Home » Jonnalagadda Rama Lakshmi » Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1



    "ఏం జరిగిందో చెప్పు" అంది గీత.
    "జ్యోతి-మనిషి ఎంత అందమైనదో మనసుకూడా అంత అందమైనది ధన లాభంతో ఆమెను పోగొట్టుకోకుండా నువ్వు కాపాడేవు."
    "ఏం జరిగింది?"
    "జ్యోతి నిన్న నన్ను కలుసుకుంది...." అని ఆగాడు రాంకుమార్.
    ఇంతకాలం జ్యోతి అతడికి దూరంగా వుండడమేకాక పెళ్ళిగురించి కూడా తేల్చి చెప్పడంలేదు. మనం ఒకరి నొకరు బాగా అర్ధం చేసుకోవాలి-అంటూండేదామె. నిన్నటి దినం ఆమె-రాంకుమార్ ని వివాహం చేసుకుందుకు నిర్ణయించుకున్నట్లు తేల్చి చెప్పింది.
    "చూడామె ఎంత గొప్పదో! నాగురించి చెడుగా వినగానే రవంతకూడా చలించలేదు. ఆ ప్రసక్తి నా వద్ద తీసుకుని రాలేదు. నా అనుమానం ఆమె నా ట్రిక్కు తెలుసుకుందని!" అన్నాడు రాంకుమార్.
    "అసలు నువ్వామెను పోగొట్టుకునే ప్రమాద మెందుకుంది?"
    రాంకుమార్ నవ్వి తన ప్రేమకథను చెప్పాడు.
    ప్రేమ అనే సెంటిమెంటు పెళ్ళికి దారితీస్తుంది. పెళ్ళి అంటే ఇద్దరపరిచితులు జీవితకాలం కలిసి జీవించాలి. అందుకే ప్రేమలో ఎప్పుడూ ఆల్టర్నేటివ్ వుండాలి ఒకరిని ప్రేమించి దెబ్బతింటే దిగాలుపడిపోకుండా ఆల్టర్నేటివ్ గా మరి ప్రియురాలుండాలి. ఇద్దరిలో ఒకరి నెన్నుకోవాలి.
    రాంకుమార్ జ్యోతిని ముందు ప్రేమించాడు. ఆమెకు ఆల్టర్నేటివ్ గా ఆమె స్నేహితురాలు చందనను కూడా ప్రేమించాడు. జ్యోతికి అందం మాత్రముంది. చందనకు అందంతోపాటు ఆస్తికూడా వుంది. చందనవి విశాల భావాలని అతడి అభిప్రాయం. కానీ నిన్నటి దినం ఆమె అతణ్ణి లేనిపోని అనుమానాలతో వేధించింది. లాయర్లా ప్రశ్నలు వేసి అతడి శీలం మంచిది కాదనీ, కాల్ గర్ల్స్ తో తిరుగుతాడనీ ఋజువు చేయబోయింది.
    రాంకుమార్ తన జేబులోంచి ఓ పర్స్ తీశాడు. అందులోంచి ఓ ఫోటోతీసి క్రింద పారేసి-"ఇకమీదట నా పర్స్ లో రెండు ఫోటోలకు స్థానంలేదు. జ్యోతి ఫోటో మాత్రమే ఇందులో వుంటుంది" అన్నాడు.
    గీత అప్రయత్నంగా క్రిందపడిన ఫోటో చూసింది. దాన్నామె చేతులోకి తీసుకుని-"నువ్వు పారవేసిన ఫోటో ఎవరిది?" అంది.
    "చందనది!" అన్నాడు రాంకుమార్.
    "చందనదా!" అందామె ఆశ్చర్యంగా ఆమెనే తను జ్యోతిగా భావించి పార్క్ లో రాంకుమార్ కు వ్యతిరేకంగా నూరిపోసింది. తనవల్ల అలాంటి పొరపాటెలా జరిగింది?
    జ్యోతి యింట్లోంచి బయటకు వచ్చిందామె. ఆ కారణంగా తనామెను జ్యోతిగా భావించింది. బహుశా చందన జ్యోతి యింటికి వెళ్ళివుంటుంది.
    రాంకుమార్ జ్యోతిని పరీక్షించాలనుకున్నాడు.  తను చందనను పరీక్షించింది. చందన పరీక్షలో ఓడిపోయింది.
    "జ్యోతి ఫోటో చూడనీ!" అంది గీత.
    రాంకుమార్ ఆమెకు జ్యోతి ఫోటో చూపించాడు.
    తెల్లబోయింది గీత జ్యోతి అంటే ప్రసాద్ ప్రియురాలు, చిలిపితనానికి తను ఆమెలో ప్రసాద్ కు వ్యతిరేకంగా భావాలు ప్రవేశపెట్టింది.
    అసలేం జరిగి వుంటుంది?
    చందన జ్యోతి ఇంటికి వెళ్ళింది. ఏదో ప్రోగ్రాం వేసి వుంటుంది. అయితే జ్యోతి ప్రసాద్ ను కలుసుకోవలసి వుంది. అనారోగ్యంవంక పెట్టి ఆమె చందనను పంపివేసి వుంటుంది. అందుకే గుమ్మందాకా కూడా రాలేదు. తర్వాత ఆమె పార్క్ కు వచ్చింది. తన కబుర్లు వింది.
    రాంకుమార్ లాగే జ్యోతికూడా ప్రసాద్ ను ఆల్టర్నేటివ్ ప్రేమికుడిగా వుంచుకుంది. ప్రసాద్ గురించి తెలియగానే రాంకుమార్ పై ఆమెకు గౌరవం పెరిగింది.
    డబ్బిచ్చి కాల్ గర్ల్ ని గదికి తెచ్చుకుని ఆమెను తాకనైనా తాకని రాంకుమార్-తండ్రి మాటలకు భయపడి ఇతర స్త్రీలను పెళ్ళిచూపులు చూడ్డానికి వెళ్ళే ప్రసాద్ కంటే- జ్యోతికి తగిన వరుడు.
    గీత ఓ జంటను విడదీసింది. అందుకామెకు విచారంగా లేదు.
    రాంకుమార్ జ్యోతి పరీక్షలో నెగ్గిందనుకుంటున్నాడు.
    జ్యోతి తన ఆల్టర్నేటివ్ ప్రియుడు మోసగాడనుకుంటోంది.
    ఏమైతేనేం-ఆ జంట ఒకరికొకరు దగ్గరయ్యారు. అదీ తన కారణంగా!
    గీత జరిగిందేమిటో రాంకుమార్ కి చెప్పదల్చుకోలేదు!


                               -:అయిపోయింది:_




Related Novels


Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.