Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"ఊ" అన్నాడు సీతాపతి.
సుబ్బలక్ష్మి ఇచ్చిన కాఫీ నోట్లో పోసుకుని తెల్లబోయి ఆమెకేసి చూశాడు.
"కాఫీ అండి"
ఈ ద్రవాన్ని ఏమని పిలిచినా అతనికి బాధలేకపోవును. కాని బాధనీ కాఫీనీ గుటకవేశాడు తప్పనిసరిగా.
"బావులేదా?" అంది పెళ్ళికూతురు సిగ్గుగా.
"బావుంది" అన్నాడు ఆ రుచిని నోట్లో అనుభవిస్తూ.
"మరికాస్త కలిపి తీసుకురానాండీ?"
"వద్దు వద్దు" అన్నాడు కంగారుగా.
కాఫీతాగి తలెత్తి చూశాడు. తలుపుచాటునే ఉందామె.
"మీరింక బట్టలేమీ తెచ్చుకోలేదా?"
"లేదు-" సీతాపతికి తన పొరపాటు తెలిసింది. కట్టుబట్టలతో ఇల్లు వదిలి వచ్చేశాడు.
"రాత్రి విప్పేసిన మీ పంచె, లాల్చీ ఉతికి పెట్టనా?" అంది సుబ్బలక్ష్మి సీతాపతి రేగిన జుట్టునీ, తెల్లని వొంటినీ చూస్తూ, ఆప్యాయంగా.
"ఊ" అన్నాడు సీతాపతి. ఈ కించిత్పరిచిత కన్యమీద అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది.
సీతాపతి ఊళ్ళోకి వెళ్ళి రామకోటిని గురించి, ట్యూషన్ల గురించీ వాకబు చేదామనుకున్నాడు. ఈ పూజారి ఇంట్లో తిష్టవేయడం ఎంత నిర్లజ్జాకరమో అతనికి తెలియకపోలేదు. మంచం మీద నుంచి లేచాడు. గుమ్మం వరకూ వచ్చాడు తల తిరిగింది.
కణతలు టకటక కొట్టుకున్నాయి. ఒళ్ళు వణికింది. వెనక్కి వాలిపోయాడు మంచంమీద . తనకి తీవ్రంగా జ్వరం - రాత్రి వానలో తడిసిన కారణంగా వచ్చిందని తెలుసుకున్నాడు. హతాశుడైపోయాడు. బెదిరిపోయాడు. కూడా. మెత్తని పరుపులతో మంచమూ, డాక్టర్లూ, వీళ్ళందరిపైనా వేయికళ్ళతో కనిపెట్టే పద్మ మనసులో మెదిలారు. అయితే తన ఈ పరిస్థితికి పద్మే కారణం అని తీర్మానించుకున్నాడు. అతనిలో పద్మ మీద కసి విపరీతంగా పెరిగిపోయింది. రాత్రి జేబులోనే తడిసిన డైరీ తలవేపునుండి తీశాడు తెరిచాడు. తడితడిగా వున్న పేజీమీద యిలా రాశాడు.
"పద్మ రాక్షసి"
అతని మనసులో ఒక్కసారిగా అతనికే జాలి కలిగింది. అతనికి చచ్చిపోవాలనిపించింది. అప్పటికి గాని పద్మకి పశ్చాత్తాపం కలగదు. పశ్చాత్తాపం ఎందుకు కలగాలో అతను స్పష్టంగా ఆలోచించలేదు. కాని కలగాలని మాత్రం అనుకున్నాడు. అతని కళ్ళు తడి అయ్యాయి. సీతాపతి అనే ఉత్తముడికి కలగవల్సిన కష్టాలుకావు ఇటువంటివి అని, నచ్చచెప్పుకున్నాడు. మళ్ళీ డైరీలో యిలా రాశాడు.
"ఒకవేళ నేను చచ్చిపోతే - కాకినాడ సూర్యారావుపేటలో వున్న నాభార్య అనగా పద్మదేవి ఇంట్లోవున్న నా తాలూకు స్వంత ఆస్తి అయిన పుస్తకాలు ఏదేనా గ్రంథాలయానికి నా పేర నివ్వవల్సింది."
భోజనం వేళకి పూజారి వచ్చి చూశాడు - సీతాపతి అస్వస్థతకి ఎంతో ఆతృత కనపరిచాడు. భార్యతో కలిసి ఆలోచించి సుబ్బలక్ష్మి చేత మిరియం, వామూ మొదలైన వాటితో కషాయం తీయించి ముగ్గురూ సీతాపతి దగ్గరకు వెళ్లి తాగమని బలవంతం చేశారు. దీనంగా చూశాడు. సీతాపతి దేవుడి దిక్కువైపు తేనె, గ్లూకోజు, పళ్ళరంస లాంటి అనుపానాలు లేకుండా అతను తలనొప్పి మాత్ర అయినా మింగలేదు. ముసలాయన ఆదేశంతో, సుబ్బలక్ష్మి తలాపి దిక్కన కూర్చుని, సీతాపతి తలఎత్తి నోట్లో చప్పున పోసింది కషాయం. సుబ్బలక్ష్మికి వొళ్ళంతా వులకలూ, సీతాపతికి చెమటలూ పట్టాయి.
"నీకు దగ్గరవాళ్ళెవరేనా ఉన్నారానాయనా, కబురంపనా" అన్నాడు ముసలాయన.
"లేరు" అన్నాడు సీతాపతి.
ముసలాయన కోరుకుంటున్నదీ ఇదే. నలగురున్నవాడూ, నాలుగూ వున్నవాడూ తనకి అల్లుడయేందుకు సులువుగా అంగీకరించడని ఆయనకి తెలుసును.
కోవెలలో అర్చకుడిగా తానిన్నాళ్ళూ చేసిన సేవకి భగవానుడికి తెలుసును. కోవెలలో అర్చకుడుగా తానిన్నాళ్ళూ చేసిన సేవకి భగవానుడి అనుగ్రహం ఈ సీతాపతి రూపంలో కలిగిందని నమ్మకం కలిగింది ఆయనకి.
"అయితే నువ్వొంటరివాడివే అన్నమాట, సంసారమూ, జంజాటమూ ఏవీ లేవన్నమాట."
ముసలాయన ముసలావిడకేసి, ముసలావిడ సుబ్బలక్ష్మి వైపూ సధాభిప్రాయంగా చూపుల్ని బట్వాడా చేశారు. సుబ్బలక్ష్మి సిగ్గుపడింది.
"జ్వరం తగ్గిపోతుంది నాయనా. జలుబున వచ్చి వుంటుంది. ఏమీ కంగారుపడకు, నీకేలోటు రానివ్వను. ఇంక ట్యూషన్లన్నావూ - బోలెడు దొరుకుతాయి. జ్వరం తగ్గాక యిద్దరం కలిసి పెద్దలందర్నీ కలుసుకుందాం. ఈ సత్రం వసారాలోనే చదువుకునే పిల్లల్ని పిలిచి పాఠాలు చెప్పొచ్చును. దివ్యంగా వుంటుంది" అని భరోసా యిచ్చాడు పూజారి.
సుబ్బలక్ష్మీ సీతాపతికి ఎప్పుడు ఏం అవసరమో అని గది ఛాయలనే రోజంతా తిరుగుతోంది సాయంత్రం పూజారివచ్చి మళ్ళీ కషాయం ఇప్పించాడు. ఈసారి ఏదో ఆయుర్వేదపు మాత్రల్ని కూడా మింగించాడు. రాత్రికి జ్వరం ఎక్కువైంది వొళ్ళునొప్పులూ ఎక్కువయ్యాయి. సీతాపతి పూజారితో నీరసంగా ఇలా అన్నాడు.



