Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 6


   
    "కూరగాయల లచ్చన్న రంగారావుకు ఆడపిల్లల్ని ఏర్పాటు చేసేవాడు. తన పేరు బయటకు రాకుండా చాలా పకడ్భందీగా వ్యవరించేవాడు లచ్చన్న"అంది సీతమ్మ.
    వెంకన్న బుర్రలో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి. రంగారావు, విష్ణుమూర్తి , కూరగాయల లచ్చన్న , రమ అందరికీ శివరావుతో సంబంధం వుంది. వాసు అతడి తరపున నేరాలు చేస్తున్నాడు. అతడు కిరాయి గుండా కాదు. హత్యలు చేయగల ధైర్యం కూడా అతనికి లేదు.
    ఏమిటి విచిత్రం?
    అప్పుడే అతడికి నోట్ బుక్ లోని అయిదవ అంకె గుర్తుకొచ్చింది.
    ఇంకా ఒక నేరం జరగాలి. ఈ నేరం కూడా వాసు చేస్తాడా?
    ఇప్పుడు వాసు మీద వెంకన్న నిఘా మనుషులున్నారు. అతణ్ణి తెలివిగా ట్రాప్ చేయడం కోసం వాసు పై తనకు గల అనుమానాలను బహిర్గతం చేయలేదు వెంకన్న.

                                  13
    ఆరోజు రాత్రి వెంకన్న కు ఫోన్ వచ్చింది -- వాసు సెకండ్ షో పిక్చర్ కి బయల్దేరుతున్నట్లు. వెంకన్న వివరాలు నోట్ చేసుకుని తనూ ఆ పిక్చర్ కి వెళ్ళి వాసుని ఓ కంట కనిపెడుతున్నాడు.
    సినిమా ఇంకా పూర్తీ కాకుండానే వాసు లేచాడు. అతడితో పాటు వెంకన్నా లేచాడు.
    వాసు చకచకా నడుస్తున్నాడు. దారి అతడికి పూర్తిగా తెలిసినట్లే వుంది. వెంకన్న అతన్ని అనుసరిస్తున్నాడు.
    వాసు ఓ యింటి ముందాగి తలుపు తట్టాడు. సుమారు ఇరవైయేళ్ళ కుర్రాడు తలుపు తీశాడు.
    వాసు చివాలున లోపలకు అడుగు పెట్టి ఆ కుర్రాడ్ని చేత్తో బట్టుకుని -- "అరవకు-" అన్నాడు. అప్పుడే అతడి రెండో చేయి గాలిలోకి లేచింది. ఆ చేతిలో కత్తి వుంది.
    వెంకన్న వెనక నుంచే వాసు చేతి మీద ఓ దెబ్బ వేశాడు.  అతడి చేతిలోని కత్తి జారిపడింది. వాసు వెనక్కు తిరగలేదు. అతడా కుర్రాడి పీక పట్టుకున్నాడు. ఆమాత్రానికే అ కుర్రాడికి స్పృహ తప్పినట్లుంది.
    వెంకన్న వాసు రెండో చేతి మీద దెబ్బ వేశాడు.
    వాసు చటుక్కున వెనక్కు తిరిగాడు.
    "మిస్టర్ వాసూ! ఏమిటి పని!" అన్నాడు వెంకన్న.
    "నా పేరు వాసు కాదు --" అన్నాడతను క్రూరంగా వెంకన్న వైపే చూస్తూ.
    "మరేమిటి నీ పేరు?"
    "శివరావు!"
    ఉలిక్కిపడ్డాడు వెంకన్న -- "మిస్టర్ శివరావ్! నువ్వేనా! రంగారావునీ, విష్ణుమూర్తి నీ, లచ్చన్ననీ హత్య చేశావ్. రమకు మానభంగం చేశావ్....ఎందుకీదంతా చేస్తున్నావ్?" అన్నాడు.
    "ఎందుకా?" రమ నాకు లొంగలేదు. లచ్చన్న సాయం అడిగాను. తనవల్ల కాదన్నాడు. నావల్ల కాదన్న వెధవ రమను రంగారావుకు అప్పజెప్పాడు. అందుకే రంగారావును లచ్చన్నను కూడా చంపేశాను. రమను మానభంగం చేసేశాను. ఆస్తి కోసం అన్నయ్యను చంపేశాను. ఇదుగో -- ఈ కుర్రాడు ....వీడు మా నాన్నకు కలిగిన అక్రమ సంతానం. తనకు చదువు చెప్పిస్తే చాలు-- మా పరువు పోకుండా తన బ్రతుకు తను బ్రతుకుతానన్నాడు. అయితే మాత్రం వీడ్ని ఎంతకాలం భరించేది?" అన్నాడు వాసు.
    "నువ్వేమో-- పేరు శివరావని అంటున్నావు. చూడ్డానికి వాసులా వున్నావు ...." అన్నాడు వెంకన్న.
    "ఆదా?" అని నవ్వాడు వాసు -- "నాకు సైకాలజీ బాగా తెలుసు. మనం చేయాలనుకున్న పనులు మనం చేయక్కర్లేకుండా కొందరు బలహీన మనుష్యుల చేయ చేయించవచ్చు. ఓసారి హోటల్లో ఎదురయ్యాడు వాసు. బయట వున్న ఊరకుక్కను నేను కొట్టాలనుకోగానే అతను కొట్టాడు. అప్పుడే నాకు అయిడియా వచ్చి అతడి మీద ప్రయోగం ప్రారంభించాను. అతడి మెదడు నాకు వశమైంది. నేను నాగదిలో ఏకాగ్రత వహించానంటే అతనిక్కడ నేను చేయాలనుకున్న పని చేస్తాడు. అప్పుడతనికి మెదడు, ఆలోచనలు -- అతనివి కావు . నావి...."
    వెంకన్న ఆశ్చర్యంగా -- "ఇది నేను నమ్మను. నమ్మలేను ...." అన్నాడు.
    "నమ్మునా, నమ్మకపోయినా ఇది నిజం ...." అంటూ వాసు-- "మిస్టర్ వెంకన్నా -- నన్ను వదులు...." అన్నాడు.
    వెంకన్న అతన్ని వదల్లేదు. మెడ పక్కన ఏదో నరం మెలితిప్పి అతడికి స్పృహ తప్పించాడు.
    
    
                               *    *    *    *

    శివరావు ఇంటిని హటాత్తుగా దాడి చేయగా వాసు విచిత్ర ష్టితిలో వెంకన్న కు చెప్పిన విషయాలన్నీ నిజమే నని తెలిసింది. వెంకన్న వంటి వాడు నేరం చేసేటప్పుడు వాసుకు ఎదురౌతాడన్న విషయం శివరావు గ్రహించలేదు. అందువల్ల వాసు నాలోచించుకుని వున్న ఆలోచనలన్నీ అతను వెంకన్న కు చెప్పేశాడు.
    శివరావు ఇంట్లో మానసిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలూ, అతడు హత్యలకు వేసుకున్న రకరకాల పదకాలూ, అతడు తన ప్రయోగాల విషయంలో తయారు చేసుకున్న నోట్సు అన్నీ దొరికాయి.
    ఇటువంటి వింత కేసు తటస్థపడినందుకు పోలీసు అధికారులు అడిరిపోయారు. ఈ కేసు పరిశోధించిన , పరిశోధించగలిగిన వెంకన్న కు అభినందన పరంపరలు శాతాధికంగా వచ్చి పడసాగాయి.
    అయితే విషయం వెంటనే వాసూ వరకూ వెళ్ళలేదు. ఒకరకమైన ఆకస్మారక స్థితిలో అతడు హత్యలు చేశాడు. ఆ వార్త విని అతడు మతి పోగొట్టుకుంటే ఆశ్చర్యం లేదు.
    శివరావు అరెస్టయ్యాడు. వాసు విషయం ఏం చేయాలో లాయర్ల కు వదిలిపెట్టాడు వెంకన్న.  ఓ ప్రముఖ లాయరు వాసునీ కేసు నుంచి రక్షిస్తానన్నాడు. అప్పుడాయన్ను తీసుకుని వెంకన్న వాసు ఇంటికి వెళ్ళాడు.
    డాక్టరు సలహా పేరిట వాసు బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు.
    వెంకన్న ను చూసి అతడు లేచాడు. వెంకన్న అతన్ని పడుకోమని -- "నీకోసం లాయర్ని తెచ్చాను--"అన్నాడు.
    "ఎందుకు?" అన్నాడు వాసు.
    "నీకు తెలియకుండా నువ్వు చేసిన హత్యల విషయంలో నిన్ను రక్షించడానికి!"
    "నేను హత్యలు చేశానా?" వాసు ఆశ్చర్యంగా అడిగాడు.
    వెంకన్న నెమ్మదిగా శివరావు పధకం గురించి చెప్పసాగాడు.
    రంగారావు హత్య గురించి విన్నాడు వాసు. అతడి కళ్ళు పెద్దవయ్యాయి. విష్ణుమూర్తి హత్య గురించి వినగానే కెవ్వుమని కేక వేశాడు. అతను తెరచిన నోరు తెరిచినట్లే వుండిపోయింది.
    "ఏమయింది?' అన్నాడు లాయర్.
    వెంకన్న వాసు చేయి పట్టుకుని నాడి పరీక్షించి -- "పాపం యమునకు అన్యాయం జరిగిపోయింది--" అన్నాడు.

                                                   *    *    *    *

    "అతడు చనిపోవడమే మంచిది, బలహీనమైన అతడి మెదడు గురించి తెలిశాక ఇంకా ఎంతమందికి దుర్భుద్ది పుడుతుందో -- " అన్నాడు వెంకన్న -- భార్య పద్మావతి దేవితో మాట్లాడుతూ..


                    -----: అయిపొయింది :-------




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.