Home » Jonnalagadda Rama Lakshmi » Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1



                                               తెలివైనవాడు
                                                           జొన్నలగడ్డ రామలక్ష్మీ

                              

    గదిలో నేలనిండా పరచిన ఖరీదయిన కార్పెట్!
    మధ్య గదిలో ఖరీదయిన సోఫా!
    సోఫాలో లక్షాధికారి వెంకటేశ్వర్లు....!
    ఆయన కెదురుగా పాతికేళ్ళ యువకుడు రాంకుమార్. అతడు చేతులు కట్టుకుని నిలబడి వున్నాడు. అతడు కొద్దిగా వణుకుతున్నాడు.
    వెంకటేశ్వర్లు రాంకుమార్ వంక కఠిణంగా చూస్తున్నాడు.
    గది గోడలకు మూడు పక్కల పోస్టర్లు. ఆ పోస్టర్లలో తుపాకియోధులు-తుపాకులు గురిపెట్టి లక్ష్యాన్ని చూస్తున్నారు.
    వెంకటేశ్వర్లు కళ్ళు గురిపెట్టిన తుపాకీల్లా వున్నాయి.
    "నేను నిన్నెందుకు పిలిచానో తెలుసా?" అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాంకుమార్ అడ్డంగా తల వూపాడు.
    "ఉదయం ఏం జరిగిందో అమ్మాయి చెప్పింది...."
    అప్పుడే స్నానం చేసివచ్చి అద్దం ముందు నిలబడి బట్టలు మార్చుకుంటున్న సురేఖను - ఆ గదిలోకి ప్రవేశించి చూశాడు రాంకుమార్. ఆమె అరిచినా వెంటనే అక్కణ్ణించి కదలలేదు.
    రాంకుమార్ తల వంచుకుని - "పొరపాటయింది" అన్నాడు.
    "పొరపాటు నీది కాదు - వయసుది!" అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాంకుమార్ తలెత్తి వెంకటేశ్వర్లుని చూశాడు. అతడి శరీరంలో వణుకు కొంత తగ్గింది.
    "అయినా నాది తప్పే!"
    సురేఖ గదిలోకి పురుషులకు ప్రవేశం లేదు. ఆఖరి కామె అన్నకు కూడా! తండ్రి కూడా ఆమెతో మాట్లాడాలనుకుంటే ఇంటర్ కామ్ ద్వారా పిలుస్తాడు. అలాంటి గదిలోకి రాంకుమార్ ప్రవేశించాడు. అతడు వెంకటేశ్వర్లుకి పర్సనల్ సెక్రటరీ! అయినవాళ్ళను వదిలి వెంకటేశ్వర్లుతోపాటు ఆయనింట్లోనే ఓ గదిలో వుంటున్నాడు.
    "తప్పు నీదికాదు - నీ పేదరికానిది...." అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాంకుమార్ కి తన యజమాని ఏం చెబుతున్నాడో అర్ధం కాక మళ్ళీ తలవంచుకున్నాడు.
    "నాకు సంబంధించినంతవరకూ సురేఖ నా కూతురు. నీకు సంబంధించినంతవరకూ వయసులో వున్న ఒక అందమైన అమ్మయి. ఇద్దరూ ఒకే యింట్లో తిరుగుతున్నారు. ఆకర్షణ అసహజం కాదు. అయితే ఒక్క విషయం - నువ్వు సురేఖను ప్రేమిస్తున్నావా?"
    "తెలియదు" అన్నాడు రాంకుమార్.
    "ఊఁ! అనడానికి భయపడుతున్నావు. తటపటాయిస్తున్నావు. నా ఎదురుగా నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పే ధైర్యం కూడా నీకు లేదు. అయినాసరే-సురేఖను పెళ్ళి చేసుకోమని నేను నీకు చెబుతాను. ఒప్పుకుంటావా?"
    రాంకుమార్ తెల్లబోయి తలెత్తి వెంకటేశ్వర్లుని చూశాడు. ఆయనతో చూపులు కలపలేక మళ్ళీ తల దించుకున్నాడు. అయితే అతడి ఆశ్చర్యం ఆనందంగా మారింది.
    "చెప్పు - సురేఖతో పెళ్ళికి ఒప్పుకుంటావా?"
    "ఊఁ" అన్నాడు రాంకుమార్.
    "వెరీగుడ్" అన్నాడు వెంకటేశ్వర్లు "ముందుగా ఒక విషయం నాకు చెప్పు. అసలు నువ్వు సురేఖ గదికి ఏ ఉద్దేశ్యంతో వెళ్ళావు?"
    సురేఖ ప్రవర్తన సరైనది కాదని రాంకుమార్ విన్నాడు. ఆమె పురుషులతో విచ్చలవిడిగా తిరుగుతుందనీ శీలానికి ప్రాముఖ్యత నివ్వదనీ అనుకునేందుకు నిదర్శనాలున్నాయతడి వద్ద. రాంకుమార్ అందంగా ఆకర్షణీయంగా ఉంటాడు. అయినా సురేఖ ఎన్నడూ అతడ్ని కన్నెత్తి చూడలేదు-పన్నెత్తి పలకరించలేదు.
    రాంకుమార్ కి సురేఖపై ఆశలు బయలుదేరాయి. ఆమె తనను పట్టించుకోవడం లేదని అతడికి బాధగా ఉంది. ఒకసారి ఆమె ప్రత్యేకంగా తన గురించి ఆలోచించే పరిస్థితి కల్పించాలని అతడనుకున్నాడు. అందుకామె గదికి వెళ్ళడ మొక్కటే మంచి ఉపాయమనిపించింది. ఎలాగూ వెడుతున్నప్పుడు మంచి సమయంలో వెళ్ళాలనుకున్నాడు. సురేఖ ఏ సమయంలో స్నానం చేస్తుందో అతడికి తెలుసు. అలాగే అనుకున్న సమయానికి వెళ్ళాడు.
    ఈ విషయం యజమాని కెలా చెప్పగలడు?
    "ఆమె నాతో ఎన్నడూ మాట్లాడదు. ఎందుకో అడిగి తెలుసుకోవాలనిపించింది" అన్నాడు రాంకుమార్.
    "ఆమె నీతో ఎందుకు మాట్లాడాలనుకున్నావు?"
    "చెప్పలేను.....కానీ......ఆమె అంటే నాకు ఆకర్షణ ఉంది" రాంకుమార్ కాస్త ధైర్యం చేశాడు.
    "ఆమె గదిలో అడుగు పెట్టేముందు నీ అంతస్థేమిటో ఆలోచించావా?"
    "లేదు...."
    "మీ యిద్దరికీ పెళ్ళయ్యే అవకాశం లేదని ఊహించలేకపోయావా?"
    "సర్ - ఆకర్షణ తప్ప నా బుర్రలో మరేమీ లేదు. ఆమెతో మాట్లాడాలనుకున్నాను తప్ప - నా మనసులో వేరే వుద్దేశ్యమేమీ లేదు...." అన్నాడు రాంకుమార్.
    "నువ్వు నిజమే చెబుతున్నావని నమ్ముతున్నాను. అయితే నేనూ ఒక నిజం చెబుతున్నాను - జాగ్రత్తగా విను-" అన్నాడు వెంకటేశ్వర్లు.
    రాంకుమార్ మనసులో కుతూహలం రేగింది. యజమాని ఏం చెబుతాడోనని అతడు చెవులు రిక్కించాడు.
    "నేను ఐశ్వర్యంలో పుట్టి పెరిగాను. కాని నా తండ్రి అంతులేని పేదరికాన్ననుభవించినాకనే ఐశ్వర్యవంతుడయ్యాడు. ఆయన నాతో-డబ్బునుకాక తెలివిని నమ్ముకో డబ్బు నిలబడుతుంది అంటూండేవాడు. ఆ మాటలు నాకు బాగా వంటబట్టాయి. నేనూ తెలివినే నమ్ముతాను. నీలో తెలివి వుంటే నిన్ను నా యింటల్లుడ్ని చేసుకుంటాను. అయితే ఆ విషయం పరీక్షించాలి."
    రాంకుమార్ కి వుత్సాహం వచ్చింది. "సార్ మీ పరీక్షకు తప్పక నిలబడతాను. నా తెలివి నిరూపించుకుంటాను" అన్నాడు.
    "అయితే ఒక విషయం......సురేఖ ను నువ్వు ప్రేమిస్తున్నావు. ఆమె నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా?"
    "తెలుసుకోవాలనే ఆమె గదికి వెళ్ళాను....."
    "పోనీ యిప్పుడయినా తెలుసుకున్నావా"?
    "ఇంకా తెలియదు-"
    "నువ్వామె గదికి వెళ్ళావు. ఆమె నాకు ఫిర్యాదు చేసింది, అంటే ఆమెకు నీపైన ప్రేమ ఉన్నట్లా, లేనట్లా?"
    రాంకుమార్ తడబడి-"ముసలాడు చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు. నేనూ జాగ్రత్తగా ఉండాలి" అనుకున్నాడు. పైకి మాత్రం "నా గురించి మీ అభిప్రాయం తెలుసుకునేందుకు-ఆ పని చేసి వుండవచ్చు" అన్నాడు.




Related Novels


Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.