Home » Dr Dasaradhi Rangacharya » Manavatha
"వెళ్ళొస్తా నాన్నా" అని బయలుదేరింది-ఆర్డరు పట్టుకొని, పైట సర్దుకొని.
"నేనూ వస్తానమ్మా" అని కర్ర అందుకొని బయల్దేరారు ముకుందంగారు.
"ఎందుకు నాన్నా మీకు శ్రమ? వెళ్ళొస్తాగా?"
"వస్తానమ్మా! వస్తాను. పెళ్ళిచేసి అత్తవారింటికి పంపాల్సిన కూతురును ఉద్యోగానికి పంపుతున్నాను. వస్తానమ్మా. దిగబెట్టి వస్తాను."
ఇద్దరూ స్కూలుకు చేరుకున్నారు. హెడ్ మిస్ట్రెస్ గదికి వెళ్ళారు. కూతురును ఆమెకు అప్పగించారు.
"ముకుందంగారూ! బాధపడకండి. ఆడపిల్లల్ని ఇంకా అబలలు అనుకోకండి. వాళ్ళూ బలం పుంజుకుంటున్నారు. జానకి సొగసైన పిల్ల. పెళ్ళి విషయం దిగులు పడకండి, ఎవడో వచ్చి అలా ఎగరేసుకు పోతాడు." అంది హెడ్ మిస్ట్రెస్ పరిచయాలయ్యాక, ముకుందరావుగారు బాధపడుతూ వుంటే.
ఆయన శలవుతీసుకుని వెళ్ళిపోయారు. జానకి వెళ్ళిపోతున్న తండ్రిని చూస్తున్నది.
"ఏమిటలా చూస్తున్నావు?" శకుంతల మాటలు విని లోకంలోకి వచ్చింది. జానకి.
"ఇలా చూసిన వాళ్ళను చాలామందిని చూశాను. ఒక అబ్బాయి దొరికాడంటే చాలు-అటే, అయ్యసంగతి ఎత్తనే ఎత్తరు. ఆ మోజులోనే పడిపోతారు"
జానకికి ఏమీ అర్ధం కాలేదు. రెప్పవాల్చలేదు. శకుంతలను తేరిపారచూచింది.
శకుంతల నడివయసు మనిషి, ముదిరిపోతున్న వయసు అగపడకుండా అలంకరించుకుంది. నెరిసిన వెంట్రుకలు కనిపించకుండా జాగ్రత్తపడింది. అయినా అక్కడక్కడా మేమున్నామని తలెత్తిచూస్తూనే వున్నాయి వెండి వెంట్రుకలు. ఆమె కళ్ళలో తీరని ఆశలు కనిపిస్తుంటాయి. అవి బుసలు కొట్టవు, కాని గూళ్ళు కట్టుకుని కాపురం వుంటాయి. ఆమెకు ఆడపిల్లలంటే ఇష్టం. అందమైన వాళ్ళంటే ఈను. ఆమెకు చరువు అంతగారాదు, సంస్కారపు జాడ తెలియదు. పెత్తనం అంటే ఆమెకు ప్రాణం. దబాయించగలదు, ఆమె మాట నెగ్గించుకోగలదు. తెలివైంది. అందుకే ఆమెకా ఉద్యోగం వచ్చింది!
"నీ కేవరైనా పెద్దలు తెలుసా?" శకుంతల అడిగింది.
"ఉహుఁ, తెలియదు." జానకి తలెత్తి జవాబిచ్చింది.
"చైర్మన్ గారూ?"
"తెలియదు."
"మరి ఉద్యోగం ఎలా వచ్చింది?"
"ఇంటర్వ్యూకు పిలిచారు, వెళ్ళాను, ఏవో ప్రశ్నలడిగారు, చెప్పాను, ఆర్డరు వచ్చింది."
"నమ్మను, ఆయన సరసుడు" అంది నవ్వుతూ.
ఆ నవ్వు వికటంగా, కటువుగా, కర్కశంగా వుంది.
జానకి తల దిమ్మెక్కింది. అక్కన్నుంచి చప్పున వెళ్ళిపోవాలనిపించింది. ముళ్ళలో వున్నట్లుందామెకు.
శకుంతల గంట మోగించింది. చప్రాసీ వచ్చి నిలిచింది.
"ఈమెను ఒకటో తరగతికి తీసికెళ్ళు."
చప్రాసీ వెంట నడిచింది జానకి. తరగతిలో ఎవరూ లేరు. పిల్లలు నానా రభస చేస్తున్నారు. జానకి చూచారు , ఆమె టీచరని గుర్తించారు. కాసేపు నిశ్శబ్దంగా వున్నారు.
జానకి కుర్చీలో కూలబడ్డది. ఆమెకు శకుంతల మాటలే గుర్తుకు వస్తున్నాయి.
సాయంత్రం తనకోసం తిరిగి తండ్రి వచ్చాడు. ఆయనతో నడుస్తూ శకుంతల ధోరణి తండ్రితో చెప్పాలనుకుంది. ఆలోచించింది. తాను చెపుతుంది. తండ్రి ఉద్యోగం వద్దంటాడు. అప్పులవాళ్ళు; బియ్యంలేని ఇల్లు, చెప్పరాదనుకుంది.
8
క్లాసు గది బల్లమీద గ్లోబు వుంది. జానకి పాఠం చెబుతూంది.
"ఇది భూగోళం. భూమి గుండ్రంగా వుంది-నారింజ పండులా భూమి గుండ్రంగా తిరుగుతూంది. ఇదిగో ఇలా- బొంగరంలా" అని గ్లోబును తిప్పి చూపింది.
పిల్లలు ఆసక్తిగా వింటున్నారు.
"ఈ భూగోళంలో అనేక దేశాలున్నాయి. అన్ని దేశాల్లోనూ మనుషులుంటారు, మానవులుంటారు, బాలురుంటారు. కొన్ని దేశాల పిల్లలు నల్లగా ఉంటారు, కొన్ని దేశాలవారు తెల్లగా వుంటారు. ఇది చర్మపు రంగు మాత్రమే! అందరికీ మన లాగే గుండె వుంటుంది, అందరికీ మనలాగే రక్తం వుంటుంది. అందరికీ మనలాగే ఆకలి అవుతుంది-దాహం అవుతుంది. అందరూ ఆహారం తీసుకుంటారు, అందరూ నీళ్ళు తాగుతారు. అన్ని దేశాల బాలలూ ఆడుకుంటారు. ప్రపంచం మొత్తంలో మనుషులున్నారు. మనుషులంతా ఒకటే, మానవులంతా ఒకటే -బాలులంతా ఒకటే. బాలికలంతా ఒకటే."
చైర్మన్, హెడ్ మిస్ట్రెస్ వచ్చారు. వాకిట నిలిచారు. జానకి పాఠం చెప్పడంలో మునిగిపోయింది, వారిని చూడలేదు.
భారతంలో అర్జునికి పక్షి తప్ప మరేమీ కనిపించలేదు.
జానకికి పిల్లలు తప్ప మరేమీ కనిపించలేదు.
శకుంతలకు తల కొట్టేసినట్లుంది, చైర్మన్ వస్తే బయట నిలబెడుతుందా జానకి? ఆమె చిరచిర లాడింది, రుసరుస లాడింది. ఆమెకు పాఠం వినిపించడం లేదు, పిల్లలు కనిపించడంలేదు, జానకికి చెబుదామనుకుంది, ఆమెను బెదిరింతా మనుకుంది. చైర్మన్ వారించాడు.
చైర్మన్ జానకిని చూచాడు, బాగనిపించింది. పాఠం విన్నారు, చాల బాగనిపించింది, ఆయనకు చప్పున ఏదో స్ఫురించింది. మానవులంతా ఒకటే, ఎంత బావుందా మాట, మాట పాటలా వుంది, మాటలో ఏదో అనుభూతి వుంది, అనుబంధం వుంది, ఈ బంధాలు ఎందుకు తెగుతాయి? యుద్దాలు ఎందుకు వస్తాయి? రక్తపాఠం ఎందుకు జరుగుతుంది. వీటికి సమాధానాలు వస్తాయేమోనని వినసాగారు, గుమ్మానికి పక్కగాచేరి వినసాగారు, జానకి కంటపడకుండా వినసాగారు.
ప్రపంచం అంటే ప్రజలు.
ప్రపంచం అంటే బాలలు.
"ప్రపంచం అంటే ఏమిటి?" అని అడిగింది జానకి.
"ప్రపంచ మంటే ప్రజలు-ప్రపంచం అంటే బాలలు" పిల్లలు ముక్తకంఠంతో అన్నారు.
అదేదో నినాదం అనిపించింది చైర్మన్ కు.
అదేదో ఆనందంలా ధ్వనించింది.
"మనమంతా ఒక్కటే! బాలులందరూ ఒక్కటే; అయిన మనలో కొన్ని మతాలున్నాయి, అవన్నీ అసలు మన మంచికే పుట్టాయి. బుద్ధుడు, జీసస్, మహమ్మద్ అంతా ఒకటే చెప్పారు. మనిశిని ప్రేమించమన్నారు, మంచిని పెంచుకోమన్నారు, మనమంతా ఒక్కటే, మానవులంతా ఒక్కటే. మనం కాట్లాడుకోవద్దు, కొట్లాడుకోవద్దు, మనం ఏం చేయరాదూ?"
"కాట్లాడుకోవద్దు. కొట్లాడుకోవద్దు" బాలలు కోరస్ గా చెప్పారు.
చైర్మన్ కు అది సంగీతంగా వినిపించింది. ఆ రమ్యమైన అనుభూతి కలిగింది, ఆలోచన వచ్చింది. అవును, అందరూ ప్రేమించమన్నారు. మనం ద్వేషించుకుంటున్నాం, ఎందుకు?
మనలో చాలా కులాలున్నాయి. ఒకడు హెచ్చువాడు, ఒకడు తచ్చువాడు అంటున్నారు, అది నిజం కాదు. ఒకే తీరుగా గాలిపీలుస్తున్నాం, ఒకే నీరు తాగుతున్నాం, ఒకే ఆహారం తింటున్నాం, మరి మనకెందుకు భేదాలు? ఈ భేదాలు పెద్ద లకు. మనమంతా ఒక్కటే! మానవులంతా ఒక్కటే!"
"మనమంతా ఒక్కటే.
మానవులంతా ఒక్కటే!" పిల్లలంతా ఏకంగా అన్నారు.