Home » Muppala Ranganayakamma » Krishnaveni


 

    గాఢంగా చేసుకున్నా ననుకున్న రెండు నిర్ణయాలూ భగ్నమైపోయాయి. వెనకా ముందూ మంచీ చెడ్డా ఆలోచించేవాళ్ళు సాహసించి ఏపనీచెయ్యలేరు. మనసైన మనువేకాదు - చావు కూడా చక్కని వరమే. ఆ రెండూ నావంటి వాళ్ళకి మాత్రం కాదు, మాధవ్ ని ఈ లోకంలో కలుసు కోలేకపోయినా మరోలోకంలోనైనా కలుసుకుంటానని తృప్తిపడ్డాను. కాని ఎన్ని జన్మలెత్తి నా ఎన్ని లోకాలు తిరిగినా మాధవ్ నాకు అందని వాడు.

                              
    అవును. మాధవ్ నాకు అందనివాడు. పరాయి వాడు. ఎప్పుడూ ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ కూర్చొనేదాన్ని.
    నా పెళ్ళికి లగ్నం నిర్ణయించారు.
    ఆ కబురు వదిన చెప్తూంటే ఎటో చూస్తూ విని వూరుకున్నాను. వదిన వెళ్ళిపోయాక మౌనంగా కళ్ళు ఒత్తుకున్నాను.
    ఒకనాడు వదిన శుభలేఖ తీసుకుకొచ్చి హాస్యంగా కళ్ళముందు పరిచిపెట్టింది. అనుకోకుండా ప్రతీ శుభలేఖా చదివేవిధంగా పేర్లు చదివాను.
    చి. శ్యామసుందర్ కు-చి. సౌ. కృష్ణవేణిని ఇచ్చి-తలతిరిగినట్టయింది. శుభలేఖ విసిరికొట్టి పక్కమీదపడి బావురుమన్నాను. వదిన వుందన్న సంగతి మర్చిపోకపోయినా ఒక్కసారిగా పొంగిన దుఃఖాన్ని దాచుకోలేకపోయాను. వదిన తెల్లబోయి వుంటుంది. మౌనంగా నా తలదగ్గిర కూర్చుంది.
    "కృష్ణవేణీ!..." అంది. నేను వెక్కి వెక్కి ఏడుస్తూ వుండిపోయాను.
    "ఏమిటిది కృష్ణవేణీ? ఎందుకిలా నీలో నువ్వు బాధపడతావు? ఈ విషయం ఎన్నిసార్లడిగినా చెప్పలేదేం?" అంది తల నిమురుతూ.
    "వదినా!" అంటూ వదిన ఒళ్ళో మొహం దాచుకున్నాను. అప్పటికి వదిన గ్రహించింది. చాలసేపు వరదవెల్లువలా పొంగిన దుఃఖం అణగారేవరకూ వూరుకొంది. తర్వాత ప్రేమగా కళ్ళు తుడుస్తూ అంది - "నీకీ పెళ్ళి ఇష్టం లేదేమోనని నేను అనుకొంటూనే వున్నాను. నిన్నెన్ని సార్లడిగినా చెప్పావుకాదు. నీ ఇష్టాన్ని కాదనేదెవరు చెప్పు? నీకెవరి ఒత్తిడీ లేదుకదా? ఎందుకిన్నాళ్ళు నీలో నువ్వుదాచుకున్నావు కృష్ణవేణీ?" అంది.
    "లేదు వదినా! నాకీపెళ్ళి ఇష్టమే."
    ఇంకా నా దగ్గిర దాపరికం చేస్తావా? భలే దానివే. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు కృష్ణవేణీ! నీకిష్టంలేని పెళ్ళి చేసుకోమని నిన్నెవరూ బలవంతం చెయ్యరు. నాకు చెప్పు. మీ అన్నయ్యకు చెప్తాను. శ్యామసుందర్ చాల మంచివాడట. పరిస్థితి తెలియజేస్తే ఏమీ అనుకోడు."
    వదినకు నిజం చెప్పాలనిపించింది- "వదినా కొన్ని నెలలక్రిందట లెక్చరర్ గా మాధవ్ రావనే అతన్ని పరిచయం చేశాను, మొన్న రెండుసార్లు ఫోన్లో పిలిచాడు. గుర్తు వుందా?"
    "అవును. అతను మీ లెక్చరర్ అని చెప్పావు కదూ?"
    "కాదు. అతనితో కలం స్నేహం చేశాను." ఆగిపోయాను.
    "మరి నీ ఇష్టాన్ని ఎవరు కాదంటారనుకున్నావ్?
    "భగవంతుడే కాదన్నాడు వదినా! అతనికి నాలుగేళ్ళక్రిందటే పెళ్ళయింది." - వదిన విస్తుబోయింది - "తెలిసీ ఎలా...?"
    "కాదు వదినా! ఆ సంగతి తెలిసేసరికే మనసు పారవేసుకున్నాను". మాధవ్ స్నేహం గురించి వదినకు చెప్పాను. అంతా విని-
    "అయ్యయ్యో! ఎటువంటి పరిస్థితిలో చిక్కుకున్నావు కృష్ణవేణి! ఎవరు చెయ్యగలిగింది మాత్రం ఏముంది?" అంటూ వాపోయింది. వదిన నావంటివాళ్ళ హృదయా వేదన అర్ధం చేసుకో గలదు. తన పెళ్ళికిముందు అన్నయ్యకు దూరమైపోతానేమోనని ఎంతబాధపడిందో చాలాసార్లు చెప్తుంది. చెప్తూనే కళ్ళనీళ్ళు కార్చేది. "నువ్వు అదృష్టవంతురాలివి వదినా! అభాగ్యం ఎంతటి వాళ్ళకి!" అన్నాను.
    "ఎవరైనా ఇష్టంలేని పెళ్ళికి బలౌతున్నా రంటే నాకు చాల కష్టం అనిపిస్తుంది కృష్ణవేణి! అందుకే రోజూ నీ గురించి ఆలోచిస్తున్నాను. కాని ఇప్పుడు ఏం చెయ్యమంటావ్ చెప్పు."
    "ఏమీ వద్దు వదినా! ఈ పెళ్ళి చేసుకుంటాను."
    వదిన ఎంతో బాధపడింది- ఎన్నో విధాల నాకు నచ్చచెప్పింది.
    "కాని వదినా! శ్యామసుందర్ ని అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తూంది వదినా! మరో ఆడదైతే అతన్ని నిండు మనసుతో ఆహ్వానించేది, కాని నావల్ల ఏం సుఖపడతాడు?"
    "అది నిజమే అనుకో. కాని నువ్విలా వుండి పోతావా? క్రమంగా నీలో చాలామార్పు వస్తుంది. నీ జీవితంలో పాలుపంచుకున్న వ్యక్తిని నువ్వు సుఖపెట్టాలి. "ఆవిషయం ఒక్కటే దృష్టిలో వుంచుకో. ఎదటి వ్యక్తి లోటుపాట్లు సహించగలగటం గొప్పగుణమే. శ్యామసుందర్ లో ఆ గుణం వుండకూడదా?"
    ఎన్నివిధాల సమర్ధించుకోబోయినా శ్యామసుందర్ ని అన్యాయం చేస్తున్నాననే భావం మాసిపోలేదు. కాని నేనేమీ చెయ్యలేని పరిస్థితిలో వుండిపోయాను.
    మాధవ్ వుత్తరాలు రాయటంలేదు. నేనే మాధవ్ కి రాయాలంటే మొహం చెల్లటం లేదు. కోపం మరిచి ఒక్కసారైనా రాస్తాడేమోనని ఎదురుచూస్తూనే వుండేదాన్ని.
    పెళ్ళికిముందు కొన్నిసార్లయినా శ్యామసుందర్ ని గురించి ఆలోచించకపోలేదు. నేను దూరంగా వుంచాలనుకున్నా అతను నాకు పరాయివాడుకాదు. బ్రతుకంతా అతనితో ముడిపడి వుంటుంది, ఆ శ్యామసుందర్ ని భర్తగా ప్రేమించి గౌరవించటం నాధర్మం.....ప్రభూ! నా ధర్మాన్ని నిష్కల్మషంగా నిర్వర్తించగలిగే మనోధైర్యం ప్రసాదించు. నన్ను సుమంగళిగా దీవించు- అని దైవాన్ని ప్రార్ధించాను.
    పెళ్ళిరోజు సమీపిస్తున్న కొద్దీ నాలో ఒకరకమైన నిర్లిప్తత - మొండితనం పెరుగుతూన్నాయనిపించేది. మనసు సున్నితం కోల్పోయింది. మాటిమాటికీ కళ్ళు చెమ్మగిలటం లేదు. దుఃఖం వరదలా పెల్లుబికిరావటం లేదు. మనసు మైదానంగా మిగిలిపోయింది అందులో మనసును మై మరపించే పూ పరిమళాలూ లేవు. తనువును బాధించే ముళ్ళ కంచెలూ లేవు. ఏ ఆలోచనలూ లేకుండా శూన్యంలోకి చూస్తూ గడిపివెయ్యటం తేలికని పించేదీ. పెళ్ళికిముందు పవిత్రమైన కన్నెహృదయంతో ఒక వుత్తరం రాయాలనిపించింది మాధవ్ కి.
    ప్రియమైన
    మాధవ్! నీకు నమస్కరించి ...
    మన స్నేహం చిత్రమయిన ప్రయాణం గా మాత్రం ఆఖరయింది. ఆ ప్రయాణంలో రకరకాల అనుభూతులు పొందగలిగాము. తోటిప్రయాణీకులెప్పుడూ మన గమ్యస్థానం వరకూ రారు. ఇద్దరి గమ్యస్థానం ఒకటే కావాలని ఆశించి, నిరాశపాలు గావలసి వచ్చింది. దానికి నే నెంత వరకు బాధ్యురాలనో నాకు తెలుసు. నేను ఏవిధంగానూ నా బాధ వెల్లడించుకోలేడు, ఈ లోకంలోనే కాదు, మరోలోకంలోనైనా నిన్ను కల్సుకోవడానికి నాకు స్వతంత్రం లేకుండా పోయింది. పవిత్ర మయిన నీ స్నేహాన్ని నేనంటూ ఉన్నంతకాలం మర్చిపోలేను. నిండు మనస్సుతో నన్ను క్షమిస్తావని ఆశిస్తాను.
                                                                                     కృష్ణవేణి


    ఈ కృష్ణవేణీ మాధవ్ ల గాధ ఎవరైనా నాకు వినిపిస్తే నేను నమ్మను. ఆసంజసమంటూ విమర్శిస్తాను. కృష్ణవేణి ప్రణయాన్ని అపహాస్యం చేస్తాను. మంచీ, చెడూ గురించి ఎప్పుడూ ఆలోచించని కృష్ణవేణి వాటికీ అంతగా చోటుయిస్తుందా? మాధవ్ కర్పించిన నిండు మనస్సుతో మరొక వ్యక్తిని ఆహ్వానించ గలుగుతుందా? భవిష్యత్తు నంధకారం చేసుకుని, పరువు, ప్రతిష్టలకోసం ప్రాకులాడుతుందా? అంటూ ప్రశ్నిస్తాను. అలా చేసిందీ అంటే కృష్ణవేణికి మాధవ్ మీదవున్న మమకారమంతా అబద్ధం. ఇక కృష్ణ వేణి బాధపడడానికి అర్ధం లేదు. అంటూ కొట్టి పారేస్తాను.
    కానీ ఎవరినోకాను, నేనే కృష్ణ వేణిని. ఎవరో నాకీ కథ చెప్పటం లేదు. స్వయంగా నేనే చెప్పుకొంటున్నాను. ఎవరైనా చెప్తే నమ్మననుకునే పరిస్థితులు నేనే కల్పించుకున్నాను. అనుభవిస్తున్నాను.
    పెళ్ళిపనులు హడావిడిగా జరిగిపోతున్నాయి. నాకు చేయించగల నగల విషయంలోనైనా నేనేమీ పట్టించుకోలేదు. అంతా వదినె సమర్ధించుకుంది. రాత్రింబవళ్ళు ఇంట్లో ఏవో పురమాయింపులూ, అంతా సందడి, నాన్నగారు మొదటిసారిగా సంతోషంగా చేస్తున్న ఆడపిల్ల పెళ్ళి. ఆహ్వానాలందుకున్న బంధువుల ఆగమనాలు ప్రారంభమయ్యాయి. పెళ్ళి రెండురోజులే వుంది. నేను నా గదిలో ఉండిపోయేదాన్ని. రేణు ఎప్పుడూ నా దగ్గిర ఏవో కబుర్లు చెప్తూ వుండేది. నన్ను చూడడానికి వచ్చిన బంధువు లందర్నీ చిరునవ్వుతో పల్కరించాల్సి వచ్చేది. అదొక రకమయిన దశ. నా యిష్టాన్ని నేను తీర్చుకోనూ లేను. అయిష్టాన్ని ఓర్చుకోనూ లేను. కన్నెదశలో మాధవ్ వ్రాసిన వుత్తరం ఒక్కటైనా చదువుకోవాలని తహతహలాడాను. అది తీరని కోరికై పోయింది. మాధవ్ నన్ను క్షమించలేదు. అవును. నేను క్షమార్హురాలిని కాను. అందుకే నేను బాధపడలేదు. మాధవ్ నాకు ఏమీ కాదు. స్నేహితుడు దూరాన వుండే స్నేహిహుడు అంతే!!

                             *    *    *

    పెళ్ళి! నాలో ఎటువంటి మధురమయిన అనుభూతులూ కల్గించలేదు. కానీ కళ్యాణమంటే నాకు స్థిరమయిన అభిప్రాయాలున్నాయి. వివాహబంధం పవిత్రమైంది. అది ఎన్నడూ ఏ విధంగానూ అపవిత్రం కాకూడదు. నన్ను నమ్మి తన జీవనభాగస్వామినిగా చేసుకుంటున్నవ్యక్తిపట్ల నా ధర్మం నేరవేర్చుకుంటాను. అదే భావంతో విశాల మైన మంటపంలో పెళ్ళిపీటల మీద తలదించుకు కూర్చున్నాను. నా వ్యక్తిత్వాన్నీ, యిష్టాన్నీ బలి పెట్టి లోకానికి లొంగిపోయి తల దించుకున్నాను. రెండు జీవితాలను ముడిపెట్టే మంత్రోచ్చారణ సాక్షిగా వెలిగే అగ్నిహోత్రం, ఎంతో పవిత్రత నింపుకున్నాయి.




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.