Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 6


 

    "బాగుందండీ--! నీ చొక్కా మీద పురుగుందంటే నీ చేత్తో నే తీసేయ్యమన్నట్లు హంతకుడ్ని పట్టుకోమని మిమ్మల్ని పిలిస్తే నన్నే హంతకుడ్ని కమ్మనమని మీ పని సులభం చేసేసుకుంటున్నారు మీరు. నిజం చెప్పాలంటే అన్నయ్య హత్య జరిగిన సమయంలో నాకు పటిష్టమైన ఎలిబీ ఉంది!" అన్నాడు శివరావు.
    "చెప్పండి!"
    గతరాత్రి శివరావు యింట్లో లేడు. స్నేహితులతో పేకాడుతున్నాడుట. పేకాట మధ్యలో అతడికి కళ్ళు తిరిగినట్లయి అప్పటికప్పుడు ఓ నర్శింగ్ హోం కు వెళ్ళి రాత్రంతా అక్కడే పడుకుని వచ్చాడట.
    "నర్శింగ్ హోం అడ్రస్ చెబుతారా?'
    శివరావు చెప్పాడు. సీతమ్మ నోట్ చేసుకుంది.
    "ఇలా కళ్ళు తిరగడం మీకు అలవాటా?"
    "అలవాటైతే నర్శింగ్ హోం కెందుకు వెడతాను? మొదటిసారి కాబట్టే కంగారు పడ్డాను...."
    'అలా ఎందుకు జరిగిందంటారు?" అన్నాడు వెంకన్న.
    "మనకత్యంత ఆప్తులైన వారికాపద కలిగేలా ఉంటే ఆ విషయాన్ని మెదడు ముందుగానే కనిపెట్టి సూచించగలదట. నిన్నరాత్రే ఈ విషయం స్పురించి వుంటే నర్సింగ్ హోం కు బదులు ఇంటికే పోయి ఉండేవాణ్ణి!" అన్నాడు శివరావు బాధగా.
    "మీకు సైకాలజీ తెలుసా?' అన్నాడు వెంకన్న.
    "ఏదో కొద్దిగా!" అన్నాడు . కానీ శివరావు కా సంభాషణ పొడిగించడం పెద్దగా యిష్టం లేనట్లుంది. "వెంకన్న గారూ! మీరు కోరిన డబ్బిస్తాను. అన్నయ్యను చంపిన హంతకుణ్ణి వీలైనంత త్వరగా పట్టుకోండి --" అన్నాడు.
    వెంకన్న ముఖం గంబీరంగా అయిపొయింది - "నా శక్తిని తక్కువ అంచనా వేసి నాకీ పని అప్పచెబితే మాత్రం తర్వాత మీరే విచారిస్తారు...." అన్నాడతను.
    "అంటే?"
    "హంతకుడ్ని నేను నిజంగానే త్వరలోనే పట్టుకో గలనన్న నమ్మకముంది --" అన్నాడు వెంకన్న.
    తర్వాత వెంకన్న, సీతమ్మ కలిసి అతడు చెప్పిన నర్శింగ్ హోం కి వెళ్లారు.
    "అతడి పేరు శివరావు. ఇందాకనే ఈ విషయం పోలీసులు వచ్చి అడిగి వెళ్ళారు. రాత్రంతా అతనిక్కడే ఉన్నాడు. మనిషిలో ఏ కంప్లైంటూ ఉన్నట్లు నాకు తోచలేదు. ఏదో గాబరాగా ఉందనీ తననో గదిలో పెట్టి గొళ్ళెం వేయమని కోరాడతను. అతనికి సుఖంగా నిద్ర పట్టడానికి ట్రాంక్విలైజెర్సీచ్చి గదిలో ఉంచి బయట గొళ్ళెం వేసాను. మధ్యలో ఓసారి తలుపు తెరిచి చూస్తె అతను ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు --" అన్నాడు డాక్టర్.
    "గది తలుపులు వేసి ఉండగా పారిపోవడానికి వేరే మార్గం లేదా?'
    "గది కిటికీలకు ఇనపచువ్వలున్నాయి. వాటిని తొలగించడం చాలా కష్టం--"
    "కష్టం కావచ్చు. అసాధ్యం కాదు గదా!" అన్నాడు వెంకన్న.
    "పోలీసులా విషయం పరిశోధించి వెళ్ళారు. అన్ని చువ్వలూ ఒక్కలా ఉన్నాయి...."
    వెంకన్న డాక్టరుకు థాంక్స్ చెప్పి అక్కణ్ణించి బయల్దేరాడు.

                                    4
    "మీరు శివరావు ననుమానించడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది!" అంది సీతమ్మ.
    "ఇందులో ఆశ్చర్యానికేముంది? విష్ణుమూర్తి మరణం వల్ల శివరావు కొక్కడికే లాభముంది! పోలీసు లాలోచించిన విధంగానే నేనూ ఆలోచిస్తున్నాను" అన్నాడు వెంకన్న.
    "అలాంటప్పుడు అతనే మిమ్మల్నేందుకు ఆహ్వానించాడు"
    "దీన్నే ముందరి కళ్ళకు బంధం వేయడమంటారు. పోలీసుల అనుమానం ఎటూ శివరావు పైనే ఉంటుంది. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ తనకు రక్షణగా ఉండడం మంచిదని అతడు భావించి ఉంటాడు...."
    "మీరతన్ననుమానించడానికింకా ఏమైనా కారణాలున్నాయా?"
    "ఉన్నాయి. ఉదాహరణకు ఎలిబీ విషయం అతను జరగబోయేది తెలుసుకుని కావాలనీ మరీ అది సృష్టించుకున్నాడనిపిస్తోంది. అన్నగార్ని హత్య చేయమని ఎవర్నో పురమాయించి తనేమీ నర్శింగ్ హోం లో వుండి పోయాడు. అతన్ని హంతకుడని ఎవరూ అనలేరు కదా!" అన్నాడు వెంకన్న.
    "ఊ" అంది సీతమ్మ ఇంకా చెప్పమన్నట్లు.
    "నేను అతనే హంతకుడని అన్నపుడు అతను వెంటనే ఎలిబీ గురించి మాట్లాడాడు. ఏ తమ్ముడి పైనైనా ఇలాంటి అభాండం పడిందంటే వెంటనే ఎలిబీ గురించి కాక -- తోడ బుట్టినవాడ్ని చంపుతారా, అందులోనూ అంత ఘోరంగా --అని వాపోతాడు. శివరావు వాపోలేదు. ఎలిబీ గురించి మాట్లాడాడు. ఆరోపణ అబద్దమని చెప్పాలన్న తపన తప్పితే -- ఆరోపణకు- అతను అణుమాత్రం నోచ్చుకున్నట్లు లేదు...." అన్నాడు వెంకన్న.
    "అప్పటికే పోలీసులు అడిగి ఉండడం వల్ల అలా ప్రవర్తించాడెమో !" అంది సీతమ్మ.
    "అయినప్పటికీ నేనడిగినా అతడికి బాధ కలిగి ఉండాల్సింది. అయితే నువ్వు చెప్పిన కారణం కూడా కొట్టేయడానికి వీల్లేదనుకో!" అన్నాడు వెంకన్న సాలోచనగా.
    "మీరో విషయం మరిచిపోతున్నారు. రంగారావు హత్యకీ, ఈ హత్యకీ సంబంధముందని మనమనుకుంటున్నాం!" అంది సీతమ్మ.
    ఈ సూచన వింటూనే వెంకన్న ఉలిక్కిపడి -- "అవును నిజమే! ఈ కోణం నుంచి కూడా ఎన్నో విషయాలి పరిశీలించాల్సి ఉంది. అన్నట్లు నీకు శివరావులో -- ఈ నోట్ బుక్ ఓనర్ పోలికలు కనబడ్డాయా?" అన్నాడు.
    "అవుననీ అనలేను. కాదనీ చెప్పలేను. నాకు గుర్తున్నది అప్పుడతను వేసుకున్న ఎర్ర పాంటు మాత్రమే!"
    
                                    5
    "ఇదివరకటి ఊరు కాదు. ప్రాణాలరచేతిలో పేట్టుకుని బ్రతకాల్సోచ్చెలాగుంది --" అంటూ కుర్చీలో కూర్చోబోయాడు పుండరీ . అతను కూర్చొనేలోగానే కెవ్వుమని అరిచాడు వాసు.
    ఉలిక్కిపడి ఆగిపోయాడు పుండరీ.
    "ఎమిటయిందండీ--" అంది యమున.
    "వాడు కూర్చో బోయే చోట ఓ కండ బేరు ఉంది. నేను  అది చచ్చిపోయిందనే అనుకున్నాను--" అన్నాడు వాసు.
    అతడికి వళ్ళంతా చెమటలు పట్టేశాయి.
    "ఏమిట్రా మరీను -- చాదస్తం ఎక్కువైపోతోంది -- " అన్నాడు పుండరీ.
    "చాదస్తం కాదురా -- అది నా బలహీనత!" అన్నాడు వాసు.
    "ఏం బలహీనతో కానీ ఈయనతో కష్టంగా ఉందన్నయ్య గారూ -- ఓ రోజు ఈయన చూస్తుండగా పేనుకుక్కానని కళ్ళు తిరిగి పడిపోయారు. మరో రోజు బల్ల పురుగును పట్టేసరికి కెవ్వుమని అరిచారు ...." అంది యమున.
    "నీలాంటి వాళ్ళకు బ్యాలన్సు గా ఉంచడం కోసమే భగవంతుడు కొందరు హంతకుల్ని సృష్టించాడెమో -- అబ్బ-- ఆ విష్ణుమూర్తి గారు శవాన్ని చూస్తె...."
    "ఏమిటండీ అ విశేషం?" అంది యమున కుతూహలంగా.
    "హంతకుడాయన్ను కుర్చీకి కట్టేసి పేక కోసేశాడు.
    "ఒరేయ్....చెప్పకురా...." అన్నాడు వాసు కంగారుగా.
    పుండరీ ముఖం గంబీరంగా అయిపొయింది -- "ఒరేయ్ వాసూ! చెట్టంత మనిషినినవ్వు. కండలు తిరిగి వున్న నిన్ను చూస్తె కొంతమంది దొంగలు జడుసుకుని పారిపోతారు. ఇంట్లో నువ్వు నీ భార్య తప్ప ఎవ్వరూ లేరు. నువ్విలా ప్రతి చిన్న విషయానికీ భయపడుతుంటే నీ భార్యకు ధైర్యం ఎలాఉంటుంది చెప్పు? ఆమెకు నువ్వు కొండంత అండగా ఉండొద్దూ-----"
    వాసు మాట్లాడకుండా తల వంచుకున్నాడు.
    భర్త చిన్నబుచ్చుకున్నాడని యమునకు అనుమానం వచ్చింది. "ఈ రోజుల్లో ఇంత మెత్తటి మనుసుండే వారే అరుదు. ఇంత మంచివాడు నావారు కావడం నా అదృష్టమనుకుంటాను. నేను. ఏదో వేళాకోళనికి ఆయన్ను వేదించినా ఆయన గురించి నాకే కష్టమూ లేదు--" అందామె.
    పుండరీ వెళ్ళిపోయాక -- ఆప్యాయంగా భర్త జుట్టు లోనికి పోనిస్తూ -- "పుండరీ గారన్నారని కాదు కానీ -- మీ సున్నిత మనస్తత్వాన్ని బయట వారు అర్ధం చేసుకోలేరు. అందుకునైనా మీరు బయటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండండి--"అంది.
    "పుండరీ నాకు బయటివాడు కాదు. అప్రమిత్రుడు-" అన్నాడు వాసు.
    "కావచ్చు. కానీ ఎవరైనా మిమ్మల్ని నా ఎదుట చిన్నబుచ్చితే బాధగా ఉంటుంది. నేను మిమ్మల్నెంతగా ఆరాధిస్తున్నానో మీకేం తెలుసు!" అంటూ ఆమె అతడి జుత్తులోంచి చేయి బైటకు తీసింది. "నేల మీద పాకుతున్న పేనుని చూస్తూ ఆమె -- "అరే - మీకు పేలు పట్టాయే!" అంది.
    "నీ తలలో ఉన్నప్పుడు నాకు పట్టకేం చేస్తాయి. కానీ నువ్వు దాన్ని చంపకు...." అన్నాడు వాసు.
    "చంపను లెండి. బాత్రూం లో వదిలివస్తాను...." అని లోపలికి వెళ్ళి అవతల పారేసి వచ్చింది యమున.
    "నాకు త్వరగా భోజనం పెట్టు -- "అన్నాడు వాసు ఆమె రాగానే.
    "ఎందుకు?' అంది యమున.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.