Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "ఎలాగ! ఈ బస్సు దాటిపోతే కలెక్టరుగారింట్లో పెళ్ళికి ఎలాగ వెళ్ళడం. రిసెప్షన్ అంతా నేనే చూసుకుంటానని మాట యిచ్చాను" - అన్నాడు రామచంద్రం. పెద్ద సమస్య వచ్చిపడింది రామచంద్రానికి.

    "అయినా మనం ఏమి చేయగలం?" భూషణం నిరీహుడై జాలిగా అన్నాడు.

    నేను వెర్రిగా సూరీడు కేసి చూస్తున్నాను. "నే నొక్కతెను చూడలేను బాబూ. మీరుంటే ధైర్యం బాబూ రక్షించండి బాబూ!" ఏడుస్తోంది సూరీడు.

    "అదిగో బస్సు వస్తోంది" అన్నాడు భూషణం. రామచంద్రం చెయ్యి ఎత్తి ఆపమని సంజ్ఞ చేశాడు.

    బస్సు ఆగింది. "త్వరగా ఎక్కండి బాబూ" అంటూన్నాడు కండక్టరు. రామచంద్రం గబుక్కున రెండు పదిరూపాయల నోట్లు జేబులోంచి తీసి సూరీడు చేతిలో పెట్టి "మేం వుండి మాత్రం ఏం చెయ్యగలం సూరీడు, మంత్రం వచ్చునా తంత్రం వచ్చునా? అవతల కలక్టరు గారింట్లో పెళ్ళి. ఈ డబ్బుతో ఎక్కడికేనా తీసుకెళ్ళి చూపించు మీ బాబుని" అని కారు ఎక్కాడు. భూషణం నిశ్టేష్టుడై చూస్తూ వున్న నన్ను జబ్బపట్టుకుని కార్లోకి తోసి, తాను ఎక్కాడు.   "సూరీడు! ఏమనుకోకు. కలెక్టరు గారింట్లో...." అంటున్నాడు. కారు బర్రున సాగింది. సూరీడు విచిత్రంగా నోరావలించి గుడ్లప్పగించి చూస్తూ నిలబడింది. పది రూపాయల నోట్లు రెండూ ఉదయపు చల్లని గాలిలో పావురాలులా పల్టీలు కొట్టుతున్నాయి.

    కారు వేగంగా వెళ్ళిపోతోంది "పాపం మనం చెయ్యగలిగిందేముంది?" అన్నాడు భూషణం యింకా జాలితో.

    "అందులో కలెక్టరుగారికి మాట యిచ్చామాయె!" అన్నాడు రామచంద్రం. -మాట ఇచ్చి తప్పడంలోని అమానుషత్వాన్ని వూహించుకుని భయపడుతూ.

    "ఇది నల్లజర్ల అడవిలోని ఆనాటి రాత్రి సంఘటన-" అని అవధానిగారు ఆగి మాకేసి చూశారు.

    "కొవ్వొత్తి అయిపోతోంది. ఎలాగ" అన్నాడాచారి భయంగా.

    "డ్రైవరు వంటవాడూ సినిమానుంచి యీపాటికి వస్తూంటారు" అన్నాడు నారాయణ.

    "ఈ తోటలో పాములున్నాయాండీ" అన్నాడాచారి.

    అవధానిగారు మాట్లాడలేదు. పాతిక సంవత్సరాల క్రితం జరిగిన యీ సంఘటనదగ్గరే వుంది ఇంకా ఆయన మనస్సు.

    "సిద్దయ్య చచ్చిపోయాడేమో" అన్నాను నేను.

    "మనకేం తెలుస్తుంది?" అన్నారు అవధానిగారు.  "సూరీడు ఏమయిందో కూడా తెలియదు" అన్నారు బరువుగా.

    గబుక్కున లైట్లు వెలిగాయి. బంగళా అంతా వెలుగుతో నిండిపోయింది. ఆచారి ఆనందంతో నవ్వుతున్నాడు. అవధానిగారు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు.  "డ్రైవరు రాగానే వెళ్ళిపోదాం" అంటున్నాడు నారాయణ. తోట అవతల నుంచి యింకా నక్కల కూతలు వినపడుతున్నాయి. కాని ఆచారి అంత భయపడలేదు.
                                               (ఆంద్రపత్రిక, ఉగాది సంచిక -1964)

                                   **********




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.