Home » Dr Dasaradhi Rangacharya » Manavatha
"ఏం లేదు నాన్నా! ఊరికినే అడిగాను. భర్తల్లేకుంటే ద్రౌపదిని మానభాగం చేసినా అడిగేవాడుండడు గదా!"
"అదేమిటమ్మా! అదోలా ఉన్నావు ఇవ్వాళ?"
"ఏం లేదు నాన్నా!" కప్పులందుకొని లోనికి వెళ్ళిపోయింది జానకి.
ముకుందంగారు దుర్యోధనుని సభలో పడిపోయారు. వారికి విదురుని మాటలు వినిపిస్తున్నాయి.
ఆ రాత్రి జానకి నిద్రపోలేదు. శకుంతల చెప్పింది చైర్మన్ రసికుడని. తనను ఇంటర్వ్యూ చేసిందతనే. అలా కనిపించలేదు. శకుంతల ఎందుకలా అన్నది? తాను అందంగా ఉన్నానని సెలెక్ట్ చేశాట్ట! ఏమో! తనను రమ్మన్నాట్ట! వంటరిగా రమ్మన్నాట్ట! ఎందుకు రమ్మంటాడు? తాను ఆడది. వయసులో ఉంది. అతడు మగాడు. ఆడది కనిపిస్తే మగాడికి మరో ఆలోచన రాదా? తాను వెళ్తుంది, చైర్మన్ తనను బలవంతం చేస్తాడు. తాను కాదంటుంది. తప్పించుకుంటుంది. బయట పడ్తుంది. వాడు పగపడ్తాడు. ఉద్యోగం ఉంటుందా? ఉండదు. ఊడుతుంది. ఉద్యోగం ఊడటం ఖాయమా? ఖాయం? ముమ్మాటికీ ఖాయం. తానే ఉద్యోగం మానేస్తే.....మానేస్తే.....అవును మానేస్తే? అదే మంచిది. ఈ దేశంలో ఆడవాళ్ళను ఉద్యోగాలు చేయనీయరు. ఆడది చూస్తే అపార్ధాలు, మాట్లాడితే అపార్ధాలు. ఆడది కనిపిస్తేనే వేరే ఆలోచనలు-మానేయడమే మంచిది. మానేస్తాను అనుకుంది. అనుకోగానే తండ్రి గుర్తుకు వచ్చాడు. దరిద్రం గుర్తుకు వచ్చింది. బియ్యం ఇవ్వనన్న కొట్టువాడు గుర్తుకు వచ్చాడు. ఈ ఇల్లు తన జీతం మీద ఆధారపడి ఉంది. ఇద్దరి జీవితాలు తన జీతం మీద ఆధారపడ్డాయి. ఉద్యోగం లేకుంటే బతుకు లేదు. ఉద్యోగం వుంటే శీలం లేదు. శీలమా ?.....ఉద్యోగమా?....ఉద్యోగమా?......శీలమా?......
ధనం ఎంత బలవత్తరమయింది?
అది అన్నింటినీ హరించగలదు!
హరించడం దాని స్వభావం.
భరించడం బ్రతుకు స్వభావమా?
కాదు; కారాదు; ఎదిరించాలి! ఎదిరించి గెలవాలి. ఎదిరింపు! గెలుపు!! పిచ్చి పదాలు. గెలుపు అధికారానిది. గెలుపు సంపదది. మనిషి గెలిచిందెప్పుడు? ఎప్పుడు గెలిచాడు మనిషి? మంచి నిలిచిందెప్పుడు! న్యాయం గెలిచిందెప్పుడు? గెలిచేది బలం. బలం గెలిచింది. శక్తి గెలిచింది. అంటే? తాను ఓడినట్లేనా? ఈ ఓటమి ఎవరిది? ఇది స్త్రీత్వానికి ఓటమి! మనిషికి ఓటమి. మంచికి ఓటమి! ఓడుతుందా తాను! కాదు-గెలవాలి. జయించాలి చీకట్లను జయించాలి దానవత్వాన్ని!
గెలుస్తుందా తాను?
చిరునవ్వు నవ్వుకుంది జానకి.
ఆ రాత్రి నిద్రలేదామెకు.
మర్నాడు చైర్మన్ గారింటికి బయలుదేరింది. బోనులోకి పోతున్నట్లనిపించింది. పద్మవ్యూహంలో జొరబడుతున్నట్లనిపించింది. గుండె దడ దడ లాడుతూంది. కాళ్ళూ, చేతులూ వేళ్ళాడబడుతున్నాయి. చైర్మన్ ఇల్లు వచ్చేసింది. వరండాలో ఎవరో నలుగురు కూర్చుని ఉన్నారు, అంతా మగవాళ్ళే. వాళ్ళంతా ఆమెను చూచారు. వాళ్ళు వింతగా చూస్తున్నట్లనిపించింది. ఒక కుర్చీ కాళీగా వుంది. దూరంగా లాక్కుంది. కూచుంది. తల వంచుకుని కూర్చుంది. గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంది. భయం భయంగా ఉంది. గుబులు గుబులుగా ఉంది.
ఏమిటీ భయం? ఏమిటీ గుబులు? ఏమిటీ నీరసం? ఎందుకీ ఆరాటం? తాను ఓడటానికి రాలేదు. పోరాటానికి వచ్చింది. గెలవడానికి వచ్చింది. తాను బలం పుంజుకోవాలి. భయాన్ని పారదోలాలి. అవును తాను శక్తికావాలి. ఆదిశక్తి కావాలి. గుణపాఠం నేర్పాలి. గెలవాలి.
లోపల్నుంచి ఒకరు వచ్చారు. జానకిని చూశారు. వెళ్ళిపోయారు. మరొకతను లోనికి వెళ్ళాడు. చూచింది జానకి. తాను లోనికి వెళ్ళాలా? వంటరిగా వెళ్ళాలా? నలుగురితో ఎందుకు మాట్లాడడు చైర్మన్? వీళ్ళు ముగ్గురూ వెళ్ళిపోతారు గానాల్ను! అప్పుడు తాను వెళ్ళాలి లోనికి వంటరిగా. తలుపు వేస్తాడేమో! ఇంట్లో ఎవరన్నా ఉన్నారా? కేకలేస్తే పలుకుతారా? ఎందుకు పలకరూ? పలకరా-తాను గొంతు నులిమేస్తుంది. ఒక హత్య జరుగుతుంది. కోర్టులో తనను హాజరు పరుస్తారు. మాన రక్షణకు హత్య చేశానంటుంది!
లోనికి వెళ్ళినవాడు వచ్చేశాడు. ముగ్గురూ లోనికి వెళ్ళారు. చూచింది జానకి. ఇహ తనవంతే. తానే వెళ్ళాలి. వెంట ఎవరయినా ఉంటే బావుండును. తండ్రిని రమ్మనాల్సింది. అతనూ వస్తాననలేదు. ఎందుకనలేదు? వంటరిగా పంపుతాడా తనను? ఆ మాత్రం తెలీదు-అంత పెద్దవాడైనాడు! తండ్రిమీద కోపం వచ్చింది. మనసులో తిట్టింది. మళ్ళీ అనుకుంది-ఏమిటీ ఆడది! ఎప్పుడూ ఒకరిమీద ఆధారపడాల్సిందేనా? తాను వచ్చిందెందుకు - పోరాటానికి-గెలవడానికి! ఎందుకిలా అనుకుంటోంది?
లోనికి వెళ్ళిన ముగ్గురూ వచ్చేస్తున్నారు, వచ్చేశారు. జానకి లేచి నుంచుంది. వధ్యస్థలానికి బయల్దేరినట్లుంది ఆమెకు. అడుగు ముందుకు పడ్డంలేదు. చైర్మన్ కనిపించాడు. వస్తున్నాడు బయటికి. ఇక్కడే కూర్చుంటే బావుండును. వీధికి దగ్గరగా ఉంటుంది, అరుస్తే వినిపిస్తుంది.
"నమస్కారం జానకిగారూ" చైర్మన్ గుమ్మంలో నుంచొని నమస్కరించాడు.
మనిషి సౌమ్యంగా కనిపిస్తున్నాడు, ముఖం ప్రసన్నంగా వుంది. 'ఏమిటీ మనిషి? ద్రోహం చేయగలడా? గోముఖవ్యాఘ్రం, వల పన్నుతున్నాడు' అనుకుంది, నమస్కరించింది.
"రండీ" అని పిలిచాడు.
జానకి యంత్రవత్తుగా అడుగులు వేసింది. వరండాలో కూర్చుని మాట్లాడండి అందామనుకుంది, అనలేకపోయింది. మెదడు పనిచేయడంలేదు. సాగిపోయింది. గది వచ్చింది. అది పెద్దగది. వరండాలాగే వుంది.
"కూర్చోండి" అని కుర్చీ చూపించాడు చైర్మన్.
ఆమె కూర్చుంది, అతడు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. దూరం చాలావుంది ఇద్దరికీ. మధ్యన టీపాయ్ ఉంది. దానిమీద ఫ్లవర్ వాజ్ ఉంది, దాన్లో గులాబీ లున్నాయి కొమ్మల సహితంగా, అందంగా ఉన్నాయి పూలు___ముళ్ళున్నాయి. కొమ్మలకు!
"కాఫీ తీసుకుంటారా, కూల్ డ్రింకా?"
"జానకి చైర్మన్ను చూసింది, ముఖంలో ఎక్కడా చిలిపితనం కనిపించలేదు. శాంతంగా ఉన్నాయి కళ్ళు-వాటిల్లో ఆదరం కనిపించింది. శకుంతల అలా అంటుందేం?
ప్రవర్తన వ్యక్తినిబట్టి ఉంటుందేమో!
"ఎందుకండీ మీకు శ్రమ?"
"బాగా చెప్పారు, నాకు శ్రమేమిటి?" కుర్రాణ్ణి పిలిచి కాఫి తెమ్మన్నాడు.
"మతాలను గురించి మీరు చెప్పిన మాటలు నాకు బాగా నచ్చాయి, ఎంత బాగా చెప్పారండీ మీరు! మతాలన్నీ మంచికే పుట్టాయి, మనిషిలో మంచిదనాన్ని పెంచడానికి పుట్టాయి."
"మహాపురుషులందరూ అందుకే పుట్టారు, మనిషిలోని మానవత పెంచడానికి అవతరించారు, వారు చెప్పిపోయినవి గొప్ప సందేశాలు. వీళ్ళు వాటిని మింగేశారు. మతాలపేర మానవులను చీలుస్తున్నారు."
కాఫీ తీసుకొని ఒక స్త్రీ ప్రవేశించింది. ఆమె కాఫీ ముందు జానకికి అందించింది. కాఫీ అందుకుంటూ చైర్మన్ పరిచయంచేశాడు ఆమె తన భార్య శాంత అని. జానకి నమస్కరించింది. శాంతను జానకికి పరిచయం చేశాడు. శాంత జానకి పక్కన కూర్చుంది.
"శాంతా! మతాల మూర్ఖత్వాన్ని గురించి పండు వలిచి అందించినట్లు. చెప్పారు జానకి-చెప్పాగా రాత్రి! మనమంతా ఒక్కటే, మానవులంతా ఒక్కటే, మనం కాట్లాడుకోవద్దు, కొట్లాడుకోవద్దు అనేది వింటుంటే మనసు పులకరించిందనుకో, నీకు పరిచయం చేయింతామని ఇంటికి రమ్మన్నాను."