Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
అతను వస్తున్నాడు. అతనితోటి మబ్బులు వస్తున్నాయి. మబ్బుల వెనుక రాక్షసులు దాక్కున్నారు.
నక్షత్రం రాలిపోయిన రాత్రి -
అతను వచ్చాడు. అతని గుండెలమీద రాక్షసుల మొదటి గోటి గీత -ఎర్రని చార!
"నన్ను కాపాడగలవా?" అన్నాడతను.
"ఓ" అంది లత.
"అయితే నీ దగ్గరున్న మణిప్రవాళం ఇవ్వు."
"నా దగ్గర లేదు"
"అయితే -?"
"ఇంకోటి ఇస్తాను."
ఆమె ఏదో ఇచ్చింది. రక్తపుచార కనబడలేదు. అతను నవ్వాడు. ఎప్పటిలాగే వెన్నెల...........
కొన్నాళ్ళు గడిచాయి. అతను వచ్చాడు. ఈసారి అతని గుండె మీద రెండు ఎర్రని చారలు. అతను కొంచెం వడలాడు.
"నన్ను కాపాడగలవా" అన్నాడు.
"ఓ" అంది లత.
"అయితే మణి ప్రవాళం ఇవ్వు."
"లేదు"
"మరి -?"
"ఇంకోటి ఇస్తాను."
ఆమె ఏమిటో ఇచ్చింది. రక్తపు చారలు కనపడలేదు.
అతను నవ్వాడు. కాని ఆ నవ్వులో నీరసం ఉంది.
లత రెండవ పువ్వు తొడిగింది. అతనికోసం చూసింది. రాత్రీ పగలూ 'ప్రియా' అని పిలిచింది. ఆ పిలుపుకి ఆకాశపు అంచున ఒక బెల్లు రాలి పడింది.
అతను వచ్చాడు. ఈసారి గుండె అంతా రక్తం. ఎర్రని మడుగులాగా ఉంది. అతని వెనుక నల్లని మబ్బులు. నల్లని మబ్బుల వెనుక రాక్షసుల వికటాట్టహాసాలు.
"నన్ను బ్రతికించు నన్ను చంపేస్తున్నారు" అన్నాడతను.
"ఏం చెయ్యను నేను?" ఏడ్చింది లత మూడుపువ్వులతో సహా.
"మణి ప్రవాళం ఇవ్వు."
"లేదు"
"ఉంది. నాకు తెలుసును."
"దానిమీద నాకు అధికారం లేదు."
"అయితేనేం- మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానుగా"
లత ఊగిపోయింది. బాధ పడింది. విహ్వలించింది. కళ్ళుతెరచి జాలిగా యిలా అంది. "నా పెద్దల అభిమానం నావాళ్ళ అనురాగం -అన్నీ పోతాయి. నా వాళ్ళు నాకు కాకుండా పోతారు...."
"వాళ్ళందర్నీ వదిలెయ్యి"
"వదలలేను"
"అయితే మరి..."
"ఇంకోటి యిస్తాను"
"లాభంలేదు."
ఈసారి అతని కళ్ళల్లో చీకటి. అతని పెదవుల పైన చీకటి. నిర్దయలాంటీ చావులాంటి చీకటి.



