Home » Muppala Ranganayakamma » Krishnaveni



    ధగధగ లాడుతున్న మాంగల్యాలు హృదయం మీదికి చేరుతూంటే హృదయందడదడలాడింది. పచ్చటి పసుపుతాడు మెడచుట్టూ తిరిగింది. మాంగల్య ధారణ జరిగిపోయింది. గుండెలమీదికి ఏదో కొత్త భారం చేరింది. అది భరించలేనని పించింది. తెల్లవారుఝాముకి నా గదికి చేరాను. తూలివెళ్ళి పరుపుమీద కూర్చున్నాను. ఎప్పుడూ నా కన్నీళ్ళను యిముడ్చుకునే తలగడ మీదికి ఒరిగిపోయాను. వెక్కివెక్కి ఏడ్చాను. మెడలో కొత్తగా వెలిసిన మంగళసూత్రం మీద కన్నీళ్లు పడ్డాయి. నీరు నిండిన కళ్ళతో సూత్రాలు చూసుకుంటూ ఉండిపోయాను. అవి శ్యామసుందర్ చిహ్నాలు. ఇద్దర్నీ ఒకటి చేసినట్టు నిదర్శనాలు. ఇప్పుడు శ్యామసుందర్ ఎవరో కాదు, నా భర్త, అగ్నిసాక్షిగా నేను స్వీకరించిన వ్యక్తి. ఇప్పుడీ కన్నీళ్లు దేనికి? నేను ఏడవటం తప్పు కాదా? కన్నీటితో అభిషేకింపబడిన ఈ సూత్రాలకెన్నడూ మలినం అంటదు. వాటిని తీసి కళ్ళకద్డుకున్నాను. అవి నేను చిరకాలం పూజించాల్సిన పవిత్రమయిన ఆభరణాలు - ఆ భావం మనస్సులో స్థిర పరచుకున్నాను.
    అంతవరకు అన్నీ నా ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి. అలాగే ఆ రాత్రి ఏర్పాట్లు సలక్షణంగా జరుగుతున్నాయి. వదినా, శాంతా ఎన్నోవిధాల ముస్తాబు చేయబోయారు. నన్ను నే నెన్నో విధాల సమర్ధించుకోబోయినా నా వశం కాలేదు. ఆమాంగల్యాన్ని పూజిస్తూ శ్యామసుందర్ కు దూరంగా ఉండిపోగలనుగానీ, అతనికి దగ్గరగా చేరలేను. మాధవ్ తో గడపిన ప్రతిక్షణం ప్రతి ఘడియా సజీవమై మనసును కోత కోస్తున్నాయి. ఇంతలోనే ఎంత మోసం! ఇంత దగా ఎలా చెయ్యను? ఎన్ని గుండెలు పెట్టుకుని శ్యామసుందర్ దగ్గరకు వెళ్ళను? నేను ఆశించే పవిత్రత నాలో ఎక్కడుంది?    
    "వద్దు వదినా! నామనసేమీ బాగులేదు. ఏవో చెప్పు నేను వెళ్ళలేను." అని కూర్చుండిపోయాను.
    "తప్పు కృష్ణవేణీ! ఒక్కరోజు తప్పించుకుంటావు. రెండురోజులు తప్పించుకుంటావు. బ్రతుకంతా తప్పించుకుంటావా చెప్పు. ఈ మాత్రానికి అతన్ని నిరాశ పరుస్తావా? నామాట విను. నీకోసం ఎంతో సరదాతో ఎదురు చూస్తూంటాడు. ఈమీ ఏమీ మనసులో వుంచుకోకు. సంతోషంగా ప్రవర్తించు. నీమీద మొదట ఏర్పడిన అభిప్రాయమే కలకాలం నిలిచి వుంటుంది. నువ్వు చిన్న పిల్లవి కాదు. చే జేతులా గొడవ తెచ్చుకోకు."
    నేనేమీ మాట్లాడలేదు. కొంతసేపయ్యాక వదిన అంది - "చెప్పు కృష్ణవేణీ! ఏ తల నొప్పిగా వుందనో - ఒంట్లో బాగులేదనో వాళ్ళ అమ్మగారికి చెప్పి రమ్మంటావా?"
    "ఒద్దు, వెళ్తాను," అన్నాను.
    పదకొండు గంటలు దాటివుంటుంది. వదిన మెట్లపై వరకూ సాగనంపింది. గుమ్మం దగ్గిరే ఆగిపోయాను. ఎంతోసేపు నిలబడ్డాను బైట. ఎంత వద్దనుకున్నా మాధవ్ మనసునుంచి దూరం కావటం లేదు. "మాధవ్! ఈ క్షణం నుంచి నిన్ను సోదర ప్రేమతో ప్రేమిస్తాను. నువ్వు నా స్నేహితుడిని. సోదరుడివి. నేను నీకు చెల్లిని. శ్యామసుందర్ భార్యవి. ప్రభూ! గతం మర్చి పోతాను. నన్ను సౌభాగ్యవతిగా నా దాంపత్యం సుఖమయంగా ఆశీర్వదించు." శూన్యంలోకి చేతులెత్తి ప్రార్ధించాను. తడబడుతూన్న అడుగులతో తలదించుకు గదిలో కాలుపెట్టాను.
    శ్యామసుందర్!
    శోభనం గదిలో కాదు. మీ జీవితంలో అడుగుపెట్టాను. మీకు సన్నిహితం కావాలని వచ్చాను. నేను గదిలో ప్రవేశించిన తర్వాత సంగతులు మీకు తెలీనివికాదు. కానీ ఆయాసందర్భాలలో నా మనోగతాభిప్రాయా లెలా వున్నాయో-నేనెటువంటి అనుభూతులు పొందగలిగానో చెపుతాను. మీపట్ల నాకు అప్పట్లో వున్న అనురాగం "తొలిచూపులలో అనురాగాలు" వంటి దేమీ కాదు. పవిత్రమైన మాంగల్య మహిమకి కట్టుబడ్డాను. మీ చరణదాసిగా వచ్చి చేరాను. కానీ మీ సన్నిధిలో నిలవలేననిపించింది. నాలో ఎంతో అపవిత్రత దాగి వుంది. ఎప్పుడూ ఆ భావం నన్ను లోలోపల బాధిస్తుంది. మీరు ఆతృతగా దగ్గిరచేరి కౌగలించుకొంటే - ఆవేశంగా ముద్దుపెట్టుకొంటే నా మనసు గిలగిల్లాడిపోయింది. ముద్దు సుఖం నాకు కొత్త గాదని మీకు తెలిసివుంటే మీలో ఆ ఆరాటం- ఆ ఆవేశం వుంటాయా? మీకు తెలీని ఆ నిజం చెప్పుకోలేని రహస్యమై వేధించింది. మొహం ఎత్తి మీ కళ్ళలోకి చూడలేదు. చూపులలోనే దొరికిపోతానేమోననే భయం. ధైర్యం చేసి దగ్గిరకు చేరలేదు. హృదయమే ఆ రహస్యాన్ని వెల్లడిస్తుందేమోననే శంకరం. గుండెల్లో ఏవో భయాలు దాచుకొని ఎన్నాళ్ళు అమాయకంగా నటించను? అంతరంగంలో వుద్భవించని ఆనందం - రాని చిరునవ్వూ ఎలా తెచ్చి పెట్టుకోను?
    నన్ను అనుక్షణమూ వేధించేది అమాయకులైన మిమ్మల్ని మోసం చేస్తున్నాననే భావం ఒక్కటే, ఈ రహస్యం ఇక ఎంతోకాలం దాగదు. అంతా చెప్పుకొని క్షమాపణ కోరుకోవాలనిపించేది. ఏది ఏమైనా ఆభారం తగ్గించుకొని మనసు తేలికపర్చుకోవాలనిపించేది. కాని ఎక్కడిదీ అంత ధైర్యం? మీరు గాఢంగా నిద్రపోతూంటే మాత్రం తదేకంగా మీ మొహంలోకి చూస్తూ కూర్చునేదాన్ని. అప్రయత్నంగా చేయివేసి జుట్టు నిమిరేదాన్ని. మీ సౌందర్యం ఆ బాధ లోనే ఏదో సంతృప్తి ప్రసాదిస్తుంది. మీమంచితనం మనసును కంగారు పరుస్తుంది. నా ఉదాసీనతని సిగ్గుగా - నా అయిష్టాన్ని కొత్తగా మాత్రం భావించి సమర్ధించుకోగలిగే మీ సద్భావానికి ఆశ్చర్యం కలుగుతుంది - పెళ్ళిలో మా ఇంట మూడు రోజులూ - మీ ఇంట మూడు రోజులూ! అప్పుడు నాతో మీరు కలిసిరాలేదు. త్వరలో వస్తాననీ తరుచూ వుత్తరాలు రాయాలనీ చెప్పారు. కానీ మీకు వుత్తరాలు రాయాలనుకొంటే మనసు అంగీకరించలేదు. ఏవో ప్రేమలేఖలు రాసి మిమ్మల్ని సంతృప్తి పరచగలను. కానీ నా అంతరాత్మని సరిపెట్టుకోలేను. అందుకే నాకు వుత్తరాలు రాసే అలవాటు లేదనీ - పెద్దగా రాయలేననీ అన్నాను. పెళ్ళిలో మీ ఇంటికి వచ్చి తిరిగి వచ్చేసరికి మాధవ్ వుత్తరం వచ్చివుంది. అందులో ఎప్పటి మంచితనం తప్పా కోపాలూ - నిష్ఠూరాలూ లేవు. చిరంజీవి కృష్ణవేణీ! అని సంబోధించాడు. సౌభాగ్యవతిగా ఆశీర్వదించాడు." నాకు నీమీద ఏవిధమైన కోపమూ లేదు. నా క్షమాపణ కావాలని నువ్వు కోరితే క్షమించగలను." అన్నాడు - ఆ మధ్య తనకి చాల సుస్థీ చేసిందట. నెల్లాళ్ళు మంచం మీదే వున్న కారణం చేత జవాబు రాయలేకపోయాడట - నన్ను ఏమీ బాధపడకూడదనీ అంతా మరిచి సంతోషంగా కాలం గడుపుకొమ్మనీ రాశాడు." "స్నేహితుడు మాధవరావు", అని ముగించాడు. నేను నిట్టూర్చి వూరుకున్నాను - ఎంత మొండిగా ప్రయత్నించినా గతంమరిచి శ్యామసుందర్ కి సన్నిహితం కాలేకపోతున్నాను మాధవ్! ఈ రహస్యం గుండెల్లో నేవున్నంత కాలం నాకు శాంతిలేదు." అని ఒకటి రెండుసార్లు మాధవ్ కి రాశాను. మాధవ్ సహృదయంతో మందలించి ధైర్యం చెప్తూ వుండేవాడు-" అరుణ ప్రవర్తనతో ఆనాటికీ ఈనాటికీ శాంతి ప్రసాదించే దాంపత్య సుఖాన్ని తప్ప మనిషి కోరదగింది ఏమీ లేదు. నీకన్నీ తెలుసుకోగలిగే జ్ఞానం వుంది. ఏవిధంగానూ నీ భర్తకి అశాంతి కల్గించకు. స్నేహాన నేను చెప్పేది వింటావనే నమ్ముతున్నాను' మాధవ్ మంచితనంలో సున్నితమైన గులాబీ సౌరభమేగానీ ముళ్ళవంటి కోపాలూ అసూయలూ వుండవు. మాట మాత్రమైనా నన్ను నిష్ఠురపర్చటం గానీ - తన మనసులో బాధచెప్పి నన్ను అశాంతి పర్చటం గానీ లేదు.
    మీ దగ్గిర్నుంచి వచ్చి ఒంటరిగా వున్న ఈ రెండు నెలలలోనూ నాలో చాలా మార్పు వచ్చింది. నన్ను ప్రాణంగా ప్రేమించే మీరు వున్నారనీ మిమ్మల్ని ఎప్పుడూ విడిచి వుండకూడదనే అనుపించేది. అన్నివిధాలా అధికుడైన మీవంటి భర్తనే పొందగలిగి నందుకు గర్వపడిన క్షణాలు కూడా లేకపోలేదు నాలో ఈ మార్పులు నన్నే ఆశ్చర్యపరుస్తున్నాయి. మీతో నిశ్చింతగా కాలం గడపాలని కోరుకుంటున్న సమయంలో మాధవ్ వుత్తరం మీరు చూడటం వెళ్ళిపోవటం మీమనసు చెప్పిన నిర్ణయాలు చేసుకొని వాటిని ఆచరించా లనుకోవటమూ చాలా జరిగాయి.
    శ్యామసుందర్!
    సుదీర్ఘమైన ఈ గాధలో ఏ విషయాలూ నేను మరుగు పర్చలేదు. సర్వం మీకు చెప్పి తీర్పుకోసం మాత్రం నిలబడ్డాను. నన్ను నేను సమర్ధించుకోవాలని ప్రయత్నించటం కాదు. కానీ ఆయా పరిస్థితుల్లో ఎవరైనా నాలానే ప్రవర్తిస్తారేమో అనుకుంటాను. నా ఎదురుగా బస్ లో కూర్చున్న వ్యక్తిని చూడటం - అతను పిలిస్తే వెళ్ళి మాట్లాడటం పొరపాట్లేనా? కుమారీ దశలో వున్న నేను ఆ వ్యక్తిపట్ల అనురాగం పెంచుకోవటం దాన్ని శాశ్వితం చేసుకోవాలని తాపత్రయ పడటం అనుచితాలేనా? అతని చరిత్ర విని జాలిపడి సానుభూతి చూపబోవటం అధర్మ మా? ఆ దశలో సర్వస్వతంత్రురాలిగా ప్రవర్తించి నప్పుడు శ్యామసుందర్ వంటి ఎవరో వ్యక్తికి మోసం చేస్తున్నానని అనుకోలేక పోయాను.నా యిష్టానుసారం నా భవిష్యత్తు నిర్ణయించుకోగల ననుకున్నాను - కానీ నేననుకున్న ప్రతీ విషయం కానిదై పోయింది. తప్పించుకోలేని పరిస్థితుల్లో చిక్కుకున్నాను. నేను తప్పేచేశానేమో? అంతకుమించి చెయ్యగలిగే మరోదారి లేదు. మీరు కృష్ణవేణిగా నా స్థానంలో వుంటే ఏం చేస్తారో క్షణం ఆలోచించండి శ్యామసుందర్!    
    నాకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నా నిర్ణయమూ ఒకటుంది. మా పరువు ప్రతిష్టలు పాడుకాకూడదనీ కుటుంబం రచ్చకెక్కకూడదనీ గాఢమైన రెండు నిర్ణయాలు మార్చుకున్నాను - మన దాంపత్యం విచ్చిన్నం కావటం మనం శాశ్వతంగా విడిపోవటం సామాన్యమైన విషయాలుకావు. ఆ విదంగానైనా మా కుటుంబం రచ్చకెక్కక తప్పదు. నేనా శించనదేదో లభించిన నాడు ఏది జరిగినా ఒకటే - మీరునన్ను త్యజించటం అనేది నేను బ్రతికివుండి సహించలేని విషయం. మీకు దూరంగా ఒక్క రోజైనా గడపాలని నేననుకోను. ఒకప్పుడు మాధవ్ ప్రాణమైతే కావచ్చు కానీ ఇప్పుడు మీకంటే ఎవ్వరూ నాదృష్టిలో అధికులు కారు. నాకు సన్నిహితులు కాబోరు. మీతో సంబంధం లేనిరోజుల్లో నా ప్రవర్తనకి క్షమాపణ కోరుకుంటున్నాను. నా మనుసులో ఎటువంటి మాలిన్యమూలేదు. మిమ్మల్ని భర్తగా ప్రేమించి గౌరవించగలనని ఆశపడుతున్నాను.
    ఇప్పుడు నాగుండెల్లో ఎటువంటి భారమూ లేదు. సర్వం మీకు వెల్లడించి తీర్పుకోసం ఎదురు చూస్తున్నాను. కానీ మీ తీర్పుపైన నాచావు బ్రతుకులు ఆధారపడి వున్నాయి. బ్రతికితే సంతోషంగా మీ నీడన బ్రతుకుతాను. లేదా సంతృప్తిగా లోకానికీ మీకూ దూరమవుతాను. ఇదేనేను చేసుకున్న నిర్ణయం. మీచే తిరస్కరింపబడి బ్రతుకంతా మోడులా గడపను. భర్త త్యజించిన ఆడదానికి లోకం దృష్టిలో ఎంతవిలువ వుంటుందో ఇంటా బయటా ఎంత ఆదరణ లభిస్తుందో నాకు తెలియని సంగతి కాదు - పౌరుష పడి నా కాళ్ళమీద నిలబడి బ్రతకగలశక్తి నాకుంది ఎంత కాదనుకున్నా ప్రేమగా చూసుకొనే నావాళ్ళు న్నారు. కానీ నాకు కావలసింది అవేమీ కాదు. ఎవరి ప్రేమా - ఎవరి ఆదరణ నన్ను సంతృప్తి పరచవు. సంతోష పెట్టవు. నేనుకోరుకునేది ఒక్క నా భర్త సన్నిధి. నిండైన ఆ అనురాగంలోనే సర్వం మరిచి జీవిస్తాను.
    నా వ్యక్తిత్వం పట్ల నాకు గౌరవం వుంది. నేను అసహ్యించు కోవాల్సినంత నికృష్ణమైన వ్యక్తిని కాను. నేను క్షమార్హురాలినో కానో నిర్ణయించి తీర్పు చెప్పే అధికారం మీకువుంది. బ్రతుకైనా చావైనా నా దృష్టిలో రెండూ ఒకటిగానే వుంచుకున్నాను - వారం రోజుల్లో మీ నిర్ణయం అందుకోగలనని ఆశిస్తాను.
                                                                            భక్తితో మీకు నమస్కరించు,
                                                                                     కృష్ణవేణి.

                                                 *    *    *




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.