Home » Jonnalagadda Rama Lakshmi » Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1



    జ్యోతి ముఖం ఆవేశంతో ఎర్రబడింది-"మనం మనం అని పదే పదే అనకు. నీ దారీ నా దారీ ఒకటికాదు" అందామె.
    "మన దారులొకటే అనడానికి ఋజువులెన్నో ఉన్నాయి...." తాపీగా అంది గీత.
    "ఏమిటవి?"
    "ఉదాహరణకు రాంకుమార్...."
    "వాడెవరు?"
    "అతడు నే నంటే యిష్టపడ్డాడు. కలిసినప్పుడల్లా వందరూపాయలిస్తాడు. సినిమాలకు తీసుకుని వెడతాడు. హోటల్సుకు తీసుకుని వెడతాడు....."
    "అయితే?"
    "అతడు నీకూ తెలుసు....."
    "నాకు తెలుసునని నీకెలా తెలుసు?"
    "అతన్నీ నిన్నూ కూడా ఓసారి బజార్లో కలిసి తిరుగుతూండగా చూశాను. రాంకుమార్ తో తిరిగేవాళ్ళు నా వంటి వాళ్ళు తప్ప వేరే ఎవరుంటారు?" అని నవ్వింది గీత.
    అప్పుడు జ్యోతి తన వానిటీబ్యాగులోంచి ఒక కవరు తీసింది. అందులో పన్నెండు కలర్ ఫోటోలున్నాయి.
    "వీటిలో రాంకుమార్ ఉన్నాడేమో చూసిచెప్పు!" అందామె.
    కొందరు యువకులు, యువతులు కలిసి తీయించుకున్న ఫోటోలవి. అందులో ఒక ఫోటోలో రాంకుమార్ ని గుర్తు పట్టింది గీత.
    జ్యోతిముఖం మాడిపోయింది. విసురుగా లేచిందామె.
    "వెళ్ళిపోతున్నావా?" అంది గీత.
    "నేను నీకు సాయపడలేను కానీ ఋణపడి ఉన్నాను." అని వెళ్ళిపోయింది జ్యోతి.
    "పూర్ రాంకుమార్! వాటేడ్రామా?" అనుకుంది గీత.

                                       3

    జ్యోతి వెళ్ళిపోయాక గీత అక్కడే కాసేపు కూర్చుంది. లేద్దామా అనుకుంటూండగా హడావుడిగా ఓ యువకుడక్కడికి వచ్చాడు.
    గీత అతడివంక ప్రశ్నార్ధకంగా చూసింది.
    "మేడమ్! నా పేరు ప్రసాద్...." అన్నాడతడు.
    "నాపేరు గీత...." అందామె.
    "ఈ సమయంలో పార్కులో మీరిక్కడుండడం నా అదృష్టం" అన్నాడతడు.
    "అంటే?"    
    "మీరు గమనించలేదా-పార్కిప్పుడు నిర్మానుష్యంగా వుంది."
    "వాడ్డూయూమీన్!" అంది గీత.
    "అయాం సారీ-నేను చెప్పదల్చుకున్నది వేరు. ఇంకో అరగంటలో ఇక్కడికి నా ప్రియురాలు వస్తుంది. ఆమెను నేనే యిక్కడికి రమ్మన్నాను. కానీ ఆమె వచ్చేవరకూ ఆగే వ్యవధి లేదు. అనుకోకుండా అర్జంటు పనితగిలింది."
    "ఆమె యింటికి ఫోన్ చేయలేకపోయారా?"
    "వాళ్ళింటికి ఫోన్ లేదు."
    "ఇంటికెవరి చేతనైనా కబురు పంపలేక పోయారా?"
    "మా పరిచయం ఇంట్లో తెలియదు. చాలా గొడవవుతుంది."
    "అయితే నేనిప్పుడేం చేయాలి?"
    "ఒక్క అరగంట మీరిక్కడేవుండి నా ప్రియురాలికి నా సందేశం అందజేయాలి. మీ మేలు జన్మజన్మలకీ మర్చిపోలేను."
    "ఏం చెప్పాలామెకు?"
    "సాయంత్రం సంగీతా పార్కులో ఆరుగంటలకు కలుసుకుందామని చెప్పండి" అన్నాడు ప్రసాద్.
    "ఏమిటీ-సంగీతా పార్కులోనా?"
    "అవును."
    ఓ అరగంట ఆగి "ఆ విషయం మీరే ఆమెకు చెప్పొచ్చుగా."
    "అరగంట ఆగడానికి లేదు."
    "ఎందుకని?"
    "కారణం మీకు చెప్పలేను."
    "కలుసుకుందుకు రమ్మనిచెప్పి రానప్పుడు-అందుకు సరైన కారణం చెప్పలేకపోతే ఏ ప్రియురాలూ క్షమించదు. మీకున్నపళంగా వచ్చిన అర్జంటుపనేమిటో చెప్పండి-" అంది గీత.
    అతడు క్షణం తటపటాయించి-"నేను పెళ్ళి చూపులకు వెడుతున్నాను. తనను ప్రేమించాక పెళ్ళిచూపుల క్కూడా ఎక్కడకూ వెళ్ళనని ఆమెకు మాటిచ్చాను కానీ యిప్పుడు తప్పలేదు. పేరుకు మాత్రమే పెళ్ళిచూపులు. మా నాన్నగారి కీ సంబంధం బాగా నచ్చింది ముహూర్తం టైముకి నేను రెడీగాలేకపోతే ఇంట్లోంచి పొమ్మంటారు. నాకుద్యోగం లేదు. ఏమైపోతాను చెప్పండి" అన్నాడు.
    "ఉద్యోగంలేదు కాబట్టి మీ నాన్నగారు బలవంతపెడితే ఆ పెళ్ళి కూడా చేసేసుకుంటారా?" అంది గీత.
    "పెళ్ళిచూపు లాపలేనుగానీ పెళ్ళి ఆపడానికి నా దగ్గర లక్ష మార్గలున్నాయి. వాటిలో కొన్ని ఈరోజె ప్రయోగిస్తాను" అన్నాడు ప్రసాద్.
    "అయితే నేనేం చేయాలి?"
    "పెళ్ళి చూపుల విషయం మాత్రం ఆమెకు చెప్పకండి. మళ్ళీ ఆమె నా ముఖం చూడదు. సాయంత్రం ఆరింటికి సంగీతా పార్కులో నేనామె కోసం ఎదురుచూస్తూంటానని చెప్పండి. మీ మేలు ఈ జన్మకు మరువను."
    "ష్యూర్...." అంది గీత.
    "మరి సెలవు" అన్నాడు ప్రసాద్.
    "బెస్టాఫ్ లక్" అంటూ చేయి సాచింది గీత! అతడు తటపటాయిస్తూనే ఆమె చేతి నందుకున్నాడు. అతడు వణుకుతున్నట్లు గ్రహించి తనలో తనే నవ్వుకుంది గీత.

                                        4

    ప్రసాద్ వెళ్ళిపోయాడు. గీత ఆలోచనలో పడింది.
    ప్రసాద్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళికి ముందే ఆమె తన నపార్ధం చేసుకుంటుందేమోనని భయపడుతున్నాడు చిన్న విషయాన్ని. ప్రమాదంలేని విషయాన్ని ప్రియురాలి నుంచి దాచాలనుకుంటున్నాడు.
    రాంకుమార్ కూడా ఓ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళయ్యాక ఆమె తన నపార్ధం చేసుకుంటుందేమోనని పెళ్ళికి ముందే కల్పితగాథల నామె తలలో కెక్కించి తమాషా చూడాలనుకుంటున్నాడు.
    ఇద్దరూ భిన్న ధృవాలు.
    అప్పుడే గీత మనసులో ఓ చిలిపి ఆలోచన ప్రవేశించింది.
    ప్రసాద్ పిరికివాడు భయస్థుడు. ప్రియురాలు తన నపార్ధం చేసుకుంటుందేమోనని కంగారుపడుతున్నాడు. అటువంటప్పుడు ప్రియురాలు నిజంగానే అపార్ధం చేసుకుని నిలదీస్తే ఏం చేస్తాడు?
    కాసేపట్లో ప్రసాద్ ప్రియురాలు వస్తుంది. ఆమెతో తను ప్రసాద్ పట్ల అనుమాన బీజాలు నాటాలి. ఆ తర్వాత సాయంత్రం సంగీతాపార్కుకు వెళ్ళి అక్కడ జరిగే తమాషా చూసి ఆనందించాలి.
    జ్యోతిలో తను అపార్ధాన్ని సృష్టిచింది. అందువల్ల తనకు ప్రతిఫలం లభిస్తుంది-రాంకుమార్ నుంచి ఇప్పుడు ప్రసాద్ ప్రియురాలిలో తా నపార్ధాన్ని సృష్టిస్తుంది. వినోదమే అందుకు తగిన ప్రతిఫలం.
    గీత అక్కడే కూర్చుని ఎదురుచూస్తోంది మధ్య మధ్య టైము చూసుకుంటోంది. కాసేపటికి అక్కడికొక యువతి వచ్చింది.
    ఈ యువతిది అద్బుత సౌందర్యం.
    పసుపు పచ్చని పోలీస్టర్ చీర ఆమె ఛాయతో కలిసి పోయింది.
    "ప్రసాద్ ఛాయస్ అద్భుతం...." అనుకుంది గీత.
    ఆ యువతి అక్కడే ఒక్క క్షణం అసహనంగా తిరిగింది.
    "నీదీ నాలాంటికేసే అనుకుంటాను...." అంది గీత.
    అంతవరకూ ఆ యువతి ఆమెను పలకరించలేదు. అప్పుడామె గీత వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
    "నేను నా ప్రియుడి కోసం ఎదురుచూస్తున్నాను. ఎటొచ్చీ అతడొచ్చే అవకాశం లేదు. నీకేమైనా ఛాన్సుందేమో తెలియదు...." అంది గీత.
    ఈ రకమైన సంభాషణ ఆ యువతికి నచ్చలేదు. అయిష్టంగా ఓ చూపు చూసి అక్కడే పచార్లు చేయసాగింది.




Related Novels


Jonnalagadda Rama Lakshmi Kadhalu - 1

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.