Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"వెళ్ళిరానా?" అన్నాడు. అతని స్వరం సన్నగా మెలికలు తిరిగి చీకట్లో గిలగిలలాడింది. గుండెనుండి కారే రక్తాలు పిండుకుంటూ అతను వెళ్ళిపోయాడు. అతని వెనుక మబ్బు లరచుకుంటూ, రాక్షసు లరచుకుంటూ వెళ్ళిపోయారు.
లత ఏడుస్తూ కూలబడింది -మూర్చపోయింది.
మళ్ళీ అతను రాలేదు.
లత మళ్ళీ పూయలేదు.
అతని జాడ తెలియదు.
చీకటి లతని ముసుగులా మూసుకుంది.
అతను మళ్ళీ రాలేదు.
అతను మళ్ళీ పిలవలేదు.
అతని పాట అర్ధరాత్రి మబ్బులలోంచి జాలిగా
ఆమె మూలగా పాతాళ కుహరంలోంచి బాధగా -
పువ్వులు రాలిపోయాయి. మంచు దట్టంగా పడి మనసులూ, ఆకులూ మూసుకుపోయాయి.
బావురుమనే నిశ్శబ్దం అంతటా....
దేవతలు ఏడుస్తోన్న వర్షం. మనుష్యులు కాలుతూన్న వాసన.
అతన్ని వెతకడానికి వెళ్ళినవారికి దారిపొడుగునా అతని గుండె రక్తపు మరకలే కనుపించాయి. కాని అతను మాత్రం కనబడలేదు.
ఆమెని చూడడానికి వెళ్ళిన వారికి గదిలో ఆమె కనపడలేదు, కటికి చీకటి తప్ప.
ఇది ప్రళయం. -అంది రాలిపోయిన పువ్వు.
ఇది విలయం - అంది జారిపోయిన చుక్క.
పెట్టెలోపల - గదిలో మూలగా పెట్టెలోపల్లోపల -మణిప్రవాళం మెరుస్తోంది. ఫక్కున నవ్వింది. ఇలాఅంది.
"నా శక్తి అనంతమైనది. నేను కరుణనీ, ప్రేమనీ, సౌందర్యాన్నీ నశింపచేస్తాను. దైవీయశక్తుల్ని ఓడిస్తాను. ఈ జగత్తు నాకు బానిస -అవునా?"
అవును అన్నాయి మబ్బులు.
అవును అన్నారు రాక్షసులు.
అవును అన్నాయి చెట్లూ, చెట్లమీద పిట్టలూ భయంకరంగా.
అవును అన్నాయి పువ్వులు ఏడుస్తూ.
ఒక్కసారిగా నిశ్శబ్దం. కఠిన శాసనంలాగా నిశ్శబ్దం. యుగాల దాకా మళ్ళీ ఏ హృదయమూ పలకలేదు. పలవరించలేదు.
(స్వాతి, 1963)
***********



