Home » Muppala Ranganayakamma » Stree


 

    గబగబా నడవసాగింది పార్వతి. మామ్మగారి కోడలికి బాగాలేదని తెలిసి చూసి రావాలని వెళ్తే ఏవో కబుర్ల తో ఏడు గంటల దగ్గరై పోయింది. వీధుల నిండా లైట్లు వెలిగాయి. 'సూర్యం గాని వస్తాడేమో? పక్కింటి వాళ్ళకు తాళం కూడా ఇచ్చి రాలేదు' అనుకుంటూ మామ్మగారి దగ్గర సెలవు తీసుకుని రోడ్డు మీది కొచ్చి గబగబా నడవసాగింది. దగ్గర సందులో ఎదురు చూస్తున్న రిక్షా తగిలి పడ్డంత పనైంది. త్రుళ్ళి పడి పక్కకు తప్పుకుంటూ రిక్షా కేసి చూసింది. నిర్ఘాంత పడ్డ దానిలా నిలబడి పోయింది. టాపు తీసేసిన రిక్షా లో ఎవరో అమ్మాయి తో కలిసి కూర్చున్న వ్యక్తీ సూర్యం లాగే కనిపించాడు. కనిపించటమేమిటి? సూర్యమే. కాలరూ చేతులూ ముదురు నీలం రంగు గుడ్డ వేయించుకుని అదేదో ఫాషన్ గా తెల్ల బుష్ షర్టు కుట్టించుకున్నాడు కొత్తగా. ఉదయమే దాన్ని మడత విప్పి తొడుక్కున్నాడు కూడాను. సరిగ్గా అదే కాలరూ, చేతులూ కనిపించాయి రిక్షా లో . పక్కన కూర్చున్న అమ్మాయి మెడల మీదుగా భుజం మీదికి చెయ్యి వేశాడు. బహుశా తనను చూసి ఉంటాడేమో కూడాను. చటుక్కున తల తిప్పేసుకున్నట్టు తోచింది.
    ఎప్పుడో వెళ్ళిపోయింది రిక్షా. భారంగా అడుగులు వేసుకుంటూ కదిలింది పార్వతి.
    ఆ రిక్షా లో వాడు సూర్యమేనా? కాదా?
    కాకపోవటం ఏమిటి? అచ్చు అలాగే ఉన్నాడుగా? తెగీ తెగని ఆలోచనలతో కొట్టుకుంటూ ఇల్లు చేరి , తాళం తీసుకుని చీకటి లోనే వాల్చి ఉన్న మంచం మీద కూర్చుంది. ఏమిటో తన బ్రతుకంతా బొత్తిగా అంధకార బందురమై పోతూన్నట్టు దుఃఖం ముంచు కొచ్చింది. తన చెప్పు చేతల్లో ఎవరు ఉన్నారు? తను చెప్పినంత మాత్రాన ఎవరు వింటారు?
    టిక్కు టిక్కు మంటూ తలుపు మీద చప్పుడయ్యే వరకూ అలా రెండు చేతుల మధ్యా తల పట్టుకుని కూర్చునే ఉంది. "అక్కయ్యా!" వీధి గుమ్మం లోంచి నెమ్మదిగా వినిపించింది సూర్యం పిలుపు.
    గమ్మున లేచి లైటు వేసి తలుపులు తీసింది. తల దించుకుని లోపలికి జొరబడిన సూర్యం చొక్కా, కాలరూ , చేతులూ- అచ్చం అవే! అవే! అనుమానం లేదు. సూర్యం క్షణాల మీద బట్టలు మార్చుకుని పెరట్లో కి వెళ్ళి చీడీల మీద కాళ్ళు కడుక్కున్నాడు.
    అన్నం వడ్డించి, కూర వేస్తూ , నెయ్యి వేస్తూ, పచ్చడి ముక్క ఓ వారన పెడుతూ ఎన్నోసార్లు తమ్ముడి మొహం లోకి చూడబోయింది. తల బాగా దించేసుకుని అన్నం కలుపుకుంటున్న వాణ్ణి పరిశీలించి చూడటం బొత్తిగా వీలు కాలేదు. అన్నం తిని లేచాక కూడా తనను చూసి జంకు తున్న వాడిలాగా, ఏదో దాచేసుకోవాలని తాపత్రయ పడుతున్న వాడి లాగా నిలకడగా నిలవకుండా కనిపించాయి వాడి చూపులు. పరిస్థితంతా చూస్తె పార్వతికి బాగా నమ్మకం ధ్రువ పడింది. వాడంత తెగించి తిరగటానికి తనే కారణం. కొత్తలోనే మందలిస్తే జాగ్రత్తగానే మెలిగేవాడు. తన కళ్ళ పడక పోయినా ప్రతి రోజూ వాడి షికార్లన్నీ ఎంత మంది చూస్తున్నారో! తెలిసిన వాళ్ళు చూసి నవ్వుకుంటే తన పరువేం కావాలి? ఏమైనా ఇంకా ఈ తిరుగుళ్ళు ముదరనిస్తే ప్రమాదమే. చేజేతులా వాణ్ణి పాడు చేసుకున్నట్టే అవుతుంది. అడిగి చూస్తె తప్పేం లేదుగా?
    తన పక్క సర్దుకొంటూ తమ్ముడి కేసి  తమ్ముడికేసి చూసింది. సూర్యం అలా చాలాసేపట్నుంచి కళ్ళు మూసుకుని పడుకునే ఉన్నాడు.
    "నిద్ర పోతున్నావేమిట్రా సూరీ?"
    వాడెం మాట్లాడలేదు. నిద్రపోయే వాడు మాట్లాడ కూడదు కాబట్టో ఏమిటో! పార్వతి కేమంత నమ్మకం కలగలేదు.
    "సూర్యం!" కాస్త గట్టిగానే పిలిచింది. "నిజంగా నిద్రే?"
    "ఊ" విసుగ్గా మరోవేపుకు దొర్లి పడుకున్నాడు.
    "నీతో కొంచెం మాట్లాడాలిరా! తెల్లారితే మళ్ళా నీదారి నీది, నాదారి నాదీ. ఇంకా తొమ్మిదైనా కాలేదు గానీ కాస్సేపు లేచి కూర్చుందూ!" ఏదో మందలింపుగానూ, వేడు కోలుగానూ అంది పార్వతి.
    సూర్యం కళ్ళు విప్పి చూశాడు.
    "ఏం? ఇవ్వాళంత తొందరగా పడుకున్నావు?" మాట్లాడకుండా లేచి కూర్చున్నాడు మంచం మీద.
    "నేను పెద్ద దాన్ని . తొందర పడో, తెలిసో తెలీకో ఓ మాట అన్నాను నువ్వేం బాధపడద్దు సుమా!" పార్వతి సూర్యం మొహం కేసి చూస్తూ అంది.
    ఆ ఉపోద్ఘాతమంతా ఎవిటన్నట్లు ఇబ్బందిగా చూశాడు సూర్యం. "నాతొ ఏమిటి మాట్లాడాలి."
    కాస్సేపు ఊరుకుంది పార్వతి. "మాట్లాడాలి. నేనడిగింది చెప్తావా?"
    "నాకు తెలిస్తే.....ఎందుకు చెప్పను?"
    "ఇందాక రిక్షాలో....ఎవరా అమ్మాయి?"
    దుప్పటి దారాలు తెంచుతూన్న సూర్యం వేళ్ళు ముడుచుకున్నాయి. గట్టిగా గుప్పిళ్ళు బిగించుకున్నాడు. తను దబాయించి ప్రయోజనం లేదన్న నిర్ణయానికి వచ్చేశాడు. అసలు తన వ్యవహారం కప్పి పుచ్చుకోవలసిన అగత్యం కూడా లేదన్నట్టు కనిపించాడు.
    "సూర్యం, నీకు తల్లి లాంటి దాన్ని. నీ మనస్సులో ఏమాట ఉన్నా నాతొ కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు?"
    సూర్యం తలెత్తి పార్వతి మొహం కేసి మాములుగానే చూశాడు. "చెప్పడాని కేముందక్కయ్యా? ఆ అమ్మాయి కాస్త సోషల్ గా ఉంటుంది. నువ్వేమైనా అపార్ధం చేసుకున్నావేమో? ఓ లాయరు గారి కూతురు. పేరు రాణి. బి.యస్సీ చదువుతోంది. నాతొ ఓ ఫ్రెండు లాగ తిరుగుతుంది . అంతే."
    పార్వతి విచిత్రంగా చూసింది తమ్ముడి కేసి. శరీరానికి శరీరం తాకుతుండగా భుజాల మీదికి చేతులు వేసుకుని, ఒక్క రిక్షా లో కూర్చుని, పబ్లిక్ గా రోడ్ల మీద షికార్లు తిరగటం , సినిమాలు చూడటం కేవలం ఫ్రెండ్స్ లాగ మసలటమా? కాని, అంత గుచ్చి గుచ్చి అడగలేక పోయింది. "అసలు నీకెలా పరిచయ మైంది?" అందామనుకుంది. అయినా ఈ కాలంలో ఓ అమ్మాయికీ, ఓ అబ్బాయికీ పరిచయం కావటానికే ముంది? ఏ సినిమా హల్లోనో, ఏ బీచి ప్రాంతం లోనో, ఏ ఫ్రాన్సీ షాపు లోనో, ఏ నట్ట నడి రోడ్డు మీదో ఎక్కడ కాకూడదు? చివరికి సిటీ బస్సు లోనైనా కావచ్చుగా?
    "ఫ్రెండే అనుకో. నేనూ అంతకన్నా మరేమీ అనుకోలేదు. అయినా, సూరీ , ఓ ఆడపిల్ల తో బొత్తిగా అంత విచ్చల విడిగా తిరగటం తప్పు కదూ? ఎటు తిరిగి ఎటొచ్చినా ఆ పిల్ల బ్రతుకు అల్లరి పడుతుంది. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, వెధవది! లోకుల ధోరణి నీకు తెలీంది కాదుగా?" తమ్ముడికి భోధన చెయ్యాలన్న ఉద్దేశ్యంతో కాస్సేపు సంఘాన్ని కూడా తిట్టి పోసింది పార్వతి. సూర్యం ఏమీ మాట్లాడలేదు. పార్వతి  ఎంతసేపు మాట్లాడినా కంఠ శొషె మిగిలింది.
    'సరేలే. పడుకో. అనవసరంగా నిన్ను నిద్ర లేపాను." లేనిపోని నిష్టూరం తన మీద వేసుకుంటూ పక్క మీదికి ఒరిగింది.
    ఓ వారం గడిచి ఉంటుంది. ఆదివారం పూట పార్వతి తీరిగ్గా పాత చీరలు కుట్టుకుంటూ కూర్చుంది. సూర్యం హడావుడిగా వస్తూ, 'అక్కయ్యా! రాణీ నిన్ను చూస్తానంటే తీసుకొచ్చాను" అన్నాడు: వెనకే వస్తూ కనిపించిన ఆ పిల్లను చూస్తూ గమ్మున తడబడింది పార్వతి. "రండి! రండి!"అంటూ ఆహ్వానించింది కంగారుగా. ఆ పిల్ల అదోలా నవ్వుతూ కుర్చీలో కూర్చుంది.
    రాణి తనను చూస్తాననడం ఎందుకూ? అన్న ఆశ్చర్యం పార్వతి మనస్సులో అట్లాగే ఉంది. రెండుసార్లు దూర దూరంగా చూస్తె రాణీ సింగారం పార్వతికి అంతగా తెలిసింది కాదు. శరీరంలో దాదాపు అన్ని భాగాలూ కనిపిస్తున్నట్టుగా ఉంది గుడ్డలు కట్టుకోటం. లేసు బాడీ, లేసులంగా స్పష్టంగా తెలిసి పోతున్నాయి. జాకెట్టు మెడ గుండెల దగ్గరికి బాగా కిందికి దిగి ఉంది. అలాగే వీపు కూడా చాలా భాగం నగ్నంగా కనిపిస్తుంది. ఒంటిపోర పైట భుజం వారకు అంటీ అంటనట్టుగా వెళ్ళాడుతుంది. అందమైన సిల్కు చీరే అయినా అ సింగారం మాత్రం బొత్తిగా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. చెంపలు ఎగదువ్వి నెత్తి చుట్టూ చక్రం లా పిన్నులు గుచ్చింది. ఉన్న బారెడు జడతోనూ పైనా కిందా ఖాళీగా వదిలేసి మధ్య మాత్రం రెండు మూడు పాయలు అల్లింది. జడలో పెట్టుకున్న కనకంబరాల దండ నడి వీపు మీద వెళ్ళాడుతుంది. చెవుల వరకూ సాగదీసిన కాటుక గీతలు, అమ్మవార్ని సింగారించినట్లు రూపాయి బిళ్ళంత బొట్టూ, కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న పెదమిల రంగూ -- ఏమిటో ఆ పిల్లను చూస్తున్న కొద్దీ పార్వతికి అర్ధం కాని అయిష్టం ఏర్పడసాగింది.
    కాళ్ళు ఊపుతూ , కుర్చీ కోడు మీద వేళ్ళతో చిటికెలు వేస్తూ గది నలుమూలలా కుతూహలంగా చూస్తూ కూర్చుంది రాణి.
    "అక్కయ్యా!" సూర్యం వంటింట్లోకి వెళ్ళి నెమ్మదిగా పిలిచాడు. పార్వతి గబగబా తమ్ముడి దగ్గరికి వెళ్ళింది.
    "పాలున్నాయి కదూ? కొంచెం కాఫీ పెట్టరాదూ?"
    "ఎందుకు పెట్టనూ? ఊరికే అలా చూస్తూ నిల్చున్నాను . సరే! నువ్వెళ్ళి కూర్చో! తొందరగా కుంపటి అంటిస్తాను." అంటూనే కుంపట్లో బొగ్గులు వేసి కాగితం ముక్క అంటించి తన పనిలో నిమగ్నమై పోయింది పార్వతి. క్రిందటి రాత్రి తెచ్చిన అరటి పళ్ళు నాలుగుంటే ఓ ప్లేటు లో పెట్టి తీసుకెళ్ళి ఇచ్చి వచ్చింది. తర్వాత రెండు గ్లాసులతో కాఫీ పట్టుకెళ్ళి బల్ల మీద పెట్టింది.
    "తీసుకో రాణీ!" అంటూ ఓ గ్లాసు అందించబోయాడు సూర్యం.
    "ముందు నువ్వు తీసుకో" అంటూ నవ్వింది రాణి.
    పార్వతి కేం మాట్లాడాలో , మాట్లాడ కుండా ఊరు కోవాలో కూడా తెలీలేదు. "మీ యిల్లు ఎక్కడండీ?" ఏదో మాట్లాడాలి అన్న శంక కొద్దీ అర్ధం పర్ధం లేని ప్రశ్న ఒకటి వేసింది. ఆవిడ గారిల్లు ఎక్కడైతే తన కేందుకూ? తనేం వెళ్ళాలా? రావాలా?                                 
    "మా యిల్లు మెయిన్ రోడ్డు లో ఉంటుందండి! ఆకుపచ్చ మేడ మీరు చూసే ఉంటారు."
    ఆ చూసే ఉంటానేమో? ఆకుపచ్చ మేడలు చాలా చూశాను." మాములుగానే అన్న ఏదో వ్యగ్యంగా అన్నట్టే అనిపించింది పార్వతి కి కూడా.
    రాణి అదోలా చూస్తూ, " మా మేడ చాలా కొత్తది. మూడునెలలు కూడా కాలేదు కట్టి" అంది అతిశయంగా.
    "నాకంత బాగా గుర్తు లేదమ్మా! ఈసారి చూస్తె పోల్చగలనేమో?" అక్క్దడికా సంభాషణ తెంచేసింది పార్వతి. మళ్ళా ముగ్గురి మధ్యా మాటల్లెకుండా పోయాయి. కాస్సేపటికి , "ఇక వెళ్దామా, సూర్యం?" అంటూ లేచింది రాణి. 'అయితే పద. అలా వెళ్ళొస్తానక్కయ్యా!" అంటూ వీధి గుమ్మం కేసి దారి తీశాడు సూర్యం.
    జవాబు అవసరం లేని ఆ మాటలు వింటూ మౌనంగానే సాగనంపింది పార్వతి.
    ఒక్క ఊపుతో జడ ముందుకు పడేసుకుని తల ఓ పక్కకు వంచుకుని  స్టైల్ గా నవ్వుతూ సూర్యానికి దగ్గరదగ్గరగా రాచుకు నడవ సాగింది రాణి.
    పార్వతి గమ్మున లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళా చీరెలు కుట్టుకుంటూ కూర్చుంది. ఆ పిల్లంటే తగని అసహ్యం , తమ్ముడి మీద విపరీతమైన కోపం ముంచుకు వచ్చాయి . అలోచనలతో సతమత మవుతూ, ఘాటుగా తమ్ముణ్ణి చివాట్లు పెట్టాలని నిర్ణయించుకుంది.




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.