Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


                   
                             ఓడిపోయిన మనిషి

    తెరచి ఉన్న కిటికీలోంచి వొంటిమీద జల్లుపడి చటుక్కున మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి కిటికీలోంచి చూశాను.  సన్న చినుకులతో వాన, గాలి మాత్రం తీవ్రంగా వీస్తోంది. సగం నలుపూ, సగం తెలుపూగల తెలవారగట్ల సన్నని చనుకుల దారాలు గాలిలో కదిలిపోతున్నాయి. చెదిరి పోతున్నాయి. ప్రహరీ గోడ దగ్గర మందార పట్టుపువ్వులు ఎర్రగా వానలో తడుస్తున్నాయి. చల్లని గాలికి వొళ్ళంతా ఏదో హాయిగా వుంది. చల్లదనం మనస్సులోకి వెళ్ళి బాధ్యతల్నీ, సమస్యల్నీ, భయాల్నీ దాచుకున్న వేడి సెరిబెల్లాని కూడా చల్లపరుస్తోన్నట్టు అనిపించింది.

    కళ్ళు మూసుకున్నాడు. ఎవరో మంచుకొండలమీద స్కేటింగ్ చేస్తోన్న దృశ్యం. విశాఖపట్నంలో డాల్ఫిన్స్ నోస్ దగ్గర తెల్లని ఓడకదులుతూన్న దృశ్యం. మద్రాస్ కాలేజి ఆవరణలో, ఎవెన్యూలో నడుస్తూన్న దృశ్యం. ఈ మూడింటికి ఏదైనా సంబంధం వుందా? హాయిలో హాయి అనే పరుపులో నన్ను నేను చుట్టబెట్టుకున్నట్టు ఏదో ఫీలింగ్. ఈ ఫీలింగ్ ని పోనివ్వకూడదనుకుంటూనే వొళ్లు ముడుచుకుంటూ, చెయ్యి పక్కకి జాపాను. మెత్తగా ముదురుగా లావుపాటి పాత రబ్బరులాగా చేతికి తగిలింది. అంతవరకూ పక్కమీద నా పక్కనే సుభద్ర పడుకుని వుందన్న మాట మరచిపోయాను. పండ్రెండేళ్ల క్రితం తాకగానే కొత్త ఉద్రేకాలూ, రహస్యాలూ నాలో ప్రవర్తింపచేసిన యీమె శరీరం, ఇన్నేళ్ళ పరిచయంలో, అనుభవింపబడడంలో, పిల్లల్ని కనడంలో వయస్సు పెరిగి ఈనాడు ఆకర్షణని కోల్పోయి "ఇల్లాలు" అనే ఒక వ్యర్థ గౌరవప్రదమైపోయిన యీమె శరీరం, నా చేతికి తగలగానే వానా, వేకువా, మందార చెట్లూ గబుక్కున మాయమైపోయాయి.

    వాటిస్థానే పెళ్ళికి ఎదుగుతూన్న ఆడపిల్లా, టాన్సిల్స్ ఆపరేషన్ చేయించవలసిన చిన్న కొడుకూ, బ్యాంకిలో తరిగిపోతూన్న డబ్బూ, ఎప్పుడూ రిపేయిర్స్ కొచ్చే కారు వచ్చి నిలుచున్నాయి. కాసేపుకూడా కల్పనా సుఖాన్ని ఊహించుకోనివ్వని కఠిన వాస్తవికతలా కనపడింది భార్య. ఆమెవైపు తిరిగి చూశాను. వొంటిమీద సగం సగం బట్టతో రేగిన జుట్టుతో, గృహిణీ ధర్మాన్ని రోజంతా నిర్వహించిన అలసట కనిపించే కనురెప్పలతో, లావెక్కి వొంపులు మాయమైపోయిన వొంటితో జాలిగా కనిపించింది. ఏదో బాధ అనిపించింది. ఎవరో నన్ను దగా చేస్తున్నారనిపించింది. మాంచి ట్యూన్ వినిపించే రేడియో గొంతుని ఎవరో నొక్కేసి వికటంగా నవ్వినట్టనిపించింది. ప్రధమ యౌవన దినాలు లీలగా జ్ఞాపకం వచ్చాయి. సుతారపు అత్తరువాసనలాంటి జ్ఞాపకాలు -ఆ రోజులు!

    మళ్ళీ అటు తిరిగి పడుకున్నాను. చల్లని గాలి మొహానికి తగులుతోంది. వెనక్కి వెళ్ళి పోతున్నాను -ముదిరిన ఏళ్ల పర్వతాల మీదనుంచి వెనక్కి వెనక్కి లోయల్లోకి, పచ్చిక బయళ్ళలోకి వెల్లబోతున్నాను. రొమాన్లూ, ఆదర్శాలూ, అమాయకత్వం కలిసిన వేడివేడి రక్తం. పడుచుపిల్లలన్నా, కవిత్వం అన్నా సోషలిజం అన్నా బలే బలే యిష్టం. జేబునిండా డబ్బూ, సినిమాలూ పైలాపచ్చీసుగా ఉండేది. భావ కవిత్వం మీదా సుభాష్ బోస్ నాయకత్వం మీదా మోజు, ఇంగ్లీషువాళ్ళన్నా, ఉద్యోగస్తులన్నా చిరాకూ, ద్వేషమూ.

    ఆ వయస్సులోనే చిన్న చిన్న రొమాన్సులు ప్రారంభం, రెండు కలువ రేకుల్లాంటి కళ్లుగాని, చివరకి - జవ్వాడే నడుంమీద నాట్యం చేసే వాల్జడగాని కవిత్వంలోకి పంపివేసేది. సామ్రాజ్యవాదాన్ని సంప్రదాయాన్ని ఎదిరించాలనే సాహసం. కాని మరికొంచెం ఎదిగేటప్పటికి నాకు తెలియకుండానే ఎన్నో జాగ్రత్తలు వచ్చికూర్చున్నట్టే తెలుసుకున్నాను. లోపల -నా లోపల ఎవడో పెద్దమనిషి బుద్దిమంతుడూ అయినవాడు పరివ్యాప్తమౌతున్నాడు. మెడచుట్టూ కండువా వేసుకుని, కొంచెం వొంగి, కర్రనానుకుని జీవితాన్ని భద్రంగా ఇటూ అటూ చెదిరిపోకుండా తాళం వేసుకుంటున్నాడు. బాలని ప్రేమించాను. అలాగని చెప్పానుకూడా. అయినా చివరికి ఏమీ ఎరగనట్టుగా తప్పుకున్నాను. పెళ్ళి పందిట్లో ఆ రాత్రి నేను తలనొప్పితో విడిది మేడగదిలోనే పడుకున్నాను. అందరూ పందిట్లో ఆ రాత్రి నేను తలనొప్పితో విడిది మేడగదిలోనే పడుకున్నాను. అందరూ పందిట్లో ఉన్నారు. పెట్రోమాక్సులైటు ఆరిపోయింది. కిటికీలోంచి వెన్నెల పడుతోంది. మెట్లమీద చప్పుడు వినపడింది. ఎవరా అని చూశాను. బాల! కళ్ళని కాటుకతో, బుగ్గమీద చుక్కతో బాల, నాదగ్గరికి వచ్చి తట్టిలేపింది. ఏమీ ఎరగనట్టుగా "ఎవరూ!" అన్నాను.

    "నేను బాలని" ఆమె గొంతులో బాధ, ఆవేశం. "రేపు ఉదయమే నాకు పెళ్ళి అయిపోతోంది"

    నేను మాట్లాడలేకపోయాను.

    "ఏం నిద్రపోతున్నావా?" అంది.
 
    "లేదు"
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.