Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 10


 

    అయితే సాంబశివరావు హత్యాసమయానికి ఆమె స్పృహ లో ఉందొ, లేదో పోలీసులు నిర్ణయించలేక పోతున్నారు. హత్య జరగడం ఆమె చూసిందనీ పోలీసుల బారి నుండి తప్పించుకోవడం కోసం మత్తుమందు మింగిందని ఒక వర్గం అంటుంటే, తన మనిషిని నియోగించి యీ హత్య చేయించి ఎలీబి కోసం మత్తుమందు మింగిందని ఇంకో వర్గం అంటున్నారు.
    "నా యింట్లో హత్య జరగడం నా వృత్తికి మంచిది కాదు. శవం పక్కన వుంటే ఏ మత్తు మందూ అక్కర్లేకుండానే మూర్చ పోయేటంత భయస్తురాలిని నేను. ఆ సమయంలో బుర్రకు పనిచేప్పే మనస్థిమితం కూడా నాకు వుండదు. అదలా గుంచితే సాంబశివరావు వల్ల నాకు బాగా లాభిస్తోంది. అయన చావుకు కలలో కూడా కోరుకోను" అందిట చంద్రావతి.
    ఆమె జవాబుల్లో సబబు కనిపించినా రాజకుమార్ కు కొన్ని అనుమానాలున్నాయి. ఎవరైనా బాగా డబ్బాశ చూపించి చంద్రావతి యింట్లో ఈ హత్య జరగడానికి ఏర్పాటు చేసి వుండవచ్చు. ఎందుకంటె సాంబశివరావును చంపడానికి అది ఆనువైన చోటు.
    హత్య విషయంలో చంద్రావతి ఎంతో కొంత సాయపడగలదు. కానీ ఆమె సాయపడడం లేదు. తనకేమీ తెలియదని అంటోంది. పోలీసులు శతవిధాల ప్రయత్నించారు.
    చంద్రావతిది చెప్పుకో తగ్గ అందం. మగవాళ్ళను ఆకర్షించే పద్దతులు ఆమెకు చాలా తెలుసు. శీలాన్ని అమ్ముకుని బ్రతుకుతున్న వ్యక్తీ. డబ్బున్నది, ఈ కారణాల వల్ల పోలీసులు చంద్రావతికి ఏమీ తెలియదన్న నమ్మకం త్వరగా కలిగింది. ఇన్ స్పెక్టర్ రాజకుమార్ ఆమె చేత ఎలాగైనా నిజాన్ని కక్కిన్చాలనుకున్నాడు కానీ ఐ.జీ గారు అతన్ని అలా చేయవద్దన్నాడు. అందుకు అసలు కారణం విషయంలో రాజకుమార్ కు అనుమానాలున్నా "ఆమె అమాయకురాలన్న నమ్మకం నాకు కలిగింది. అమాయకులను హింసించడం నాకు బాధను కలిగిస్తుంది" అని అయన చెప్పిన కారణం రాజకుమార్ అంగీకరించక తప్పలేదు.
    సాంబశివరావు వ్యాపారానికి సంబంధించిన మనుషుల్ని కలుసుకుని రకరకాలుగా ప్రశ్నించాడు. రాజకుమార్ కి అందరూ కూడా అయన గుణగుణాలను అమితంగా పొగిడారు.
    "అయన చచ్చిపోలేదనుకొండి. అప్పుడు అయన గురించి మీ అభిప్రాయం చెప్పండి" అని రాజకుమార్ వాళ్ళను రిక్వెస్ట్ చేశాడు- చచ్చిన వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం ఇష్టం లేక వాళ్ళలా అంటున్నారేమోనని భ్రమ పడి. చచ్చినా బ్రతికినా సాంబశివరావు గురించి వారందరిదీ ఒకే అభిప్రాయమని తేలిపోయింది.
    "పోనీ ఎవరికైనా అభిప్రాయ బేధాలు, ఎప్పుడైనా కోప్పడడం లాంటివి....?"
    హిరణ్యకశివుడు, రావణాసురుడు లాంటి వాళ్ళక్కూడా సాంబశివరావుతో అభిప్రాయ బెదాలుండవట. ఎవరైనా తన మీద తనే కప్పడవచ్చును కానీ సాంబశివరావు పైన కోప్పడడం అసాధ్యమట. అయన ఎవరి పైన అయినా కోపం ప్రకటిస్తే దాన్ని కోపంగా గుర్తించ గల వాడీ ప్రపంచంలో పుట్టలేదుట.
    ఇలాంటి కేసు రాజకుమార్ కు ఎక్కడా తగలలేదు. ఎలాగో అలా దీన్ని పరిష్కరించాలి . అందుకు అతను సాంబశివరావు కుటుంబసభ్యుల పైన ఆధారపడ్డాడు. వీరభద్రం మాట్లాడే పద్దతి అతన్ని ఆకర్షించింది. కన్నతండ్రి అయినప్పటికీ సాంబశివరావు గురించి అతను మాట్లాడిన విధంగా ఇతర పరిచయస్తులు కూడా చెప్పలేకపోయారు.
    అయితే ఫ్రాంక్ గా మాట్లాడడం ఒక్కటే చాలదు రాజకుమార్ కు, ఏదైనా చిన్న క్లూ దొరకాలి. అదే ఇంకా దొరకలేదు.

                                    8
    వీరభద్రం యింకా ఏదో ఆలోచిస్తుండగానే అక్కడికి ఓ పోలీసు కానిస్టేబులు వచ్చి రాజ్ కుమార్ కు సెల్యూట్ చేశాడు.
    "ఏమిటి విశేషం?" అన్నాడు రాజ్ కుమార్.
    కానిస్టేబుల్ రాజకుమార్ కు ఓ కవర్ అందించి - "ఎస్సై గారు మీకిది అర్జంటుగా అందజేయమన్నారండి" అన్నాడు.
    రాజ్ కుమార్ కవరు లోంచి ఒక ఉత్తరాన్ని బయటకు తీశాడు. ఆ ఉత్తరం చదువు తుంటే అతని కళ్ళు మెరిశాయి. ఉత్తరం చదవగానే - "ఎంత అదృష్టం ?" అన్నాడు.
    "ఏమయిందండీ ?" అన్నాడు వీరభద్రం.
    "హంతకుడు , క్లూ -- ఈ రెండింటిలో కనీసం ఒకటి దొరికినట్లుంది -' అన్నాడు రాజ్ కుమార్.
    వీరభద్రం కూడా ఆ ఉత్తరం చదివాడు. అది సాంబశివరావు దస్తూరీ. ఆయనకు తను హత్య చేయబడతానన్న అనుమానం వుంది. ఒక వ్యక్తీ ఆయన్ను హత్య చేస్తానని బెదిరిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణ కోరే అవకాశం లేదు కానీ ఆ హంతకుణ్ణి పట్టివ్వడానికి అయన అతగాడి ఫోటో, వేలిముద్రలు సేకరించి - ఈ ఉత్తరంతో కలిసి ఓ కవర్లో పెట్టి సీలు చేసి తనకు నమ్మకస్తుడైన ఒక వ్యక్తీ కిచ్చి -- తను కనుక హత్య చేయబడితే ఆ కవరు పోలీసు స్టేషన్ లో అందజేయవలసిందిగా కోరాడు.
    ఉత్తరంలోని తండ్రి దస్తూరీ చూస్తుంటే వీరభద్రం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "మా నాన్నగారంటే నా కెక్కువ యిష్టం లేదు. అయన మా అమ్మను సుఖపెట్టడం మాట అటుంచి కష్ట పెట్టడంతో నాకు ఆయనంటే కోపం కూడా. కానీ అయన యిక లేరనీ ఘోరంగా హత్య గావించపడ్డారనీ తెలిసి నాకు చాలా బాధగా ఉంది. ప్రవర్తన యెలా ఉన్నా ఆయనకు మేమంటే యెంతో యిష్టం . యెటువంటివాడైనా తండ్రి లేకపోవడం పెద్ద లోటే. ఆ లోటు ఈ జన్మకు తీరదు-"
    రాజ్ కుమార్ అతని వంక జాలిగా చూసి - "ఒక పోలీసు ఇన్ స్పెక్టర్ వద్ద మిరీలా మాట్లాడకూడదు. మీ మాటలు రికార్డు లోకి వెడితే మిమ్మల్ని కూడా అనుమానించవలసి ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచి యిప్పుడు మీరు చెప్పండి - మీ నాన్నగారు తననెవరో హత్య చేస్తారని బెదిరిస్తున్నట్లు మీ కెప్పుడూ చెప్పలేదా-"? అన్నాడు.
    "లేదు" అన్నాడు వీరభద్రం.
    "మీ అమ్మగారికి --"
    "లేదు-'
    "ఎలా చెప్పగలరు?"
    "మా అమ్మ అన్నీ మాకు చెబుతుంది..."
    "పోనీ ఒకసారి కనుక్కుని చూడండి..."
    "చూస్తాను. కానీ ఈ ఉత్తరంలో అయన హంతకుడి ఫోటో, వేలిముద్రలు పంపిస్తున్నట్లు రాశారు. ఆ ఫోటో, చూస్తె ఆ మనిషి గురించి ఏమైనా చెప్పగల నెమో...."
    "ఫోటో, వేలిముద్రలు -- ఎస్సై గారి దగ్గర ఉన్నాయండి. ఐడెంటిఫికేషన్ కు అయన అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారండి" అన్నాడు కానిస్టేబులు.
    వీరభద్రానికి ఆ ఫోటో చూడాలని చాలా ఆత్రుతగా వుంది. తండ్రిని హత్య చేస్తానని బెదిరించిన ఆ వ్యక్తీ యెవరు? యెందుకలా బెదిరించాడు? అతనే నిజంగా హత్య చేసాడా?" ఈ విషయాలన్నీ తండ్రి తనకూ తల్లికీ చెప్పకుండా యెందుకు దాచాడు? ఆఖరికి తన ప్రాణాలు ప్రమాదంలో ఉంటే పోలీసుల కైనా యెందుకు చెప్పలేదు ?
    వీరభాద్రన్ని చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయి.
    'అల్ రైట్ . నేను మళ్ళీ వస్తాను. ప్రస్తుతానికి అక్కడ మావాళ్ళు ఏం తెలుసుకున్నారో తెలుసుకోవాలి. అవసరాన్ని బట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను-' అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "సార్. నేనూ మీతో వస్తాను. ఆ ఫోటో ను గుర్తు పట్టడానికి పనికి వస్తాను...." అన్నాడు వీరభద్రం.
    'అలాగే" అన్నాడు రాజ్ కుమార్. "ఈలోగా ఈ ఉత్తరం ఒకసారి మీ అమ్మగారికి చూపించి ఆవిడ ఏమైనా చెప్పగలరేమో చూడండి."
    వీరభద్రం ఉత్తరం తీసుకెళ్ళి తల్లికి చూపించాడు. ఆవిడ అది చదివి భోరున ఏడ్చింది. ఉత్తరం కన్నీళ్ళతో తడిసి పోకుండా వీరభద్రం కాపాడాడు.
    "హత్య చేస్తానని నాన్నగారిని బెదిరించే వ్యక్తీ ఎవ్వరయ్యుంటారు" అన్నాడు వీరభద్రం.
    "అయన తాగితే తాగారు. ఆడవాళ్ళ కోసం డబ్బు తగలేస్తే తగలేశారు. కానీ ఒకరితో గొడవ పెట్టుకునే మనిషి కాదు. ఆయన్ను హత్య చేయాలనుకునే మనిషి గురించి యెలా ఊహించి చెప్పాలి?" అంది లక్ష్మమ్మ.
    వీరభద్రం అ ఉత్తరం తీసుకుని రాజ్ కుమార్ వద్దకు వెళ్ళి తల్లి చెప్పిన మాటలు అతనికి చెప్పాడు. ఇన్ స్పెక్టర్ నిట్టూర్చి బయటికి నడిచాడు.

                                    9

    "కేసులో మనం కాస్త ముందుకు వెళ్ళి నట్లే తోస్తోంది. హతుడి జేబులోని రేడియో మీద వేలిముద్రలతో -- సాంబశివరావు పోస్టు చేయించిన కవర్ లోని వేలిముద్రలు టాలీ అయ్యాయి-" అన్నాడు ఎస్సై గోవిందం.
    రాజ్ కుమార్ కళ్ళు మెరిశాయి - "ఫోటో యేది ...?'
    'పది నిమిషాల్లో వస్తుంది. పాత నేరస్తులలో అయిడెంటిఫై చేయటానికి పంపించాను...."అన్నాడు గోవిందం.
    ఫోటో వచ్చేవరకూ వీరభద్రం అక్కడ అసహనంగా కూర్చున్నాడు. ఫోటో రాగానే ఆత్రుతగా లేచి పోయాడు.
    'ఇతను పాత నేరస్థుడు కాడు...." అన్నాడు ఫోటో తీసుకువచ్చిన మనిషి.
    వీరభద్రం ఫోటో చూసి ఆశ్చర్యంగా - "అరే - "ఇతనా?" అన్నాడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.