Home » Muppala Ranganayakamma » Krishnaveni


                                 

    దీక్షగా మూడు రాత్రులూ, మూడు పగళ్ళూ కూర్చుని కృష్ణవేణి శ్యామసుందర్ కు సుదీర్ఘ మయిన లేఖ వ్రాసి పూర్తి చేసింది. కోపంతో వెళ్ళిపోయిన శ్యామసుందర్ "మనం విడిపోయె యేర్పాటు చేస్తాను," అని రాసినప్పుడు నిర్ఘాంతపోయింది కృష్ణవేణి. కొంత తమాయించుకుని తన బ్రతుకు చక్కదిద్దుకోవడానికి తనే ప్రయత్నించాలని, ఆలోచించి, శ్యామసుందర్ కి లేఖ పూర్తి చేసింది. అది తన పేరుతో పంపితే బహుశా శ్యామసుందర్ తీసుకోక పోవచ్చు.
    "ఇది మీ బావగారికి నీ పేరన పంపించు అన్నయ్యా" అంటూ అన్నయ్య హాస్పిటలుకు బయలుదేరుతుంటే పార్శిల్ చేసిన ఆ కట్ట అందించింది.
    "ఏమిటమ్మా యిది? వెళ్ళి నాలుగు రోజులైందో లేదో, అంత దస్తరం పంపుతున్నావు? ప్రార్ధనా పత్రం కాదుకదా?" అంటూ హాస్యమాడింది వదిన.
    "నయం దేవిరింపన్నావుకాదు" అంది కృష్ణవేణి.
    "ఏమిటో మేము చూడకూడదా?" అన్నాడన్నయ్య నవ్వి.
    "చూడకూడదో - వచ్చునో నీకు తెలుసులే" అంటూ నవ్వింది కృష్ణవేణి.
    "పోనీగానీ, మధ్యలో నా పేరనేమిటి పంపటం?"
    "అలానే పంపించు అన్నయ్యా!"
    కృష్ణవేణీ దాంపత్యంలో కలహం వచ్చిన సంగతి వదినకు గానీ, రేణుకు గానీ తెలీదు. అన్నయ్యతో ఉత్తరం పంపింది మొదలు అవే ఆలోచనలతో ఉండిపోయింది కృష్ణవేణి. శ్యామసుందర్ ఉత్తరం అందుకుంటాడా? తను రాసింది తెలుసుకుంటే చదువుకుంటాడా? అంతా చదివినా తనను అర్ధం చేసుకుని క్షమిస్తాడా? ప్రతిదీ అనుమానమే. ప్రతిదీ ఆలోచనే. కొంతసేపైనా మనసు విశ్రాంతి కోసం రేణు దగ్గరకు వెళ్ళాలని పించింది. దాన్ని చూసి కూడా నాలుగయిదు రోజులైంది.
    "శ్యామసుందర్ వచ్చాడని తెలిసి, సాయింత్రాలప్పుడు మీరేషైరుకో వెళ్తుంటారని నేను రావటం మానేశాను కృష్ణవేణీ!" అంది రేణు కృష్ణ వేణిని చూస్తూనే.
    "శ్యామసుందర్ వెళ్ళిపోయి నాలుగురోజులైంది" అంది క్లుప్తంగా కృష్ణవేణి. రేణు తెల్లపోయింది.
    "అదేం? మొన్ననేగా వచ్చింది?"
    కృష్ణవేణి నిట్టూర్చి కుర్చీలో చేరబడి కూర్చుంటూ, "నా బ్రతుకులో ఏది సవ్యంగా జరిగింది రేణూ! గతమేదో మర్చిపోతున్న నాటికి ఇప్పు డీ దాటలేని అవాంతరం వచ్చిపడింది. .... ఆయన నన్ను క్షమిస్తారనిపించదు." కృష్ణవేణి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. - అంతా నిన్న రేణు చాలాసేపు మవునంగా ఉండిపోయి "కనీసం శాంతవుంటే ఏమైనా చెప్పేదేమో!" అంది. శాంత పాపనెత్తుకుని మూడవనెల రాగానే వెళ్ళిపోయింది. కానీ ఎవరు వున్నా చెప్పగలిగిందేముంటుంది? అదే అనుకుంది కృష్ణవేణి.
    ఏ క్షణాన శ్యామసుందర్ జవాబు రాస్తాడో ఎటువంటి జవాబు వినవలసివస్తూందో, తన భవితవ్యం ఏ విధంగా మారనైవుందో! అప్పుడే వుత్తరం వెళ్ళి నాలుగు రోజులు ఇంక మూడు రోజులు గడువు. సంతోషానికీ, దుఃఖానికీ మూడు రోజులు వ్యవధి.
    
                          *    *    *

    మాధవ్ దగ్గరనుంచి వుత్తరం వచ్చింది. చాలా కాయితాలున్నాయి. ఏదో గొప్ప విషయమే రాసి వుంటాడు.
    చిరంజీవి సౌభాగ్యవతి
    కృష్ణవేణిని ఆశీర్వదించి,
    ఈ శుభవార్త విని నువ్వు ఎంతో సంతోషపడతావు. అరుణ వచ్చింది కృష్ణవేణీ! అరుణ వచ్చింది. పరిపూర్ణమయిన స్త్రీత్వం నింపుకుని వచ్చింది. నేను కోరేవిధంగా మారి వచ్చింది. నా విలువ తెలుసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చింది.
    అరుణ వచ్చి మూడు రాత్రులు గడిచాయి. మూడు జన్మల సుఖాన్ని చూపించింది. నేను పరిపూర్ణ మైన తృప్తితో - శాంతిగా వ్రాస్తున్న ఈ లేఖ నిన్ను ఆనందపరుస్తుందని ఆశిస్తున్నాను. జీవితంలో రెండవసారి అనుకోని దెబ్బతిని, నీతో ఘర్షణపడి రైలెక్కిన రాత్రే తీవ్రమయిన జ్వరం ఆవరించింది. అలానే ఇంటికొచ్చాను. మర్నాడు ఆఫీసుకు సెలవు పెట్టాను. ఆ అనారోగ్యంలో పళ్ళు తెలియకుండా నెలరోజులపైన మంచంమీదే ఉన్నాను. ఎప్పుడైనా తెలివిలో ఉన్న సమయంలో నా ఖర్మను తలుచుకుంటూ ఏడవటంతప్ప, మరో ధోరణి లేదు. నాకు నయం కాకూడదనీ, చచ్చిపోవాలనీ, ఎంతో కోరుకున్నాను. కానీ, రోజులు గడుస్తున్నకొద్దీ ఆరోగ్యం చక్కబడి లేచి తిరగాల్సి వచ్చింది, ఎప్పుడూ ఏదో భరించలేని మవునం - ఏదో నిర్లిప్తత, ఎక్కడవున్నా లేనట్లే నిశ్శబ్దత నన్ను చుట్టుముట్టాయి. గంటలతరబడి వంటరిగా కూర్చోవాలనిపించేది. అంతా వదులుకుని ఏదైనా ఆశ్రమంలో చేరి భగవంతుని సేవలో విలీనమై పోవాలని వుండేది. అమ్మని లక్ష్మి దగ్గరకు పంపేసి, అరవిందాశ్రమానికో, రామకృష్ణమఠానికో వెళ్ళిపోవాలని ఆలోచించే వాడిని. నాలో మార్పులు పసిగట్టి "ఏమిటలా మారిపోతున్నావు మధూ?" అంటూ ఏడిచేది అమ్మ. నన్ను ఆదినుంచీ కట్టిపడేసింది అమ్మ ప్రేమ ఒక్కటే. అమ్మ కన్నీరుచూసి, నా నిర్ణయం పాటించటానికి తటపటాయిస్తూ వచ్చాను. కానీ ఆ ఆలోచన అలా మనసులో రేగుతూనే వుంది. ఆఫీసూ, ఇల్లూ, జీవచ్చవాన్ని పోలిన బ్రతుకూ, నైరాశ్యం పెరుగుతూంది తప్ప, నా బాధ మరుపు రావటం లేదు. అరుణ కలిగించిన గాయాన్ని నీ స్నేహంతో మాన్పుకున్నాను. నువ్వు ఒంటరిగా పోయేసరికి అరుణవచ్చి ఆదుకుంది.
    ఆ రోజుసాయంత్రం నేరుగా ఆఫీసునుంచి ఇంటికొచ్చాను. వరండాలో ఏవో కొత్త సామాన్లు కన్పించాయి. ఎవరువచ్చారు చెప్మా! అనుకొంటూ వంటగదిలోకెళ్ళాను. అమ్మ ఏదో హడావిడిలో వుంది.
    "ఎవరమ్మా? చుట్టాలు వచ్చినట్టుంది." అన్నాను. అమ్మ నాకళ్ళల్లోకి చూసి నవ్వింది. అమ్మ చూపుల్లో దాచుకోలేని సంతోషం వెల్లివిరుస్తోంది.
    "గదిలోకి వెళ్ళి చూడు నాన్నా!" అంది నవ్వుతూ అమ్మ ఎంతో సంతోషంతో వున్నప్పుడు అలానే పిలుస్తుంది. అంత సంతోషానికి కారణమేమిటో ఆ గదిలో వున్నది ఎవరో చూడాలని ఆతృతగా బూట్లు చప్పుడు చేసుకుంటూ గదిలో అడుగుపెట్టాను. ఎదుట వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయాను. ఆశ్చర్యం-సంతోషం-నా కళ్ళని నేనే నమ్మలేని అనుమానం ఒక్కుమ్మడిగా చుట్టుముట్టాయి. రెండడుగులు ముందుకు వేసి చేతులు చాస్తూ - "అరుణా!" అన్నాను. తలదించుకు నిలబడివున్న అరుణ ఒక్కసారిగా వచ్చి చేతుల్లో ఇమిడి పోయింది. గాఢంగా హృదయానికి హత్తుకున్నాను. ఆవేశంతో ముద్దుపెట్టుకున్నాను. అరుణ వెక్కివెక్కి ఏడుస్తూ చేతుల్లోంచి జారి పాదాలమీద ఒరిగి పోయింది. ఒంగి లేవదీసి తలనిమురుతూ మౌనంగా ఓదార్చాను. అరుణ వెక్కుతూ గుండెలమీద తల ఆన్చి వుండిపోయింది-"తప్పు కదూ అరుణా! ఏడవకు." అంటూ అరుణ మొహం ఎత్తి కళ్ళు తుడుస్తూంటే "నేనువచ్చేశాను. ఇంకవెళ్ళను. ఎప్పుడూ మీదగ్గిరే వుంటాను," అంది నాకళ్ళల్లోకి చూస్తూ. అ చూపుల్లో ఎంతో పశ్చాత్తాపం నిండివుంది. నోటితో అడగలేక కళ్ళతోనే క్షమాపణ కోరుకుంటోంది. అరుణని మరీదగ్గరికి చేర్చుకున్నాను. "ఎప్పుడూ నా దగ్గిరే వుంచుకుంటాను. నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను అరుణా!" అన్నాను. ఇద్దరి హృదయాలూ అంతులేని అనురాగంతో పొంగిపొర్లాయి.
    ఆ రాత్రి మా ఇద్దర్నీ కూర్చోబెట్టి అమ్మ ఒడ్డనకుపక్రమించింది. అరుణ సిగ్గుపడుతూ అన్నం తింటూంటే అరుణలో ఎంతో కొత్తదనం కన్పించింది. అరుణలో అటువంటి సిగ్గు ఎప్పుడూ చూడలేదు నేను - "అమ్మా! నీ కోడలు కొత్తగా సిగ్గు నేర్చుకుంది," అన్నాను. అరుణ మరీ ముడుచుకు పోయింది. అమ్మ నవ్వి- "నేర్చుకో దేమిట్రా? ఎప్పటివాళ్ళు అప్పటిలా వుండిపోతారా?" అంది. అమ్మకి అరుణంటే అసలేగారం. అదీగాక అరుణ కొత్తగా అత్తయ్యా!" అని పిలుస్తోంది అమ్మని. అమ్మ మై మరచి పెరుగంతా అరుణకే ఒంపేసింది. "అదేమిటమ్మా? నేనేమైపోతాను?" అంటే అమ్మ పొరపాటు కప్పిపుచ్చుకుంటూ-"నీకు మజ్జిగుంది లెద్దూ" అంది. "నాకేం అక్కర్లేదు" అంటూ అరుణ పళ్ళెంలో కలబడ్డాను. అరుణ సిగ్గుపడి లేచిపోబోయింది.  కొంగుపట్టుకు కూర్చోబెట్టీ తనకి తినిపిస్తూ నేను తిన్నాను. అరుణతో కలిసి భోంచేసిన ఆ సంఘటన ఎన్నడూ మర్చిపోలేనిది.
    పడుకోటానికి గదిలో నాపడకగది నాకే కొత్తగా కన్పించింది. గదినిండా అగరొత్తుల సువాసన అలుముకుంది. పరుపుమీద తెల్లటి సిల్కు దుప్పటి పరిచివుంది. దుప్పటంతా అత్తరు పూసుకొంది. ఘుమఘుమ లాడే ఆ సువాసనలు అఘ్రాణిస్తూ పక్కమీద పడుకున్నాను. క్షణాలు యుగాల్లా గడుస్తున్నాయి. అరుణాదేవి వస్తూన్న లక్షణాలేవీ కన్పించటంలేదు. ఎప్పుడో నంగనాచిలా వచ్చి గది ముస్తాబుచేసి వెళ్ళిపోయింది కాబోలు. పిలుద్దామా? అనుకొంటూనే మరి కొంతసేపు గడిపాను. ఎంతకీ రాదేం? నాకు కోపం వచ్చేసింది. అంతలోనే గుమ్మం దగ్గిర గాజుల సవ్వడి వినవచ్చింది. అటుతిరిగి కళ్ళు మూసుకు పడుకున్నాను. నాపాదాలమీద మృదువైన స్పర్శ తగిలింది. అరుణ సున్నితమైన చేతులతో పాదాలు ఒత్తుతూంది. నాకు ఆశ్చర్యమే కల్గింది. ఎన్నడైనా అరుణ అలా చేసిందా? కళ్ళు సగం సగం తెరిచి దొంగచాటుగా చూడసాగాను. అరుణ మెత్తటి తెల్లటి చీరలో జడనిండామల్లెపువ్వులు కూర్చుకొని రతీదేవిని తలదన్ని నట్లు అలంకరించుకొంది. అరుణ పూర్తిగా మారిపోయింది. ప్రతీ విషయంలోనూ మారిపోయింది. అంత మార్పుకి కారణం ఏమిటి? ఎందుకని మారింది? ఒక్కసారిగా ఆ అనుమానం అప్పుడే రేగింది. అరుణ పాదాలు ఒత్తుతూనే వుంది.
    "చాల్లే! వెళ్ళిపడుకో. నాకు తలనొప్పిగా వుంది" అన్నాను కోపం నటిస్తూ, కాళ్ళు ముడుచుకొని, అరుణ అర్ధంచేసుకొందిలా వుంది. నవ్వింది - "అమృతాంజనం రాస్తాను" అంది. "ఏం అక్కర్లేదు. నాకురెస్ట్ కావాలి. నువ్వెళ్ళు" అన్నాను చిరాకుపడిపోతూ.
    "అలాగేం పాపం?" అంటూ కితకితలు పెట్టి పక్కలో దూరింది. ఆటా గీటా మానేసి అరుణా!" అంటూ దగ్గిరకు చేర్చుకున్నాను.
    అప్పటి నీఠీవీ-దర్జా-అతిశయం ....." అరుణ చేతితో నోరుమూసింది-" దెప్పుతున్నారా?" అంది.




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.