Home » Muppala Ranganayakamma » Stree


 

                              

    మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వచ్చాడు సూర్యం.
    "అన్నం వడ్డించేస్తాను. కాళ్ళు కడుక్కురా!"
    "రాణి వాళ్ళింట్లో భోజనం చేశాను."
    "అదేమిటి? వాళ్ళింట్లో భోజనం చెయ్యటం ఏమిటి?"
    "వాళ్ళమ్మ గారు నిన్ననే అడిగితె సరే నన్నాను."
    "అయితే అముక్క నాకు చెప్తే ఈ పూట వంటే మానేసేదాన్నిగా? కాస్త చద్దన్నం ఉంది. ఏ పచ్చడి ముక్కో వేసుకు తిని లేచేదాన్ని."
    "ఇప్పుడెం పోయింది? పని మనిషికి ఇచ్చేయ రాదూ?' విసుగ్గా అంటూ మంచం మీద కూర్చున్నాడు. "వెధవ అన్నం గురించి రాద్దాంతం ఏమిటి?"
    మరి మాట్లాడలేదు పార్వతి. తను అడగాలనుకున్న ముక్క అడగనూ లేదు. పెట్టాలనుకున్న చివాట్లు పెట్టనూ లేదు.
    మధ్యాహ్నం నిద్రపోయి లేచిన తమ్ముడికి కాఫీ అందిస్తూ మొహం కేసి పరిశీలనగా చూసింది. మాములుగానే ఉన్నట్టున్నాడు. వ్యవహారం కదిలించాలను కుంది. "అయితే, సూరీ! ఆ పిల్లకి....అదే, ఆ రాణి కీ నన్ను చూద్దామని ఎందుకు బుద్ది పుట్టింది?" అంది నవ్వుతూనే.
    "ఆ మాట ఆ పిల్లనే అడగలేకపోయావా మరి?" ప్రశాంతంగా చూశాడు సూరి.
    "అసలు నన్ను చూడ్డానికి వచ్చిందన్నావ్. నాతొ ఏం మాట్లాడిందనీ?"
    "అంతకన్న ఏం మాట్లాడుతుంది? ఏదో చూడాలని వచ్చింది. చూసి వెళ్ళింది. పోనీ నువ్వు మాత్రం ఏం పలకరించావ్?"
    "నిజం చెప్పద్దూ? నాకేం మాట్లాడాలో తోచనే లేదు."
    సూర్యం బద్దకంగా ఒత్తిగిల్లుతూ అన్నాడు: "వాళ్ళమ్మ గారు నిన్నోకసారి తీసుకు రమ్మన్నారు."
    "నన్నా? నన్నెందుకూ?"
    "ఎందుకేమిటి? చూడ్డానికి.'
    "ఇది మరీ బావుంది. వాళ్ళంతా నన్ను చూడ్డం ఏమిటి?"
    "ఉత్త చూడ్డం కాదులే. ఏదో మాట్లాడతారేమో కూడాను."
    పార్వతి కేదో అనుమానం తోచింది. సూర్యం మొహంలోకి గుచ్చి గుచ్చి చూసింది. "అసలు నీ కడుపులో మాటేమిటో సరిగ్గా చెప్పవేం?"
    అ మాట అడగదేమో అనుకొంటున్న సూర్యం నవ్వి అన్నాడు : "రాణీని చూశావు కదా? నీ ఉద్దేశ్యం ఏమిటి?"
    "ఆ పిల్ల గురించి నా ఉద్దేశ్యం ఎమిటైతే ఎవరి క్కావాలి గానీ మీ యిద్దర్నీ గురించి చెప్పాలంటే మాత్రం నువ్వా అమ్మాయితో అంత అతిగా స్నేహం చెయ్యటం నాకేం నచ్చలేదు."
    "ఏం? ఎందుకనీ?" నుదురు చిట్లిస్తూ అడిగాడు.
    "ఎందుకేమిటి? నిర్మొహమాటంగా చెప్పాలంటే ఆ అమ్మాయి పద్దతులు నాకేం బాగా లేవు. బొత్తిగా అలా ఒంటి ఒంపులు ప్రదర్శించుకోటం , సభ్యతా పాడూ లేకుండా ప్రవర్తించటం . పోనీ, ఎవరెలా వుంటే మన కెందుకు గానీ ఆ అమ్మాయితో ఎక్కువ జోక్యం పెంచుకోకు. నలుగురూ చూడడాని కైనా బావుండదు."
    సూర్యం మాట్లాడలేదు. చాలాసేపు. తర్వాత అన్నాడు: "రాణి పెళ్ళి విషయంలో నీతో మాట్లాడాలను కుంటున్నారు వాళ్ళింట్లో వాళ్ళు."
    పార్వతి ఆశ్చర్యంగా చూసింది. తన అనుమానం నిజమేనా ఏమిటీ? "ఆ పిల్ల పెళ్ళి మాట నాతొ మాట్లాడ్డం ఏమిటి?" అంది సగం అర్ధం కానట్టు , సగం అర్ధం కాక కూడాను.
    "పెళ్ళి పెద్దవి. నీతో గాక ఇంకెవరితో మాట్లాడతారు? నన్నడిగితే నిన్నడగమని చెప్పాను."
    "సూర్యం!" విభ్రాంతి గా అరిచింది పార్వతి. "ఆ పిల్లని నువ్వు పెళ్ళి చేసుకుంటావా? నిజంగానే!"
    సూర్యం జవాబు చెప్పలేదు.
    "ఆ పిల్ల నీకు నిజంగానే నచ్చిందా ఏమిటి?"
    "ఏం? నచ్చకేం?" బొత్తిగా అభ్యంతరం లేనట్టే అన్నాడు సూర్యం. "చదువు కుంటోంది. సోషల్ గా ఉంటుంది. వాళ్ళ నాన్నగారూ వాళ్ళూ కూడా ఇష్టపడి అడిగారు. ఏం లోటని కాదనటం?"
    తనేం చెప్తుంది? ఏం లోటని చెప్తుంది? ఆ పిల్లే తనకు మరదలౌతుందంటే బొత్తిగా తమ్ముణ్ణి వారించకుండా ఎలా ఉంటుంది? "చూడు సూర్యం! నిన్ను చూసి అసూయతో గాని, నీ మీద కక్షతో గాని ఇలా అంటున్నాననుకోకు సుమా! ఎల్లకాలం నువ్వు సుఖంగా సంతోషంగా ఉండాలనే నా కోరిక. ఏది చెప్పినా నీ మేలు కోరే చెప్తాను. 'వివాహం నూరేళ్ళ పంట' అంటారు. ఈనాడు తొందర పడి చేసుకున్న నిర్ణయాలూ, ఆశలూ , ఆవేశాలూ పోయిన పొడుగునా నిలవవు. రాణి నీ సాహాచార్యానికి తగినదే నంటే నాకేమిటో నమ్మాకం గా లేదు. ఆ వేలితెమిటో నేను చెప్పలేకపోతున్నాను గానీ, ఆ పిల్లతో నువ్వేమంత సుఖ పడలేవేమో? కాస్త నీకు నువ్వు బాగా ఆలోచించుకో, సూర్యం!"
    సూర్యం నెలల తరబడి ఆలోచించక పోయినా అసలు ఆలోచించకుండా మాత్రం ఊరుకోలేదు. అయినా అంతగా ఆలోచించటాని కేముంది? నవనాగరీకంగా , అందాల బొమ్మలా మెరిసి పోయే రాణీని పెళ్ళి చేసుకోటానికి అసలు ఆలోచన దేనికి? అదీగాక వాళ్ళ నాన్నగారు తనను.....
    "ఏం, సూరీ, కోపం వచ్చిందా?"
    "అబ్బే! అది కాదక్కయ్యా! సరిగ్గా సావకాశం లేక ఈ సంగతి నీకు నేను చెప్పలేదు గానీ వాళ్ళ నాన్నగారు నన్ను బి.ఎల్ చదివిస్తానంటున్నారు. జీవితమంతా ఇలా గుమస్తా గా పడి వుంటే ఎప్పటికీ సుఖ పడగలను? రెండు మూడేళ్ళు చదివి ఓ లాయరైతే....."
    సూర్యం చెప్పే ప్రతి కబురూ విచిత్రంగానే ఉంది పార్వతికి. "వాళ్ళ నాన్నగారు నిన్ను లా చదివిస్తారా? మరి నీ ఉద్యోగం?"
    "ఇంకా ఉద్యోగం ఏమిటి? వదిలేసుకునే కాలేజీ లో చేరాలి."
    షాక్ తగిలినట్లు చూసింది పార్వతి. "ఉద్యోగం వదిలేసుకుంటావా?"
    "మరి ఎలా? అవ్వా కావాలి, బువ్వా కావాలి అనుకుంటే వీలౌతుందా?"
    "అయితే వాళ్ళ దయా ధర్మాల మీద ఆధారపడి చదువు కుంటావా? అంతేనా?"
    "దయాధర్మాలదేముంది? వాళ్ళ పిల్లని పెళ్ళి చేసుకున్నందు కెలాగూ నాలుగైదు వేలు కట్నం ఇస్తారు. అది కాదంటే నా చదువు రూపేణా ఖర్చు పెడతారు. అంతేగా?"
    "సూర్యం!' పార్వతి తల గిర్రున తిరిగింది. కట్నం నాలుగైదు వేల రూపాయలు కావాలను కొంటున్నాడా సూర్యం? తను ఒక్కసారైనా ఆ కట్నం మాట, అంతడబ్బు మాట ఆలోచించగలిగిందా? అసలు తనకా పాపిష్టి కోరిక పుట్టిందా?
    "ఏం, అక్కయ్యా? నీ కిష్టం లేదా?" పార్వతి ఇష్టం కోసమే అడిగినట్టు మాత్రం అనిపించలేదు.
    "అది కాదు సూర్యం! నిన్ను కట్నాలకి అమ్ముకోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. కట్నం అన్నమాట వింటే నా హృదయం ఎలా మండి పోతుందో నీకు అర్ధం కాదు. ఈపాపిష్టి కట్నాల దురాశే లేకపోతె ఈ అక్కయ్య అందరు ఆడవాళ్ళ లాగే ఓ యింటి ఇల్లాలై కాపురం చేసుకుంటూ ఉండేది, సూర్యం! మన బ్రతుకులు ఎందుకిన్ని మలుపులు తిరిగాయో నీకు తెలీని విషయమేమీ కాదు. నా చేతుల మీదుగా పెరిగి పెద్దవాడి వైన నువ్వయినా నా అభిప్రాయాలతో ఏకీభవిస్తావనుకున్నాను. నా అభిరుచులు...."
    "నీ పెళ్ళి మాటకీ దీనికీ సంబంధం ఎమిటక్కయ్యా? అప్పుడు మనకు తాహతు లేక ఇవ్వలేక పోయాం. ఇప్పుడు వీళ్ళకు కట్నం ఇవ్వటానికి లోటేమీ లేదుగా? వాళ్ళ కై వాళ్ళే సంతోషంగా ఒప్పు కుంటున్నారు."
    "నేనే మూర్ఖంగా ఆలోచిస్తున్నానెమో సూర్యం! అది కూడా నాకు తెలీటం లేదు. ఒక్కటి చెప్పు. వాళ్ళు నిన్ను చదివించటానికి ఒప్పుకోకపోతే, కట్నం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటె అప్పుడు కూడా రాణీని మనస్పూర్తిగా ఇష్టపడి పెళ్ళి చేసుకోగలవా? నిజం చెప్పు. నీ అంతరాత్మ సాక్షిగాచేప్పు."




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.