Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    పాత్రో కంగారుగా ఒకసారి తన కనెక్షన్స్ అన్నీ గమనించాడు. ఓ రెండు నిముషాలు పరీక్షించినా అతనికి తన తప్పు తెలియలేదు.
    "మైగాడ్ -- ఎలాగైతే ఎలాగ? మీరు మెయిన్స్ నించి డైరక్టర్ కనెక్షన్ దేనికిచ్చారో చూడండి" అన్నాడు గోపాలరావు.
    పాత్రో పరీక్షించి నాలిక్కరుచుకుని -- "చాలా పెద్ద పొరబాటే జరిగింది. మిల్లీ వోల్ట్సు రీడ్ చేయడానికి ఉన్న టెర్మినల్స్ కు డైరెక్టుగా మెయిన్స్ నించి కనెక్షన్స్ ఇచ్చే శాను" అని గబగబా మార్పులు చేసేశాడు.
    తర్వాత గోపాలరావు పరీక్షించి చూసి - "గుడ్ - కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కనెక్షన్స్ చేసేటప్పుడు ఒకోసారి కాస్ట్ లీ పరికరాలుంటుంటాయి" అన్నాడు.
    గోపాలరావుతో కాసేపు మాట్లాడ్డ మయ్యేక విశ్వనాధం ఇంకో లాబరేటరీ లోకి వెళ్ళాడు. అది మెకానికల్ ఇంజనీర్ శ్రీవాస్తవ అధ్వర్యంలో ఉంది. అయన అక్కడున్న అందర్నీ పరిచయం చేశాక - 'సార్ - గ్యాసు లీకవుతోంది" అన్నాడు ఒకతను.
    అతనే రామానందామని అడిగి తెలుసుకున్నాడు విశ్వనాధం.
    శ్రీవాస్తవ త్వరగా వెళ్ళి అక్కడున్న గ్యాస్ సిలెండర్ వాల్వ్ ముందు క్లోజ్ చేసి - తర్వాత రెగ్యులేటర్ ని సిలెండర్ నుంచి సెపరేట్ చేసి - చూసి - "మైగాడ్ ! రాంగ్ త్రేడింగ్ " అన్నాడు.
    "స్క్రూ ఒక పట్టాన తిరక్కపోతే బలం ఉపయోగించాను. కాస్త బలంగా రెంచితో తిప్పితే తర్వాత స్క్రూ సులభంగానే తిరిగింది" అన్నాడు రామానందం.
    "స్క్రూ తిప్పడానికి బలాన్నుపయోగించకూడదు. మొదట్లో నట్టు చాలావరకూ సులభంగానే తిరిగిపోతుంది. చివర్లో రెంచి పెట్టి కాస్త బిగించాలి. మొదట్లోనే స్క్రూ సరిగ్గా తిరగడం లేదంటే రాంగ్ థ్రెడింగ్ పడిందన్న మాట. అప్పుడు సరిచేసి స్క్రూ మళ్ళీ సరిగ్గా పెట్టాలి. అలా కాకుండా బలవంతంగా బిగించేస్తే మొత్తం స్క్రూ అంతా పాడైపోతుంది. అందుకే గ్యాసు లీకయింది...." అన్నాడు.
    రామానందం కాస్త సిగ్గు పడ్డట్లు ముఖం పెట్టుకుని-- "థియరీ నాకు తెలుసునండి. కానీ గ్యాసు సిలెండర్సు లో వర్కు చేయడం ఇదే ప్రధమమంది" అన్నాడు.
    శ్రీ వాస్తవ నవ్వి -- "ఊరికే తెలుసుకుంటారని చెప్పాను. మొదట్లో ఇలాంటి పొరపాట్లు రావడం చాలా సహజం" అన్నాడు.
    విశ్వనాధం అక్కణ్ణించి కదలబోయేముందు -- "రామానందానికి నాలుగేళ్ళ అనుభవముందంటున్నారు. అతని అనుభవానికీ పొరపాటు సహజమైనదేనా?" అన్నాడు.
    'చాలా సహజం. అయినా అతని అనుభవం పాల్ టెక్నిక్ కాలేజీలో లెక్చరర్ గా. పాఠాలు చెప్పడం వేరు. ప్రయోగాలు చేయడం వేరు. కాలేజీల్లో సిలెండర్స్ కి రెగ్యులేటర్స్ ఫిక్స్ చేయడం అటెండర్స్ వల్ల జరుగుతుంటుంది. అందువల్ల స్టూడెంట్స్ కీ- లెక్చరర్స్ వల్ల జరుగుతుంటుంది. అందువల్ల  స్టూడెంట్స్ కీ - లెక్చరర్స్ కీ అందులో ఉండే సాధక బాధకాలు తెలియకపోతే ఆశ్చర్యం లేదు" అన్నాడు శ్రీవాస్తవ.
    విశ్వనాధం అంత సంతృప్తి చెందినట్లు కనబడలేదు. అతను మళ్ళీ ఒక్కొక్క లాబరేటరీ నే చూసుకుంటూ బయల్దేరాడు. నారయనపాత్రో అతను వెళ్ళేసరికి ఎలక్ట్రికల్ సర్క్యుట్సుకు సంబంధించిన ప్రేలిమనరీ స్టాండర్డు పుస్తకాన్ని చదువుతూ కనిపించాడు. అతనికది ఆశ్చర్యాన్నీ కలిగించింది.
    "బొత్తిగా టచ్ లో లేనండి. ఫండమెంటల్సు చదువుతున్నాను" అన్నాడు పాత్రో.
    తర్వాత విశ్వనాధానికి తన రుమాలు సంగతి గుర్తుకు వచ్చింది. నిత్యానందబోస్ ఉన్న లాబొరేటరీకి వెళ్ళాడు.
    "నా రుమాలు తీసుకుందామని వచ్చాను...." అన్నాడు విశ్వనాధం.
    ఇద్దరూ ఎయిర్ ఓవెన్ దగ్గరకు వెళ్ళి, ఆస్బెస్టా గ్లోవ్స్ తొడుక్కుని -- అందులోని బీకరు తీశాడు బోస్.
    అయితే అప్పటికి ఓవెన్ నిండా చాలా గాజు సామాను ఉంది. ఎంత జాగ్రత్తగా అతను తీసినప్పటికీ ఒక ఇరవై సీసీల పిపేట్ దొర్లుకుంటూ ఒవెన్లోంచి క్రింద పడిపోయింది. విశ్వనాధం చటుక్కున వంగున్నాడు. కానీ అప్పటికే అది బద్దలై పోయింది.
    "వెరీ సారీ -- నారుమాలు గురించి మీ పిపేట్ బద్దలై పోయింది" అన్నాడు విశ్వనాధం బాధగా.
    "ఫరవాలేదు లెండి . గవర్నమెంటు సోమ్మేగా " అన్నాడు. బోస్ నిశ్చింతగా - విశ్వనాధం తన రుమాలు తీసుకుంటుంటే అతనింకో పిపేట్ శుభ్రపరచడం  మొదలు పెట్టాడు. విశ్వనాధం అక్కణ్ణించి కదిలాడు.
    అతనింకో లాబరేటరీ కి వెళ్ళే సమయానికి అక్కడ పావనమూర్తి డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్  తయారుచేస్తూ కనబడ్డాడు. అతను కోనికల్ ప్లాస్కు లో నీళ్ళు తీసుకున్నాడు- టాప్ కింద ప్లాస్కు పై భాగాన్ని తడుపుతూ ఉండి ఉండి కాస్త యాసిడ్ పోసి మళ్ళీ మళ్ళీ ప్లాస్కు ను షేక్ చేస్తున్నాడు. ఇందాకా తను చెప్పిన విధంగా డైల్యూట్ యాసిడ్ చేస్తున్నాడతను.
    లాబొరేటరీ లో సాహు లేడు. "హలో!" అంటూ విశ్వనాధం పావనమూర్తిని సమీపించి - "ఫైరెక్స్ గ్లాస్ బీకరుండగా చాదస్తంగా డైల్యుట్ యాసిడ్ తయారు చేస్తున్నారే !' అన్నాడు.
    పావనమూర్తి కాస్త విసుగ్గా ముఖం పెట్టాడు. - "అయ్యా అంతా మీమూలంగానే వచ్చింది. నా బాస్ జియాలిస్టు . ఆయనకు కెమిస్ట్రీ గురించి ఏమీ తెలియదు. అందువల్ల నేనెలా ప్రయోగాలు చేస్తున్నా అయన పట్టించుకునే ప్రసక్తి లేదు. ఇందాకా మీరు చేసిన కామెంట్సు విని మీరు వెళ్ళేక ఆయన నన్ను కాస్త మందలించాడు. కనీసం విజిటర్స్ ఎదుటైనా పుస్తకంలో చెప్పిన ప్రకారం ప్రయోగాలు చేయాలని సూచించాడు - నా సబ్జక్టు లో ఆయనకు నాకంటే ఎక్కువ తెలుసా?" అయినా బాస్ కాబట్టి ."
    విశ్వనాధం సారీ చెప్పి అక్కణ్ణించి బయటపడి లాబొరేటరీ లైబ్రరీ లోకి వెళ్ళాడు. అక్కడ తను చూసిన ప్రయోగాలకు సంబంధించిన ఫండమెంటల్ బుక్సు కొన్నింట్లో అవసరమనిపించిన పేజీలు  చదివాడు. చదువుతుంటే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ వచ్చాయి. నోట్ చేసుకున్నాడు.
    
                                     5
    డిటెక్టివ్ విశ్వనాధం , డాక్టర్ ముఖర్జీని కలుసుకుని -- "నేను వచ్చిన పనయింది. బహు ధన్యవాదాలు" అన్నాడు.
    "ఏమైనా ఆచూకీ తెలిసిందా?" అన్నాడు ముఖర్జీ.
    'అన్నింటికంటే ముఖ్యమైనదొకటి తెలిసింది. ఈనాటి చదువుల గురించి అది అధ్యాపకులలోపమో - విద్యార్ధుల లోపమో- లేక అసలు విద్యా విధానంలోనే లోపముందో చెప్పలేను కానీ ఎంతలేసి క్వాలిఫికేషన్స్ ఉన్నా -- వారి వారి పరిజ్ఞానం అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఎవ్వరికీ కనీసం తము చదువుకున్న సబ్జక్టు లోనైనా కూలంకుష పరిజ్ఞాన ముండడం లేదు."
    "ఈ రోజులు వేరు లెండి. ఇవి స్పెషలైజేషన్ రోజులు. వారికి అవసరామైనంత మాత్రమే నేర్చుకుంటున్నారు. మిగతా వాటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిఫర్ చేయడానికి పుస్తకాలున్నాయి ...." ముఖర్జీ ఏదో చెప్పబోతుండగా ----
    'అవన్నీ ఇప్పుడెందుకు లెండి గానీ -డాక్టర్ నిత్యానంద్ బోస్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి రెండ్రోజుల్లో సీబీఐ మనుషులు వచ్చేవరకూ నమ్మకమైన వారినేవరైనా అతన్ని కనిపెట్టి ఉండమనండి. సాధ్యమైనంతవరకూ అతని కే విధమైన సమాచారమూ అందకుండా చూడండి" అన్నాడు విశ్వనాధం.
    ముఖర్జీ ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనబడింది - "ఎలా తెలుసుకున్నారు మీరు?"
    "కొత్తగా అపాయింటయిన నలుగురు అసిస్టెంట్లూ కూడా కొన్ని తప్పులు చేశారు. అయితే పాయింట్ అవుట్ చేయగానే ఏమిటో చెప్పకుండానే ఆ తప్పును చాలామంది గుర్తించగలిగారు. కొన్ని తప్పులు సహజమైనవే. అయితే అనలిటికల్ కెమిస్ట్రీ లో డాక్టరేట్ ఉన్న వ్యక్తీ పిపెట్లను డ్రై చేయడానికి ఎయిర్ ఓవెన్లో పెట్టడంటే - దాన్ని పొరాపాటుగా కాక- అతని డిగ్రీనీ వ్యక్తిత్వాన్నీ అనుమానించాల్సి వస్తుంది' అన్నాడు విశ్వనాధం.
    పిపెట్సు ను సొల్యూషన్ కొలతల కుపయోగిస్తారు. కొలతను బట్టి పిపెట్ మీద మార్కింగ్ ఉంటుంది. ఆ మార్కును రూం టెంపరేచర్ వద్ద స్టాండరైజ్ చేస్తారు. ఏ పరిస్థితుల్లో వాటిని డ్రై చేయడానికి వేడి చేయరాదు. నీటితో కడిగేక -  తొందరగా ఎవాపరేట్ ఆయె ఆల్కహాలు, అసిటోన్లలో కడిగి కాసేపు ఎయిర్ బ్లో చేస్తే డ్రై అయి పోతాయి."
    విశ్వనాధం చెప్పినదంతా సావధానంగా విని - "మీ సునిశిత పరిశీలనా శక్తిని అభినందించకుండా ఉండలేను...." అన్నాడు.
    'అప్పుడే ఎక్కడ....అతని సాయంతో ఈ గూడచారి ముఠాని పట్టుకోవాలి. ఇదింకా మొదటి మెట్టు మాత్రమే!" అన్నాడు విశ్వనాధం.
    విశ్వనాధం అంచనా తప్పు కాలేదు. విలువైన ఒక పరిశోధన రహస్యం లాబరేటరీని దాటి వెళ్ళకుండా అతను రక్షించగలగడమే కాక- ప్రమాదకరమైన ముఠాకు సంబంధించిన ఒక వ్యక్తిని అతను ప్రభుత్వానికి పట్టి ఇవ్వగలిగాడు.

                                  ----------




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.