Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 6


 

    "సెకండ్ షో పిక్చర్ కి వెళ్ళాలి!"అన్నాడు వాసు గంభీరంగా.
    "అదేమిటండీ -- హటాత్తుగా చెప్పారు. నేనూ వస్తాను...."అంది యమున.
    "నువ్వురావద్దు. నేనొక్కడినే వెడతాను..." అన్నాడు వాసు.
    యమున చిరాగ్గా -- మీరు సెకండ్ షోకి వెడితే నన్నెందుకు తీసుకు వెళ్ళరు? నిజంగా పిక్చర్ కే వేడుతున్నారా-- లేక ...."అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది.
    "నీ ప్రశ్నకు జవాబు చెప్పను. త్వరగా భోజనం పెట్టు -" అన్నాడు వాసు.

                                     6
    "అనుకోకుండా వెనక్కు తోయబడి ఉంటాడు. లేచేలోగా పోడిచేశాడు హంతకుడు --" అన్నాడు ఇన్స్ పెక్టర్ . అతడి ముఖం చాలా చిరాగ్గా వుంది.
    "హంతకుడు బొత్తిగా ఒక్క క్లూ కూడా వదల్లేదని చిరాగ్గా ఉన్నట్లుంది. ఇన్స్ పెక్టర్ గారికి.... హంతకుడు మీకోసం హత్య చేయడు మరి!" అన్నాడు వెంకన్న.
    "రావణాసురుడంతటి తెలివైనవాళ్ళే వరాలు కోరుకునేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఈ హంతకుడంత కంటే తెలివైన వాడా?" అన్నాడు ఇన్స్ పెక్టర్.
    "అలోచించి చూస్తె మరో చిన్న క్లూ దొరుకుతుంది-" అన్నాడు వెంకన్న.
    "ఏమిటది?" ఆత్రుతగా అడిగాడు ఇన్స్పెక్టర్.
    "రంగారావు , విష్ణుమూర్తి, లచ్చన్న -- ఈ ముగ్గురి హత్యలూ ఇంచుమించూ ఒకే సమయంలో జరిగాయి -- అదీ సాదారణంగా సినిమా రెండో అట వదిలిన కాసేపటికి...." అన్నాడు వెంకన్న.
    ఇన్స్ పెక్టర్ ఆలోచనలో పడి - "అంటే హంతకుడు రెండో అట సినిమా చూసొచ్చి ఈ హత్యలు చేస్తున్నాడంటారా?"అన్నాడు.
    "అంతకంటే ముఖ్యంగా మీరు గ్రహించవలసింది- ఈమూడు హత్యలూ ఒకే హంతకుడు చేసి వుంటాడని! అంటే ఈమూడు హత్యలకూ ఏదైనా కామన్ మోటివ్ ఉన్నదా అని!" అన్నాడు వెంకన్న.
    ఇన్స్ పెక్టర్ ఆశ్చర్యంగా - "మీరు చెప్పేదాని కంటే ఎక్కువ మీకు తెలుసునని నాకనుమానంగా వుంది--" అన్నాడు.
    "అనుమానముంటే  ఉండనివ్వండి -- నన్ను మాత్రం అనుమానించకండి!"అన్నాడు వెంకన్న.
    ఈ జోక్ ను నువ్వే మూడ్ ఇన్స్ పెక్టర్ కున్నట్లు లేదు. లచ్చన్న హత్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాడతను.
    లచ్చన్నది కూరగాయల వ్యాపారం. నాలుగు వేళ్ళూ లోపలకు పోతున్నాయి. భార్య ముగ్గురు పిల్లలు. అంతా పుట్టింటికి వెళ్ళారు. అతనొక్కడే ఉంటున్నాడు వారం రోజులుగా. చుట్టూ పక్కల వాళ్ళేమీ సమాచారం ఇవ్వలేక పోయారు. రాత్రి జరిగిన విశేషం గురించి. ఎవ్వరూ ఏమీ చూడలేదంటున్నారు. లచ్చన్న తో ఎవరికీ అట్టే పరిచయమున్నట్లు కూడా లేదు.
    చచ్చిపోయిన వారిలో
    రంగారావు ధనికుడు కాడు కానీ ధనవంతులతొత్తు, దుర్మార్గుడన్న పేరుంది.
    విష్ణుమూర్తి మధ్యరకం వ్యాపారి.
    లచ్చన్న కూరగాయల వ్యాపారి.
    ముగ్గురికీ ఏమీ సంబంధ బాంధవ్యాలూ , లావాదేవీలు వున్నట్లు లేదు. ఈ ముగ్గురు ఒక్కడే చంపాడనుకోవడం వల్ల నేను క్లిష్ట తరమవుతుందే తప్ప క్లూ దొరకదు.
    ఇన్స్ పెక్టర్ తన అభిప్రాయం వెంకన్నకు చెప్పాడు.
    వెంకన్న నోట్ బుక్ విషయం ఇన్స్ పెక్టర్ కు చెప్పలేదు. ఈ మూడు హత్యలకూ సంబంధమున్న విషయానికి తిరుగులేని రుజువు అదే!
    వెంకన్న కు కలిగిన బాధ అంతా ఇంతా కాదు. కేసు బొత్తిగా ముందుకు వెళ్ళడం లేదు. జరగబోయే నేరాల గురించి తనకు ముందుగానే తెలిసింది. కానీ ఆ నేరాల గురించి ప్రజలనెలా హెచ్చ్రించాలో తనకు తెలియడం లేదు. అయినా ఈ హంతకుడెవరు? హత్యలు చేయడానికి అతనికున్న కారణాలేమిటో? అతనేవారేవరిని చంపడానికి ఎన్నుకున్నాడో? ఈ హత్యాకాండ ఎంతకాలం  ఇలా కొనసాగిస్తాడో?
    తనేమీ చేయలేడా? జరగబోయేవన్నీ నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవడమేనా?
    "ఎందుకైనా మంచిది? ఈ మూడు హత్యల్నీ కలిపి పరిశీలీస్తున్నట్లు ప్రచారం చేయండి. ఒకోసారి ఇలాంటి ట్రిక్స్ క్లిక్ అవుతుంటాయి...." అన్నాడు వెంకన్న.
    "ఇది నాకిష్టం లేదు!" అన్నాడు ఇన్స్ పెక్టర్.

                                   7
    "ఏమండీ -- మీరా నోట్ బుక్ ని సీరియస్గా తీసుకున్నట్లు కనబడదు. దేనికైతే నేను భయపడ్డానో అదే జరిగాబోతున్నట్లుంది. మీరేం చేయలేరా?" అంది పద్మావతీదేవి.
    "మొత్తం కేసంతా నీకు తెలుసు....ఏదైనా ఉపాయం నువ్వే చెప్పు!"అన్నాడు వెంకన్న.
    "నేను డిటెక్టివ్ భార్యనే కానీ డిటెక్టివ్ ను కాదు...." అంది పద్మావతీ దేవి.
    "నేను డిటెక్టివ్ నే కానీ భగవంతుడ్ని కాను...."అన్నాడు వెంకన్న.
    "అయితే మీరేమీ చేయలేరా?'అంది పద్మావతీ దేవి నీరసంగా.
    "భగవంతుడంతటి వాడు దుర్మార్గుల్ని పరిమార్చడం కోసం అవతారాలెత్తి తగిన అవకాశం కోసం ఎదురు చూసి -- అప్పుడు దుష్ట సంహారం చేశాడు. నేను సామాన్య మానవుణ్ణి, ఒక చిన్న అవకాశం లభిస్తే బాగుండునని ఆశిస్తున్నాను....ఇంతవరకూ నేను పట్టిన కేసులో ఫేయిలవలేదు. సగంలో వదిలి పెట్టవలసిన అవసరం రాలేదు. పోలీసులకు వివరాలందజేసినా వేయకపోయినా ప్రతి కేసుకూ అంతం మాత్రం చూడగలిగాను. దీనికీ అవకాశం రాకపోదు . ఒకే ఒక చిన్న...."    
    వంటింట్లో టెలిఫోన్ మ్రోగింది. వెంకన్న అందుకున్నాడు.
    "సార్! ఈరోజు నేనా నోట్ బుక్ ఒనర్ని చూశాను. అతను ఎర్ర పాంటు తో బయట తిరుగుతుండగా గుర్తుపట్టాను. అతనేనన్న విషయంలో నాకేమీ సందేహం లేదు--"అంది సీతమ్మ.
    "ఎవరతను?"
    "విష్ణుమూర్తి తమ్ముడు శివరావు....."
    "ఐసీ....భోంచేసి వస్తున్నాను. నువ్వక్కడే వుండు...."అన్నాడు వెంకన్న. తర్వాత భార్య వంక తిరిగి --"నేనెదురు చూస్తున్న చిన్న క్లూ దొరికినట్లే వుంది....'అన్నాడు ఉత్సహంగా.
    భోజనం చేసి ఆఫీసు రూమ్ కి వెళ్ళగానే సీతమ్మ ను చూసి "ఈరోజు నువ్వు చాలా పెందరాళే వచ్చినట్లున్నావు" అన్నాడు. అప్పటికింకా రాజమ్మ రాలేదు.
    "అవును బాస్. అమ్మ యింట్లో కాఫీ పొడి అయిపోయిందంటే నేను ఉదయం షాప్ కెళ్ళాల్సోచ్చింది. అప్పుడా ఎర్ర ఫాంటు వాడ్ని చూశాను. వుత్సాహం ఆగలేదు..." అంది సీతమ్మ.
    'చూసీ చూడగానే నాకా శివరావు మీద అనుమానం కలిగింది. వాడి కళ్ళు భయంకరమైన ఆలోచనలు సూచిస్తున్నాయి. మనిషి చాలా లోతైనవాడని అనిపిస్తోంది. ముఖంలో కూడా హంతకుడి ఛాయలు కనబడుతున్నాయి. సాధారణంగా నా అంచనా తప్పు కాదు...."అన్నాడు వెంకన్న.
    "ముఖం చూసి హంతకుడెవరో చెప్పగలిగితే ఇంక పరిశోధన ఎందుకు?" అంది సీతమ్మ.
    "ఋజువులు కోసం! కోర్టుల జోస్యాలు నమ్మవు గదా!"అన్నాడు వెంకన్న.
    కాసేపట్లో రాజమ్మ వచ్చింది. ముగ్గురూ కలిసి కేసును క్షుణ్ణంగా చర్చించారు.
    'అన్నట్లు మనం వదిలేసిన పాయింటోకటుంది . ఆ నోట్ బుక్ లోని దస్తూరీ శివరావుదో కాదో తెలిస్తే పోయేదిగా --" అంది రాజమ్మ.
    'ఆ ఐడియా నాకెప్పుడో వచ్చింది. దస్తూరీ శివరావుదే అని గ్రహించినంత మాత్రాన మనమేమీ చేయలేము. సీతమ్మ అతణ్ణి సరిగా గుర్తుపట్టలేకపోవడం వల్ల -- ఆ ఎర్ర పాంటు వ్యక్తీ వేరే మనిషై ఉంటాడన్న బ్రాంతిలో  నేను నోట్ బుక్ దస్తూరీ గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు శివరావు పై మన అనుమానం పెరిగింది. దస్తూరీ కూడా పోల్చి ఒక్క క్షణం కూడా అతన్ని వదిలి పెట్టకూడదు-" అన్నాడు వెంకన్న . మాటలైతే ఆపాడు కానీ అతని ఆలోచనలింకా కొనసాగుతున్నట్లు కళ్ళు సూచిస్తున్నాయి.
    "దస్తూరీ ఎలా సంపాదిస్తారు?' అనడిగింది సీతమ్మ.
    "అందుకు రాజమ్మ వెడుతుంది. మగాడి వంక కవ్వించే చూపులు చూసి అనుకున్న పని సాధించుకు రావడంలో రాజమ్మ గట్టిది!" అన్నాడు వెంకన్న.
    సీతమ్మ తన కుర్చీని వెంకన్న కు దగ్గరగా జరిపి అతడి వంక అదోలా చూస్తూ -- "అలా చూడ్డం నాకు చేత కాదంటారా?" అంది.
    వెంకన్న ఆమె వంకచూసి -- "మిస్ సీతమ్మా! ఇప్పుడలా చూడకు. నా మూడ్ పాదయిందంటే ఆలోచనలు తప్పుదారి పడతాయి. ప్లీజ్!" అని - "ఈ కేసునాకు అప్పగించింది శివరావు. అతడే హంతకుడైతే ఇందులో నాకు ఒక్క పైసా రాదు. డబ్బు కోసం రాజమ్మను శివరావు ఇంటికి పంపిస్తాను. అప్పుడు రాజమ్మ అతడి దస్తూరీ సంపాదించుకు రావాలి--" అన్నాడు వెంకన్న. అంటూనే అతడు శివరావు కు ఫోన్ చేసి తన అసిస్టెంట్ ను పంపిస్తున్నట్లు చెప్పాడు.
    రాజమ్మ బయల్దేరి కార్లో వెళ్ళి ఆరగంటలో తిరిగి వచ్చేసింది. శివరావు రెండు వేలిచ్చాడు. ఆమేరకు అతడి చేత ఓ వుత్తరం కూడా రాయించి పట్టుకొచ్చింది.
    వెంకన్న ఆమెను మెచ్చుకుని నోట్ బుక్ -- ఆ దసూరి ని సరిపోల్చి చూసి -- "మైగాడ్ -- ఇది శివరావు దసూరీయే --" అన్నాడు.
    అనుకున్నదే అయినా అసిస్టెట్లిద్దరూ అప్రయత్నంగా ఆశ్చర్యంతో నోరు తెరిచారు-- "ఇప్పుడెం చేయాలి?' అంది ఇద్దరిలోకి రాజమ్మ ముందుగా తేరుకుని.
    "మనం కేసుల్ని ఎన్నో కొనాల్నుంచి పరిశీలించాం. రంగారావు, లచ్చన్నను చంపడానికి-- శివరావు కుండే కారణాలు సూచన ప్రాయంగా కూడా తెలియడం లేదు. అందుకే పరిశోధన కుంటి నడకన నడుస్తోంది. ఇప్పుడు మనకు శివరావు హంతకుడని తెలిసిపోయింది. కాబట్టి త్వరగా ఋజువులు సంపాదించాలి. అన్నిటి కంటే ముందు శివరావుని ఈ క్షణం నుంచీ నీడలా వెన్నాడాలి--" అన్నాడు వెంకన్న.
    "ఇరవైనాలుగు గంటలూ ఓ మనిషిని వెన్నాడాలంటే ఒక్కరు చాలరు. ఈ పనికి నేను నా బాయ్ ఫ్రెండ్ ని నియోగిస్తాను" అంది సీతమ్మ.
    వెంకన్న నవ్వి అంగీకారం తెలిపాడు.

                                     8
    "తేలండీ --" అంది యమున.
    అది చాలా పెద్ద తేలు. గోడకు మూలగా ఆగివుంది.
    "ఎవర్నయినా పిలు--"అన్నాడు వాసు.
    "తేలును చంపడానికి ఎవర్నయినా పిలిస్తే బాగుండదండీ -- అనవసరంగా అంతా మిమ్మల్ని చూసి నవ్వుతారు. నాకది నచ్చదు. దాని గురించి నేను చూస్తాను...." అంటూ మంచం దిగింది యమున.
    రేడియో లో వస్తున్న తెలుగు వార్తల్ని కట్టేశాడు వాసు. యమున గదిలోంచి బయటకు వెళ్ళి ఓ చెప్పు, కర్రతో మళ్ళీ లోపలకు వచ్చింది. అది చూస్తూనే వాసు వనకసాగాడు.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.