Home » Jonnalagadda Rama Lakshmi » Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1



    "అలా తిరిగితే కాలక్షేపం కాదు కూర్చో-నా కథ చెబుతాను" అంది గీత చనువుగా.
    ఆమె ఏమనుకుందో ఏమో గీత కెదురుగా కూర్చుంది.
    "నిజం చెబుతాను. నన్నీసడించకు. నేను నీలాంటి దాన్ని కాదు. నువ్వు నాలాంటిదానివి కాదని చూస్తూనే గ్రహించాను...."
    ఆమె మాట్లాడలేదు.
    "నేను చెడిన మాట నిజం. అంతమాత్రాన నాతో మాట్లాడితేనే నువ్వూ చెడిపోతావా?" అంది గీత బాధగా.
    ఆమె తడబడి "నా ఉద్దేశ్య మదికాదు. నా ఆలోచనల్లో నేనున్నాను. నీ గురించి నాకేమీ తెలియదు" అంది.
    "నా గురించి వినడం నీకు ప్రయోజనం...." అంది గీత. ఆ యువతి అనుమతి కోసం ఎదురుచూడకుండా ఆమె చెప్పడం ప్రారంభించింది.
    "అతడు నన్ను ప్రేమించానన్నాడు. నిజమేననుకున్నాను. అతడు నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు. లొంగిపోయాను. తర్వాత నుంచి మొహం చాటేయడం మొదలు పెట్టాడు. అతడి మోసం అర్ధమయింది కానీ నేనేం చేయగలను? ఆ తర్వాత కొన్నాళ్ళకతడు తన తప్పు తెలుసుకున్నానని మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు. నిజమేననుకున్నాను. అతడి దురుద్దేశ్యం నా కర్ధం కాలేదు.
    ఇంట్లో తల్లిదండ్రులు పెళ్ళికొప్పుకోరని చెప్పి-నన్నెక్కడికో తీసుకుని వెళ్ళాడు. నన్ను డబ్బు కో దుర్మార్గుడికమ్మేశాడని ఆలస్యంగా నాకు తెలిసింది. అక్కడ నన్ను బలవంతంగా వ్యభిచారంలో ప్రవేశపెట్టాలని కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అక్కణ్ణించి నన్నో యువకుడు రక్షించాడు-ఒక షరతుమీద. నే నిప్పుడు కాల్ గర్ గా ఉంటూ నా సంపాదనలో కొంత ఆ యువకుడి కిచ్చుకుంటున్నాను. వ్యభిచారంకంటే బాగా మెరుగ్గా వుందిది.....
    అప్ప్దుఆ యువతి గీతవంక జుగుప్సాకరంగా చూసింది. ఆమె తన నసహ్యించుకున్నట్లు గీత కర్ధమయింది.
    "అలా చూడకు నా కథ పూర్తిగా విను. ఓ గంట క్రితం తొలిసారి నన్ను మోసగించిన దుర్మార్గుడు కనిపించాడు. నన్ను చూసి ముఖం చాటేయబోయాడు. నేనే పిలిచి పలకరించి ఇక్కడకు తీసుకుని వచ్చాను. నా కథ చెప్పుకున్నాను. వాడికి నా మీద యింకా ఆశ వుంది. ఎలాగూ చెడిపోయాను కాబట్టి తప్పు లేదనుకున్నాడు. అబద్ద మెందుకూ-కన్నె హృదయాన్ని తొలిసారిగా నమ్మి అర్పించుకున్నందువల్ల నా మనసులో వాడికో స్థానముంది.
    వాడు మళ్ళీ మంచిమాటలు చెప్పి నా కో దారి చూపిస్తానన్నాడు. మోసమని తెలిసిపోయినా నేను లొంగిపోయాను. ఉన్నట్లుండి ఏమయిందో టైము చూసుకుని 'నువ్వు వెళ్ళిపో-మళ్ళీఎప్పుడయినా కలుసుకుందాం అన్నాడు. వాడలాగంటే నా కనుమానం వచ్చింది. నేను వెళ్ళనన్నాను. బ్రతిమాలాడు. వెళ్ళనన్నాను. 'నాకు అర్జంటుపనుంది వెళ్ళిపోతున్నాను. నా మీద నమ్మకముంటే సాయంత్రం ఆరు గంటలకు సంగీతా పార్కుకి రా' అన్నాడు. 'నీతో ఇంకా చాలా చెప్పుకోవాలి. అర్జంటు పని చూసుకుని నువ్వే యిక్కడకురా-నువ్వొచ్చేదాకా అన్నపానాలు మానుకుని యిక్కడే ఎదురు చూస్తూంటాను' అని వాడికి చెప్పాను.
    వాడు రానని ఖచ్చితంగా చెప్పేశాడు. నేనిక్కన్నించి కదలనని ఖచ్చితంగా చెప్పేశాను. సంగీతాపార్కు గురించి మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. అయినా వస్తాడేమోననే ఆశతో ఇక్కడ కూర్చున్నాను. కానీ ప్రసాద్ నన్నెన్నిసార్లు మోసగించలేదు కనుక......ఈసారి కాదనుకునేందుకు" అంది గీత.
    "నీ ప్రియుడి పేరేమిటన్నావ్?" అందా యువతి ఉలిక్కిపడి.
    "ప్రసాద్-ఏం?" అంది గీత అర్ధంకానట్లు.
    ఆ యువతి ముఖంలో రకరకాల భావాలు కనిపించాయి గీత అవి చూసి మనసులోనే నవ్వుకుంది.
    "ఏమీలేదు" అందా యువతి అన్యమనస్కంగా.
    "చూడు-నీ ప్రియుడు కూడా రాలేదు. మగవాళ్ళను గుడ్డిగా నమ్మకు. పెళ్ళయ్యేవరకూ ఎలాంటి నమ్మకస్థుడి నైనా దూరంగానే వుంచు. అనుభవంమీద చెబుతున్నాను" అంది గీత సలహా యిస్తున్నట్లు.
    ఆమె అవన్నీ విందో లేదో తెలియదు. కానీ-"సాయంత్రం నువ్వు సంగీతా పార్కుకి వెడతావా?" అనడిగింది గీతను.
    "వెళ్ళను. ప్రసాద్ వచ్చేవరకూ నే నిక్కడే ఎదురుచూస్తాను" అంది గీత.
    "మంచి కంపెనీ యిచ్చావు థాంక్స్!" అంటూ లేచిందా యువతి.
    గీత నవ్వుతూ - "అప్పుడే వెళ్ళిపోతున్నా వేం-కూర్చో!" అంది.
    "లేదు-నేను వెళ్ళాలి!" అందామె.
    గీత మళ్ళీ తనలో తనే నవ్వుకుంది.
    
                                     5

    సాయంత్రం ఆరింటికి సంగీతా పార్కుకి వెళ్ళి రహస్యంగా గమనించింది గీత.    
    ఆ యువతి ప్రసాద్ ను నోరెత్తనివ్వలేదు. అతణ్ణి నానా మాటలూ అంది. దుష్టుడు, దుర్మార్గుడు, నీచుడులాంటి పదాలన్నీ వాడింది. తన అదృష్టాన్ని తనే అభినందించుకుంది. ఏ జన్మలోనో తను చేసిన పుణ్యం ఈ జన్మలో సమయానికి తన్ను ప్రసాద్ వంటి భ్రష్టుడి పాలబడకుండా రక్షించిందండి.
    జరుగుతున్నదంతా గీత చూసింది. మొదట్లో ఆమెకు కాసేపు వినోదంగానే అనిపించింది. తర్వాత ప్రసాద్ ను చూస్తే జాలివేసింది. అతడి కాలు మాట్లాడే అవకాశమే రావడంలేదు. అలాంటి అమాయకుడిమీద తానెన్ని నిందలు వేసింది?
    ఆ యువతి వెళ్ళిపోయాక ప్రసాద్ దిగులుగా కూర్చుండి పోయాడు.
    జరిగిందేమిటో అతడికి తెలియదు. తన ప్రియురాలి అలకకు కారణమతడికి తెలియదు. బహుశా తను పెళ్ళి చూపులకు వెళ్ళిన విషయమామెకు తెలిసి వుంటుందని అతడనుకుంటూ వుండవచ్చు.
    ప్రసాద్ ని ఓదారుద్దామా అనుకుంది గీత. ఆ ప్రేమికులను తిరిగి కలపడానికి తను సాయం చేయాలని కూడా ఆమె అనుకుంది. కానీ ఇలాంటి సమస్య నుంచి తనకు తానై సంబాళించుకోలేనివాడు ప్రేమకు అనర్హుడని కూడా ఆమె భావించింది.
    కొద్దిరోజులు చూసి అప్పుడు తను రంగప్రవేశం చేయాలనుకుందామె. ఎందుకంటే ఆమెలో యిప్పుడు తప్పుచేసిన అనుభూతి కూడా వుంది. మనసారా ప్రేమించుకున్న ఓ జంట కేవలం తన కారణంగా విడిపోతోంది.....
    అప్పుడామెకు రాంకుమార్ గుర్తుకు వచ్చాడు.
    అతడి గతి ఏమయిందో? తనకు తెలిసిన తప్పును స్త్రీ అంత సులభంగా క్షమించలేదు. ఆ యువతి స్థానంలో జ్యోతి.....ప్రసాద్ స్థానంలో రాంకుమార్.....
    అయితే రాంకుమార్ కు జ్యోతి తనపై ఎందుకు తిరగబడుతోందో తెలుసు. అయితే మాత్రం అతడికి మాట్లాడే అవకాశం రావాలిగదా!
    జ్యోతి రియాక్షన్ మీద గీత కాసక్తి వుంది. అనుకున్న ఫలితం సాధిస్తే మరో వందరూపాయలిస్తా నన్నాడు రాంకుమార్ ఆమెతో.
    ఆ రోజు కింక చేయగలిగిందేమీ లేదు మర్నాడామె రాంకుమార్ ఆఫీసుకు ఫోన్ చేసింది.
    "హలో-గీతా! థాంక్యూ వెరీమచ్ ఫర్ దీ కాల్. సాయంత్రం మనం కలుసుకుందాం - ఎప్పటిలాగే!" అన్నాడు రాంకుమార్.
    ఎప్పటిలాగే అంటే అశోకా హోటల్లో అతడు తన కోసం రూం బుక్ చేసి వుంచుతాడు.
    సాయంత్రం ఆమె హోటల్లోని తన రూముకు వెళ్ళి రాంకుమార్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
    అన్నకంటే అరగంట ఆలస్యంగా వచ్చి సారీ చెప్పుకున్నాడు రాంకుమార్. అతడి ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.
    "నాకు బహుమతి గ్యారంటీ" అనుకుందామె. అయితే సాధించబడిన ఫలితమేమిటో ఆమెకు తెలియదు.
    రాంకుమార్, ఆమెకు ఎదురుగా కూర్చుని "మిస్ గీతా నువ్వు నాకు మహోపకారం చేశావు. ప్రేమను అలక్ష్యం చేయబోయిన నా కళ్ళు తెరుచుకున్నాయి. అందుకు కారణం నువ్వు" అన్నాడు.




Related Novels


Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.