Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"రామకోటి ఇల్లు తెలుసునా తాతగారూ మీకు?" అని అడిగాడు.
"రామకోటి అంటే?"
వివరించి చెప్పాడు సీతాపతి.
"అయ్యో నాయనా, ఈ ఊళ్ళో పొలమూ ఇల్లూ అమ్మేసి పట్నం వెళ్ళిపోయాడు రామకోటి, తండ్రిపోగానే, మీకు తెలియదా బాబూ?"
సీతాపతి నెత్తిన పిడుగు పడినట్టయింది. ఏ ఆశతో వచ్చాడో ఆ ఆశ సమూలంగా పెకలింపబడినట్లయింది. అతనికి కాళ్ళాడలేదు. మళ్ళీ కడుపులోంచి వొణుకు వచ్చింది.
"అయితే ఎలాగ ఈ రాత్రికి? ఎక్కడ బసచెయ్యాలో ఏమో....." తనలోతనే గొణుక్కున్నాడు సీతాపతి.
"ఎంత మాట ఎంత మాట! మీకు లోటు రానిస్తారా! సత్రంలో బసచేద్దురుగాని" అన్నాడు పూజారి.
ఆవూరు పల్లెటూరయినా మంచి రోడ్లతో పెంకుటిళ్ళతో అక్కడక్కడ మేడలతో సుఖంగా ధనవంతంగా కనపడింది. విద్యుద్దీపాలు ఉండడంవలన ఊరికి ఒక సందడి వచ్చినట్టుంది. పూజారి వెనకనే వొణకుతూ సీతాపతి సత్రానికి వెళ్ళాడు.
సత్రంలో ఓ గదిలో ఒక పొడుగాటి మొద్దుబల్లమీద పరుపు అని పొరపాటుగా అనుకొనబడే వస్తువు నొకదాన్ని పరచి, దానిమీద ఓ దుప్పటి వేసి పక్క తయారుచేశారు. పూజారి కుటుంబం. సీతాపతి భోజనం వద్దన్నాడు. కాని వాళ్ళు (భార్యా, భర్తా) జమిలిగా బలవంతం చేయగా, విధిలేక అంతకుముందే వాళ్ళిచ్చిన బట్టలు కృతజ్ఞతతో ధరించిన సీతాపతి భోజనానికి లేచాడు. మేకులలాంటి ఎర్రన్నమూ, ఊరగాయా, కూరా రుచి చూసేసరికి తాతలు కనిపించారు సీతాపతికి. వాటిని నమలడం ఒక బారీ పరిశ్రమగా, ముద్ద గొంతు దిగడం ఓ గండంగా గడిచింది. నిజానికి అతనికి ఆకలిగా లేదు. అయినా తినకపోవడం - అంత బతిమాలినప్పుడు బావుండదనుకున్నాడు. ఒకరు చెప్పినట్టు చేసే ప్రకృతి అతనిలో స్థిరపడిపోయింది, భోజనం చేస్తూ సీతాపతి అడిగాడు - "ఈ ఊళ్ళో ట్యూషన్లు ఏమైనా మంచివి దొరుకుతాయాండీ?"
ముసలాయనా, భార్యా తెల్లబోయి ఒకరి నొకరు చూసుకున్నారు. సీతాపతి ధనవంతుడన్న వారి అభిప్రాయాన్ని ఈప్రశ్న చెదరగొట్టింది. ఇతని వాలకమూ, దుస్తులూ, వొంటి మిసమిసా, వేళ్ళని రాళ్ళు పొదిగిన రెండు ఉంగరాలూ -ఇవన్నీ బ్రతుకుతెరువులేని ఒక ప్రయివేటు మేష్టారి తానూకని నమ్మడం కష్టంగా ఉంది. అయినా ముసలాయన తిరిగి ప్రశ్నించగా, ట్యూషన్ లు యింక తన జీవనాధారం అని జవాబిచ్చాడు సీతాపతి. ముసలాయన మనస్సులో చటుక్కున గొప్ప వూహ మెరిసింది. ఇతడు సామాన్యుడే అయితే, యెదిగిన తన కూతురునిచ్చి పెళ్ళిచేసి ఇంట్లో ఉంచుకుంటే....? ఎదిగిన ఆ పెంపుడు కూతురే యిప్పుడు వడ్డన కావిస్తోంది. పళ్ళు కొంచెం ఎత్తూ, కళ్ళు కొంచెం చిన్నవీ అయినా భారీగా కన్ను చెదిరేట్టుగా వుంది. ముసలాయనకీ పిల్ల -సుబ్బలక్ష్మి అంటే ఎంతో ప్రేమ.
"ట్యూషన్లా! వాకబుచేద్దాం నాయనా, నలుగుర్నీ అడిగితెలుసుకుంటాను. ఇంతకీ మనదేవూరు నాయనా?"
సీతాపతి సరిగా జవాబివ్వలేదు. మజ్జిగ చల్లగా కడుపులో పడేసరికి మళ్ళీ వణుకు వచ్చింది. ఎలాగో కళ్ళు
మూసుకు తినేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. సుబ్బలక్ష్మి వచ్చి కంచుచెంబుతో నీళ్ళు అతని పక్క దగ్గరగా పెట్టి వెళ్ళిపోయింది.
తెల్లవారి లేచేటప్పటికి సీతాపతి కళ్ళు మంటలుగానూ, వొళ్ళు నొప్పులుగానూ వుంది. అప్పటికే ముసలాయన మూడుసార్లు వచ్చి చూశాడు. సీతాపతి లేచాడేమోనని, రాత్రి ఆయన భార్యతో సంప్రదించాడు. సీతాపతిని అల్లుణ్ణి చేసుకునే విషయమై
"కుర్రవాడు బుద్దిమంతుడూ, మంచివాడూ, నా అనేవాళ్ళెవరూ లేనివాడూ అయివున్నాడు. కట్నం ఏమీ అడగడు బహుశా అడిగినా ఇచ్చుకొనే స్థితిలో మనం లేంకదా! ఏమంటావ్?" అన్నాడు.
"సెబాస్" అంది ముసలావిడ.
చాటుగా ఈ సంభాషణని ఆలకించిన సుబ్బలక్ష్మి కి వొళ్ళంతా విద్యుత్తు పాకినట్టయ్యింది. సిగ్గు దొంతరలు దొంతరలుగా వొళ్ళంతా వ్యాపించింది. ఈ పెంపుడు తండ్రి తనకింద పెళ్ళి చేయగలడనే నమ్మకమూ, ఆశా లేదు ఆమెకి దిగులుగా వుంది. ఇప్పుడు వయస్సులో కొంచెం పెద్దవాడైనా, అందగాడైన వాడూ, చదువుకున్నవాడూ భర్తగా దొరుకుతాడన్న ఆశ ఆవర్షాకాలంలో ఆమె గుండెల్లో వసంతాగమనాన్ని సూచించింది.
సీతాపతి కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు. అతనికి వొళ్ళు స్వాధీనంలో ఉన్నట్టులేదు ఊరికే కళ్ళు మూసుకుని నిద్రపోవాలని ఉంది. ఏదో కొత్తగా చిరాకుగా వుంది. ట్యూషన్లు మంచివి సంపాదించుకోవాలన్న తహతహ మనస్సులో ఎక్కువైపోతుంది. గది కిటికీలోంచి ఎండ నేలమీదకి పాకింది.
"నాయనా లేచావా!" అన్నాడు నాల్గోసారి వచ్చిన ముసలాయన.
సీతాపతి లేచి కూర్చున్నాడు.
"అమ్మాయి నీకు కావల్సినవన్నీ చూస్తుంది బాబూ, మొహమాటపడకు. ఇది నీ ఇల్లే అనుకో" అన్నాడు ముసలాయన.
"అలాగేనండి."
కాసేపట్లో "కాఫీ తీసుకురానాండీ" అన్న సన్నని గొంతుక తలుపుచాటునుంచి వినపడింది. ఉలిక్కిపడి తలెత్తాడు. సుబ్బలక్ష్మి ఎడం జబ్బా, చీర కుచ్చెళ్ళూ కనపడుతున్నాయి.



