Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 10


 

    రాజ్ కుమార్ కళ్ళు పెద్దవయ్యాయి- " ఇతను నీకు తెలుసా?"
    "ఇతనెవరో తెలియదు. పేరు కూడా తెలియదు. ఎక్కడుంటాడో తెలియదు. కానీ మనిషి మాత్రం తెలుసును...." అన్నాడు వీరభద్రం.
    "ఎలా తెలుసు?"
    "ఒకరోజు సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో మా యింటికి వచ్చి రాత్రి పదకొండు గంటలు దాటే వరకూ యింట్లో ఉన్నాడు. నాన్నగారితో అర్జంటుగా ఏదో చెప్పాలన్నాడు. అదేమిటంటే రహస్యం అన్నాడు. ఆయనకోసం యెంత సేపైనా ఎదురు చూస్తానన్నాడు. కానీ రాత్రి పదకొండు గంటలు దాటేక మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. అతనితో నేను చాలాసేపు మాట్లాడేను కాని అతని గురించి ఏ విధమైన వివరాలు తెలుసుకోలేకపోయాను.'
    "ఇతని గురించి ఇంకేమీ చెప్పలేదా?"
    "చెప్పలేదు."
    "పోనీ యితను మిమ్మల్నేప్పుడు కలుసుకున్నాడో చెప్పగలరా?"
    "వీరభద్రం క్షణం ఆలోచించాడు. హటాత్తుగా అతని కళ్ళు మెరిశాయి. - " అతను మా యింటికి వచ్చిన రోజు రాత్రే మా నాన్న గారి హాత్య జరిగింది" అన్నాడు అరిచినట్లు.
    "వాట్ !" అన్నాడు రాజ్ కుమార్ - "ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు?"
    "ఈ హత్యకీ దానికీ సంబంధ ముంటుందని ,ముందు నాకు తోచలేదు. అతను హంతకుడయుంటాడని ప్రవర్తనను బట్టి తోచలేదు. మనిషి మంచివాడు, తెలివైన వాడులా కనిపించాడు నాకు. మా నాన్నగారికి స్నేహ పాత్రుడే కానీ శత్రువని అనిపించలేదు !-- " అన్నాడు వీరభద్రం.
    'అసలేం జరిగిందో వివరంగా చెప్పండి" అన్నాడు రాజ్ కుమార్.
    వీరభద్రం అంతా జాగ్రత్తగా గుర్తు చేసుకుని ఇన్ స్పెక్టర్ కు చెప్పాడు. అయితే అతను చెప్పిన కొన్ని మాటలు - తండ్రి ఒకప్పుడు పేదవాడుగా ఉండి భాగ్యవంతుడు కావడం లాంటివి మాత్రం వీరభద్రం ఇన్ స్పెక్టర్ కు చెప్పలేదు.
    వీరభద్రం చెప్పిన వివరాలు విని - "అయితే ఆ మనిషి హంతకుడు కాడు...." అంటూ నిట్టూర్చాడు రాజ్ కుమార్.
    "ఎందువల్ల?"
    "హత్య రాత్రి తోమ్మిదిన్నరకూ, పది గంటలకూ మధ్య జరిగింది. అతను మీ యింట్లో రాత్రి పదకొండు గంటలు దాటేవరకూ ఉన్నాడంటూన్నారు. ఈమధ్యలో ఒక్క క్షణం కూడా అతను బయటకు వెళ్ళలేదా-?" అనడిగాడు రాజ్ కుమార్.
    "లేదు . ఒక్క క్షణం కూడా బయటకు వెళ్ళలేదు...."
    "బాగా గుర్తు చేసుకోండి...." అన్నాడు రాజ్ కుమార్.
    "నిజం చెప్పాలంటే తొమ్మిది నుంచి పది దాకా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. నేనే వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చాను " అన్నాడు వీరభద్రం.
    రాజ్ కుమార్ కళ్ళు మెరిశాయి. 'డాక్టర్ని మీరే తీసుకువచ్చారా? అయితే తొమ్మిదికీ పదికీ మధ్య ఇంట్లో లేరన్న మాట. ఆ సమయంలో అతను బయటకు వెళ్ళి వచ్చేశాడేమో?"
    వీరభద్రం నవ్వి - "ఇంపాజిబుల్ ...." అన్నాడు. "నేను స్కూటర్ మీద వెళ్ళాను. వెళ్ళడానికీ , డాక్టర్ని తీసుకు రావడానికి మొత్తం టైము పదిహేను నిముషాల కంటే పట్టలేదు. తోమ్మిదయ్యే సరికల్లా నేను డాక్టర్ని తీసుకుని వచ్చేశాను. అంతవరకూ అక్కడ మా అమ్మ ఉంది. డాక్టరు సుమారు గంటసేపు మా యింట్లో ఉన్నాడు."
    'అయితే దొరికినట్లే దొరికి హంతకుడు మళ్ళీ చేయి జారిపోయాడు" అంటూ భారంగా నిట్టూర్చాడు రాజ్ కుమార్.
    "ఒకవేళ హత్య పదకొండు దాటేక జరిగిందేమో" అన్నాడు వీరభద్రం.
    "అసాధ్యం. హత్య తొమ్మిదిన్నరకు ముందుగానీ పది తర్వాత గానీ జరగదానికీ ఏమాత్రమూ అవకాశాలు లేవని డాక్టర్ చెప్పాడు" అన్నాడు రాజ్ కుమార్.
    "అతను ఎవరో? మా నాన్నగారతన్ని ఎందుకు అనుమానించారో?" అన్నాడు వీరభద్రం.
    "పాయింట్ సార్!" అన్నాడు గోవిందం.
    "యేమిటది ....-----" అన్నాడు రాజ్ కుమార్ చిరాగ్గా.
    "ఈ ఫోటో లోని మనిషి హత్య చేస్తానని సాంబశివరావు గార్ని బెదిరిస్తూ ఉండి ఉంటాడు. అయితే ఆ విషయం సాంబశివరావు గారు గ్రహించి ఇతగాడి వేలిముద్రలు సంపాదించి - నువ్వు నన్ను చంపావంటే నేను చచ్చిన తక్షణం నీ వివరాలు పోలీసులకు అందజేసే ఏర్పాటు చేశానని బెదిరించి ఉంటాడు. ఆ ఏర్పాటుకు భయపడిన ఈ మనిషి హత్యకు మరో మనిషిని నియోగించి - హత్య సమయానికి తనకు దుర్భర్ధ్యమైన ఎలిబీ సృష్టించుకుని ఉంటాడు " అన్నాడు గోవిందం.
    'వండర్ పుల్!" అంటూ గోవిందం వీపు మీద గట్టిగా చరిచాడు రాజ్ కుమార్.
    గోవిందం వెనక్కు చేయి జాచి వీపు నిమురుకో బోయాడు కానీ వీలుపడలేదు. కానిస్టేబు లోకడు పరుగెత్తుకు వచ్చి గోవిందానికి వీపు నిమిరి పెట్టాడు. గోవిందం సంతోషించి రాజ్ కుమార్ తనను మెచ్చుకున్న విధంగానే కానిస్టేబుల్ని మెచ్చుకున్నాడు . కానిస్టేబుల్ చేతులు వెనక్కు జాపి వీపు నిమురుకున్నాడు.
    "సమస్య పువ్వులా విడిపోయింది. ఈ మనిషి దొరికితే హంతకుడు దొరికినట్లే! ఎలిబీ కోసమే అతను మీఇంటికి వచ్చి ఉండడమూ, కడుపు నొప్పి పేరుతొ డాక్టర్ని రప్పించు కోవడమూ జరిగింది. హత్య యెన్ని గంటలకు జరుగుతుందో అతనికి ఖచ్చితంగా తెలిసి వుండాలి. అందుకే పదకొండు గంటల ప్రాంతంలో అర్ధాంతరంగా ఇల్లు వదిలి పెట్టాడు. ఈ అయిడియా ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్ - హేట్సాఫ్ టు ఉంగరాలజుట్టు --" అన్నాడు రాజ్ కుమార్.
    ఇలా జరగవచ్చునని వీరభద్రానికి ముందుగా తోచలేదు కానీ గోవిందం , రాజ్ కుమార్ వివరించాక అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజజీవితంలో ఇంత నేర్పుగా ఓర్పుగా అలోచించి పధకాలు వేసుకునే వాళ్ళుంటారంటే అతనికి థ్రిల్లింగ్ గా ఉంది.
    "మీరన్న ప్రకారమే జరిగుండాలి సార్ - మా నాన్నగారి హత్య యితని కారణంగానే జరిగి ఉండాలి ?-" అన్నాడు వీరభద్రం.
    వీడింకా ఈ ఊళ్ళో నే ఉండి ఉంటాడు. ఫోటో వుంది, వేలిముద్ర్రలున్నాయి. ఈ ఊళ్ళో కాదు, ముల్లోకాల్లో ఎక్కడున్నా వీణ్ణి సాధించి తీసుకువస్తాను -" అన్నాడు రాజ్ కుమార్ దర్పంగా.
    
                                    10

    వీరభద్రం తలుపులు తీసి ఆశ్చర్యంగా "హాయ్ మీరా?' అన్నాడు. అంతలోనే అతని కళ్ళలో భయం తొంగి చూసింది. తనకు యెదురుగా నిలబడిన వ్యక్తీ సామాన్యుడు కాదు, నిండు ప్రాణాన్ని నిలువునా తీయగల దారుణ హంతకుడు.
    "ఇంక మీరు నన్ను మీరా అని పిలవక్కర్లేదు. ఇప్పుడు మీరడక్కుండానే నా పేరు చెప్పుకుంటాను. గోపీ నా పేరు " అన్నాడతను.
    'అయితే ఉంగరాల జుట్టు పేరు గోపీ అన్నమాట..." అనుకున్నాడు వీరభద్రం. "అయితే గోపీగారు -- మీరు కలుసుకునేలోగానే నాన్నగారు ...." అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడతను.
    "అన్నీ నాకు తెలుసునని మీకు తెలుసు. నాగురించి మీకున్న అనుమానాలు కూడా నాకు తెలుసు. పేపర్ లో నా ఫోటో చూసేక పోలీసులంటే కూడా నాకు అసహ్యం వేసింది. నన్ను పట్టి యిచ్చిన వారికి బహుమతి యిస్తారట. పట్టి యివ్వడానికి నేనేమైనా నేరస్థుడినా?" అన్నాడు గోపీ.
    "ఆ విషయాలు నాకేం తేలుస్తాయండీ -- ఏదో కారణం లేనిదే -- పోలీసులు ఎటువంటి పని చేయరు గదా?" అన్నాడు వీరభద్రం.
    "లోపలకు వచ్చి కూర్చోవచ్చా?" అన్నాడు గోపీ.
    తడబడుతూనే "రండి, కూర్చోండి -" అన్నాడు వీరభద్రం.
    గోపీ లోపలకు వచ్చి కూర్చుని - "నేను నేరస్తుడ్ని అనడానికి ఋజువు లేవు. ఆ విషయం మీకూ తెలుసు. అటువంటప్పుడు ఫోటో క్రింద అలా రాసి వుండాల్సింది కాదు. ఫలానా ఫోటోలోని వ్యక్తీ పైన అనుమానంగా వుంది కాబట్టి, అతను యెక్కడున్నా సరే వచ్చి పోలీసులకు కలుసుకోవలసింది -- అని రాసి వుంటే నేను ఎంతో సంతోషించేవాణ్ణి -" అన్నాడు.
    "అంటే?" అన్నాడు వీరభద్రం.
    నేను పోలీసులను కలుసుకొని మాట్లాడ్డానికి సిద్దంగా వున్నాను. అయితే అంతకు ముందుగా ,మీ యింటికి వచ్చాను. ఎందుకంటె హతుడు మీ తండ్రి. నేను సాంబశివరావు ని హత్య చేశానని పోలీసులతో పాటు మీరు నమ్ముతూ వుండి వుండాలి. అందుక్కారణం మీ నోటి వెంటనే వినాలని నాకు కోరిక కలిగింది."
    వీరభద్రం తండ్రి పోలీసులకు అందేలా ఏర్పాటు చేసిన ఉత్తరం గురించి చెప్పాడు. అదంతా విని "ఆ ఉత్తరం గురించి మీలో ఒక్కరూ బుద్ది ఉపయోగించి అలోచించి నట్టు లేరు. సాంబశివరావు గారినీ నేను హత్య చేయాలను కొంటె నా వివరాలన్నీ ఆయనకు అందజేసి - వాటితో అయన నన్ను బెదిరిస్తూంటే - అందుకొక ఎలిబీ సృష్టించుకొని హత్య చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక మనిషి తన్ను చంపాలను కుంటున్నాడని తెలిస్తే -- వాడ్ని తనను చంపనిచ్చి అ తర్వాత వాడి వివరాలు పోలీసులకు అందే ఏర్పాటు చేసిటంత తెలివితక్కువ దద్దమ్మలు ఈ ప్రపంచంలో యెక్కడైనా ఉంటారా? ఎవరికైనా  ప్రాణాలు ముఖం గానీ ప్రాణాలు పోయేక హంతకుడు దొరకడం ముఖం కాదు గదా! సాంబశివరావు  ముందుగానే పోలీసు లకు నా విషయమెందుకు చెప్పలేదు? అంటే ఇందులో ఏదో పెద్ద తిరకాసు ఉందనేగా అర్ధం!" అన్నాడు గోపీ.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.