదు."