Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
      ఇప్పుడైనా తానక్కడ ఆవూళ్ళో ట్యూషన్లు చెప్పుకొని సుఖంగా జీవించవచ్చు ననుకున్నాడు. రామకోటి ధనవంతుడూ, పలుకుబడి గలవాడూ కూడా. ఈ ఏడెన్మిదేళ్ళలోనూ ఆ గ్రామంలో హైస్కూలు వెలిసే దుర్యోగం పట్టి వుండదు. ఆ ఊర్లో తననికాని తన భార్యనికాని ఎరిగున్నవాళ్ళు లేరు. కాబట్టి తన ఉనికి ప్రసారమయ్యే వీలుండదు. అజ్ఞాతంగా హాయిగా బతకొచ్చును అని అనుకొన్నాడు సీతాపతి.

    ఎటొచ్చీ ఆవూరు రైలు స్టేషనుకు దగ్గర్లో లేదు. ఫలానా స్టేషనులో దిగి కాలినడకనో బండిమీదనో నాల్గుమైళ్ళు వెళ్ళితేకాని ఆవూరు చేరుకోలేడు. అయితేనేం - రాత్రిపదిగంటలకి ఆవూరు చేరుకుని రామకోటి యింట్లో హాయిగా పడుకుని......

    సీతాపతి మనస్సు చివుక్కుమంది. తను యింట్లో లేకపోవడం ఇంటికి రాకపోవడం చూసి పద్మ ఎంత బేజారైపోతుందో, సోగలైన ఆమె కళ్ళనుండి నిరంతర ధారగా కన్నీరు కారుతుండగా కిటికీలోంచి వీధివైపు తనకోసం రాత్రంతా చూస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఉంటుందో తలచుకునేటప్పటికి ఏదో బాధ కలిగింది. వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాడు ఓ క్షణం. కాని యింతలో హరిశ్చంద్రుడూ, రామచంద్రుడూ, బుద్దుడూ మొదలైన - భార్యల్ని అమ్మేసిన, వదిలేసిన, వడిచేసిన - ఆర్య వీరులందరూ జ్ఞాపకంవొచ్చి అతన్ని కర్తవ్య పరుణ్ణి చేశారు.

    రైలు వేగంగా వెళ్ళిపోతోంది. కొత్తగా సంపాదించుకున్న స్వేచ్ఛతో అతనికి రైల్లో మనుష్యులూ ఇటూ అటూ, పొలాలూ, కొండలూ అన్నీ కొత్తగా ఉత్సాహంగా అనిపించాయి. మందు తీసుకోమనీ, కందిపచ్చడి తినకూడదనీ, రాత్రి పది దాటాక మేలుకోకూడదనీ ఇలాగ అడుగడుక్కీ అడ్డంకులు, నిషేదాలూ లేని స్వర్గంలోకి సజీవంగా ఎగిరిపోతూన్నట్టు అనిపించింది సీతాపతికి. చల్లనిగాలి వొంటికి తగిలింది. ఏవిటా అని ఆకాశంకేసి చూశాడు. మబ్బులు నల్లనల్లగా , దొంతర్లుగా కమ్ముకుంటున్నాయి. గాలి వేగం హెచ్చింది. కోపం అయిన ప్రియురాలు చెంపమీద విసురుగా కొట్టినట్టుగా మొహానికి చురుకుగా తగులుతోంది చల్లగాలి. భావుకుడైన సీతాపతి మనస్సు ఆనందంతో నిండిపోయింది.

    రాత్రి ఎనిమిది గంటలకి ఆగవలసిన స్టేషనులో ఆగింది రైలు. ఊహాలోకంలోంచి చటుక్కున విడివడి సీతాపతి రైలు దిగేటప్పటికి కాని అతనికి వర్షం కురుస్తోన్నట్టు తెలియలేదు. ఆషాడమాసంలో మేఘాలూ మేఘాల్లా ఉండిపోక వర్షం అనే రూపాంతరం పొందుతాయన్న సంగతి అతను ఇందాకటి ఉత్సాహంలో మరిచిపోయాడు. స్టేషన్ దాటి వచ్చేసరికి ఉన్న ఒకటి రెండు బళ్ళని ఆడవాళ్ళతో దిగిన ఆసామీలు చటుక్కున కుదిర్చేసుకున్నారు. సీతాపతికేమీ తోచలేదు. ఇంతవరకూ నీడపట్టున ఒకరి సంరక్షణలో తనని గురించి తాను ఆలోచించుకోవాల్సిన అవసరం ఏ మాత్రములేని ఒక పరిస్థితిలో బతికిన సీతాపతికి ప్రాక్టికల్ గా బతికే, ఆలోచించే అలవాటు పూర్తిగా తప్పిపోయింది

    కొందరు వర్షంలో గొడుగులు వేసుకునీ, కొందరు తడుస్తోనూ వెళ్ళిపోయారు. మరికొందరు లోపలే నిలబడిపోయారు. నాలుగుమైళ్ళ దూరం వర్షంలో నడిచివెళ్ళడం అసాధ్యమూ, అవివేకమూ అనుకున్నాడు సీతాపతి ఏం చేయాలా అని ఆలోచిస్తూ చూరునుంచి ధారలు ధారలుగా కారుతున్న వాన నీటిని చూస్తూ నిలబడ్డాడు.

    "బాబూ మీ రెక్కడికి వెళ్ళాలి"

    ఎవరా అని తిరిగి చూశాడు. తన ప్రక్కనే ఓ కుండలాల బ్రాహ్మణవృద్ధుడు నిలబడి వున్నాడు.

    ఫలానా వూరని చెప్పాడు సీతాపతి.

    "నేనూ అక్కడికే వెళ్ళాలి. ఎవరింటికి వెడతారు తమరు?" అన్నాడు వృద్ధుడు సీతాపతి ధరించిన పల్చని పొందూరి పంచెనీ, తెల్లగా మిసమిసలాడే సిల్కు లాల్చీని భక్తియుతంగా చూస్తూ.

    "ఒక మిత్రుడి యింటికి" ముక్తసరిగా చెప్పాడు సీతాపతి., తన ఆలోచనలు  పద్మ వైపు పోతూండగా.

    కొంత సేపటికి వాన తగ్గింది. వృద్ధుడు గౌరవంగా "వాన తగ్గింది బాబూ, తుంపరకేంలెండి, ఇలాగ కూర్చుంటే రాత్రంతా ఇక్కడే జాగారం చెయ్యాలి. రండి అడుగేస్తూ ఉందాం. అరగంటలో మన ఊరు వెళ్ళిపోవచ్చును " అన్నాడు.

    సీతాపతి సమ్మతించి వృద్ధుడితో బయలుదేరాడు. మబ్బులుమూలాన చీకటి ఎక్కువగా ఉంది. వృద్ధుడు తనని గురించి చెప్పుకుపోతున్నాడు. ఆ వూరి కోవెలకు తాను పూజారిననీ, కోవెలకు ఆనుకునే వున్న సత్రానికి యాజమాన్యం కూడా తనదేననీ, తనకి పిల్లలు లేరనీ, బంధువుల పిల్లనొకదాన్ని పెంచుకుంటున్నాననీ, దానికి పెళ్ళి చేయాల్సిన బాధ్యత వొకటి తనమీద ఉందనీ....

    సగందూరం వెళ్ళేసరికి వర్షం డబడబ మొత్తింది. హోరునకురిసే వర్షంలో యిద్దరూ గబగబా నడవడం మొదలు పెట్టారు.

    "అనుకున్నంత పనీ అయిందీ" అని సాగదీశాడు బ్రాహ్మణుడు వానమీదకోప్పడుతూ.

    సీతాపతి తడిసిపోయాడు. పూర్తిగా, మొత్తంగా, ఘోరంగా తడిసిపోయాడు. పంచె, లాల్చీ వొంటికి పట్టుకునిపోయాయి. పాపం చన్నీళ్ళ స్నానమైనా ఎప్పుడూ అలవాటు లేదతనికి, లోపట్నుంచి చలి గుబులుగుబులుగా బయలుదేరింది. పద్మ  కళ్ళు ఆత్రంగా బాధగా చూస్తున్నట్టు అనిపించి చలించిపోయాడు. కానీ మళ్లీ దైర్యంగా, మొండిగా ఊపిరి బిగించి నడవసాగాడు.

    ముసలాయనకి ప్రతిరోజూ సూర్యోదయాత్పూర్వం ఎంత చల్లని నీళ్ళల్లో అయినా మునిగే అలవాటేమో, ఈవర్షం పిసరైనా బాధించలేదు. అయితే ఆయన ఆందోళనల్లా చంకలో తడిసిపోతూన్న మూట గురించి మాత్రమే.

    ఊరు చేరుకునేసరికి వర్షమూ తగ్గింది. విద్యుదీపాలు మందకొడిగా మెరుస్తున్నాయి. సీతాపతికి ఉత్సాహం వచ్చింది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.