Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 6


 

                                 10
    "మూడు రోజుల్నుంచి నా ఫ్రెండ్సతన్ని షాడో చేస్తున్నారు. ఇంతవరకూ చెప్పుకోదగ్గ విశేషమేమీ జరుగలేదు...."అందిసీతమ్మ.
    "మన పరిశోధన తప్పుదారిలో వెడుతున్నదేమోననిపిస్తోంది--" అన్నాడు వెంకన్న.
    అప్పుడే అక్కడ టెలిఫోన్ మ్రోగింది.
    "హలో!"అన్నాడు వెంకన్న.
    "హలో -- వెంకన్న గారూ-?" అందవతల్నించి ఓ స్త్రీ కంఠం.
    "అవును...."
    "వెంకన్న గారూ! నేనో పెద్ద పొరపాటు చేశాను. ఒక దుర్మార్గుడ్ని సన్మార్గుడనుకుని వాడి ఆచూకీ ఇంత కాలమూ దాచి పెట్టాను. వాడు నిన్న రాత్రి నా యింటి కొచ్చాడు. గౌరవంగా అన్నయ్యా అని పిలిచాను. అయినా నన్ను....నన్ను.....క్రూరంగా హింసించి.....బలవంతంగా అనుభవించి వెళ్ళిపోయాడు...." ఫోన్ లో మాటలు ఆగి ఏడుపు ఆరంభమైంది.
    "హలో -- మీరెవరో చెబుతారా?"
    "నేనెవరో తెలుసుకుని మీరెం చేస్తారు? రంగారావుని చంపిన హంతకుడేవరో చెబుతాను. వెళ్ళి అతన్ని పట్టుకోండి. నేను మాత్రం ఈ కేసులో బయటకు రావదల్చుకోలేదు. అడ్రస్ నోట్ చేసుకోండి -" అంటూ ఆమె గబగబా ఓ చిరునామాచేప్పి ఫోన్ పెట్టేసింది.
    "ఈ అజ్ఞాత యువతి ఎవరో?" అంటూ నిట్టూర్చాడు వెంకన్న.
    "నోట్ బుక్ లో వ్రాసిన ప్రకారమే ఒక్కొక్క నేరమే జరిగి పోతోంది. మనం అనుకున్న శివరావు హంతకుడు కాదు --" అంది రాజమ్మ.
    "ఈ యువతి చెప్పిందే నిజమైతే హంతకుడి పేరు వాసు. అతనింతవరకూ తటస్థపడలేదు. వెంటనే అతన్ని కలుసుకోవాలి...." అన్నాడు వెంకన్న.
    "మన టైము శివరావు మీద వృధా అయింది. నిన్న రాత్రి కూడా శివరావు ఇల్లు వదిలి బయటకు రాలేదుట--" అంది సీతమ్మ.
    "ఈ వాసు ఎవడో ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలి. అయితే అజ్ఞాత యువతీ మాట పట్టుకుని అతడింటికి వెళ్ళి నేరస్థుడని ఎలా చెబుతాం? ఇంతవరకూ జరిగిన నేరాల్లో ఒక్కదానికీ క్లూ లేదు. హంతకుణ్ణి స్వయంగా చూసినామే అతడి పేరు, చిరునామా చెప్పింది కానీ తను బయటపడ్డం లేదు. కేసు చాలా క్లిష్టంగా వుంది-" అన్నాడు వెంకన్న.
    "అసలు ఇన్స్ పెక్టర్ గారి పరిశోధన ఎంతవరకూ వచ్చిందో? ఆయనే మైనా కొత్త విశేషాలు తెలుసుకున్నాడెమో?" అంది రాజమ్మ.
    "అవును అన్నట్లు నేనోసారి ఇన్స్ పెక్టర్ ని కలిసి రావాలి. ఈలోగా ఏదైనా అర్కెంటు మేసేజుంటే అక్కడికి ఫోన్ చేయండి--" అంటూ లేచాడు వెంకన్న.

                                     11
    వెంకన్న పోలీస్ స్టేషన్ చేసేసరికి అక్కడొక యువతి, యువకుడు ఉన్నారు. వారిద్దరూ భార్యాభర్తలని తెలుస్తూనే వుంది.
    "వీళ్ళెవరు?" అన్నాడు వెంకన్న ఇన్స్ పెక్టర్ తో.
    "నిన్న రాత్రి వీళ్ళింట్లో దొంగతనం జరిగింది. రిపోర్టివ్వడానికి వచ్చారు...." అన్నాడు ఇన్స్ పెక్టర్.
    "దొంగతనమేలా జరిగింది?' అన్నాడు వెంకన్న.
    ఆ యువతి వివరించి చెప్పి -- "అయన లేని సమయంలో వాడింట జొరబడి ఇంట్లోని విలువైనవన్నీ మంగళసూత్రాలతో సహా మూటకట్టుకుని పోయాడు. ఆ సమయంలో వాడు నా జోలికి రానందుకు సంతోషించాను...." అంది.
    వెంకన్న దొంగతనం గురించి మరికొన్ని ప్రశ్నలు వేసి ఎక్కడ జరిగిందో అడిగి -- ఆమె చెప్పిన సమాధానం విని ఉలిక్కిపడి వాళ్ళ పేర్లు అడిగాడు.
    ఆమె పేరు యమున, అతడి పేరు వాసు!
    వెంటనే వెంకన్న ముఖం గంబీరంగా అయిపొయింది. "మిస్టర్ వాసూ! నిన్ను నేను కొన్ని ప్రశ్నలడగాలి!"
    "అడగండి!" అన్నాడు వాసు వినయంగా.
    "నిన్నరాత్రి తేలు మందు తీసుకొస్తానని నువ్వెక్కడికి వెళ్ళావ్?' అన్నాడు వెంకన్న.
    సమాధానంగా వాసు నవ్వి ఊరుకున్నాడు.
    "సమాధానం కావాలి నాకు...." అన్నాడు వెంకన్న.
    యమున కలగజేసుకుని -- "ఈ ప్రశ్నడగడం వల్ల మీ కేమిటి ప్రయోజనం?" అంది.
    "ఉంది కాబట్టే ఆడుతున్నాను...." అన్నాడు వెంకన్న.
    "అదేమిటో చెప్పండి!" అంది యమున పట్టుదలగా.
    "ఈ దొంగతనం నీ భర్తే చేయించాడు..." అన్నాడు వెంకన్న.
    ఈ అభియోగానికి యమున, వాసు ఇద్దరూ తెల్లబోయారు. "ఆయనింట్లో ఆయనే దొంగతనం చేయాల్సిన అవసరమేముంది?" అంది యమున.
    "ఈ రోజుల్లో చాలామంది మగాళ్ళకి ఆడాళ్ళకి తెలియని ఖర్చులుంటాయి. అందుకోసం ఇలాంటి నాటకాలాడుతుంటారు. లేకపోతే ఏడున్నరకు బయటకు వెళ్ళిన నీ భర్త రాత్రి మూడింటికి తిరిగి రావడమేమిటి? ఇంట్లో ఒంటరి ఆడదుందని తెలిసీ మీద చేయి వేయకపోవడమేమిటి?" అన్నాడు వెంకన్న.
    "చేతి మీద దోమ వాలితే చంపలేని నా భర్త దొంగతనాని కంత ప్లాను చేస్తారని నేననుకోను...."
    యమున మాటలకు వెంకన్న నవ్వి -- "చేతిమీద దోమను చంపలేని వాళ్ళు హత్యలు చేయలేరనుకోవడం చాలా తెలివితక్కువ. నిన్న రాత్రి నీ భర్త ఓ అమ్మాయిని మానభంగం చేసి వచ్చాడంటే నమ్ముతావా?' అన్నాడు.
    వాసు భయం భయంగా -- "నిజంగా నాకేమీ తెలియదు-...." అన్నాడు.
    "రాత్రి ఎక్కడి కెళ్ళావో చెప్పు ...." అన్నాడు వెంకన్న.
    "నిజంగా నాకేమీ తెలియదు...." అన్నాడు వాసు.
    ఇన్స్ పెక్టర్ విసుగ్గా -- "ఇదంతా ఏమిటి మిస్టర్ వెంకన్నా!" అన్నాడు.
    "ఏదో నాపిచ్చి, రిపోర్టివ్వడమై పొతే వాళ్ళను వెళ్ళమనొచ్చు--" అన్నాడు వెంకన్న.

                                     12    
    "శివరావు గ్రంధ సాంగుడే! అతడికి అమ్మాయిల పిచ్చి వుంది. చచ్చిపోయిన రంగారావు అంతటి వాడు కాకపోయినా చాలాకాలంగా అతడో అమ్మాయి చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయే మన అజ్ఞాత యువతి కావచ్చు ననిపిస్తోంది--" అంది రాజమ్మ.
    వాసుతో మాట్లాడటమయ్యాక వెంకన్న కేసు విషయంలో చాలా తీవ్రంగా పరిశోధించాడు.
    శివరావు కీ, వాసుకీ ఎటువంటి సంబంధమున్నదో విచారించాడు. ఇద్దరి గుణగుణాల గురించీ విచారించాడు. పరిశోధనలో వాసు చాలా అమాయకుడనీ, నిజంగానే చీమను కూడా చంపలేని వాడనీ తేలింది. అలాంటివాడు హత్యలు చేస్తాడన్న విషయం నమ్మడం కష్టం. అయితే హత్యలు, నేరాలు జరిగిన రోజుల్లో అతడికి ఎలిబీ లేదు. ఆరోజుల్లోనే అతడు సెకండ్ షో పిక్చర్ కి వెళ్ళినట్లు వెంటనే ఇంటికి తిరిగి రానట్లూ యమున డైరీలో వుంది. అతడికి శివరవుతో ఎటువంటి సంబంధం లేదు.
    కానీ శివరావు గుణగుణాలు మంచివి కాదు. అతను తరచు వ్యభిచార గృహాలకి వేడుతుంటాడు. ఈ విషయంలో అతడికి సహకరించే ఒక వ్యక్తీ ద్వారా అజ్ఞాత యువతి వ్యవహారం బయటపడింది. వెంకన్న ఆమెను కలుసుకున్నాడు.
    ఆమె పేరు రమ. ముందామే విషయం ఒప్పుకోలేదు. వెంకన్న డబాయించాగా ఒప్పుకుని తన పేరు బయటకు రానివ్వద్దని వేడుకుంది.
    "శివరావు నన్ను కోరాడు. నేను నిరాకరించాను. రంగారావు కన్ను నామీద పడేలా చేస్తానని బెదిరించాడు. అతనే అలా చేశాడో ఏమో కానీ నేను రంగారావు ట్రాప్ లో పడి అతనింటికి వెళ్ళాను. అక్కడ రంగారావు బలవంతం చేయబోయాడు. నేను ప్రతిఘటించి అలసిపోయాను. నా సర్వస్వం దోచుకోబడే సందర్భంలో వాసు వచ్చి రంగారావుని క్రూరంగా హింసించి చంపి నా మానం కాపాడాడు. అతను నా జోలికి రాలేదు. సరిగదా సరైన ఆచ్చాదన లేని నా వంటి మీద గుడ్డ కూడా కప్పాడు. అప్పుడే నేనతన్ని నోరారా అన్నయ్య అని పిలిచాను. ఈ సంఘటన జరిగాక శివరావు మళ్ళీ నన్ను సమీపించాడు. అతన్ని నేను తిప్పి కొట్టాను. తర్వాత వాసు వచ్చి నన్ను మానసికంగా హింసించి శారీరకంగా అనుభవించి వెళ్ళిపోయాడు. ఇదీ నా కధ . ఇందులో నా కింకేమీ తెలియదు--" అందామె.
    "నువ్వు మొట్టమొదటే వాసు పేరు బయటపెట్టి వుంటే నేను నిన్ను రక్షించగలిగి వుండేవాడ్ని--" అంటూ వెంకన్న ఆమెకు తన దగ్గరున్న నోట్ బుక్ చూపించాడు.
    అది చదివి అదిరిపడింది రమ-- "ఆ వాసు చాలా మంచివాడనీ నన్ను రక్షించడానికి వచ్చాడనీ అనుకున్నాను నేను. ఆవేశంతో హత్య చేశాడు తప్పితే ఇలా పధకం ప్రకారం హత్యలూ, నేరాలు చేస్తున్నాడని ఊహించలేక పోయాను. చేజేతులా ఘోరం అనుభవించాను...."
    "ఇప్పటికైనా కళ్ళు తెరిచావు. ఆ వాసుని పట్టివ్వడంలో సహకరిస్తావా?" అన్నాడు వెంకన్న.
    "ఈ క్షణం నుంచీ మీరేం చెబితే అది చేస్తాను...." అంది రమ.
    అతనక్కడ్నించి ఇంటికి వెళ్ళేసరికి -- "బాస్ ఓ పెద్ద కనెక్షన్ దొరికింది -- " అంది సీతమ్మ.
    "ఏమిటది?' అన్నాడు వెంకన్న.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.