Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


               
                                                   మణి ప్రవాళం

    చీకట్లో గదిలో పడుకుని వుంది లత. ఏకాకిగా ఏ హృదయమూ స్పందించని ఏకాంతంలో, ఎవరూ చూడని నరకంలో చిక్కుకుని వుంది లత.

    అతను మెరుపులాగా వచ్చాడు. అటు దక్షిణానిలం వీచే దారి నుండి దయా సరస్సులలో విహరించే రాజహంసనెక్కి నక్షత్ర కిరణం మీదుగా జారుతూ వచ్చాడు.

    అతను పాట పాడాడు. పాటకి చీకటి చీకాకుపడి నల్లగా కోప్పడింది. అతను పాట పాడాడు. చీకటిని చెరిపివేస్తూ వేయి పువ్వులతావి వింతగా కమ్ముకుంది.

    అతను పాట పాడాడు. జాలిగా తియ్యగా లత గుండెలో కోర్కెలా హాయిగా తెరతెరల్లాగ కదలింది.
   
    ఆమె కళ్ళు తెరిచింది. అతను నవ్వాడు. అతను వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ మరో రోజున వచ్చాడు. "లతా" అని పిలిచాడు. అతని గొంతులో మాధురీ మందాకిని జలజలించింది

    "ఇంకోసారి పాడు" అంది లత రెప్ప్లని కొంచెం ఎత్తి. నల్లని పొడుగాటి ఆమె తల వెంట్రుకలు చీకట్లో తరంగాలలా కదలుతున్నాయి.

    అతను పాడాడు. చీకటి చీకాకు పడింది. గుడ్లగూబలు దిగులుగా ఏడ్చాయి. అతను వెళ్ళిపోయాడు.

    అతను మళ్ళీ ఇంకోరోజున వచ్చాడు. లత పెదవుల మీద సన్నని చిరునవ్వు చెదిరింది. ఆప్యాయంగా అడిగింది. "ఒక్క పాట పాడవూ?"

    పాడాడు. లత కళ్ళలో నీళ్ళు, నీళ్ళలోంచి చావును దాటిన వెలుగు.. అతను నిట్టూర్చాడు.

    కొన్నాళ్ళకి మాలతీ సౌరభం వీచిన రాత్రి -

    "స్వామీ" అంది లత.

    అతను మాట్లాడలేదు.

    "కవీ" అంది లత.

    అతను మాట్లాడలేదు.

    "ప్రియా" అంది లత

    అతను పలికాడు. నక్షత్రాలు మెరిశాయి. వెన్నెల కురిసింది. అతని చేయి ఆలంబనగా లత లేచి నిలుచుంది. అతని వొళ్ళో వాలింది. కిటికీ అవతల మందారం ఎర్రగా నవ్వి తల పక్కకు తిప్పుకుంది.

    వకుల వృక్షం విరిసిన రాత్రి -

    "ప్రియా" అంది లత.

    "మిమ్మల్ని వదలలేను."

    జవాబుగా ఆమె ఫాలాన్ని ముద్దాడాడు అతను.

    "ఎక్కడనుంచి వచ్చారు?"

    "మంచు పర్వతాల అంచున దయాసరస్సుకి దక్షిణాన మంత్ర విహంగాలు మసలేచోటున - రంగు రంగుల చెట్ల నీడలలో పాడుకుంటూ ఉంటాను."

    "అక్కడికి దగ్గరగా మాయలోకం ఉంది. భయంలేదా" అంది లత. అతను నిట్టూర్చాడు.

    మొగలిచెట్టు మొదటిరేకు తొడిగినరాత్రి -

    "ప్రియా" అంది లత.

    "ప్రియతమా" అన్నాడతను.

    "ఏఁవి టాలోచిస్తున్నారు?"

    అతను నిట్టూర్చాడు. అతను వెనక్కి చూశాడు. అతని వెనకాల మబ్బులు........

    "పాట పాడవూ" అతని వొడిలో తల పెట్టుకుని అడిగింది లత. అతను పాడాడు - లత పులకరించింది. పరవశించింది.

    అరమోడ్పు కన్నులతో అతన్ని గుండెలకి హత్తుకుంది. అతను బరువుగా నిట్టూర్చాడు.

    అతను వస్తున్నాడు. లత చిగురుపట్టింది. మొదటి పువ్వు పూసింది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.